gaddar

07:55 - March 20, 2017

సామాజిక న్యాయం..సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర నిన్నటితో ముగిసింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగసభ జరిగింది. ఈ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరితో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలపై వక్తలు విమర్శలు గుప్పించారు. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్షాలు ఆయనపై పలు విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో చెరుపల్లి సీతారాములు (సీపీఎం), తాడూరి శ్రీనివాస్ రెడ్డి (టీఆర్ఎస్), శ్రీధర్ (బీజేపీ), బెల్లం నాయక్ (టి.కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

06:48 - March 20, 2017

హైదరాబాద్ : సబ్బండ వర్గాల సమరసైన్యం హైదరాబాద్‌లో సమరశంఖం పూరించింది. ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసింది. ఎర్రదళం భాగ్యనగరి వీధుల్లో కవాతు తొక్కింది. ఎక్కడ చూసినా లాల్‌, నీల్‌ జెండాల రెపరెపలే దర్శనమిచ్చాయి. మెడలో కండువాలు, చేతిలో జెండాలు, లాల్‌,నీల్‌ దుస్తులు ధరించి సాగిన ర్యాలీ... హైదరాబాద్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దారులన్నీ సరూర్‌నగర్‌కే అన్నట్టుగా ఎటుచూసినా జనసంద్రమే తలపించింది. పదం పాడుతూ... కదం కదుపుతూ ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. హైదరాబాద్‌లో ఆదివారం ఎక్కడ చూసినా ఎర్రజెండాలు, నీల్‌ జెండాలే రెపరెపలాడాయి. దీంతో హైదరాబాద్‌ లాల్‌నీల్‌ వర్ణశోభితమైంది. కులవివక్షత, సామాజిక అసమానతలపై అవి దండోరా మోగించాయి. సామాజిక న్యాయం - సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వంపై సమరశంఖం పూరించాయి.

154 రోజులు..
తెలంగాణ వ్యాప్తంగా మహాజన పాదయాత్ర 154 రోజులు కొనసాగింది. 4200 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఆదివారం పాదయాత్ర ముగింపు సందర్భంగా సమర సమ్మేళనం సభ జరిగింది. ఈ సభకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి తమ్మినేని నేతృత్వంలో పాదయాత్ర బృందం సభ్యులు, పార్టీ కార్యకర్తలు సభా ప్రాంగణానికి పాదయాత్రగా చేరుకున్నారు. ఈ పాదయాత్రకు హైదరాబాద్‌ జనం అడుగడుగునా జేజేలు పలికారు. తమ అభిమానాన్నంతా పూలవర్షంలా కురిపించారు. పాదయాత్ర వస్తున్న ప్రధాన కూడళ్లలో కార్యకర్తలు బాణాసంచాలలు కాల్చి ఘన స్వాగతం పలికారు. జై భీం, లాల్‌సలాం నినాదాలతో హోరెత్తించారు. దీంతో పాదయాత్ర సాగిన దారులన్నీ కోలాహలంగా జన జాతరను తలపించింది.

నగరంలో జోరు హోరు..
పాదయాత్ర పొడవునా తమ్మినేని బృందానికి జనం తండోపతండాలుగా తోడయ్యారు. ప్రతి కూడలి దగ్గర పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలుకుతూ..అక్కడి నుంచి వారితో కలిసి నడిచారు. టీవీ టవర్‌ చౌరస్తాకు రాగానే జనం వేలాదిగా జమఅయ్యారు. ఇక కొత్తపేట చేరుకోగానే జనం రెట్టింపయ్యారు. దీంతో దారులన్నీ సీపీఎం, సామాజిక సంఘాల కార్యకర్తలతో నిండిపోయాయి. మరోవైపు వనస్థలిపురంలోని స్పెన్సర్స్‌ నుంచి మరో ర్యాలీ సభా ప్రాంగణానికి చేరుకుంది. యువత, మహిళలు, వృద్ధులు, విద్యార్ధులు భారీగా సభకు తరలివచ్చారు. లాల్‌,నీల్‌ జెండాలు చేతబట్టి వాహనాల్లో చేరుకున్నారు. దూరప్రాంతాల వారు కొంతమంది శనివారం రాత్రే హైదరాబాద్‌ చేరుకున్నారు. దీంతో మధ్యాహ్నానికే సభ ప్రాంగణం నిండిపోయింది. ఎర్రని ఎండను సైతం లెక్కచేయకుండా జనం సభలో కూర్చొన్నారు. సభికుల సౌకర్యార్ధం సభా ప్రాంగణంలో మూడు స్క్రీన్లు ఏర్పాటు చేశారు. స్టేడియంలో తొక్కిసలా జరుగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగా జనమూ సహకరించారు. సభా ప్రాంగణానికి దూరంగా వాహనాలను నిలిపివేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో మొత్తం హైదరాబాద్‌ జన హోరు తలపించింది.

