GHMC

13:50 - March 21, 2018

హైదరాబాద్ : గ్రేటర్‌ పరిధిలో నిర్మాణ రంగం ఊపందుకుంది. రోజురోజుకు నగరంలో కొత్త కొత్త నిర్మాణాలు వెలుస్తున్నాయి. ప్రతి యేటా 5 వేల నిర్మాణాలకు అనుమతిచ్చే జీహెచ్‌ఎంసీ.. ఈ ఏడాది 13,595 అనుమతులిచ్చింది. దేశంలోని మిగతా నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ జోరు తగ్గగా... భాగ్యనగరంలో మాత్రం 34 శాతం వృద్ధి సాధించిందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. 

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం దూసుకుపోతుంది. నూతన భవనాల కొనుగోలు వ్యాపారంలో భాగ్యనగరం మొదటి స్థానంలో ఉందని జెఎల్‌ఎల్‌ సంస్థ సర్వే స్పష్టం చేసింది. మెట్రో నగరాలలో రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌పై.. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో విశేష అనుభవమున్న జెఎల్‌ఎల్‌ సంస్థ సర్వే నిర్వహించింది. గత ఐదేళ్లుగా దేశంలోని ఆరు ప్రధాన నగరాలైన న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణే, చెన్నై, కోల్‌కత్తాలో నూతన భవనాల నిర్మాణం, కొనుగోళ్లు 41 శాతం పడిపోగా... గ్రేటర్‌ హైదరాబాద్‌లో 34 శాతం పెరుగుదల ఉందని తెలిపింది. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత... రాజకీయ సుస్ధిరత, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించడమే ఈ అభివృద్ధికి కారణమని జెఎల్‌ఎల్‌ విశ్లేషిచింది. 2013-14లో దేశ రాజధానిలో ఒక లక్షా 16 వేల 250 నూతన ఆస్తి కొనుగోళ్లు జరగగా... 2015-16లో 62,300కు పడిపోయింది. 2017 నాటికి అది మరింత క్షీణించి 37,600 కొనుగోళ్లు మాత్రమే జరిగాయి. అలాగే... ముంబైలో 27 శాతం, చెన్నైలో 45 శాతం, పుణెలో 29 శాతానికి కొనుగోళ్లు పడిపోయాయి. ఐటీ నగరమైన బెంగళూరులోనూ గతేడాదికి కొనుగోళ్లు 17 శాతానికి పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే.. అన్ని నగరాల్లో క్షీణదశల్లో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ రంగం హైదరాబాద్‌లో మాత్రం భారీగా పుంజుకుందంటున్నారు బల్దియా కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి. 2013-14లో ఆస్తుల విక్రయాలు 11,450 ఉండగా.. 2017లో అది 15,100కు చేరిందన్నారు.

ఇక కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యాట్‌తో దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగంపై తీవ్ర ప్రభావం చూపి కుదేలవ్వగా.. హైదరాబాద్‌పై మాత్రం స్వల్ప ప్రభావం మాత్రమే పడిందంటున్నారు. ప్రధానంగా నగరం చుట్టూ ఉన్న రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌ జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పనల వల్ల నూతన గృహ క్రయ విక్రయాల్లో గణనీయ పురోగతి సాధించిందని అధికారులంటున్నారు. 

17:35 - March 17, 2018

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ గుర్తింపు సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. నాలుగేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో ప్రధానంగా టీఆర్‌ఎస్‌కేవీ, బీఎంఎస్‌ మధ్య పోటీ కొనసాగుతోంది.. టీఆర్‌ఎస్‌కేవీనే విజయ ఢంకా మోగిస్తుందని ఆ సంఘం నేత గోపాల్‌ పేర్కొన్నారు.

