election commission

21:58 - December 8, 2017

అహ్మదాబాద్ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 89 స్థానాలకు... శనివారం పోలింగ్‌ జరగనుంది. తొలిదశలో సౌరాష్ట్ర, పశ్చిమ గుజరాత్‌, కచ్‌ ప్రాంతాలున్నాయి. గుజరాత్‌ సీఎం విజయ్‌రూపాని సహా 977 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు ఈ ఎన్నికలను వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకొని విస్తృతంగా ప్రచారం చేశారు. సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లో అధిక స్థానాలు ఉండడంతో ఇక్కడ ఆధిక్యత సంపాదించడం అన్ని పార్టీలకు కీలకంగా మారింది. మిగిలిన స్థానాలకు డిసెంబర్‌ 14న పోలింగ్‌ జరగనుంది. 

21:08 - December 8, 2017

ఢిల్లీ : గుజరాత్‌ ఎన్నికల ప్రచార సభల్లో తగ్గించిన జిఎస్‌టిని ప్రచారం చేయవద్దని ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశించింది. ఇటీవల 178 వస్తువులపై జిఎస్‌టిని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని తనకనుకూలంగా మార్చుకోవాలని బిజెపి భావిస్తోంది. ఇది ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఈసీ పేర్కొంది. వస్తువులు, సేవల పేర్లు తీసుకోకుండా పన్నును సరళీకరించినట్లు చెబితే అభ్యంతరం లేదని తెలిపింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నోట్లరద్దు, జిఎస్‌టి అంశాలపై మోది ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ టార్గెట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు అంశాలు బిజెపి నష్టం కలిగించాయి. దీంతో నష్ట నివారణ కోసం జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశం 178 వస్తువులపై టాక్స్‌ను తగ్గించింది. 

11:34 - November 24, 2017

చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. డిసెంబర్ 21న ఎన్నికలు..డిసెంబర్ 24న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. జయలలిత మరణంతో ఆర్కే నగర్ అసెంబ్లీ సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. డబ్బు పంపిణీ, నిబంధనల ఉల్లంఘనతో గతంలో వాయిదా పడింది. తాజాగ మరోసారి షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.

జయలలిత మరణం అనంతరం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. పన్నీర్ సెల్వం తన మద్దతు దారులతో బయటకు వెళ్లిపోవడంతో అన్నాడీఎంకే రెండుగా చీలిపోయింది. అనంతరం నాటకీయ పరిణామాల మధ్య శశికళ జైలుకు వెళ్లింది. అనంతరం పన్నీర్..పళనీ వర్గాలు ఒక్కటయ్యాయి. పార్టీ గుర్తు కోసం ఇరువర్గాలు పోటీ పడ్డాయి. చివరకు గురువారం పన్నీర్..పళనీ వర్గాలకు రెండాకుల గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. 

15:43 - November 23, 2017

చెన్నై : అన్నాడిఎంకె పార్టీ గుర్తుపై శశికళ వర్గానికి ఈసీ ఝలక్‌ ఇచ్చింది. రెండాకుల గుర్తును పళని-పన్నీర్‌ వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికను డిసెంబర్‌ 31లోగా నిర్వహించాలని మద్రాస్‌ హైకోర్టు ఈసీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నాడిఎంకె పార్టీ గుర్తు పళని-పన్నీర్‌ వర్గానికి దక్కడం గమనార్హం. ఆర్‌కె నగర్‌ ఉప ఎన్నిక సమయంలో పార్టీ గుర్తు రెండాకుల కోసం శశికళ-దినకరన్, పళని, పన్నీర్‌ వర్గాలు ఈసీని ఆశ్రయించారు. తదనంతరం జరిగిన పరిణామాల్లో పళని, పన్నీర్‌ వర్గాలు ఏకమయ్యాయి.

21:45 - November 17, 2017

పాట్నా : జనతాదళ్‌ యునైటెడ్‌ పార్టీ చిహ్నం బాణం నితీష్‌ కుమార్‌కే దక్కింది. జెడియు ఎన్నికల చిహ్నం బాణం గుర్తును నితీష్‌ వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జెడియు ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు నితీష్‌ కుమార్‌కే ఉందని ఈసీ పేర్కొంది. ఈసీ నిర్ణయంతో శరద్‌యాదవ్‌ వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. బిహార్‌ సిఎం నితీష్‌కుమార్‌ ఆర్జేడితో తెగతెంపులు చేసుకుని బిజెపితో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నితీష్‌ బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని జెడియు సీనియర్‌ నేత శరద్‌యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించడంతో రెండు వర్గాలుగా పార్టీ చీలిపోయింది. 

22:16 - November 7, 2017

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గాను నవంబర్‌ 9న పోలింగ్‌ జరగనుంది. కాంగ్రెస్‌, బిజెపి మొత్తం 68 స్థానాల్లో పోటీ పడుతున్నాయి. సిపిఎం 14 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తోంది. ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి 187 అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌-బిజెపి పార్టీలు విస్తృతంగా ప్రచారాలు నిర్వహించాయి. కాంగ్రెస్‌ అవినీతిని ఎండగడుతూ ప్రధాని మోది ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన ప్రచారంలో నోట్లరద్దు, జిఎస్‌టిలపై కేంద్రాన్ని టార్గెట్‌ చేశారు. గుజరాత్‌ మోడల్‌ ఫెయిల్‌ అయిందని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌నే కాంగ్రెస్‌ నమ్ముకుంది. ఎన్నికలకు వారం రోజుల ముందు బిజెపి సిఎం అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌ పేరును ప్రకటించింది. 

