farmers suicide

12:02 - July 26, 2018

హైదరాబాద్ : వ్యవసాయం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపొయ్యేలా చేస్తోన్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు రైతు సంఘాలు ఉద్యమానికి సిద్దం అవుతున్నాయి. గిట్టుబాటు ధర, రైతు రుణమాఫీ, ఉపాధి హామీలే ఎజెండాగా... పోరాటానికి రెడీ అవుతున్నాయి. దశలవారీగా పాలకుల తీరును ఎండగట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. జైల్‌భరో, ఛలో ఢిల్లీకి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. సెప్టెంబర్‌ 5న ఢిల్లీ వీధుల్లో రైతు సమస్యలపై కేంద్రంతో పోరుకు కాలుదువ్వుతున్నాయి. రైతు సమస్యలపై గళమెత్తేందుకు ఊరూవాడ ఛలోఢిల్లీకి సన్నద్దం అవుతున్న తీరుపై 10టీవీ కథనం..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు రైతులు సంఘాలు ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. పాలకుల విధానాలపై పోరాడేందుకు హైదరాబాద్‌లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ, ఏఐకేఎస్‌, AIAWU, రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. కనీస వేతనాలు, గిట్టుబాటు ధరలు, భూమి, ఉపాధి హామీ అంశాలపై సెప్టెంబర్‌-5న జరిగే ఛల్లో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించి సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. మూడు సంఘాలు తలపెట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమ విజయవంతం కోసం ఐక్య కార్యాచరణను నాయకులు రైతు సంఘాల ముందు ఉంచారు. సెప్టెంబర్‌ 5 వరకు ఊరూర క్యాంపెయిన్‌ నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 10వేల గ్రామాల నుంచి గ్రామానికి వెయ్యి మందిచొప్పున ఛలో ఢిల్లీకి తరలిరావాలని రైతు నాయకులు పిలుపునిచ్చారు.

సెప్టెంబర్‌ -5న జరిగే ఛల్లో ఢిల్లీకి ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 9న.. అన్ని కలెక్టరేట్ల ఎదుట జైల్‌ భరో కార్యక్రమం నిర్వహించబోతున్నట్టు నాయకులు ప్రకటించారు. ఆగస్టు -14న జన జాగరణ, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సదస్సుల్లో పాల్గొన్న ఏఐకేఎస్‌ జాతీయ కార్యదర్శి విజయరాఘవన్‌ ... మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. అనేక పోరాటాలతో సాధించుకున్న ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే పనిలో కేంద్రంలోని మోదీ సర్కార్‌ ఉన్నదని విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం... రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు. కేంద్ర సర్కార్‌ కార్పొరేటర్లకు , పెట్టుబడిదారులకు అనుకూలంగా సంస్కరణలు తీసుకొస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బ్యాంకులను నిర్వీర్యం చేసే ఆలోచనలో బీజేపీ ఉందని ఆరోపించారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 36వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్‌ విమర్శించారు. వీరిలో 12వేల మంది రైతులు మహారాష్ట్రకు చెందిన వారన్నారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో 70శాతం మంది రైతులు బీజేపీ పాలిత రాష్ట్రాల వారేనన్నారు. దేశంలో రైతుల నుంచి బలవంతపు భూసేకరణ జరుగుతోందన్నారు.

మొత్తానికి సెప్టెంబర్‌ -5న జరుగనున్న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి భారీ సంఖ్యలో రైతులను సమీకరించాలని రైతు సంఘం నాయకులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. దశల వారీ పోరాటాలకు రూపకల్పన చేశారు. మరి ఆ కార్యక్రమాలు విజయంతానికి కృషి చేయాలని కార్యకర్తలకు నేతల పిలుపునిచ్చారు. 

