farmers

15:32 - October 17, 2017

కడప : జిల్లాలో భూమి కుంగిపోవడంతో రైతులు..గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇలాంటి ఘటనే మళ్లీ పునరావృతం కావడంతో అక్కడ ఆందోళన నెలకొంది. చింతకొమ్మదిన మండలం గూడవాండ్ల పల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. పంట పొల్లాలో భూమి ఒక్కసారిగా కుండిపోయింది. మామిడి చెట్లు భూమిలోకి కుంగిపోయాయి. తమకు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నామని, గతంలో ఇలాంటిదే జరిగితే అధికారులు వచ్చి వెళ్లారని ఓ రైతు పేర్కొన్నారు. 

21:46 - October 15, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని చిన్నా, పెద్ద ప్రాజెక్టుల్లో జలకళ వచ్చింది. పలు జిల్లాల్లో  కుండపోత వానలతో పంటలు నీటిపాలయ్యాయి. ఇటు హైదరాబాద్‌ను మరోసారి భారీవర్షం ముంచెత్తింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌ జామ్‌లతో సిటీజనం నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు బంగాళాఖాతంతో అల్పపీడనం ఏర్పడటంతో మరో 3 రోజులు ఏపీ, తెలంగాణలకు భారీవర్షాలు తప్పవని విశాఖ వాతావరణశాఖ తెలిపింది.
హైదరాబాద్‌ను వదలని వరుణుడు  
హైదరాబాద్‌ను వరుణుడు వదలడంలేదు. భారీవర్షాలు ముంచెత్తడంతో సిటీ జనం అవస్థలు పడుతున్నారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్‌, హయత్‌నగర్‌లో కుండపోతగా వర్షం కురిసింది. గత పది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం అతలాకుతలమైంది. ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో నగరంలోని ఆయా ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. అటు శివారు ప్రాంతాల్లో కూడా భారీగానే వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే డ్రైనేజీలన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. భారీవర్షాలతో  అటు  నిజమాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలు నాశనం అయ్యాయి. నిజామాబాద్‌జిల్లాలో వరిపంటను వర్షాలు దారుణంగా దెబ్బతీయగా.. కామారెడ్డి జిల్లాలో చేతికవచ్చిన పత్తిపంట నేలపాలయిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.  
ఏపీలోనూ 
ఏపీలోనూ భారీవర్షాలకు పంటలు నేలరాలాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో  ఇటీవల కురిసిన  వర్షాలకు  మొత్తం 31.161 హెక్టార్లలో వివిధ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లావ్యాప్తంగా దాదాపు 834  కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, అలాగే 365  కిలోమీటర్ల మేర పంచాయతీ రాజ్ రోడ్లు దెబ్బతిన్నాయని జిల్లా అధికారులు లెక్కలు వేశారు.  
నిండుకుండలా ఆల్మట్టీ, శ్రీరాం సాగర్, శ్రీశైలం
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ జలకళతో తొణికిసలాడుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆల్మట్టీ, శ్రీరాం సాగర్, శ్రీశైలం, సింగూరు , నిజాంసాగర్, తదితర ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ నీటితో నిండుకుండలా మారాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో నాగార్జున సాగర్‌ నీటి మట్టం అమాంతం పెరిగుతోంది.  అయితే నాగార్జున సాగర్ నిండడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అటు  నిజామాబాద్ జిల్లాలోని  శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. 
బంగాళాఖాతంలో అల్పపీడనం
ఇదిలావుంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల  భారీవర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తెలంగాణలో  ఉపరితల ఆవర్తనం కొనసాగుతూనే ఉంది. భారీగా క్యూములోనింబస్‌ మేఘాలు ఏర్పడి.. హైదరాబాద్‌తోపాటు, పలు జిల్లాల్లో మరో 3రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

 

20:38 - October 13, 2017

హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, అటవీ, పర్యావరణ, వన్యప్రాణి అనుమతులు, పంప్ హౌజ్‌లు, కెనాల్స్‌తో పాటు ఇతర పనుల పురోగతిపై హరీష్‌రావు సమీక్ష నిర్వహించారు. 6 లక్షల 74 వేల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతి ఇంకా వేగంగా జరగాలని మంత్రి హరీష్‌రావు అన్నారు. 