 

13:28 - October 25, 2017

ఢిల్లీ : ఎట్టకేలకు ఈసీ గుజరాత్ ఎన్నికల తేదీలను ప్రకటించింది. బుధవారం మధ్యాహ్నం ఎన్నికల అధికారి ఈ షెడ్యూల్ ను విడుదల చేశారు. రెండు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 9 ,14 తేదీల్లో ఎన్నికలు జరుగనున్నాయని, డిసెంబర్ 18న కౌంటింగ్ జరుగనుందని వెల్లడించింది. ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలకు ఈవీంఎలను సిద్ధం చేయడం జరిగిందని, తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. ఎన్నికల ప్రక్రియ అంతా వీడియో గ్రాఫ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. 50,128 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, గుజరాత్ లో 4.43 కోట్ల మంది ఓటర్లున్నారని పేర్కొన్నారు.

ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన ఈసీ గుజరాత్ రాష్ట్రానికి ప్రకటించలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటన నేపథ్యంలోనే ఈసీ ప్రకటించలేదనే విమర్శలు వినిపించాయి. గుజరాత్ లో మోడీ పర్యటన ఇటీవలే ముగిసిన సంగతి తెలిసలిందే. అనంతరం బుధవారం ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడం గమనార్హం. 

2012 ఫలితాల బల బలాలు..
గుజరాత్ అసెంబ్లీ 2012 ఫలితాలు ఒక్కసారి చూస్తే బీజేపీ ఓట్ల శాతం 64.29 శాతం ఉండగా కాంగ్రెస్ ఓట్ల శాతం 32.42గా ఉంది. మొత్తం 182 సీట్లున్న రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ 120 సీట్లు..కాంగ్రెస్ 43..ఎన్సీపీ 2...జేడీయూ 1..ఇండిపెండెంట్ 1 బలంగా ఉంది. 12 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 

20:12 - October 20, 2017

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘంపై మాజీ కేంద్ర మంత్రి చిదంబరం మండిపడ్డారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించడంలో ఈసీ కావాలనే జాప్యం చేస్తోందని ఆయన ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. ప్రధాని మోది గుజరాత్‌లో తలపెట్టిన మెగా ర్యాలీ కోసమే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించకుండా ఈసీ జాప్యం చేసిందని ఆరోపించారు. ప్రధాని అన్ని రాజకీయ ప్రకటనలు చేసిన తర్వాత... గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటిస్తుందని ఎద్దేవా చేశారు. అక్టోబర్‌ 12న హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల తేదీలను ప్రకటించిన ఎన్నికల కమిషన్.. గుజరాత్ తేదీలను మాత్రం వెల్లడించలేదు. 

07:21 - October 13, 2017

 

ప్రజాస్వామ్యాన్ని అపహస్యపాలు చేయడం చాలా దారుణమని, దేశవ్యాప్తంగా జీఎస్టీ సమస్య ఉంటే కేవలం గుజరాత్ కు సంబంధించిన కొన్నింటికి మాత్రమే మినహాయింపు ఇచ్చారని, రాజకీయా పార్టీలు తమ స్వర్థం కోసం స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ ను వాడుకుంటున్నారని, ఎన్నికల సంఘం అధికారులు నైతిక బాధ్యతలతో ఉండాలని ప్రముఖ విశ్లేషకులు వీరయ్య అన్నారు. ఏ రాజకీయా పార్టీ అయిన ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉంటాయని, ఎన్నికల కమిషన్ హిమచల్ ప్రదేశ్ కు తేదీ ప్రకటించిందని, కానీ దాని ఫలితం రాకముందే గుజరాత్ ఎన్నికలు జరుపుతుందాని, ఎన్నికల కమిషన్ ఎప్పుడు స్వతంత్రంగా వ్యవహరిస్తోందని బీజేపీ నాయకురాలు మాధవి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

21:51 - October 12, 2017

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. అక్టోబర్‌ 16న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు తెలిపింది. నవంబర్ 9న హిమాచల్ అసెంబ్లీకి ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తం 68 అసెంబ్లీ స్ధానాలకు ఒకే దశలో పోలింగ్‌ జరుగుతుందని పేర్కొంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 18న జరుగుతుంది. అదేరోజు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 49 లక్షల మంది ఓటర్లున్న హిమాచల్‌లో మొత్తం 7521 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఈవీఎంలతో పాటు వీవీపాట్‌ యంత్రాలు ఉపయోగిస్తామని సీఈసీ అచల్‌ కుమార్‌ జ్యోతి చెప్పారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో  నేటి నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని తెలిపారు. అభ్యర్థులు భారీ స్ధాయిలో ఓటర్లకు పంపే ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్‌ మెసేజ్‌లనూ  ఎన్నికల ప్రచార వ్యయం కింద పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక కారణం వల్ల గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ పెండింగ్‌లో పెట్టింది. ఆ రాష్ట్రంలో డిసెంబర్‌ 18లోపు ఎన్నికలు జరుగుతాయని తెలిపింది.

 

Pages

Don't Miss

Subscribe to RSS - election commission