14:11 - July 11, 2018

హైదరాబాద్ : ఎవరైనా..  వ్యాపారంలో ఒక ఏడాది నష్టం వస్తే భరిస్తారు.. రెండేళ్లు అయినా ఇదొక్కసారి చూద్దాంలే అనుకుంటారు. కానీ, వరుసగా మూడో ఏడూ నష్టాలే వస్తే.. తక్షణం ఆ వ్యాపారాన్ని మూసేస్తారు. కానీ, రైతుకు వ్యవసాయంలో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఇరవై ఏళ్లుగా నష్టాలే.. నష్టాలు. కనీసం పెట్టుబడి కూడా దక్కని దయనీయ స్థితి.. దీనికి కారణం ఎవరు..? కచ్చితంగా పాలకులే. ద్రవ్యలోటును తగ్గించుకునే క్రమంలో చేస్తున్న విన్యాసాలే రైతులను అప్పుల ఊబిలోకి.. అక్కడి నుంచి వద్యశిలకు తోసేస్తున్నాయి. 
ఇరవై ఏళ్లుగా వరుస నష్టాలు...
ఇరవై ఏళ్లుగా వరుస నష్టాలు...సేద్యపు నష్టాల్లో భారత్‌కు ప్రపంచంలోనే అగ్రస్థానం... అవును.. భారత దేశంలో వ్యవసాయం ఓ జూదంగా మారిపోయింది. ప్రతిఏడాదీ కోటి ఆశలతో సేద్యం చేసే రైతులు.. గడచిన ఇరవై ఏళ్లలో ఒక్కసారీ లాభం గడించలేదు సరికదా.. పెట్టుబడి మొత్తాన్ని కూడా సంపాదించలేక పోయారు. ఇది ఎవరో వేసిన కాకి లెక్కలు కాదు. అంతర్జాతీయ సంస్థ.. ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఓఈసీడీ... 36 దేశాల్లో విస్తృతంగా సర్వే చేసి వెల్లడించిన సత్యం. 
ఓఈసీడీ సంస్థ అత్యంత పకడ్బందీగా సర్వే 
ఓఈసీడీ సంస్థ అత్యంత పకడ్బందీగా ఈ సర్వేని నిర్వహించింది. వరుస నష్టాలకు కారణాలనూ అధ్యయనం చేసింది. ఈ క్రమంలో స్థూల రాబడులు, పాత సూచీలను ఎన్నింటినో పరిశీలించింది. 2000-2016 మధ్య కాలంలో సేద్యపు రాబడులు.. ఏటేటా ఆరు శాతం చొప్పున.. సగటున  14శాతానికి పడిపోయాయి. దీన్నిబట్టే.. భారత్‌లో సేద్యం ఏ దుస్థితిలో ఉందో.. రైతు బతుకులు ఎంత దుర్భరంగా ఉన్నాయో తేటతెల్లం అవుతోంది. మరి ఈ దుస్థితికి కారణం ఎవరు..? ఇంకెవరు.. ఘనత వహించిన పాలకులే..!
పాలకుల అస్తవ్యస్థ వాణిజ్య విధానాలు
భారత్‌లో పాలకుల అస్తవ్యస్థ వాణిజ్య విధానాలు రైతాంగాన్ని నష్టాల్లో తోసిందన్నది ఓఈసీడీ సర్వే తేల్చింది. ద్రవ్యలోటును పూడ్చుకునే వంకతో.. ఆహారం ధరలను అతి తక్కువగా కొనసాగించారన్నది సర్వేలో తేలింది. ఎగుమతులపై ఆంక్షలు విధించిన ప్రభుత్వాలు.. ప్రపంచ మార్కెట్‌లో వచ్చే పరిణామాలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా భారత్‌ పంచదార, బియ్యం, జొన్న, గోధుమ, బాస్మతి బియ్యం వంటి ఉత్పత్తులను గణనీయంగా ఎగుమతి చేసి.. లాభాలు గడించే అవకాశాలను కోల్పోయింది. మరోవైపు.. పదే పదే ఇన్‌పుట్‌ సబ్సిడీలు ఇచ్చారే తప్ప.. సేద్యంలో పెట్టుబడులు,  ఉత్పత్తులకు కనీస మద్దతు ధర వంటి ప్రధాన అంశాలను పాలకులు విస్మరించారన్నది సర్వే తేల్చిన సత్యం. 
భూమి కలిగిన రైతులు 62 శాతం 
భారత్‌లో, 0.80 హెక్టార్లలోపు భూమి కలిగిన రైతులు 62 శాతం మంది ఉన్నారు. వీరు వ్యవసాయేతర వృత్తుల్లోకి మారకపోతే.. శాశ్వతంగా దిగువ పేదరికపు జీవులుగా బతకాల్సిన దుస్థితి నెలకొంటుందని నీతి ఆయోగ్‌ సైతం గుర్తించినట్లు.. సర్వే నిర్వహించిన ఓఈసీడీ సంస్థ వెల్లడించింది. భారత్‌లో 2011 నుంచి వ్యవసాయ ఉత్పాదనలు ఏటా 3.6 శాతం మేర పెరుగుతూ వస్తున్నాయి. జీడీపీ 1990 నుంచి 5 శాతం వరకూ పెరిగింది. ఫలితంగా దేశంలో పేదరికం సగానికి తగ్గినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. 
వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని తప్పుబట్టిన సర్వే  
వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడాన్ని సర్వే తప్పుబట్టింది. దేశీయ ద్రవ్యలోటును తక్కువగా చూపేందుకు ప్రత్యేకమైన వాణిజ్య ఆంక్షలు డిజైన్‌ చేశారు. ఇందులో భాగంగా.. ఎగుమతులపై తరచూ బ్యాన్‌ విధించడం.. కనీస మద్దతు ధరను అంతర్జాతీయ స్థాయితో పోలిస్తే అత్యంత తక్కువగానే నిర్ణయించడం లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా.. ఇరవై ఏళ్లుగా.. ఏలికలు తీసుకుంటున్న అస్తవ్యస్థ విధానాల కారణంగా.. భారత రైతు పెను సంక్షోభంలో కూరుకు పోయాడు. ఈ పరిస్థితిలో స్వామినాథన్‌ కమిషన్‌ నివేదికను యథాతథంగా అమలు చేసి... రైతును లాభాల బాట పట్టించాలి. తద్వారా.. ఇంతకాలం రైతుకు చేసిన అన్యాయాన్ని పాలకులు సరిదిద్దుకున్నట్లు అవుతుంది. మరి ఏలికలు ఆదిశగా అడుగులు వేస్తారా..?  చూడాలి. 