 

18:13 - October 13, 2017

హైదరాబాద్ : సీబీఐ కోర్టులో జగన్‌ కేసు విచారణ ముగిసింది. నవంబర్‌ 2 నుంచి పాదయాత్ర చేపడుతున్న నేపథ్యంలో... ఆరు నెలలపాటు... ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టు హాజరు నుంచి మినహాయించాలని జగన్‌ కోరారు. దీనిపై ఈనెల 20న విచారణ చేపడతామని కోర్టు సూచించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:40 - October 13, 2017

తూర్పుగోదావరి : జగన్‌ ప్రతిపక్ష నాయుకుడిగా ఉండటం మా అదృష్టమని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. జగన్‌ తలకిందులుగా తపస్సుచేసినా జగన్‌ను ప్రజలను నమ్మరని చెప్పారు. జగన్‌.. తన వికృత ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. నవ్యాంధ్ర అభివృద్ధికి తోడ్పడే ఆలోచనలు ఇస్తే స్వీకరిస్తామని అన్నారు. 

 

12:11 - October 12, 2017

 

నాగపూర్ : భారతీయులకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. ఎక్కువ శాతం మందికి ప్రజలకు వ్యవసాయరంగమే జీవనోపాధి కల్పిస్తోంది. జనాభాలో సగం మందికి పైగా వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇలాంటి రంగంలో సహజ ఎరువుల వినియోగం తగ్గిపోయి పెస్టిసైడ్స్‌ వాడకం పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తులను ఆశించిన స్ధాయిలో పొందేందుకు క్రిమి సంహారక మందులు, కలుపు మందులు విరివిగా వాడుతున్నారు. పంటను కాపాడుకోవాలనే తాపత్రయంతో.. అవసరానికి మించి క్రిమిసంహారక మందులను వాడుతున్నారు. అవే వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.

బలవంతంగా అంటగడుతున్నారు....పెస్టిసైడ్స్‌ వినియోగం పెరగడంతో.. వ్యాపారులు దీన్నీ తమ లాభార్జనకు.. వంచనకు మార్గంగా ఎంచుకుంటున్నారు. నకిలీ పురుగు మందులు.. నాణ్యత లేని, ప్రమాదకర పెస్టిసైడ్స్‌ను.. రైతులకు బలవంతంగా అంటగడుతున్నారు. వీటిని వినియోగించే క్రమంలో రైతులు రకరకాల రుగ్మతలకు లోనవుతున్నారు. పెస్టిసైడ్‌ వల్ల రోగాల పాలై చనిపోయిన రైతులు చాలా మందే ఉన్నారు. వాటిపై వారికి పూర్తిగా అవగాహన లేకపోవడమే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.ఏదో జబ్బు చేసిందని ఆసుపత్రుల చుట్టూ తిరిగి చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు. స్లో పాయిజన్‌లా పని చేసే పురుగుల మందు ప్రభావంతో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నా కారణమిదని గ్రహించుకోలేకపోతున్నారు. మందుల మోతాదు ఎక్కువై గాలి, నేల కలుషితమవుతున్నాయి. వీటివల్ల మనుషులకు క్యాన్సర్‌, గుండె జబ్బులు వస్తున్నాయి. శిశు మరణాలు సంభవిస్తున్నాయి.