11:49 - March 17, 2018

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్తింపు సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 25పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2012లో జీహెచ్ ఎంసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. నాలుగేళ్లు ఎన్నికలు వాయిదా పడ్డాయి. టీఆర్ ఎస్ కేవీ, బీఎంఎస్ మధ్యే పోటీ నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

06:24 - March 17, 2018

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ గుర్తింపు సంఘం ఎన్నికల కోసం కార్మికశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. చావోరేవో తేల్చుకునేందుకు కార్మిక సంఘాలు రెడీ అవుతున్నాయి. నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు రావడంతో తమ సత్తా చాటేందుకు కార్మికసంఘాల నేతలు సిద్ధమయ్యారు. ఇప్పటికే జోరుగా ప్రచారం నిర్వహించిన కార్మిక నాయకులు.. తమనే గెలిపించాలని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

2012లో జీహెచ్‌ఎంసీ గుర్తింపు సంఘం అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ప్రతి రెండు ఏళ్లకు ఒకసారి జరగాల్సిన ఈ ఎన్నికలు వివిధ కారణాలతో నాలుగేళ్లు వాయిదా పడుతూ వచ్చాయి. కోర్టు మొట్టికాయలతో ఎట్టకేలకు కార్మికశాఖ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇవాళ ఎన్నికలు నిర్వహించేందుకు లేబర్‌ కమిషన్‌ సిద్ధమైంది. గ్రేటర్‌ పరిధిలోని 9 సంఘాలకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హతను కల్పించింది. ప్రచారం కోసం ఒక్కో సంఘానికి ఒక్కోరోజు కేటాయిస్తూ.. ఈనెల15 వరకు ప్రచారానికి అవకాశం చ్చింది. దీంతో ప్రచార హోరు సాగించాయి కార్మిక సంఘాలు. 5570 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేలా 25 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు మొదలయ్యే పోలింగ్‌... సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.

గత ఎన్నికల్లో 7424 మంది కార్మికులు ఉండగా.. 6352 మంది కార్మికులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గుర్తింపు సంఘంగా ఎన్నికైన గ్రేటర్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేత గోపాల్‌కు 3548 ఓట్లురాగా... సమీప ప్రత్యర్థి బీఎంఎస్‌కు 2175 ఓట్లు లభించాయి. ఇక అప్పటి హెచ్‌ఎంఎస్‌ తరపు పోటీ చేసిన నాయిని నర్సింహారెడ్డికి 316 ఓట్లు, ఐఎన్‌టీయూసీ సంజీవరెడ్డికి 181 ఓట్లు వచ్చాయి. నాడు ఎన్నికల్లో ఆరు సంఘాలు పోటీపడగా.. ఇప్పుడు 9 సంఘాలు ఎన్నికల అర్హత సాధించాయి. అయితే ప్రధాన పోటీమాత్రం గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌... బీఎంఎస్‌ మధ్యే ఉంది. 25 పోలింగ్‌ కేంద్రాల నుంచి పోలింగ్‌ ముగిశాక జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఓట్ల లెక్కింపు చేయనున్నారు. జీహెచ్‌ఎంసీలో హోరాహోరీగా జరుగనున్న ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది. అధికార పార్టీకూడా ఎన్నికలను ప్రిస్టేజ్‌ గా తీసుకొని ఉన్న గుర్తింపును కాపాడుకునేందుకు మంత్రులను సైతం ప్రచారంలోకి దింపింది. అయితే కార్మికులు ఎవరికి జై కొడతారో వేచిచూడాలి.

06:33 - March 1, 2018

HMDA పరిధిలో ఎలాంటి అ్రపూవల్‌ లేకుండా వందల లేఔట్స్‌ వెలుస్తున్నాయి. అయితే వీటిని క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా... ఆ చర్యలు లోపభూయిష్టంగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ ఏంటి ? వాటిలో ఉన్న లోపాలేంటి ? ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో ప్రజలు, ప్రభుత్వం పాటించాల్సిన నియమాలు ఏంటనే అంశంపై టెన్ టివి 'జనపథం'లో 'ఫెడరేషన్‌ ఆఫ్‌ కాలనీస్‌ అండ్‌ అపార్ట్‌మెంట్స్‌ అసోసియేషన్‌ నాయకులు అంజయ్య విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:29 - February 23, 2018

