google

18:16 - December 6, 2018

ప్రఖ్యాత సెర్చింజన్ గూగుల్ సంస్థ ఒక్కో సర్వీస్‌ని క్లోజ్ చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే గూగుల్ ప్లస్, హ్యాంగౌట్స్ మేసేజింగ్ యాప్‌లను మూసివేన గూగుల్ తాజాగా మరో మేసేజింగ్ యాప్ ''అల్లో''ను మూసివేయాలని నిర్ణయించింది. 2019 మార్చి నుంచి ‘అల్లో’ పూర్తిగా కనిపించకుండా పోతుంది. 2016 సెప్టెంబర్‌లో గూగుల్ సంస్థ ఈ చాట్ యాప్‌ను తీసుకొచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో దీనికి ఆదరణ లభించలేదు. దీంతో ఈ యాప్‌ను క్లోజ్ చేసేందుకు మొగ్గుచూపింది. ఏప్రిల్ నుంచి పెట్టుబడులు నిలిపివేసిన గూగుల్.. వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తిగా యాప్ కార్యక్రమాలను నిలిపివేయనున్నట్టు అధికారిక బ్లాగ్‌లో తెలిపింది. అదే సమయంలో ఎస్ఎంఎస్‌ పంపిణీ నిర్వహణ తీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందించే పనిలో పడింది. అల్లో స్థానంలో ఆర్‌సీఎస్ తీసుకొని వస్తోంది. ఆండ్రాయిడ్ డివైజస్‌లో ఐమేసేజ్‌లకు ఇది ఉపయోగపడుతుంది.

 

10:48 - December 1, 2018

హైదరాబాద్ :  తెలంగాణ ఎన్నికలు గూగుల్ ట్రెండింగ్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. అసెంబ్లీని రద్దు చేసిన ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు జాతీయ పార్టీ అయిన బీజేపీ, మహాకూటమిగా ఏర్పడిన పార్టీలు ఎన్నికల్లో ప్రచారాన్ని ఉదృతం చేశాయి. ఈ క్రమంలో గత 3 నెలల నుండి గూగుల్ లో తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది? అనే ప్రశ్న వెల్లువెత్తుతోంది. 
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అనే విషయం తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్నికలు జరిగేదాక కూడా ఆగలేక..గూగుల్ తల్లిని ప్రశ్నించేస్తున్నారు. తీవ్రంగా వెదికేస్తున్నారు. ‘‘తెలంగాణాలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు?’’ అనే ప్రశ్న గత 3 నెలల నుండి గూగుల్ లో  నెటిజన్లు వెతుకుతున్న ప్రశ్న ఇదే. తెలంగాణాలో టీఆర్ఎస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలు గూగుల్ ట్రెండ్స్ లో నిలిచాయి. 
కేసీఆర్ అసెంబ్లీ రద్దు,కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన గూగుల్స్ ట్రెండ్స్..
కాగా సెప్టెంబరు 6వ తేదీన సీఎం కేసీఆర్ శాసనసభను రద్దు..అనతరం అసెంబ్లీని రద్దు  చేస్తూ తీర్మానించినపుడు నెటిజన్లు టీఆర్ఎస్ పేరిట ఎక్కువగా పరిశోధించారు. మొదట టీఆర్ఎస్ గురించి ఎక్కువగా శోధించిన నెటిజన్లు నవంబరు 1వతేదీకల్లా టీఆర్ఎస్ కు హిట్స్ తగ్గాయి. గత 20 రోజుల్లో గూగుల్ లో కాంగ్రెస్ గురించి ఎక్కువమంది నెటిజన్లు శోధించారని గూగుల్ ట్రెండ్స్ లో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ గురించి శోధించిన నెటిజన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీఅరేబియా, అమెరికా, సింగపూర్ దేశాలతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో ఎక్కువమంది నెటిజన్లు తెలంగాణా ఎన్నికల గురించి గూగులమ్మను శోధించారని తేలింది.  తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు ఏ రేవంత్ రెడ్డి గురించి ఎక్కువమంది నెటిజన్లు శోధించారని వెల్లడైంది. రేవంత్ రెడ్డి నియోజకవర్గం, ఆయన కుటుంబసభ్యుల గురించి కూడా ఎక్కువ నెటిజన్లు వెతకడం విశేషం. 