రైతులు శరీరాన్నంతా ఆప్రాన్‌ లేదా కవర్‌తో కప్పేసుకోవాలి...
మందులు పిచికారీ చేసే సమయంలో రైతులు శరీరాన్నంతా ఆప్రాన్‌ లేదా కవర్‌తో కప్పేసుకోవాలి. మందు చల్లినప్పుడు మొక్క పత్ర రంధ్రాల ద్వారా ఎలా లోపలికి వెళ్తుందో.. అలాగే మనిషి చర్మంపై పడి పురుగుల మందులు శరీరంలోకి వెళ్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే శరీరాన్ని పూర్తిగా కప్పుకోవాలని చెబుతున్నారు. తలపై కూడా క్యాప్‌ పెట్టుకోవాలి. చేతులతో మందు కలపకుండా కర్రతో కలపాలి. మందు చల్లడం పూర్తయిన తరువాత సబ్బుతో చేతులు కడుక్కోకుండా, స్నానం చేయకుండా భోజనం చేయకూడదు. ఇలాంటి సూచనలు చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులకు పట్టింపు లేకుండాపోయింది. దీంతో రైతాంగం మొత్తాన్ని పురుగుల మందులు స్లో పాయిజన్‌లా చంపేస్తున్నాయి. 

12:10 - October 12, 2017

 

నాగపూర్ : మహారాష్ట్రలో రైతుల మృత్యుఘోష. నెల్లాళ్ల వ్యవధిలో 50 మంది రైతుల మృతి. చూపు కోల్పోయిన 300 మంది రైతులు. పిచ్చివాళ్లవుతోన్న యావత్మాల్‌ రైతాంగం ఎందుకీ దుస్థితి..?దేశంలో దాదాపు 6 కోట్ల కుటుంబాల జీవితాలు.. పత్తితో ముడిపడి ఉన్నాయి. 60 లక్షల మంది నేరుగా పత్తి పండిస్తుంటే.. 5 కోట్ల మందికి పైగా టెక్స్‌టైల్‌ సంబంధ పరిశ్రమల్లో పని చేస్తున్నారు. వరి తరువాత ఎక్కువ మంది సాగు చేస్తోన్న పంట పత్తి మాత్రమే. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్నాటక, పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పత్తి ఎక్కువగా సాగవుతోంది. ఈ రాష్ట్రాల్లోనే రైతుల ఆత్మహత్యలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. కానీ విదర్భలో జరుగుతున్నవి రైతుల ఆత్మహత్యలు కావు. కానీ రైతుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి.

వ్యాపారుల లాభాపేక్ష..
మహారాష్ట్రలోని విదర్భలో.. రైతులు పురుగుమందుల వ్యాపారుల లాభాపేక్ష.. వంచనలకు గురై అసువులు బాస్తున్నారు. పత్తి చేలకు పురుగుల మందు పిచికారీ చేస్తూ ఇప్పటివరకూ 20 మంది రైతులు చనిపోయారు. పలువురు కంటిచూపు కోల్పోయారు. రాష్ట్ర రాజధాని ముంబయికి 670 కిలోమీటర్ల దూరం ఉన్న యావత్మాల్‌ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ పత్తి చేలకు పురుగుల మందు పిచికారీ చేస్తూ ఆ వాసనలు పీల్చడంతో నెల రోజుల్లో 20 మంది చనిపోయారు. ఇప్పటివరకూ మొత్తం 800 మంది రైతులు పురుగుల మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురయ్యారు. వీరిలో వంద మందికి పైగా వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