హైదరాబాద్ : బల్దియాలో కొందరు అధికారుల అక్రమాలు, అలసత్వంతో ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. చేతులు తడపందే పనిచేయని వారు కొందరైతే... తడిపినా తడపకపోయినా... అసత్వం వీడని అధికారులు మరికొందరు బల్దియాలో ఉన్నారని ప్రజలు మండిపడుతున్నారు.జననధృవీకరణ పత్రం కోసం బల్దియా చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా పనులు కావడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరణ ధృవీకరణ పత్రం తీసుకోవడమంటే... మా చావుకొచ్చినట్టుందంటున్నారు ప్రజలు. ఏపనిమీద బల్దియాకు వెళ్ళినా పరిస్థితి మాత్రం ఇలాగే ఉందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.బల్దియా చేతివాటం గాళ్ళ అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. చేయితడపనిదే పనిచేయని వారూ ఉన్నారు. ఇటీవల జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీలో జరుగుతున్న అక్రమాల గుట్టు రట్టయింది. ఇక్కడ చేతివాటం ప్రదర్శిస్తున్న హెల్త్‌ అసిస్టెంట్ల వ్యవహారాన్ని రాచకొండ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. పాకిస్తాన్‌ దేశీయులకు కూడా హైదరాబాద్‌లో బర్త్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తున్నారంటే ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ప్రతి బిడ్డ వివరాలు రిజిష్టర్‌ చేయించాలి...
పుట్టిన ప్రతి బిడ్డ వివరాలు రిజిష్టర్‌ చేయించాలి... జనన ధృవీకరణ పత్రం పొందడం ప్రతి బిడ్డకు ఉన్న హక్కు... హైదరాబాద్‌ పరిధిలో పుట్టిన ప్రతి బిడ్డకూ 21 రోజుల్లో బర్త్‌ సర్టిఫికెట్‌ను ఇంటికే పంపిస్తాం.. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మెడికల్‌ రిపోర్టుతో పాటు ఆధార్‌ కార్డు, బర్త్‌ సర్టిఫికెట్‌ కూడా ఇస్తాం.. ఇవన్నీ బల్దియా చెప్పిన మాటలు.. ధృవీకరణ పత్రాల జారీలో మాత్రం బండెడు అలసత్వం చూపిస్తోంది బల్దియా. పుట్టిన బిడ్డకు ఆసుపత్రి దగ్గరే బర్త్‌ సర్టిఫికెట్‌ ఇస్తామన్నారు అధికారులు... ఈ కార్యక్రమం కోసం ఐదు ఆసుపత్రులను ఎంపిక చేశారు. నయాపూల్ మెటర్నటీ ఆసుపత్రి, నిలోఫర్ చిల్ర్డన్స్ ఆసుపత్రితోపాటు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ఈ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కేవలం నయాపూల్‌ ఆసుపత్రిలో మాత్రమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమెరికాలో పుట్టిన బిడ్డకు అన్ని రకాల ధృవపత్రాలు ఇచ్చే విధంగా హైదరాబాద్‌లో కూడా బర్త్, ఆధార్‌ సర్టిఫిరకెట్‌ ఇస్తామని అధికారులు ప్రకటించారు. బల్దియా అధికారులకు ఆరంభంలో చూపే ఆర్బాటం ఆచరణలో లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

16:29 - February 22, 2018

హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్ఎండీఏ డైరెక్టర్ పురుషోత్తమ్ రెడ్డిని ఏసీబీ కస్టడీలోకి తీసుకోనుంది. ఏసీబీ నిర్వహించిన దాడుల్లో కోట్లాది రూపాయల ఆస్తులు బయపడిన సంగతి తెలిసిందే. అతని బంధువులు..ఇతర నివాసాలపై దాడులు కొనసాగుతుండగానే పురుషోత్తమ్ రెడ్డి కనిపించకుండా పోయాడు. కొద్ది రోజుల అనంతరం ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. కేసుకు సంబంధించిన వివరాలు రాబట్టేందుకు కస్టడీకి అప్పగించాలని ఏసీబీ కోరింది. దీనితో ఈనెల 23 నుండి 28 వరకు కస్డడీకి అనుమతినిచ్చింది. పురుషోత్తమ్ రెడ్డి బినామీ శ్రీనివాస రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. 

