doctor's negligence

15:53 - November 22, 2017

తూర్పుగోదావరి : కూనవరం ప్రభుత్వాసుపత్రిలో కరెంటు లేక రోగులు నానా అవస్థలు పడ్డారు. కరెంటు లేదని చెప్పినా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఓ బాలింత పేర్కొంది. మూడు రోజుల పసికందుతో లక్ష్మీ అనే బాలింత జాగారం చెప్పడం కలకలం రేగుతోంది. ఇంటికి పంపించేందుకు వాహనం లేకపోవడంతో ఆసుపత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కానీ కరెంటు లేకపోవడం వల్ల ఆమె కొవ్వొత్తి వెలుగులోనే ఉండాల్సి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి. 

07:42 - October 11, 2017

కరీంనగర్/పెద్దపల్లి : వైద్యుల నిర్లక్ష్యం ఓ పసికందు ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సీతనగర్‌కు చెందిన జంగపెల్లి మౌనిక గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం కోసం చేరింది. ఆదివారం పండంటిపాపకు జన్మనిచ్చింది. ఉన్నట్టుండి పాప పరిస్థితి సీరియస్‌గా మారింది. ఆ సమయంలో ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడంతో కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి పరిస్థితి సీరియస్‌గా ఉందని.. మళ్లీ గోదావరిఖని ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో తిరిగి వస్తుండగా మార్గమధ్యలో చిన్నారి చనిపోయింది. తన బిడ్డ మృతికి వైద్యులే కారణమంటూ చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. చిన్నారి మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

06:55 - August 12, 2017

హైదరాబాద్ : చావును ఎవరూ తప్పించలేరు. కానీ.. సరైన సమయంలో వైద్యం అందిస్తే కొన్ని ప్రాణాలనైనా కాపాడవచ్చు. ఆపద సమయంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగుల విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. మహిళలకు గర్భశోకమే మిగులుస్తోంది. ఎంతో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా చాలా ప్రాంతాల్లో.. సరైన వైద్యం అందక పురిట్లోనే చిన్నారులు, బాలింతలు.. రోగులు మృతి చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తునే ఉన్నాయి.

నిర్మల్‌ జిల్లా బైంసా మండల కేంద్రంలో అర్ధరాత్రి ఓ గర్భిణీ ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చింది. పురిటినొప్పులతో బాధపడుతున్నా... ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదు. నొప్పులు ఎక్కువ కావడంతో నిద్రపోతున్న నర్సులకు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన సిబ్బంది... కుటుంబ సభ్యులపై చిందులు వేస్తూ ఏవో ఇంజక్షన్లు చేశారు. తర్వాత నొప్పులు తగ్గాయి... ఉదయం ఆపరేషన్‌ చేయగా... మృత శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.

ఇక పెద్దపల్లి జిల్లా మంథనిలో మరో శిశువు మృతి చెందాడు. ప్రసవం కోసం గత మంగళవారం జ్యోతి అనే గర్బిణీ ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. సిజేరియన్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే... అనస్తషీయ రాలేదని ఆపరేషన్‌ను వాయిదా వేశారు. శుక్రవారం రోజున నొప్పులతో మళ్లీ ఆస్పత్రికి రావడంతో... వైద్యులు ఆపరేషన్‌ చేశారు. అయితే.. అప్పటికే ఆలస్యం కావడంతో... ఆ తల్లి మృత శిశువుకు జన్మనిచ్చింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని తల్లిదండ్రులు వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో నవోదయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి మృతి చెందింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న యువతిని ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే... వైద్యులు సరైన వైద్యం అందించకపోవడంతో... యువతి చనిపోయిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులు... యువతి మృతికి కారణమైన డాక్టర్లను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రాణాలు కాపాడుతారని ఎంతో నమ్మకంగా రోగులు ఆస్పత్రికి వస్తే... వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎంతో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. 

10:12 - April 25, 2017

హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రులు నిర్లక్ష్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నాయి. ఒకవైపు డాక్టర్లు నిర్లక్ష్యం.. మరోవైపు లంచాలకు మరిగిన సిబ్బంది. వెరసి ధర్మాసుపత్రులంటేనే జనం హడలిపోయే పరిస్థితి దాపురించింది. గవర్నమెంట్‌ దవాఖాన పేరు చెబితేనే జనం పారిపోతున్నారు. అసలు పెద్దాసుపత్రులకు ఈ దుస్థితి ఎందుకొచ్చింది? ఏ మందు వేస్తే ఈ రోగం నయమవుతుంది.?