పిజ్‌గావ్‌ గ్రామాన్ని సందర్శించిన 10టీవీ
యావత్మాల్‌ జిల్లా, మారేగావ్‌ తాలుకా పిజ్‌గావ్‌ గ్రామాన్ని 10టీవీ సందర్శించింది. ఇక్కడ పత్తి చేనులో పురుగుల మందు పిచికారీ చేయడంతో.. 30 మంది అస్వస్థతకు గురయ్యారు. శంకర్‌ నాగోజి అగ్లావే అనే రైతు నాలుగు రోజులు హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతూ చనిపోయాడు. అతనికి ఇద్దరు కుమారులున్నారు. అతని నాలుగెకరాల పొలంలో పత్తి, సోయా వేశాడు. పోలో సింటెంజా అనే పెస్టిసైడ్‌ని పిచికారీ చేయడంతో అదే రోజు సాయంత్రం సొమ్మసిల్లిపడిపోయాడు. అతని కుటుంబ సభ్యులు 4 రోజులు ఆసుపత్రుల చుట్టూ తిప్పినా ఫలితం దక్కలేదు. అతని భార్యాపిల్లలు ఇప్పుడు దిక్కు లేకుండాపోయారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకూ వారికి ఎలాంటి భరోసా ఇవ్వలేకపోతోంది. అశోక్‌ గెడెం అనే వ్యక్తి పత్తి చేనుకు పురుగుల మందు స్ప్రే చేయడానికి పనికి వెళ్లిన పాపానికి కంటి చూపును కోల్పోయాడు. అంధకారంలో మగ్గిపోతున్నాడు. రాథోడ్ అనే రైతు తన కుటుంబాన్ని పోషించే దిక్కు లేక.. భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. బ్రహ్మానంద్‌ ఆదిక్‌ అనే వ్యక్తి కూడా చూపు కోల్పోయాడు.

ప్రాణాలు తీస్తున్న పోలో సిజెంటా
పోలో సిజెంటా అనే మందును గతంలో ఇచ్చిన దానికన్నా తక్కువ ఇచ్చి తమతో వాడించారని రైతులు అంటున్నారు. ఆ పెస్టిసైడ్‌ స్ప్రే చేసిన వారంతా అస్వస్థతకు గురయ్యారని, తమ గ్రామంలో అయిదుగురు చనిపోగా.. ఇంకొందరు కంటి చూపు కోల్పోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వానికి సరైన నివేదికను పంపడంలో.. జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. సమస్యకు పరిష్కారం అన్వేషించక పోగా.. రైతులు పిట్టల్లా రాలుతున్నా.. పట్టనట్లే వ్యవహరించింది. మీడియా ద్వారా విషయం తెలియడంతో.. సీఎం ఫడ్నవీస్‌ స్పందించి.. యావత్మాల్‌ రైతుల మరణాలపై ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అప్పటికి గానీ అసలు విషయం ఆయన దృష్టికి చేరలేదు. దీంతో.. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తామని సీఎం ఫడ్నవిస్‌ హామీ ఇచ్చారు. కిందిస్థాయి అధికారుల ఉదాసీనత ఫలితంగా.. 50 మంది దాకా రైతుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 

13:22 - October 11, 2017

రంగారెడ్డి : జిల్లా యాచారం మండలం మేడిపల్లిఓ ఉద్రిక్తత నెలకొంది. ఫార్మా సిటీ ఏర్పాటుపై జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణలో గందరగోళంగా మారింది. మరోవైపు సభకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను, ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

12:03 - October 10, 2017

 

నిజామాబాద్ : ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుంటే.. తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వెలవెలబోతోంది. ప్రాజెక్టులో ఇంతవరకు భారీగా నీరు చేరుకోలేదు. ప్రస్తుతం 1094 అడుగులు మాత్రమే ఉంది. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

10:29 - October 9, 2017

మహారాష్ట్ర : యావత్మాల్‌ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. నెలరోజుల వ్యవధిలో 20 మంది రైతులు మృతిచెందారు. 700 మంది ఆస్పత్రిపాలయ్యారు. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన క్రిమిసంహారక మందులు చల్లే యంత్రాల వినియోగం రైతులకు అర్థంకాలేదు. దీంతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండానే వాటిని వినియోగించారు. దీంతో వందలాది రైతులు క్రిమిసంహారకాల ప్రభావానికి గురయ్యారు. నెల రోజుల వ్యవధిలోనే 20 మంది రైతులు చనిపోయారు. 700 మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో 25మంది కంటిచూపు కోల్పోయారు. క్రిమిసంహారక ముందులు చల్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకపోవడంతో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మందులు చల్లే పరికరాల్లో కొత్త మోడళ్లు రావడం.. వాటిపై రైతులకు సరైన అవగాహన లేకపోవడం కూడా ఓ కారణమేనని నిపుణులు చెబుతున్నారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - farmers