06:46 - March 20, 2017

హైదరాబాద్ : సమర సమ్మేళనం సభలో కళాకారుల ప్రదర్శనలు సభికులను కట్టిపడేశాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ పోడకలపై గాయకుల పాటలు అందరినీ ఆలోచింపజేశాయి. ప్రజాగాయకులు గద్దర్‌, గోరటి వెంకన్న, విమలక్క పాటలు అందరిలో ఉత్సాహాన్ని నింపాయి. గాయకుల పాటలకు సభికులు ఈలలువేస్తూ, నృత్యాలు చేస్తూ తమ మద్దతు తెలిపారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం గ్రౌండ్స్‌లో నిర్వహించిన సమర సమ్మేళనం సభలో కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. సభకు వచ్చిన జనాన్ని అలరించాయి. ప్రజా గాయకుడు గద్దర్‌ సభలో పాటలు పాడుతూ అందరినీ ఉత్సాహపరిచారు. అమర వీరులపై పాడిన పాట ఉర్రూతలూగించింది. ఇక పొడుస్తున్న పొద్దుమీద పాటకు సభికులు నృత్యాలు చేశారు. రచయిత, ప్రజా కవి గోరటి వెంకన్న స్టేజ్‌ను షేక్‌ చేశారు. పాటలు పాడుతూ, స్టెప్పులు వేస్తూ సభకు వచ్చిన వారిని ఉత్సాహపరిచారు. ఇక విమలక్క ప్రజా ఉద్యమాలపై జరుగుతున్న దాడిపై పాడిన పాటకు సభికుల నుంచి విశేష స్పందన లభించింది. ఆడుదాం డప్పుల్లా దరువేయరా అంటూ విమలక్క పాడితే సభికులు కదం కలుపుతూ స్టెప్పులేశారు. గాయకుడు ఏపూరి సోమన్న తన పాటలతో అందరిలో ఉత్తేజం నింపారు. కేసీఆర్‌ హామీలపై ఆయన పాడినపాటలు అందరినీ ఆలోచింపజేశాయి. రోజులు మారాలి, మా రోజులు రావాలంటూ సాగిన పాటకు సభికుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజానాట్య మండలి కళాకారులు నర్సింహ్మా పాడిన పాటలు సభలో ఉత్సాహాన్ని నింపాయి. తమ్మినేని పాదయాత్రపై ఆయన పాడిన పాటకు సభకు వచ్చిన వారు ఈలలువేస్తూ... నృత్యాలు చేస్తూ మద్దతు తెలిపారు. ప్రజానాట్యమండలి కళాకారుల ఆటపాటలు, భద్రాచలానికి చెందిన గోండు నృత్యాలు సమర సమ్మేళనం సభకే హైలెట్‌గా నిలిచాయి.