పెద్దాసుపత్రులపై పేదలకు సన్నగిల్లుతోన్న నమ్మకం

సర్కార్‌ దవాఖానాలంటే పేదల ప్రాణాలకు భరోసా కేంద్రాలు. చేతిలో పైసలు లేనివారు.. ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లే ఆర్థిక స్థోమత లేనివారు ప్రభుత్వ దవాఖానాలకు వస్తుంటారు. తమ రోగంనయం చేయించుకుని ధైర్యంగా ఇంటికి తిరిగి వెళ్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పేదలకు పెద్దాసుపత్రులపై ఉన్న నమ్మకం సన్నగిల్లుతోంది. ధర్మాసుపత్రుల్లో చూపించుకుంటే వారి ప్రాణాలకు భరోసా లేకపోవడమే ఇందుకు కారణం. అందుకే ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు నమ్మకంగా వచ్చిన జనం ఇప్పుడు ఖర్చులు భారమైనా ప్రాణాలమీద ఆశతో ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో వరుస ఘటనలు...

హైదరాబాద్‌లోని ప్రభుత్వా సుపత్రుల్లో ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోయింది. నిలోఫర్‌ ఆస్పత్రిలో 5గురు గర్భిణులు ప్రాణాలు విడిచిన ఘటన మరువకముందే... ఇప్పుడు కోఠి మెటర్నిటీ, పేట్ల బురుజు ఆస్పత్రిలో గర్బిణులు ప్రాణాలు విడిచారు. ఆపరేషన్‌ చేస్తున్నప్పుడు ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో గాంధీకి తరలించి వైద్యం అందిస్తుండగా నలుగురు చనిపోయారు. వైద్యుల నిర్లక్ష్యంతో రోగులు ప్రాణాలు వదులుతున్నారు. గాంధీ, ఉస్మానియా, ఛాతీ ఆస్పత్రిలో జరుగుతున్న వరుస ఘటనలతో జనం బెంబేలెత్తుతున్నారు.

కోఠి ఆస్పత్రిని సందర్శించిన చెరుకు సుధాకర్‌

కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో గర్ణిణులు చనిపోవడంతో ఆ ఆస్పత్రిని తెలంగాణ ఉద్యమ వేదిక నేత చెరుకు సుధాకర్‌ సందర్శించారు. రోగులను అడిగి వైద్యం అందుతున్న తీరును తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.

లంచావతారులతో నిండిపోయి కోఠి ఆస్పత్రి...

కోఠి మెటర్నిటీ హాస్పత్రి లంచావతారులతో నిండిపోయిందని రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రతి పనికి లంచం అడుగుతూ తమ రక్తాన్ని పీల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే తమకు పుట్టిన బిడ్డలను చూడనీయకుండా దాచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోఠి ఆస్పత్రిలో అరకొర సిబ్బంది

కోఠి ఆస్పత్రిలో సరిపడ సిబ్బంది లేకపోవడంతో దీంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. మొత్తం ఆస్పత్రిలో 14మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఈ 14మంది వైద్యులే సంవత్సరానికి 13వేల డెలివరీలు చేయాల్సి వస్తోందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అంటున్నారు.

కోఠి మెటర్నిటీ ఆస్పత్రికి ప్రత్యేక గుర్తింపు...

తెలంగాణ రాష్ట్రాంలోనే కోఠి మెటర్నిటీ ఆస్పత్రికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇలాంటి ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరతలేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అంతేకాదు... అత్యాధునిక టెక్నాలజీతో డెలివరీలు చేసేలా పరికరాలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెరుగైన సౌకర్యాలు అందించి.. ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

18:26 - February 10, 2017

హైదరాబాద్: నీలోఫర్‌లో బాలింతలమృతిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. 9రోజుల వ్యవధిలో.. ఐదుగురు బాలింతలు చనిపోవడంతో... ఆస్పత్రి సూపరింటెండెంట్‌, ఆర్‌ఎంవోపై బదిలీ వేటు పడింది. బాలింతల మృతిలో ఈ ఇద్దరు అధికారుల నిర్లక్ష్యం ఉందని సర్కారుకు... హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా సమర్పించిన నివేదికలో ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నివేదిక ఆధారంగా తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది.

12:21 - February 7, 2017
09:19 - February 7, 2017

హైదరాబాద్: డాక్టర్ల నిర్లక్ష్యానికి విలవిల్లాడిన ఓ పసిప్రాణం మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. వరంగల్‌జిల్లాకు చెందిన భిక్షపతి.. జ్వరంతో బాధపడుతున్న తన కూతురు సాయీప్రవల్లికను రెండు నెలల కిందట హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. పాపకు ట్రీట్‌ మెంట్‌ ఇచ్చే సమయంలో ఆస్పత్రి డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పురుగులతో కల్తీఅయిన సెలైన్‌ బాటిల్‌ను పాప ఒంట్లోకి ఎక్కించారు. దీంతో సాయిప్రవల్లిక తీవ్ర అస్వస్థతకు గురైంది. తప్పు తెలుసుకున్న గాంధీ ఆస్పత్రి వైద్యులు పాపకు గత రెండు నెలలుగా చికిత్స అందిస్తున్నారు. కాని..బ్లడ్‌లో సోకిన ఇన్ఫెక్షన్‌ ఎంతకీ తగ్గక పోవడంతో.. పాప నిన్న అర్థరాత్రి మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యానికి తమ పాప బలైపోయిందన్న తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. పాప చనిపోయిన విషయాన్ని రహస్యంగా ఉంచిన డాక్టర్లు..పోలీసు బందోబస్తు మధ్య పాప మృతదేహాన్ని వరంగల్‌ జిల్లాలోని ఆమె సొంతూరుకు తరలించారు.