07:28 - February 22, 2018

హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వ్యూహాత్మక రహదారి పథకం కోసం... వినూత్నంగా బాండ్ల విక్రయంతో నిధుల సేకరణకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది.. గతంలో పుణే నగరపాలక సంస్థ తొలిసారి మున్సిప‌ల్ బాండ్లు విక్రయించి నిధులు సమకూర్చుకుంది.. దీన్నే బల్దియా ఆదర్శంగా తీసుకుంది. జీహెచ్‌ఎంసీ మొదటిసారే వెయ్యి కోట్ల రూపాయల సేకరణకు బాంబే స్టాక్ ఎక్చేంజ్‌ ద్వారా ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌కు వెళ్లింది. డబుల్‌ ఏ రేటింగ్‌ వల్లే జీహెచ్ఎంసీకి నిధుల సమీకరణ సులభమైంది.

14 ముంబైలో నిర్వహించిన ఎలక్ర్టానిక్ బిడ్డింగ్
ఈ నెల 14న ముంబైలో నిర్వహించిన ఎలక్ర్టానిక్ బిడ్డింగ్ ద్వారా జీహెచ్ఎంసీ జారీ చేసిన బాండ్లకు అనూహ్య స్పందన వచ్చింది. దీన్ని బ‌ల్దియా వ‌ర్గాలు ధృవీకరించాయి కూడా. రెండు రోజుల‌ వ్యవధిలోనే 200 కోట్ల నిధులు 8.9 శాతం రేటుకే సమకూరాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఖాతాలో నగదు కూడా జమ అయ్యింది. ఇలా నిధుల సేకరణలో దేశంలోని ఇతర పురపాలక, నగరపాలక సంస్థలకు హైదరాబాద్ ఆదర్శంగా నిలిచిందని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. బాంబే స్టాక్ ఎక్చేంజ్ లో జీహెచ్ఎంసీ బాండ్ల లిస్టింగ్ కార్యక్రమాన్ని నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు.

స్కైవేలు, అండర్ పాస్ ల నిర్మాణం
బాండ్ల ద్వారా సేకరించిన నిధులతో స‌మ‌గ్ర ర‌హ‌దారుల డెవ‌ల‌ప్ మెంట్, స్కైవేలు, అండర్ పాస్ ల నిర్మాణం వేగవంతం కానున్నాయి.. ప్రస్తుతం సేకరించిన 2 వందల కోట్ల రూపాయలతో ఈ పనులను ముమ్మరం చేస్తారు. ఆ తర్వాత దశల వారీగా మరో 800 కోట్ల రూపాయలు సేకరించాలని బల్దియా నిర్ణయించింది. గత యాభై ఏళ్లలో దేశంలో పురపాలక సంస్థలు, స్థానిక సంస్థలు బాండ్ల రూపంలో 2వేల కోట్ల రూపాయలు సేకరించగా... వీటిలో పదిశాతాన్ని కేవలం జీహెచ్ఎంసీ సేకరించింది. ఇతర పురపాలక సంస్థలకు ఇది ఆదర్శవంతంగా నిలుస్తుందని కమిషనర్ జనార్దన్ రెడ్డి అన్నారు.జీహెచ్‌ఎంసీ నిధుల సమీకరణతో ఇతర రాష్ర్టాలకు ఆదర్శవంతంగా నిలుస్తోంది... ఈ ఒరవడిని ఇలాగే కొనసాగిస్తూ... మరింత మంచి స్టేటస్ సాధించి.. అభివృద్ధి పథంలో దూసుకెళ్ళాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అడుగులేస్తోంది.

10:28 - February 17, 2018
11:13 - February 15, 2018

Pages

Don't Miss

Subscribe to RSS - GHMC