17:18 - November 29, 2018

మౌంటన్ వ్యూ: దాదాపు 500 మంది గూగుల్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు మంగళవారం (నవంబర్ 27) చైనా దేశం కోసం ప్రత్యేకంగా సెర్చ్ ఇంజన్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ గూగుల్ యాజమాన్యానికి లేఖ రాశారు. గూగుల్ చైనా కోసం ప్రత్యేకంగా ‘‘ప్రాజెక్టు డ్రాగన్ ఫ్లై’’ అనే సెర్చ్ ఇంజన్‌ను నిర్మిస్తోంది. దీనిపై గూగుల్ ఉద్యోగుల్లో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వందలకొద్ది గూగుల్ ఉద్యోగులు సైన్ చేసిన ఓపెన్‌లెటర్‌ను యాజమాన్యానికి పంపగా.. దీనిలో కొన్ని మానవ హక్కుల గ్రూపులైన అమ్నెస్టీ ఇంటర్ నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ లాంటి సంస్థలు ఈ పోరాటంలో గూగుల్ ఉద్యోగులకు తోడయ్యాయి. 
అయతే.. ఈ ఉద్యమంపై వ్యాఖ్యానించేందుకు గూగుల్ యాజమాన్యం నిరాకరించింది. గతంలో గూగుల్ ప్రతినిధి చైనా సెర్చ్ ఇంజన్‌పై స్పందిస్తూ చైనా ప్రజలకు ఉపయోగపడేందుకు కొన్ని సంవత్సరాలుగా శ్రమిస్తున్నామని.. అయతే సెర్చ్ ఇంజన్ ఇంకా ప్రాధమిక దశలోనే ఉందని చెప్పారు.
 

 

09:13 - October 26, 2018

ఢిల్లీ :  ప్రముఖ అంతర్జాల సంస్థ గూగుల్ కు ‘మీటూ’ సెగ పాకింది. ‘మీ టూ’ ఉద్యమం యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఆ రంగం ఈ రంగం అనే తేడా ఈ ఉద్యమానికి లేదు. అన్ని రంగాలలోను వుండేది మనుషులే కాబట్టి ‘మీటూ’ అన్ని రంగాలలను కుదిపేస్తోంది. కాకుంటే సెలబ్రిటీల ముసుగులో కొందరు చేస్తు వెర్రి మెర్రి వెకిలి చేష్టలు ఇకపై భరించబోమంటు ‘మీటూ’ అంటున్నారు నుటి అతివలు. ఇప్పటి వరకూ సిని పరిశ్రమ, బిజినెస్, రాజకీయాలు వంటి పలు కీలక రంగాలలో వుండే వేధింపులు వెలుగులోకి వచ్చాయి. కానీ వెలుగులోకి రానివి ఎన్నో ఎన్నెన్నో. ఈ నేపథ్యంలో ఏ రంగమైనా, ఎటువంటి వ్యక్తులైన వేధింపులను మాత్రం భరించబోమంటు గళమెత్తుతున్నారు అతివలు.  ఈ నేపథ్యంలో మీటూ ఉద్యమ సెగ ఇప్పుడు గూగుల్‌కు పాకింది.

Image result for googleప్రపంచంలోనే అతి ప్రశాంతమైన పని ప్రదేశం అని పేరొందిన గూగుల్ లో కూడా ఈ సెగ తప్పలేదు. 48 మంది ఉద్యోగులపై లైంగివ వేధింపుల ఆరోపణల వేటు పడింది. వీరిలో 13 మంది సీనియర్ ఉద్యోగులు ఉండడం గమనార్హం. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ స్వయంగా వెల్లడించారు. తమ సంస్థలో మహిళా ఉద్యోగులకు పూర్తి రక్షణ ఉందని పేర్కొన్న ఆయన.. వారి రక్షణకు గూగుల్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.  వేధింపులు ఎదుర్కొంటున్న వారు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే సంస్థ వారికి అండగా ఉంటుందని సుందర్ పిచాయ్ హామీ ఇచ్చారు. తాము తొలగించిన 48 మందిలో 13 మంది సీనియర్ ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపారు. విధుల నుంచి తొలగింపునకు గురైన వారికి ఎటువంటి ఎగ్జిట్ ప్యాకేజీ ఉండదని పేర్కొన్నారు.