21:48 - July 4, 2018

ఢిల్లీ : 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ ప్రభుత్వం రైతులకు భారీ నజరానా ప్రకటించింది. ఖరీఫ్‌ పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ ప్రధాని మోది అధ్యక్షతన జరిగిన కాబినెట్‌ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. వరితో సహా 14 ఖరీఫ్‌ పంటల కనీస మద్దతు ధర పెరగనుంది. క్వింటాల్‌ వరిపై మద్దతు ధర 2 వందల వరకు పెరిగింది. గ్రేడ్‌ ఏ రకం వరి క్వింటాల్‌ ధర 1,590 నుంచి 1,750కి పెంచారు. పత్తి ధర 4,020 నుంచి 5,150కి పెంచారు. కందులు క్వింటాల్‌ ధర  5,450 నుంచి 5,675, పెసర్ల ధర  5,575 నుంచి  6,975, మినుములు 5,400 నుంచి 5,600లకు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. స్వాతంత్రం అనంతరం తొలిసారిగా MSP ఇంత భారీగా పెరగడం ఇదే తొలిసారని  హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. మద్దతు ధర పెంచడంతో ప్రభుత్వంపై 15 వేల కోట్ల అదనపు భారం పడనుందని ఆయన పేర్కొన్నారు.

16:35 - July 4, 2018

ఢిల్లీ : ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. వరి ధాన్యం మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు పెంచింది. ఇతర పంటలకు 50 శాతం మద్దతు ధర పెంచాలని నిర్ణయించింది. 

 

19:59 - June 4, 2018
07:56 - May 15, 2018

హైదరాబాద్ : అధికారుల నిర్లక్ష్యానికి రైతుల ప్రాణాలు బలి అవుతూనే ఉన్నాయి. రైతుల కోసం ఎంతో చేస్తున్నామని పాలకులు చెప్పుకుంటున్నా.. రైతుల ఆత్మహత్యలు మాత్రం తగ్గడం లేదు. ఇందుకు నిదర్శనంగా సిద్దిపేట, నల్గొండ జిల్లాలో రైతుల భూముల విషయంలో జరిగిన అవకతవకలు మరో ఇద్దరు రైతులు ఆత్మహత్యప్రయత్నానికి పురిగొల్పాయి. రైతన్నల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నామని పాలకులు చెబుతున్నా రైతుల కష్టాలు మాత్రం తీరడం లేదు. అధికారుల తీరుతో నిత్యం రైతులు అవస్థలు పడుతూనే ఉన్నారు. నిత్యం ఏదో ఒక సమస్యతో రైతన్నలు బలవంతంగా తనువు చాలిస్తున్నారు. 