18:38 - February 4, 2017

జగిత్యాల : ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది. ఆపదలో ఆస్పత్రికి వచ్చిన వారిని వైద్యులు చిన్నచూపు చూస్తున్నారు. రక్షించండి మహాప్రభూ అని వేడుకుంటుంటే.. ప్రాణాలు హరించివేస్తున్నారు. జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోంది.
రోగికి సెక్యూరిటీ గార్డ్‌ వైద్యం
ఇదిగో చూశారా. రోగికి సెక్యూరిటీ గార్డ్‌ వైద్యం చేస్తున్నాడు. వైద్యులు లేక సెక్యూరిటీ గార్డ్‌ అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేస్తున్నాడునుకుంటే పొరపాటు. ఇదిగో పక్కనే డాక్టరమ్మ ఉంది. ఈమె తీరు చూస్తేంటే.. సీనియర్‌ డాక్టర్‌ వైద్యం చేస్తుంటే జూనియర్‌ డాక్టర్‌ పరిశీలిస్తున్నట్లుగా ఉంది.
జగిత్యాల జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఘటన
ఈ ఘటన జగిత్యాల జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకువస్తే సెక్యూరిటీ గార్డ్‌ వైద్యం చేశాడు. పక్కనే డాక్టర్‌ ఉన్నా కూడా కనీసం ఆమె రోగిని తాకకపోవడం విడ్డూరం.
డాక్టర్‌, ఇద్దరు సిబ్బంది సస్పెన్షన్‌
గతంలో కూడా సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై జిల్లా కలెక్టర్‌ శరత్‌ ఆకస్మిక తనిఖీలు చేసి.. ఒక డాక్టర్‌తో పాటు.. ఇద్దరు సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. అయినా సిబ్బంది తీరులో మార్పు రాలేదు. ఎలాంటి అర్హతలు లేని సెక్యూరిటీ గార్డ్‌ వైద్యం చేయడంతో.. రోగికి ఏదైనా ఎవరు బాధ్యత వహిస్తారు పలువురు ప్రశ్నిస్తున్నారు.
గర్బిణికి వైద్యం చేసిన నర్సు
రెండు రోజుల క్రితమే గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లికి చెందిన గర్భిణికి నర్సు వైద్యం చేయడంతో.. పాప మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఇలాంటి ఘటనలో చోటు చేసుకుంటున్నా.. ఇప్పటికీ వైద్యుల తీరులో మాత్రం ఇంకా మార్పు రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.  
ప్రజల ప్రాణాలంటే చులకన
ప్రజలందరికీ ఆరోగ్యం అందిస్తాం.. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం చేయించుకునే విధంగా తీర్చుదిద్దుతామని ప్రభుత్వం ఒక పక్క చెబుతుండగా.. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్యులు కనీసం ట్రీట్‌మెంట్‌ చేయించకుండా.. సెక్యూరిటీ గార్డ్‌ చేత వైద్యం చేయిస్తున్నారంటే.. ప్రజల ప్రాణాలంటే వారికి ఎంత చులకనో అర్ధమవుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

 

21:03 - June 30, 2015

నల్లగొండ: జిల్లాలో వైద్యుల మధ్య విభేదాల కారణంగా ఓ శిశువు గర్భంలోనే మృతిచెందింది. తల్లి స్పృహ కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఈ ఘటన జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. చిట్యాలకు చెందిన గర్భిని సాయికళ.. ప్రసవానికి ఆస్పత్రికి వచ్చింది. అప్పటి డ్యూటీ డాక్టర్‌ శోభారాణి సాయికళకు చికిత్స చేసి.. తన సమయం అయిపోయిందని వెళ్లిపోయింది. నైట్‌ డ్యూటీకి వచ్చిన డాక్టర్‌ పద్మావతి.. మరో డాక్టర్‌ చూసిన పేషెంట్‌ను తాను చూడనని ఖరాకండిగా చెప్పింది. వారిద్దరి విభేదాల కారణంగా.. సమయానికి వైద్యం అందక తల్లి కడుపులోనే శిశువు చనిపోయింది. సాయికళ అపస్మారక స్థితికి చేరుకోవడంతో స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై సాయికళ భర్త సతీష్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

Don't Miss

Subscribe to RSS - doctor's negligence