fruits

12:22 - March 28, 2017

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. బెజవాడలో భానుడు విరుచుకుపడుతున్నాడు. ఉదయం 8 గంటలకే ఎండలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. సూర్యుడి ప్రకోపానికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. చల్లధనం కోసం పరుగులు తీస్తూ శీతల పానియాలతో సేద తీరుతున్నారు. పనిలో పనిగా..పళ్ల రసాలు, కూల్‌డ్రింక్స్ వ్యాపారులు దండుకుంటున్నారు. 
ఏపీలో ఎండలు 
ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగలు నిప్పులకొలిమిని తలపిస్తున్నాయి. జనాన్ని ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా విరుచుకుపడుతున్నాయి. ఉక్కపోతకు తోడు వేడిగాలులు దడపుట్టిస్తున్నాయి. విజయవాడలో  ఎండలు తీవ్రస్థాయికి చేరుతూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి ప్రకోపానికి విజయవాడ వాసులు బెంబెలెత్తిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు ఠారేత్తిస్తుండటంతో.. ఇళ్లనుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ముఖ్యంగా ఏపీలోని కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వడదెబ్బ మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇంకోపక్క భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో..మంచినీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చుతోంది. ఉక్కపోత, వడగాలులు సైతం పెరగడంతో వృద్ధులు, చిన్నారులు అల్లాడిపోతున్నారు. 
అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు..
ఈ వేసవిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువ అని  పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏప్రిల్, మే నెలల్లో సాధారణ ఉష్ణోగ్రతలు కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఏపీ, తెలంగాణలో ఈ ప్రభావం మరింతగా ఉంటుందని..ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఏటికేడు వడగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి.  వీటిధాటికి 2015లో 1,369 మంది మృత్యువాతపడితే, 2016లో 723 మంది చనిపోయారు. ఏప్రిల్ రెండోవారం నుంచి మే నెలాఖరు వచ్చే సరికి రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవ్వచ్చని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మార్చి మాసంలోనే..తిరుపతి, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, విజయనగరం, ఏలూరులో ఎండలు తీవ్రమమయ్యాయి. 
మధ్యాహ్న సమయంలో బయటతిరగరాదు...
అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటతిరగకూడదని.. ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు పూర్తి చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. డీ హైడ్రేషన్‌కు గురికాకుండా పళ్లరసాలు, కొబ్బరిబోండాలు, మజ్జిగ సేవించాలని వైద్యులు సూచిస్తున్నారు. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఎండలు అన్యూహంగా పెరుగుతున్నాయని.. ప్రజలు తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. 
సంగారెడ్డి జిల్లాలో 
సంగారెడ్డి జిల్లాలో భానుడు తన ప్రచండరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. సూర్యుడి భగభగలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. మార్చిలోనే విపరీతమైన ఎండలు మండిపోతుండడంతో జనం ఇళ్లల్లోంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎండవేడికి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 
భానుడు ఉగ్రరూపం
సంగారెడ్డి జిల్లాలో ప్రచండ భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఎండల తీవ్రతకు జిల్లా ఉడికిపోతోంది. జిల్లావ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి నెలలోనే ... నిప్పుల కొలిమిని తలపించే సెగలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటింది. ఉదయం 8 గంటలకే సూర్యుడు ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు ఇళ్లకే  పరిమితం అవుతున్నారు. భానుడి ప్రతాపానికి చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఆయాస పడుతున్నారు. ఇప్పుడే ఇంత విపరీతంగా ఎండలు ఉంటే ఏప్రిల్‌, మే నెలల్లో పరిస్థితి ఏంటని తలుచుకుంటేనే భయమేస్తోందని ప్రజలంటున్నారు. 
బయటకాలు పెట్టాలంటే జంకుతున్న ఉద్యోగులు  
ఇక ఉద్యోగులు బయటకు కాలు పెట్టాలంటే జంకుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో చిల్లర వ్యాపారాలు చేసుకునేవారు ఎండ వేడిమి తట్టుకోలేకపోతున్నారు. చిన్నచిన్న శామియానాలు, గొడుగుల సహకారంతో వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. రోడ్లు, బస్టాండ్లు, వివిధ కార్యాలయాలు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. పెరిగిన ఎండలకు ఉపాధి కూలీలు, భవన నిర్మాణ రంగంలో పనిచేసేవారికి ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. 
చిరువ్యాపారులకు వడదెబ్బ 
తోపుడు బళ్లు, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే చిరువ్యాపారులు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనీస జాగ్రత్తలు తీసుకోకుంటే తొందరగా వడదెబ్బకు గురికావడం ఖాయమని డాక్టర్లు హెచ్చ రిస్తున్నారు. ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు శీతల పానియాల వైపు అడుగులు వేస్తున్నారు. పట్టణ కేంద్రాల్లో ఆయా కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన ఫ్రూట్‌ జూస్‌, కొబ్బరి బొండాలు, కూల్‌డ్రింక్స్‌ తదితర వాటిని తాగి దాహం తీర్చుకుంటున్నారు. ప్రజలకు అందు బాటులో వ్యాపారులు ఉంటూ తమ వ్యాపారాలు చేసు కొని సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా కొబ్బరి బోండాలు, నిమ్మరసం పానియాలకు డిమాండ్‌ పెరిగింది. 