సిద్దిపేట జిల్లా ఎల్లాయిపల్లిలో తమ భూమిలో ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం చేపడుతుండడంతో మనస్తాపం చెందిన ఓ మహిళా రైతు ఆత్మహత్యాయత్నం చేసింది. తమకు చెందిన 8 ఎకరాల భూమి గతంలో ప్రాజెక్ట్‌ కోసం ప్రభుత్వం సేకరించింది. అయితే.. ఆ తర్వాత డిజైన్‌ మార్చడంతో 4 ఎకరాల భూమి మిగిలింది. ఆ భూమి ఆ ఎనిమిది కుటుంబాలకు చెందినవారు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే.. తాజాగా ఆ భూమిలో ప్రభుత్వం డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మిస్తోంది. దీంతో ఆగ్రహించిన రైతులు... ఆ నిర్మాణాలను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి చిన్నకోడూరు పీఎస్‌కు తరలించారు. అధికారుల తీరుతో మనస్తాపం చెందిన   భూలక్ష్మీ అనే వృద్ధురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వం మా భూముల్లో బలవంతంగా డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మిస్తుందని.. అందుకే భూలక్ష్మీ ఈ ఘాతుకానికి పాల్పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు. తమ స్థలం తమకే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

మరో వైపు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపింది. తన భూమి పట్టా విషయంలో స్థానిక వీఆర్ వో రికార్డులు మార్పిడి చేయకుండా ఇబ్బందులకు గురి చేయడంతో మనస్థాపం చెందిన లింగయ్య  పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.  లింగయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స చేయించారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు తమ అభివృద్ధికి తోడ్పడాలే కానీ... ఉన్న జీవితాలు రోడ్డున పడేయం ఏంటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

20:56 - October 30, 2017

కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఫల్యం వల్లే పత్తి రైతులకు నష్టాలు వస్తున్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డి, బీజేపీ నేత రాకేష్ రెడ్డి, టీఆర్ ఎస్ నేత భానుప్రసాద్, ఏపీ రైతు సంఘం నాయకులు రంగారావు పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వం పత్తికి మద్దతు   ధర ప్రకటించటం లేదని విమర్శించారు. నకిలీ విత్తనాలు, క్రాప్ ఇన్సూరెన్స్, ప్రకృతి వైపరీత్యాలతో కూడా రైతు నష్టపోతున్నారని తెలిపారు. పత్తి రైతులను ప్రభుత్వాలు ఆదుకోవడం లేదని వాపోయారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:12 - September 13, 2017

సూర్యాపేట : జిల్లాలోని నెరేడుచర్ల మండలం పెంచికలదిన్నె గ్రామంలో కృష్ణయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కృష్ణయ్య కుటుంబ సభ్యులు అతని శవంతో రోడ్డుపై ధర్నా చేశారు. తనఖాలో ఉన్న తన భూమిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించడంతో.. మనస్తాపానికి గురైన కృష్ణయ్య ... పురుగులు మందు తాగి...తన పంట పొలం దగ్గరే ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన కృష్ణయ్య బంధువులు ఆందోళన చేశారు. కృష్ణయ్య ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

 

19:01 - September 11, 2017

సిద్దిపేట : అప్పులబాధ తాళలేక సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ రైతు.. ముంబైలో ఆత్మహత్య చేసుకున్నాడు. చెప్పాల్‌ గ్రామానికి చెందిన అక్కరాజు నర్సయ్య అనే రైతు తన రెండెకరాల భూమిలో నాలుగు బోర్లు వేసినా.. చుక్కనీరు పడలేదు. చేసిన అప్పులు తీర్చారని ముంబైకి వలసవెళ్లాడు. మూడు నెలలు గడవకముందే మనస్తాపానికి గురైన నర్సయ్య..ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

14:35 - September 10, 2017

ఆదిలాబాద్ : తెలంగాణలో రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు టీజాక్ చైర్మన్ కోదండరామ్. రైతాంగానికి భరోసా ఇస్తూ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కాపాడాల్సిన అవరం ఉందన్నారు. అమరవీరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో జరిగిన రోడ్‌ షో కోదండరామ్ పాల్గొన్నారు. అనంతరం భారీ సభ నిర్వహించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - farmers suicide