12:57 - February 26, 2017

కవులు, రచయితలు, కళాకారులు, ప్రేక్షకుల సహకారంతో నాలుగేళ్లు పూర్తి చేసుకున్న టెన్ టీవీ అక్షరం 'అక్షరం సమీక్షణం' పేరుతో ఓ వేడుకను నిర్వహించింది. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన ఈ సెలబ్రేషన్స్ లో ప్రముఖ కవి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె శివారెడ్డితో పాటు సాహితీ ప్రముఖులు ఖాదర్ మొహియుద్దీన్, ప్రసాదమూర్తి, యాకూబ్, స్ఫూర్తి, జి. లక్ష్మీనర్సయ్య, అట్టాడ అప్పల్నాయుడు, శిఖామణి, పసునూరు రవీందర్, ఎండ్లూరి మానస, పసునూరు శ్రీధర్ బాబు, అక్షరం ప్రేక్షకులు పలువురు పాల్గొన్నారు. ఆ కార్యక్రమ విశేషాలు వీడియోలో చూడండి..

12:48 - February 26, 2017

ఓ సాహిత్య కార్యక్రమం ఎలక్ట్రానిక్ మీడియాలో ఇముడుతుందా? ప్రతీ వారం ఇవ్వగలరా? అసలు అక్షరాన్ని విజువల్ గా ఎలా చూపిస్తారు..? ఇప్పటికే కొందరు ప్రయత్నించారు.. విరమించుకున్నారు.. మరి ఈ ప్రయత్నం మాత్రం ఎంతవరకు విజయవంతమౌతుంది? ఇలాంటి ప్రశ్నలు అనేకం వినిపించాయి.. అన్ని ప్రశ్నలకు సమాధానంగా నాలుగేళ్లు... రెండువందల వారాలు.. పూర్తి చేసుకుని .. సరికొత్త ప్రణాళికలతో, మరిన్ని విన్నూత్న కార్యక్రమాలతో మీ ముందుకు రాబోతోంది టెన్ టీవీ అక్షరం.. అక్షరం 200వ ఎపిసోడ్ సెలబ్రేషన్స్ తో పాటు.. ఈ నాలుగేళ్ల పయనంలోని అనుభవాలతో ఈ వారం అక్షరం ప్రత్యేకంగా మీముందుకొచ్చింది. సమున్నత ఆశయంతో సాగుతున్న టెన్ టీవీ అక్షర ప్రయాణంలో ఓ మైలు రాయి లాంటి సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ నిర్వహించిన చిన్న వేడుక 'అక్షరం సమీక్షణం' పలువురు సాహితీవేత్తల సమక్షంలో జరిగింది.

13:43 - January 9, 2017

మహబూబాబాద్: పేదల సంక్షేమం వదిలేసి ఆలయాలకు కోట్లకు కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండి పడ్డారు. ముందు ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.. మహాజన పాదయాత్రలోభాగంగా తమ్మినేని మహబూబాబాద్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు.. ఇప్పటికే 19 జిల్లాల్లో పాదయాత్ర పూర్తిచేసిన బృందం... మైబాద్‌లోకూడా స్థానికులు సమస్యలు తెలుసుకుంటోంది.... జిల్లాలో ప్రవేశించిన సీపీఎం బృందానికి స్థానిక నేతలు, కార్యకర్తలనుంచి అపూర్వ స్వాగతం లభించింది..

09:10 - January 9, 2017

జనగాం : డీసీపీఎం మహాజన పాదయాత్ర 85వ రోజుకు చేరుకుంది. జనగాం జిల్లాలో సీపీఎం పాదయాత్ర కొనసాగుతోంది. వరంగల్‌ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. బలహీన వర్గాల ఉన్నతి కోసం పాటుపడుతున్న సీపీఎంకు ఎప్పడూ తమ మద్దతు ఉంటుందని టెన్ టివితో రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఇంకా ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియోలో చూడండి. 