 

12:17 - March 28, 2017

హైదరాబాద్ : ఓ వైపు ఎండలు మండుతున్నాయి.  మరోవైపు పండ్లను ముట్టుకుంటే అంటుకుంటున్నాయి. వేసవిలో ఆరోగ్యాన్ని పంచే పండ్లను తిందామంటే సామాన్యులకు తలకు మించిన భారంగా మారింది. అయితే వ్యాపారులు మాత్రం ఇదే అదనుగా భావించి పండ్ల ధరలను ఇష్టమొచ్చినట్లు పెంచి దోచుకుంటున్నారు. 
అమాంతంగా పెరిగిన పండ్ల ధరలు
మండు వేసవిలో పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. సాధారణంగా ఇతర కాలాల కంటే ప్రస్తుతం పండ్లకు గిరాకీ అధికంగా ఉండడంతో.. పండ్ల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. పండ్ల ధరలు మూడింతలు పెరగడంతో కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవిలో పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తున్న సామాన్యులకు ధరలు చూసి మైండ్‌ దిమ్మతిరిగిపోతుంది. ఇప్పుడే ధరలు ఇలావుంటే రానురాను ఇంకేంత పెరుగుతాయోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
రెచ్చిపోతున్న వ్యాపారులు  
ఇదిలావుంటే ఇదే ఆసరాగా చేసుకుని హోల్‌సేల్‌ మార్కెట్‌లో వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న సరుకును వేలం వేయకుండా రైతుల వద్ద నేరుగా కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌లో ఇష్టం వచ్చినట్లు రేట్లు నిర్ణయించి విక్రయిస్తున్నారు. దీంతో గతేడాదితో పోలిస్తే ఈసారి పండ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. 
పెరిగిన విదేశీ పండ్ల ధరలు 
గతంలో 80 పలికిన గ్రేప్స్‌.. 100కు పెరిగింది. పుచ్చకాయలు 45 రూపాయలు, సంత్రా ఒక్కటి 10 రూపాయలకు చేరింది. ఇక మామిడికాయలైతే.. 120 రూపాయలు పలుకుతున్నాయి. మరోవైపు విదేశీ పండ్ల ధరలు కూడా ఇదే స్థాయిలో పెరిగిపోయాయి. 
ఇష్టానుసారంగా పండ్ల ధరల నిర్ణయం 
ఇదిలావుంటే.. హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్లలో పండ్ల ధరలను ఇష్టమొచ్చినట్లు నిర్ణయించి విక్రయిస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలంటున్నారు. ప్రజలకు ఆరోగ్యాన్ని పంచే పండ్ల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే.. గతేడాది కంటే ఈసారి పండ్ల ధరలు పెరిగాయని వ్యాపారులంటున్నారు. ఏది ఏమైనా వేసవిలో పండ్లు తింటే అనారోగ్యానికి గురికాకుండా ఉంటామనే నమ్మకంతో ప్రజలు ధర ఎంతైనా కొనుగోలు చేస్తున్నారు. 