10:37 - October 17, 2018

న్యూఢిల్లీ: వీడియో వీక్షించే వినియోగదారులకు దాదాపు 45 నిమిషాలపాటు అంతరాయం కలిగింది. కారణం గూగుల్‌కు చెందిన యూట్యూబ్ షేరింగ్ సేవలు బుధవారం కొద్దిసేపు నిలిచిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన సాంకేతిక కారణాల వల్ల యూట్యూబ్ సేవలు ఆగిపోయాయి. గూగుల్ సంస్థ నుంచి వచ్చిన యూట్యూబ్ 2005 సంవత్సరంలో ప్రారంభించిన నాటినుండి ఇంటర్‌నెట్‌ అత్యధిక వినియోగదారులు సందర్శించే వేదికగా పేరు గడించింది.
‘‘ మేము రిస్టోర్ చేశాం. మీ సహనానికి ధన్యవాదాలు. ఒకవేళ మీరు  ఈ సమస్య ఇంకా ఫేస్ చేస్తున్నట్టయితే మాకు సమాచారం ఇవ్వండి’’ అంటూ యూట్యూబ్ టీమ్ వినియోగదారులను కోరింది. 
ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ వినియోగదారులు సేవలు అందక ఈ ఉదయం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందరూ ‘‘ 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్’’ అంటూ స్క్రీన్‌పై అక్షరాలు ప్రత్యక్షం కావడంతో పదేపదే బ్రౌజ్ చేయటం ప్రారంభించారు. ఈ సమస్య 45 నిమిషాలపాటు భారత్ సహా అన్ని దేశాల్లోనూ కనిపించింది. 
నిన్న ట్విట్టర్‌లో ఎదుర్కొన్న సమస్యనే ఇవాళ యూట్యూబ్ వినియోగదారులూ అనుభవించారు. ట్విట్టర్ దాదాపు 1 గంటపాటు ఆగిపోయింది. అలాగే మరో సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్ సేవలు కూడా కొద్దికాలం క్రితం ఇలాగే నిలిచిపోయాయి. 
 

 

13:15 - October 9, 2018

కాలిఫోర్నియా: డేటా లీక్.. సోషల్ మీడియాకు ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఖాతాదారుల సమాచారం ఇతరులకు చేరిపోతోంది. గతంలో ఫేస్‌బుక్ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది. డేటా లీక్ వ్యవహారంలో అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌కు చెందిన సామాజిక మాధ్యమం గూగుల్‌ ప్లస్‌కు ఈ సమస్య ఎదురైంది. గూగుల్ ప్లస్‌లోని 5 లక్షల ఖాతాల సమాచారం లీకై ఉండొచ్చని తెలుస్తోంది. గూగుల్‌ ప్లస్‌లో తలెత్తిన ఓ సాంకేతిక సమస్య కారణంగా 2015 నుంచి 2018 మార్చి మధ్య కాలంలో ఈ సమాచారం లీక్‌ అయ్యుంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో దాదాపు 10 నెలలపాటు సాధారణ వినియోగదారులు గూగుల్‌ ప్లస్‌ను వినియోగించకుండా సేవలను కంపెనీ ఉపసంహరిస్తోంది. అయితే గూగుల్‌ ప్లస్‌ కార్పొరేట్‌ సేవలు మాత్రం కొనసాగుతాయి. ఈ వ్యవహారంపై స్పందించిన గూగుల్..
గూగుల్‌ ప్లస్‌లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని తెలుసుకుని వినియోగదారుల సమాచారాన్ని ఎవరైనా దొంగిలించి ఉంటారని తాము భావించడం లేదని తెలిపింది. అసలు ఈ లోపం గురించి ఎవరికీ తెలీదని వివరణ ఇచ్చింది. కాగా విచారణ సంస్థలకు భయపడి గూగుల్‌ ఈ సమాచారాన్ని దాచేస్తున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది.

07:55 - September 18, 2018

అమెరికా : మొబైల్‌ ఫోన్ లో సెట్టింగ్‌లను మన అనుమతి లేకుండానే గూగుల్‌ మార్చేస్తుందా ? అంటే అవునని పలువురు ఆండ్రాయిడ్‌‌ యూజర్లు అంటున్నారు. గత శుక్రవారం పలు ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ‘బ్యాటరీ సేవర్’‌ మోడ్‌ ఆటోమెటిక్‌గా ఆన్‌ అయింది. తమ ప్రమేయం లేకుండానే ఇలా జరగడంతో పలువురు ఆండ్రాయిడ్‌‌ యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్ల‌ వినియోగదారులు చాలా మంది తమ ఫోన్లలో తగినంత ఛార్జింగ్‌ ఉన్నప్పటికీ.. ఆటోమెటిక్‌గా బ్యాటరీ సేవర్‌ మోడ్‌ ఆన్‌ అయిందని ఫిర్యాదు చేసినట్లు ‘ఆండ్రాయిడ్‌ పోలిస్‌’ వెబ్‌సైట్‌ తెలిపింది. ‘పై’ లాంటి లేటెస్ట్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్లు వినియోగిస్తున్నవినియోగదారులు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొన్నారని పేర్కొంది.
 