08:36 - January 9, 2017

జనగాం : ఎర్రజెండా చేబూని పల్లెపల్లెనూ చైతన్య పరుస్తూ సీపీఎం మహాజన ముందుకు సాగుతోంది. జనగాం జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో ప్రజాగాయకుడు గద్దర్‌ పాల్గొని మద్దతు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కళాకారులను చిన్నచూపు చూస్తోందని, వారికి గుర్తింపు కార్డులిచ్చి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. సామాజిక తెలంగాణ లక్ష్య సాధన కోసం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర 84 రోజులు పూర్తి చేసుకుంది. జనగామ జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర 84వ రోజు.. మైలారం, ధర్మపురం, విసునూరు, పాలకుర్తి, దరదెపల్లి, మల్లంపల్లి ఎక్స్‌రోడ్‌, వావిలాల గ్రామాల్లో పర్యటించింది. పాలకుర్తిలో జరిగిన సభలో డీసీసీబీ ఛైర్మన్‌ జంగారాఘవరెడ్డి, ప్రజా గాయకుడు గద్దర్‌ పాల్గొన్నారు. పొడుస్తున్న పొద్దుమీద.. అంటూ తన గళం విప్పి యాత్రకు మద్దతు తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించి రెండున్నరేళ్లు గడిచిపోయినా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినా ఒక్క హామీని నెరవేర్చలేదని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ బతుకు చిత్రం మారాలంటే... వామపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని తమ్మినేని పిలుపునిచ్చారు. మార్క్స్‌, అంబేద్కర్‌, పూలేల సిద్ధాంతాల మేళవింపే ఈ దేశానికి విముక్తి ప్రసాదిస్తోందని తమ్మినేని అన్నారు. సామాజిక మార్పు కోరే ప్రతిఒక్కరూ ఈ మహాకర్మ యుద్ధంలో పాల్గొనాలని తమ్మినేని పిలుపునిచ్చారు.

కళాకారుల పాత్ర కీలకం..
తెలంగాణ సమాజంలో కళాకారుల పాత్ర ఎంతో కీలకమైందని తమ్మినేని అన్నారు. పేద కళాకారులను ఆదుకోవడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని, కళాకారులందరినీ ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కళాకారులకు ఫించన్‌లు, గుర్తింపు కార్డులు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. ఇప్పటివరకు పాదయాత్ర 850 గ్రామాల్లో పర్యటించింది. పందొమ్మిది జిల్లాల్లో 2200 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. విస్నూర్‌గడీని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజల ప్రాణాలను నిలబెట్టే దవాఖానాను నిర్మించాలని సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. 

18:03 - January 8, 2017

జనగామ : జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. మహాజన పాదయాత్రకు ప్రజా గాయకుడు గద్దర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తన ఆటా పాటలతో అలరించాడు. అమరవీరుల త్యాగాలు, ఉద్యమ గీతాలు పాడి వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 'మనది పాలకపక్షం కాదు.. ప్రతిపక్షం కాదని.. ప్రజల పక్షం' అని అన్నారు. ఇబ్రహీంపట్నంలో 2016అక్టోబర్ 8న సీపీఎం మహాజన పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర బృందానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వం వహిస్తున్నారు. తొమ్మిది మంది బృందంతో పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే పాదయాత్ర రెండు వేల కిలో మీటర్లకు పైగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం జనగామ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర బృందానికి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. పార్టీలకతీతంగా నేతలు పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. అశేషజనవాహని పాదయాత్ర కొనసాగుతోంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బడుగు,   బలహీన వర్గాల ప్రజలు తమ సమస్యలను బృందానికి ఏకరువుతుపెడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 
 

12:51 - October 27, 2016

హైదరాబాద్ : ఏవోబీ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావో నేత ప్రభాకర్ మృతదేహానికి పలువురు ప్రజాసంఘ నాయకులు ప్రజాగాయడకుడు దగ్గర్..విమలక్క నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజాగాయకుడు గద్దర్ మాట్లాడుతూ..ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ విషయంలో అనుమానాలున్నాయని పేర్కొన్నారు. చంపడం ప్రజాస్వామ్యం కాదన్నారు. అడవుల్లోకి వెళ్లి చంపాల్సిందనంత అవుసరం ఏముందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. మావోయిస్టుల పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - gaddar