 

17:05 - March 27, 2017

డ్రై ఫూట్స్ తో ఆరోగ్యానికి ఎంతో మేలు అనే సంగతి తెలిసిందే. డ్రై ఫ్రూట్స్ లో ఎండు ద్రాక్ష కూడా ఒకటి. ఇది తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఎండు ద్రాక్షలను తీసుకోవడం ద్వారా రక్త హీనతను దూరం చేసుకోవచ్చు. తద్వారా శరీరంలో రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. ఎండుద్రాక్షల్లో విటమిన్ బి, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు. విటమిన్స్, అమినో యాసిడ్స్, మెగ్నీషియం, పోటాషియం అధికంగా ఉంటాయి. హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటే ఎండుద్రాక్షలను తీసుకోవడం ద్వారా ఆ సమస్య దూరమయ్యే అవకాశం ఉంది. క్యాల్షియం పిల్లల్లో ఎముకల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లల పెరుగుదలకు, గర్భిణీలకు ఎండుద్రాక్షలు ఎంతగానో మేలు చేస్తాయి.

19:28 - March 15, 2017

ఎండాకాలం వచ్చేసింది. దీనితో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురుకానున్నాయి. ఎండల వల్ల డీ హైడ్రేషన్ తో పాటు చర్మ సంబంధిత రోగాలు వచ్చే అవకాశాలున్నాయి. దీనితో ఎండకాలం నుండి తప్పించుకోవడానికి పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైంది తాజా పండ్ల రసాలను తీసుకోవడం. క్యారెట్..బీట్ రూట్..దానిమ్మ..సంత్రా..ఇలా పండ్ల రసాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం మేలుగా ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల ఇది సూర్యుని నుండి వచ్చే కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. క్యారెట్ జ్యూస్ లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. దానిమ్మ జ్యూస్‌ను రెగ్యులర్‌గా తాగడం వల్ల గ్లోయింగ్‌ స్కిన్‌ పొందవచ్చు. ఇది అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. ద్రాక్ష జ్యూస్‌ను తీసుకోవడం ద్వారా వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

10:46 - March 5, 2017

పుచ్చకాయలో ఉండే లైకోపీస్ గుండె..చర్మ సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. సపోటా పళ్లు మలబద్ధకాన్ని నివారిస్తాయి. అనాసపళ్లలో బ్రొమిలిస్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల వాపులను తగ్గిస్తుంది. ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి. పచ్చిజామకాయలో ఉండు టానిస్ మాలిక్ ఆమ్లాలు దుర్వాసనను పొగొడుతాయి. టమాటలో ప్రొస్టైట్ క్యానసర్ సోకకుండా అడ్డుకుంటుంది. సంత్రా పండు తినడం వల్ల న్యుమోనియా వ్యాధి తగ్గుతుంది. ఆవాలని క్రమం తప్పకుండా వంటల్లో వాడడం వల్ల ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది. క్యారెట్ జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. చేపలు తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. పంటి నొప్పి సమస్యకు దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిసుంది. అంతేగాకుండా మలబద్ధకాన్ని కూడా వదిలిస్తుంది. మునగకాయలు ఆకలిని పెంచుతాయి. రోజు ఒక తులసి ఆకును తినడం వల్ల క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉంటుంది. రోజు ఒక కప్పు పాలు తాగడం వల్ల ఎముకలు ధృడంగా ఉంటాయి. ప్రతి రోజు ఓ కప్పు ఉడకబెట్టిన బీన్స్ లేదా పప్పు ధాన్యాలు ఖచ్చితంగా తీసుకోవాలి.

16:01 - December 16, 2016

చలికాలం..చర్మం పాడవుతూ ఉంటుంది. చర్మ సంరక్షణకు ఏవో క్రీములు, మందులు ఇతరత్రా వాడుతుంటారు. లేనిరోగాలు తెచ్చుకుంటుంటారు. వండే పదార్థాల్లోనే కాకుండా పండ్లతో కూడా చర్మం పాడు కాకుండా ఉంచుకోవచ్చు. అలాంటి పండ్లలో కొన్ని..మీ కోసం..

దానిమ్మ : ఈ పండు చర్మ కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో పోషక విలువలు మెండుగా ఉంటాయి. ముఖంపై మడతలు, మొటిమలను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దానిమ్మ పండులను తినడం వల్ల చర్మ కణాలను బిగుతుగా ఉంచుతుంది.

స్టాబెర్రీ : ఈ పండులో కూడా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఈ పండు తినడం వల్ల నీరసం దరి చేరదు. రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు చర్మాన్ని కాంతి వంతంగా తయారు చేస్తుంది. ఈ పండును క్రీములు..పదార్థాలు తయారు చేయడంలో వాడుతుంటారు.

బొప్పాయి : ఈ పండులో విటమిన్ ఎ ఉంటుందనేది అందరికీ తెలిసిందే. చర్మ సంరక్షణకు యాంటీ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇందులో పైపైన్ ఎంజెమ్ మృత కణాలను తొలగించడానికి సహాయ పడుతుంది. చర్మ కణాలకు అవసరమైన ఎంజెమ్ లను ఉత్పత్తి చేస్తుంది.

అరటి : అరటి పండులో పోటాషియం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. ఇందులో విటమిన్ ఇ, సి ఉంటాయి. చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తాయి.

ఆపిల్ : విటమిన్ సి ఉండడం వల్ల మొటిమలు, ముతలు రాకుండా కాపాడుతుంది. నల్లమచ్చల సమస్య కూడా దూరం అవుతుంది. పొడిబారిన చర్మం గల వారు ఆపిల్ పండు తినాలి.

సీతాఫలం : విటమిన్ ఎ, సి ఈ పండులో ఉంటాయి. కొత్త కణాల ఉత్పత్తి చేయడానికి ఈ పండు ఉపయోగపడుతుంది. చర్మానికి మంచి స్ర్కబ్ లా పనిచేస్తుంది. ప్రీ రాడికల్స్ ను ఉత్పత్తి చేస్తాయి.

12:15 - September 28, 2016

కాలానికనుగుణంగా పండ్లు వస్తుంటాయి. కొన్ని పండ్లు సంవత్సరమంతా దొరుకుతుంటాయి. ఆరోగ్యం బాగులంటే ఆహారంతో పాటు పండ్లు కూడా భుజించాలి. పండ్లలో దొరికే పోషకాలు మన శరీరానికి దొరుకుతాయి. దీనితో అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు. మరి ఏ పండు తింటే ఏ లాభం అనేది చూద్దాం..
మామిడి : పలు రకాల క్యాన్సర్లను రానివ్వదు. రెచీకటిని దూరం చేస్తుంది కళ్ళు పొడిబారకుండా సహాయపడుతుంది. అంతేగాకుండా శరీరానికి చలువ.
అరటి పండు : తక్షణ శక్తిని అందిస్తుంది.
బత్తాయి : చర్మ సంరక్షణ, కంటి చూపు మెరుగుపడుతుంది. జ్వరపీడితులకు మంచిది.
పైనాపిల్ : ఎముకలను పటిష్టపరచడమే కాకుండా ఆర్తరైటిస్ దరి చేరనివ్వదు.
ఉసిరి : వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తం లోని చకెర నిల్వను తగిస్తుంది, కిళ్ళ వాతాన్ని తగిస్తుంది అన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది
దానిమ్మ : మెదడు ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది.
స్టాబెర్రీ : క్యాన్సర్ మీద పోరాడే గుణం ఎక్కువగా ఉంటుంది.
పుచ్చకాయ : హృదయ స్పందనల రేటను సక్రమంగా ఉంచుతుంది. బాడీ లోని ఫ్యాట్ ను తగిస్తుంది, హై బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది.
ఆపిల్ : రక్తహీనతను దూరం చేస్తుంది. హై బీపీని తగ్గిస్తుంది. మలబద్ధకం తగ్గిస్తుంది.
ఖర్జూరం : మత్తును దూరం చేస్తుంది. గుండెకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది.