ఆ తర్వాత ఈ సమస్యపై గూగుల్‌ సంస్థ స్పందించింది. తాము చేసిన కొన్ని మార్పుల కారణంగానే అలా జరిగిందని తప్పుని ఒప్పుకుంది. ‘కొన్ని ఫోన్లలో బ్యాటరీ సేవర్‌ మోడ్‌ ఆటోమెటిక్‌గా ఆన్‌ అవడం జరిగింది. అంతర్గతంగా మేం చేపట్టిన ఓ ప్రయోగం పొరపాటున బయటి ఫోన్లపై ప్రభావం చూపించింది. బ్యాటరీ సేవర్‌ మోడ్‌ను అంతర్గతంగా పరీక్షిస్తున్న సమయంలో ఇలా జరిగింది. మేం వెంటనే సెట్టింగ్స్‌ను తిరిగి పూర్వస్థితిలోకి తీసుకొచ్చాం. ఇందుకు క్షమించగలరు’ అని గూగుల్‌ రెడిట్‌ పోస్ట్‌లో పేర్కొంది.

 

12:10 - September 5, 2018

సెప్టెంబర్ 5...సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీచర్లకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రముఖ అంతర్జాతీయ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ రూపొందించింది. ప్రముఖుల దినోత్సవాలు..ఇతర ముఖ్యమైన రోజుల్లో గూగుల్ డూడుల్స్ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కళ్లజోడు ధరించిన ఉపాధ్యాయుడిని గ్లోబ్‌గా చూపిస్తూ.. మ్యూజిక్, ఆస్ట్రానమీ, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇతర పాఠ్యాంశాలను ప్రస్తావిస్తూ.. గురువు ప్రాధ్యాన్యతను ప్రతిబింబించేలా..డూడుల్ ను రూపొందించింది.

ఇక ఈ డూడుల్‌ను ఎంపిక చేయడం కోసం పోటీలను కూడా నిర్వహిస్తుంటారు. ఆకర్షితంగా ఉండేలా ఈ డూడుల్ ఉంటుంది. 1998లో తొలి గూగుల్‌ డూడుల్‌ పుట్టుకొచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వస్తున్న..వచ్చే డూడుల్స్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. టీచర్స్ డే సందర్భంగా దేశ వ్యాపితంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తుంటుంది. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అవార్డులను అందిస్తుంటారు. మరొక్కసారి ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు....

16:34 - February 9, 2016

హైదరాబాద్ : గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ 199 మిలియన్‌ డాలర్ల విలువ చేసే స్టాక్స్‌ సొంతం చేసుకొని రికార్డు సృష్టించారు. అత్యధిక వేతనం పొందుతున్న గూగుల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా ఘనత పొందారు. గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ సుందర్‌కు 199 మిలియన్‌ డాలర్ల విలువ చేసే 273,328 క్లాస్‌ సి గూగుల్‌ స్టాక్‌ యూనిట్లను ఇచ్చింది. వీటి విలువ రూపాయల్లో సుమారు 1,356 కోట్లు ఉంటుంది. దీంతో అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న అమెరికా కంపెనీల ఎగ్జిక్యూటివ్స్‌లో పిచాయ్‌ చోటు దక్కించుకోనున్నారు. 

17:23 - December 17, 2015

ఢిల్లీ : విద్యార్థులు రిస్క్‌ తీసుకోవడానికి వెనకాడొద్దని గూగుల్‌ సిఈఓ సుందర్‌ పిచాయ్‌ పిలుపునిచ్చారు. ఢిల్లీ యూనివర్సిటీ శ్రీరాం కళాశాలకు చెందిన కామర్స్‌ విద్యార్థులతో ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. రిస్క్‌ తీసుకుంటే ఇబ్బందులతో పాటు విజయం వరిస్తుందని విద్యార్థులకు సూచించారు. వచ్చే తరానికి క్రియేటివిటీ అన్నదే ప్రధాన అంశమని, చదువుల కన్నా సృజనాత్మకత అవసరమన్నారు. ఉద్యోగాలు చేయడం గురించి కాదు...ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగేలా ఆలోచనలు ఉండాలని పేర్కొన్నారు. గూగుల్‌లో తొలిసారి అడుగుపెట్టినపుడు మిఠాయి దుకాణంలో చిన్న పిల్లవాడు అడుగు పెట్టినట్టు అనిపించిందని తన అనుభవాన్ని విద్యార్థులతో పంచుకున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - google