floor test

16:55 - March 20, 2017

హైదరాబాద్: మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ విశ్వాసపరీక్షలో నెగ్గారు. 60 మంది శాసనసభ్యులున్న మణిపూర్‌ అసెంబ్లీలో ముఖ్యమంత్రికి 32 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. మణిపూర్‌ ఎన్నికల్లో 28 స్థానాలు గెలిచి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బిజెపికి కేవలం 21 స్థానాలు మాత్రమే వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్‌ ఫిగర్‌ 31. ఈ నెల 15న మణిపూర్‌ ముఖ్యమంత్రిగా బీరేన్‌సింగ్‌, డిప్యూటి సిఎంగా ఎన్‌పిపికి చెందిన జయకుమార్‌ సింగ్‌ ప్రమాణం చేశారు. పీపుల్స్‌ ఫ్రంట్‌కు చెందిన నలుగురు, ఎన్‌పిపికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, లోక్‌ జనశక్తి ఎమ్మెల్యేల మద్దతుతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలని కాంగ్రెస్‌ చేసిన విజ్ఞప్తిని గవర్నర్‌ నజ్మాహెప్తుల్లా తోసిపుచ్చారు. మణిపూర్‌లో తొలిసారిగా బిజెపి అధికారంలోకి వచ్చింది.

21:11 - July 17, 2016

ఢిల్లీ : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు అధికార.. విపక్షాలు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. జీఎస్‌టీ సహా పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ ఆమోదించుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బిల్లుల ఆమోదానికి సహకరించాలని.. ఉభయ సభల్లో చర్చలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అఖిలపక్ష నేతలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఏ ప్రభుత్వానికి లాభం చేకూరింద‌న్న అంశం క‌న్నా జాతి ప్రయోజ‌నాలు ముఖ్యమ‌ని మోదీ ఈ సంద‌ర్భంగా అన్నారు.  మరోవైపు జీఎస్‌టీ బిల్లు కాంగ్రెస్‌, బీజేపీలు నిర్ణయించేది కాదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు.

సీపీఎం విమర్శ..
దీనిపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని రెండేళ్లుగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. జీఎస్టీపై రాష్ట్రాలు, కేంద్రం మ‌ధ్య స‌యోధ్య లేద‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎలా ముందుకెళ్తార‌ని కాంగ్రెస్ ఎంపీ గులాంన‌బీ ఆజాద్ ప్రశ్నించారు. జీఎస్టీ బిల్లులోని మూడు వివాదాస్పద అంశాల‌ను కేంద్రం ఎలా ప‌రిష్కరిస్తుందో తెలపాలని మరో కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా కోరారు. జీఎస్టీపై పూర్తిస్థాయి ముసాయిదా ప్రతిపాద‌న కావాలని ఆయన డిమాడ్‌ చేశారు. ప‌న్ను రేటును 18 శాతానికి ప‌రిమితం చేయాల‌న‌డంతో పాటు ప‌లు కీల‌క స‌వ‌ర‌ణ‌లను కాంగ్రెస్‌ సూచిస్తోంది. అయితే భ‌విష్యత్‌లో మ‌ళ్లీ స‌వ‌ర‌ణ చేయాల్సిన అవ‌స‌రం త‌లెత్తకుండా ప‌న్ను రేటును ప‌రిమితం చేయాల‌ని అనుకోవ‌డం లేద‌ని ప్రభుత్వం చెబుతోంది.

తెలుగు రాష్ట్రాల ఎంపీలు..
అటు తెలుగు రాష్ట్రాల ఎంపీలు మాత్రం విభజన హామీలపైనే ప్రధానంగా ఫోకస్‌ చేస్తున్నారు. విభజన బిల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలపై సమావేశంలో చర్చించినట్లు టీడీపీ ఎంపీ తోటనరసింహం చెప్పారు. రాష్ట్రానికి సంబంధిచిన అన్ని అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. టీఆర్‌ఎస్‌ సైతం విభజన హామీలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. ప్రత్యేక హైకోర్టు, 9, 10 వ షెడ్యూల్‌లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు రాష్ట్రానికి రావల్సిన నిధులపై సభలో ప్రస్థావించనుంది. అఖిల పక్ష భేటీ అనంతంరం తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆ పార్టీ ఎంపీలంతా భేటీ అయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. విభజన హామీలతో పాటు పార్టీ ఫిరాయింపుల సవరణ బిల్లును సభలో చర్చించాలని వైసీపీ డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు తాము ప్రైవేట్‌ బిల్లును సైతం సభలో ప్రవేశపెట్టనున్నట్లు ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. పార్టీ ఫిరాయింపులతో రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుందని మేకపాటి అన్నారు. మొత్తానికి అధికార విపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలతో పార్లమెంట్‌ సమావేశాలు హాట్‌ హాట్‌గా జరగనున్నాయి. 

15:30 - July 17, 2016

ఢిల్లీ : పెండింగ్ లో ఉన్న బిల్లుల ఆమోదానికి సహకరించాలని కేంద్రం ప్రతిపక్షాలను కోరింది. కాసేపటి క్రితం ప్రధాని మోడీ అధ్యక్షతనలో అఖిలపక్ష సమవేశం జరిగింది. రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జీఎస్టీ బిల్లు గురించి ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ బిల్లు దేశానికి ఎంతో కీలకమని, ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే అన్ని బిల్లుకు సహకరిస్తామని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. అయితే జీఎస్టీ బిల్లును కాంగ్రెస్..బీజేపీ నిర్ణయించలేవని సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఈ బిల్లుపై రెండేడ్లుగా అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

14:20 - July 17, 2016

ఢిల్లీ : రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. అందులో భాగంగా ఆదివారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి రాజకీయ పార్టీల నేతలంతా హాజరయ్యారు. వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు. పెండింగ్ బిల్లులకు సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను కోరింది. ప్రధానంగా ఈ సమావేశంలో జీఎస్టీ బిల్లుపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా జీఎస్టీ బిల్లు, ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర బిల్లులపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రజలకు ఉపయోగపడే బిల్లుల కోసం సహకరిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ పేర్కొన్నారు. జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్..బీజేపీ పార్టీలు ఆమోదం తెలిపితే సరిపోదని.. అఖిలపక్ష సమావేశం నిర్వహించి చర్చించిన తరువాతే బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని సీపీఎం పేర్కొంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుండి పార్లమెంట్ నేతలు పాల్గొన్నారు. పార్టీ ఫిరాయింపుల సవరణ బిల్లు, ఎంపీ ల్యాడ్స్ పెంచాలని, కేంద్రం హామీలు నెరవేర్చాలని వైసీపీ ఎంపీ మేకపాటి సూచించారు. కేంద్రం ఇస్తామన్న నిధులు తిరిగి వెంటనే చెల్లించాలని టిడిపి ఎంపీలు సూచించారు. హైకోర్టు విభజన, ఉమ్మడి వెనుకబడిన జిల్లాల అభివృద్ది, ఏయిమ్స్, తదితర అంశాలను టీఆర్ఎస్ ఎంపీలు ప్రస్తావించారు. ఇక పార్లమెంట్ సమావేశాలు 20 రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో 25 బిల్లులను ఆమోదించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం జరిగిన ఈ అఖిలపక్ష సమావేశం సంతృప్తిపరంగా సాగినట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. 

22:02 - July 16, 2016

అరుణాచల్ ప్రదేశ్ : ఫ్లోర్‌ టెస్ట్‌ కన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా నబమ్ తుకీ రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ అసమ్మతి ఎమ్మెల్యేలు సొంత గూటికి చేరుకున్నారు. నిన్నటి వరకు అసమ్మతి నేతగా కొనసాగిన పెమ ఖండూ కొత్త సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా కొత్తగా ఎన్నికైన పెమా ఖండూ నేతృత్వంలోని 44 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిశారు. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పెమా ఖండూ గవర్నర్‌కు తెలిపారు. పెమా ఖండూ మాజీ ముఖ్యమంత్రి డోర్గి ఖండు కుమారుడు. అసెంబ్లీలో ఇవాళ జరగాల్సిన బలపరీక్ష వాయిదా పడింది. 

09:51 - May 24, 2016

ఉత్తరాఖండ్  : సీఎం హరీష్‌రావత్‌ నేడు సీబీఐ ముందు హాజరుకానున్నారు. ఓటుకు నోటుకు కేసులో హరీష్‌రావత్‌ను సీబీఐ ప్రశ్నించనుంది. కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ముడుపులిచ్చి తనకు అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు ప్రయత్నించారని హరీష్‌రావత్‌పై ఆరోపణలున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన హరీష్‌రావత్‌ను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. అనంతరం జరిగిన పరిణామాల్లో అసెంబ్లీలో బలనిరూపణకు ప్రయత్నించిన హరీష్‌రావత్... ఎమ్మెల్యేలకు ముడుపులిచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ ఒకటి బయటపడింది. ఈ నేపథ్యంలో సీబీఐ హరీష్‌రావత్‌ను ప్రశ్నించనుంది.  

14:43 - May 6, 2016

డెహ్రడూన్ : ఉత్తరాఖండ్‌లో బిజెపి వ్యూహాలకు ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ బలపరీక్ష నిర్వహించేందుకు కేంద్రం సమ్మతించింది. అయితే 9 మంది కాంగ్రెస్ రెబల్స్ ఓటింగ్‌లో పాల్గొనకూడదంటూ సుప్రీంకోర్టు కండీషన్ విధించింది. ఈ నెల 10న బలపరీక్ష నిర్వహించే అవకాశముంది.  

 

Don't Miss

Subscribe to RSS - floor test