11:32 - September 22, 2016

నలుగురిలో ఉన్నా అందరి దృష్టి తమపైనే ఉండాలని కోరుకుంటుంటారు. చర్మం సౌందర్యంగా ఉండటానికి పలు రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ చర్మం సౌందర్యంగా మారకపోవడంతో నిరుత్సాహానికి గురవుతుంటారు. పండ్ల జ్యూస్ తాగితే చర్మం నిగారింపు వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. పండ్ల రసాన్ని ఫేసియల్ గా ఉపయోగిస్తే ? ఇంట్లోనే కొద్దిపాటి చిట్కాలు పాటిస్తే చర్మ సంరక్షణ సులభంగానే సాధ్యమవుతుంది. పండ్ల గుజ్జును ముఖానికి, శరీరంలోని ఇతర భాగాలకూ రాసుకుంటే చర్మం మిలమిల మెరుస్తుంది.
పండ్లలో రాజు 'మామిడి'. ఈ పండు ద్వారా చర్మ సౌందర్యం పొందవచ్చు. దీని సరం చర్మం అందంగా తయారయ్యేందుకు ఉపయోగపడుతుంది. ఈ పండులో బీటా కెరోటిన్ ఉంటుంది. దీనివల్ల చర్మం పునరుద్ధపరిచి, కణాల జీవితకాలాన్ని పెంచుతుంది.
ముఖంపై మచ్చలు..మొటిమల నివారణకు 'బొప్పాయి' పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పండురసాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ గా వేసుకోవచ్చు. మచ్చలు..మొటిమలు..వివిధ చర్మ వ్యాధులను తగ్గించేందుకు ఇది చక్కగా పనిచేస్తుంది. చర్మం మరింత ప్రకాశించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
సంవత్సరం మొత్తం లభించే పండు 'అరటిపండు'. ఇందులో ఐరన్..మెగ్నిషియం..పోటాషియం వంటివి చర్మ నిగారింపునకు ఎంతో ఉపయోగపడుతాయి. అరటి పండులో ఏ, బీ, ఈ విటమిన్స్ ఉంటాయి. చర్మం మంచి రంగులోకి మారాలంటే అరటిపండును ఉపయోగించుకోవచ్చు.
చర్మం నిగనిగలాడటానికి 'నిమ్మ' ఎంతగానే ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ సి ఉంటుందనే విషయం తెలిసిందే. ఉదయం లేవగానే పరగడుపున ఒక గ్లాస్ వేడి నీళ్లలో నిమ్మ..తేనె కలిపి తాగితే చర్మం నిగనిగలాడుతుంది. మోచేతులు..నల్లవలయాలు ప్రాంతాల్లో నిమ్మతో రుద్దితే చర్మం అందంగా తయారవుతుంది.
యాపిల్ పండుతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి. సాధారణమైన చర్మం గల వారిలో ఈ ఫేస్ ప్యాక్ ఎంతగానే ఉపయోగపడుతుంది. యాపిల్ పండు ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టాలి. అందులోనే కాస్త తేనె, రోజ్ వాటర్ కలుపుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను చర్మంపై రాయాలి. అనంతరం నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం నిగారింపు రెట్టింపు అవుతుంది. 

