election code

21:42 - December 6, 2018

హైదరాబాద్: ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ కొరడా ఝళిపించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నాయకులు, అభ్యర్థులపై కేసులు నమోదు చేసింది. కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, టీడీపీ నేత జూపూడి ప్రభాకర్, శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్ ప్రసాద్, సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి, మేడ్చల్ టీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి, కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణలపై సెక్షన్ 171(ఈ) కింద కేసులు నమోదు చేశారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు ఇప్పటివరకు 7వేల 852 కేసులు నమోదు చేసినట్టు ఈసీ తెలిపింది. ఇక పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పిలుపునిచ్చింది.

 

19:34 - November 12, 2018

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ కీలక ఆదేశాలు ఇచ్చారు. మంత్రులు కుల సంఘాల సమావేశాల్లో పాల్గొనొద్దని, కుల సంఘాల సమావేశాల్లో పాల్గొనడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పరిగణిస్తామని ఆయన హెచ్చరించారు. కుల సమావేశాలు నిర్వహించిన అభ్యర్థులకు నోటీసులు జారీ చేస్తామన్నారు. ఇలాంటి కేసుల వ్యవహారంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
తెలంగాణలో నవంబర్ 12 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైందని.. తొలిరోజు 43 నామినేషన్లు వచ్చాయని, ఇంకా 7 నియోజకవర్గాల నుంచి వివరాలు అందాల్సి ఉందని రజత్‌కుమార్ తెలిపారు. ఎక్కువగా బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారని చెప్పారు. నామినేషన్ వేసినప్పటి నుంచి ఖర్చు లెక్కలోకి వస్తుందన్నారు.
ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో రూ.77.62 కోట్ల నగదును సీజ్ చేసినట్టు రజత్‌‌కుమార్‌ చెప్పారు. 4038 మద్యం దుకాణాలు తొలగించాని, 47,234 కేసులు నమోదయ్యాయని వివరించారు. సీ విజిల్ యాప్ ద్వారా 2251 ఫిర్యాదులు అందగా, 1279 పరిష్కరించామన్నారు. మొత్తం 2, 76, 29610 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని నోటీసులు ఇచ్చిన ముగ్గురు నేతలు బదులిచ్చారని పేర్కొన్నారు. తన మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. బోగస్, డబుల్ ఓట్లు లక్ష 60 వేలు ఉన్నాయని, నిబంధనల మేరకు వాటిని తొలగించామని పేర్కొన్నారు. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో పోలింగ్ నిర్వహించనున్నట్టు రజత్ పేర్కొన్నారు.

21:57 - October 27, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఈఓ రజత్ కుమార్ హెచ్చరించారు. నామినేషన్ రోజు నుంచి అభ్యర్ధుల ఖర్చు వివరాలు సేకరిస్తామన్నారు. ప్రైవేటు సమావేశాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు. పార్టీల సమావేశాలు, శాంతిభద్రతల విషయంలో పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 59 ఫిర్యాదులు అందాయని అందులో 11 పరిష్కారమయ్యాయన్నారు. సోషల్ మీడియా పోస్టులు, పేయిడ్ మీడియా పై ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశామని రజత్ కుమార్ అన్నారు.

 

11:49 - October 24, 2018

హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా ఈసీ అన్ని వర్గాలను అప్రమత్తం చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. అనుమతి లేనిదే ప్రచార సామాగ్రిని ముద్రించరాదంటూ ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వాహకులను ఆదేశించింది. 

 

* ఎన్నికల కోడ్‌ను పక్కాగా అమలు చేస్తున్న ఈసీ
* అభ్యర్థి ఖర్చు, ప్రచార సామాగ్రిపై దృష్టి పెట్టిన ఈసీ
* ప్రింటర్ల యజమానులతో ఈసీ భేటీ 
* అభ్యర్థి అనుమతి లేకుండా ప్రచురిస్తే చట్ట ప్రకారం చర్యలు

హైదరాబాద్‌ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎన్నికల నిబంధనలపై ప్రింటర్ల యాజమానులతో ఈసీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల జాయింట్ క‌మిష‌న‌ర్ దాస‌రి హ‌రిచంద‌న, జాయింట్ క‌లెక్టర్‌ ర‌వి, ఎన్నిక‌ల వ్యయ నోడ‌ల్ అధికారి ద్రాక్షమ‌ణి ఈ స‌మావేశాన్ని నిర్వహించారు. ప్రచురణ సంస్థలకు పలు ఆదేశాలు జారీ చేశారు. 