15:29 - July 21, 2016

అనారోగ్యానికి గురికాకుండా ఉండాలంటే, ఒకవేళ అనారోగ్యానికి గురైనా కోలుకోవడానికి పోషకాలతో కూడిన ఆహారం అవసరమవుతుంది. అలాంటి సమయంలో ఎలాంటి పోషకాహారం తీసుకోవాలో వీడియోలో చూడండి. 

07:49 - June 17, 2016

హైదరాబాద్ : రంజాన్ మాసం కావడంతో పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. మార్కెట్లో పండ్ల కొరత లేనప్పటికీ రంజాన్ పండగ సీజన్ నేపథ్యంలో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో వ్యాపారులు ధరలను అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది. 
మండిపోతున్న పండ్లరేట్లు 
రంజాన్ మాసం.. అందునా... పండ్లను ఫలహారంగా తీసుకునే ఆచారం.. వీటన్నింటిని ఆసరాగా తీసుకుంటున్న పండ్ల వ్యాపారులు రేట్లను పెంచేసి సామాన్యులకు దూరం చేస్తున్నారు. మార్కెట్ లో పండ్లు విరివిగా దొరుకుతున్నా.. పండ్ల రేట్లను పెంచేస్తున్నారు. అదేం అంటే.. సీజన్ లేదంతే.. అనే సమాధానం.. దీంతో చేసేది లేక అటు కొనలేక .. ఇంత రేటు పెట్టలేక పోతున్నారు సామాన్య ప్రజలు. 
రంజాన్‌ మాసంలో ఖర్జూరకు మొదటి ప్రాధాన్యం
రంజాన్‌ మాసంలో ముస్లింలు మొదటి ప్రాధాన్యం ఖర్జూరకు,  రెండో ప్రాధాన్యం ఎండుఫలాలకు ఇస్తారు. వీటికి తోడు రంజాన్‌ ఆద్యాంతం ఇతర పండ్లను సహార్‌, ఇఫ్తార్‌ సమయాల్లో ఉపవాసం ఉన్న వారు ఆరగిస్తారు. అరటిపండు , యాపిల్‌, దానిమ్మ, బత్తాయి, సపోటా, పైనాపిల్‌, ద్రాక్ష, మామిడి, కర్బూజా, తర్బూజ్‌ వంటి ఫ్రూట్స్ ను  రంజాన్‌ ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా అధికంగా వినియోగిస్తారు. పది రోజుల క్రితం ఉన్న ధరలతో పోల్చి చూస్తే రంజాన్‌ మాసంలో ధరలు 25 శాతంకుపైగా పెరిగినట్లు వ్యాపారులే అంగీకరిస్తున్నారు. 
కిలో ద్రాక్ష ధర 100 నుంచి 130 రూపాయలు
పెరిగిన ధరలతో ద్రాక్ష సామన్యుడికి అందకుండా మరింత పుల్లగా మారిందనే చెప్పవచ్చు. కిలో ద్రాక్ష ధర  100 నుంచి  130 రూపాయలకు ధర పెరిగింది.  ఇక సైజును బట్టి  పైనాపిల్‌ ధర 70 నుంచి  100 వరకు పలుకుతోంది. వీటితో పాటు కర్బూజా సైతం 25 నుంచి 40 రూపాయలకు  కిలో విక్రయిస్తుండగా, తర్బూజా 50 రూపాయలకు పైగా  కిలో విక్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే  డజన్‌ అరటి పండ్ల ధర 30 నుంచి 50 వరకు పెరిగింది. డిమాండ్ పెరగగానే వ్యాపారులు అమాంతం రేట్లు పెంచుతుండటంతో సామాన్యులకు పండ్లు కొనుక్కోవడం భారంగా మారింది. దీనిపై సంబంధిత మార్కెటింగ్ శాఖ నియంత్రణ చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు సామాన్యులు అంటున్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - fruits