* అనుమతి లేకుండా కరపత్రాలు, పోస్టర్లు ముద్రిస్తే చర్యలు
* ఎన్నికలు జరిగే అన్ని రోజుల్లో తప్పనిసరి నియమం
* పోస్టర్లు, పాంప్లెట్స్‌ ప్రింటింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈసీ వివరణ
* కరపత్రాలపై ప్రచురణ కర్త పేరు, ప్రచురణ సంఖ్య తప్పనిసరి
* కరపత్రాలకు సంబంధించిన సమాచారం ఈసీకి అందించాలని సూచన

ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో ముందస్తు అనుమతి లేకుండా కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు ముద్రిస్తే సంబంధిత ప్రింటర్లపై ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. ఎన్నికలు జరిగే అన్ని రోజులు ఈ నియమం తప్పనిసరని తేల్చి చెప్పింది. పోస్టర్లు, పాంప్లెట్స్‌ ప్రింటింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా వివరణ ఇచ్చింది. ప్రింట్‌ చేసిన కరపత్రాలు, పోస్టర్లు, హాండ్‌బిల్స్‌పై ప్రచురణ కర్త పేరు, ప్రచురించిన సంఖ్య అలాగే ప్రింటర్‌ వివరాలను విధిగా ప్రింట్‌ చేయాలని సూచించింది. ప్రింట్‌ చేసిన కరపత్రాలకు సంబంధించిన సమాచారాన్ని అపెండెక్స్‌-బిలో పూర్తి చేసి... ప్రింట్‌ చేసిన కాపీని జతపరిచి ఎన్నికల అధికారికి ఇవ్వాలని సూచించింది. 

* నిబంధనలు ఉల్లంఘిస్తే 6నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా
* అభ్యర్థి అనుమతి లేకుండా ప్రచురిస్తే చట్ట ప్రకారం చర్యలు

నిబంధనలు ఉల్లంఘించి... ప్రచురణ కర్త పేరు, ప్రింటర్‌ పేరు లేని కరపత్రాలను ముద్రిస్తే 6 నెలల జైలు శిక్ష, లేదా రెండు వేల జరిమానా ఒక్కోసారి రెండూ విధిస్తామని ఈసీ తెలిపింది. పోటీ చేసే అభ్యర్థి అనుమతి లేకుండా ప్రచురిస్తే ప్రింటర్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల జాయింట్‌ కమిషనర్‌ హరిచందన తెలిపారు. 

ఇప్పటికే ఎలక్షన్‌ కోడ్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం... అభ్యర్థి ఖర్చు, ప్రచార సామాగ్రిపై కూడా దృష్టి సారించింది.

21:40 - October 5, 2018

హైదరాబాద్ :  తెలంగాణ అసెంబ్లీ రద్దు అయిన నాటి నుండే ఎన్నికల కోడ్ అమలులో వుంటుందని స్పష్టం చేసిన ఎలక్షణ్ కమిషన్ ఆపద్ధర్మ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కొత్త పథకాలను ప్రవేశపెట్టకూడదనీ..అమలులో వున్న  పథకాలైన రైతు బంధు పథకం, బతుకమ్మ చీరల పంపిణీలను నిలిపివేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యలో కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్‌‌కు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుబంధు చెక్కుల పంపిణీకి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. గతంలో ఉన్న లబ్ధిదారులకే రైతుబంధు వర్తింపజేయాలని సూచించింది. రైతుబంధు జాబితాలో కొత్తగా ఎవరినీ చేర్చుకోవద్దని షరతులు విధించింది. చెక్కుల రూపంలో కాకుండా నేరుగా అకౌంట్లలో జమచేయాలని ఆదేశించింది. అదేవిధంగా రైతుబంధులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూదని తేల్చి చెప్పింది.
 రైతుబంధు చెక్కుల పంపిణీని నిలిపివేయాలంటూ రాష్ట్రంలోని వివిధ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీనిని పరిశీలించిన సీఈసీ.. చెక్కులు పంపిణీకి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈసీ నిర్ణయంతో రెండో దఫా రైతుబంధు చెక్కుల పంపిణీకి మార్గం సుగమం అయింది. కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం పేరుతో రైతబంధు పథకం తీసుకువచ్చిన విషయం తెలిసింది. ఈసీ నిర్ణయంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

17:09 - September 27, 2018

ఢిల్లీ : తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని ఎన్నికల సంఘం తెలిపింది. అసెంబ్లీ రద్దైన నాటి నుంచే కోడ్ అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే ఎన్నికల నియమావళి అమల్లో ఉందని తెలిపింది. కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుందని ఈసీ తెలిపింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎలాంటి విధానపరమైన, కీలకమైన నిర్ణయాలు తీసుకోరాదంటూ  సూచించింది. ప్రజలను ఆకర్షించేలాకొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించకూడదని షరతు విధించింది. అనధికార కార్యక్రమాలకు ప్రభుత్వ వనరులను వినియోగించుకోరాదని తెలిపింది. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల కార్యదర్శులకు ఈసీ లేఖ ద్వారా తెలిపింది. కేంద్రప్రభుత్వం సహా అసెంబ్లీ రద్దు అయిన అన్ని రాష్ట్రాల్లోను ఈ నియమాలు వర్తిస్తాయని తెలిపింది. 

 

06:48 - April 20, 2016

హైదరాబాద్ : ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.ఖమ్మం జిల్లాలో తమ సత్తాను చాటాలని ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఐతే ఎన్నికల కోడ్ అమలు కానుండడంతో...ప్లీనరీకి ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

అధికార పార్టీలో తర్జన భర్జనలు...

గులాబి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకులకు ఎన్నికల కోడ్ పగ్గాలు వేస్తోంది. ఖమ్మం జిల్లాల్లో ఈ నెల 27వ తేదీన నిర్వహించే ఆవిర్భావ సదస్సు, బహిరంగ సభలకు సంబంధించి అధికార పార్టీలో తర్జన భర్జనలు మొదలయ్యాయి. ఈ నెల 20వ తేదీ నుంచి పాలేరు ఉప ఎన్నికల కోడ్ అమలు కానుంది. నేపథ్యంలో ప్లీనరీ, బహిరంగ సభల నిర్వహణపై ఆచి తూచి వ్యవహరించాల్సిన పరిస్థితి అధికార పార్టీకి ఏర్పడుతోంది. బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేయాలని భావించినా..... ఇప్పుడు ఆత్మరక్షణలో పడే పరిస్థితులు తలెత్తాయి. అయితే ఈ సభనే ఎన్నికల సభగా నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశంపైనా గులాబి పార్టీలో చర్చ మొదలైంది

.కోడ్ నేపథ్యంలో నిరాండబరంగా...

ప్రతినిధుల సభతో పాటు బహిరంగ సభను ఎలా నిర్వహించాలనే అంశపై అధికార పార్టీలో చర్చ మొదలైంది. ఖమ్మం జిల్లాను గులాబి మయం చేయాలనుకున్నా........కోడ్ నేపథ్యంలో నిరాండబరంగా ఈ కార్యక్రమాలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరో వైపు అధికార పార్టీ నిర్వహించ తలపెట్టిన సదస్సు, బహిరంగ సభలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారికంగా అన్ని అనుమతులు తీసుకునేందుకు టీఆర్ఎస్ రెడీ అవుతున్నట్లు సమాచారం.

19:42 - December 12, 2015

హైదరాబాద్ : మండలి ఎన్నికల్లో ఏకగ్రీవమైన చోట ఎలక్షన్ కోడ్ లేదని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. పోటీ ఉన్న చోటనే కోడ్ అమలులో ఉంటుందన్నారు. ఇవాళ నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన అనంతరం... 6స్థానాలు ఏకగ్రీవమైనట్టు ఆయన ప్రకటించారు. మిగతా 6 స్థానాలకు ఈనెల 27న పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. కౌటింగ్ ఈనెల 30న జరగనుంది.

 

17:40 - December 10, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్...రాష్ట్ర మంత్రి కేటీఆర్ లపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఎలా హామీలిస్తున్నారంటూ సీరియస్ అయ్యింది. ఏకంగా వారిద్దరికీ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిలంచారంటూ నోటీసుల్లో పేర్కొంది. ఎమ్మెల్యే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. బుధవారం నామినేషన్ ల పర్వం కూడా పూర్తయ్యింది. కానీ సీఎం క్యాంపు కార్యాలయం వేదికగా హామీలు గుప్పిస్తున్నారని, కేటీఆర్ ఏకంగా సచివాలయం కేంద్రంగా ఎంపీటీసీ, జడ్పీటీసీలను చేర్చుకుంటున్నారంటూ సీరియస్ అయ్యింది. ఇటీవలే ఖమ్మం జిల్లాకు చెందిన విపక్ష నేతలను సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారికి కేసీఆర్ పలు హామీలిచ్చినట్లు సమాచారం. ప్రాజెక్టులు పూర్తిచేస్తామని, తూర్పుగోదావరి జిల్లాకు ధీటుగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ పేర్కొనడంపై ఈసీ ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

06:49 - November 28, 2015

హైదరాబాద్ : తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పాఠశాల విద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారిగా ఉపాధ్యాయుల ఖాళీల వివరాలు, స్కూళ్లలో ఉన్న సిబ్బంది గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల, డీఎస్సీ నిర్వహణ, ఎన్నికల కోడ్‌, నోటిఫికేషన్‌ సాధ్యాసాధ్యాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా విద్యను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేయాలని...వీలైనంత త్వరగా ఖాళీల భర్తీ వివరాల్ని అందచేయాలని అధికారులను మంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది.

 

Don't Miss

Subscribe to RSS - election code