governor

18:12 - October 20, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి విజయలక్ష్మి (94) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. శుక్రవారం విజయలక్ష్మి కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు. వెంటనే కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లి విజయలక్ష్మి పార్థీవ దేహానికి నివాళులర్పించారు. అనంతరం పంజగుట్టలో అంత్యక్రియలు జరిగాయి. 

21:56 - October 4, 2017

ఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిపై కొందరు నిరాశను వ్యాపింపజేయడం ద్వారా ఆనందపడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోది అన్నారు. ఐసీఎస్ ఐ గోల్డెన్‌ జుబ్లీ సమావేశంలో మోది ప్రసంగిస్తూ...దేశ ఆర్థిక పరిస్థితిపై వస్తున్న విమర్శలపై స్పందించారు. నోట్ల రద్దు తమ ప్రభుత్వం తీసుకున్న అత్యంత సాహసోపేత నిర్ణయమని మోది తెలిపారు. నల్లధనానికి వ్యతిరేకంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇపుడు 'నిజాయితీ' శకం ఆరంభమైందని... బ్లాక్‌మనీతో లావాదేవీలు జరిపేందుకు ప్రజలు  ఒకటికి 50 సార్లు ఆలోచిస్తున్నారని మోది చెప్పారు. జిడిపి తగ్గడం ఇపుడు కొత్తేమి కాదన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీసేందుకు కఠినమైన చట్టాలు రూపొందించామని ప్రధాని పేర్కొన్నారు.

 

21:47 - September 13, 2017

హైదరాబాద్ : టీడీపీ.. కాంగ్రెస్‌..! ఈ రెండు పార్టీలూ మొన్నటి వరకూ వైరిపక్షాలు. కానీ ఇప్పుడు ఈ రెండు పార్టీలూ తెలంగాణలో ఐక్యతారాగాన్ని ఆలపిస్తున్నాయి. సమస్య ఏదైనా.. విడివిడిగానో... ఐక్యంగానో ప్రభుత్వ తీరును ఎండగుడుతోన్న టీడీపీ, కాంగ్రెస్‌లు, ఇప్పుడు ఎన్నికల్లోనూ ఐక్యంగా బరిలోకి దిగాలని నిర్ణయించాయి. రానున్న సింగరేణి ఎన్నికల్లో దీనికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించాయి. 

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షాలు ఐక్యతారాగం అందుకున్నాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు, అదే కాంగ్రెస్‌తో జతకలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు.. ఈ రెండు పక్షాలూ తమ సిద్ధాంతాలను సైతం పక్కనబెట్టి ఏకమవుతున్న పరిస్థితి తెలంగాణలో ఆవిష్కృతమవుతోంది. 

తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో అవ‌క‌త‌వ‌కల్ని ఎండగట్టేందుకు.. తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు ఐక్యంగా ముందుకు సాగుతున్నాయి. కొంతకాలంగా వివిధ సమస్యలపై ఈ రెండు పక్షాలూ ఉమ్మడి ఆందోళనల్లో పాల్గొన్నాయి. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టుకు భూసేకరణ, మియాపూర్ భూస్కాం ఆరోప‌ణ‌లు, నేరెళ్ళలో ద‌ళితుల‌పై దాడి పైనా ఒకే వాణిని వినిపించిన విపక్షాలు.. కొన్ని సందర్భాల్లో ఒకే ఉద్యమ వేదికనూ పంచుకున్నాయి. తాజాగా, రైతు సమన్వయ సమితులపైనా కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఐక్యగళాన్ని వినిపిస్తున్నాయి.  

సమగ్ర భూ సర్వే కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 39కి వ్యతిరేకంగా.. ఈ రెండు పక్షాలు ఐక్యంగా ఉద్యమిస్తున్నాయి. సీపీఐ, టీజేఏసీ నేతలను కూడా కలుపుకుని.. బుధవారం, జీవో 39 రద్దు కోసం గవర్నర్‌ నరసింహన్‌ను కలిశాయి. జీవో నెంబర్‌ 39ను రద్దు చేసేలా చొరవ తీసుకోవాలంటూ ఈ పార్టీల నేతలు గవర్నర్‌కు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు.  

సమస్యలపై ఐక్య పోరాటమే కాదు.. కలిసికట్టుగా ఎన్నికలను ఎదుర్కొనే దిశగానూ టీడీపీ, కాంగ్రెస్‌లు సాగుతున్నాయి. సింగరేణి ఎన్నికల్లో.. టిఆర్ఎస్ అనుబంధ యూనియ‌న్‌ను ఓడించడమే లక్ష్యంగా ఉమ్మడి అభ్యర్థులను నిలపాలని నిర్ణయించాయి. సింగ‌రేణిలో వార‌స‌త్వ ఉద్యోగాలు ఇస్తామన్న సర్కారు.... మాట తప్పిందన్న ఆరోపణలతో.. సింగరేణి కార్మికుల మనసు చూరగొనే ప్రయత్నం చేస్తున్నాయి. వారసత్వ ఉద్యోగాల క్రమబద్దీకరణకు జీవో ఇచ్చిన ప్రభుత్వం... మళ్లీ జాగృతి నాయకుడితో దానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్‌ వేయించిందని ఆరోపిస్తున్నాయి. మొత్తానికి సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. ప్రతిపక్ష పార్టీలు ఇప్పటినుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.. గులాబీ బాస్‌ను ఢీకొట్టాలన్న  వీరి ఐక్యతారాగం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో వేచిచూడాలి.. 

21:55 - August 9, 2017

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులుకి గవర్నర్‌ పదవి దక్కబోతుందా ? ఇదే అంశంపై గతంలో చంద్రబాబు, మోదీతో జరిపిన చర్యలు ఫలించబోతున్నాయా ? ఈశాన్య రాష్ట్రానికి మోత్కుపల్లిని గవర్నర్‌ను చేసే అవకాశాలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

09:22 - April 13, 2017

హైదరాబాద్: అదిగో.. ఇదిగో అంటూ రెండేళ్లుగా ఊరిస్తున్న గవర్నర్‌ పదవి.. కొద్ది రోజుల్లోనే టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులును వరించబోతుంది. వివిధ రాష్ట్రాల్లో ముగిసిన గవర్నర్ల స్థానంలో ఏదో ఒకచోట మోత్కుపల్లిని నియమించే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే మోత్కుపల్లి కల నెరవేరనుంది.

ఏడాది క్రితమే రావాల్సిన పదవి ...

మోత్కుపల్లికి ఏడాది క్రితమే గవర్నర్‌ పదవి రావాల్సి ఉండగా.. అనేక కారణాల వల్ల అది ఆలస్యమైంది. టీడీపీలో సుదీర్ఘ కాలం పని చేసిన అనుభవం, ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నిక కావడంతో పాటు మంచి వాక్చాతుర్యం ఉన్న దళిత నేత కావడంతో గవర్నర్‌ పదవి పొందడంతో ఆయన ముందున్నారు. అధినేత చంద్రబాబు కూడా ఇచ్చి న హామీ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. మోత్కుపల్లికి గవర్నర్‌ పదవి ఇవ్వాలనే అంశాన్ని ఢిల్లీలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సమావేశంలోనూ చంద్రబాబు ప్రస్తావించారు. మోత్కుపల్లిని వెంటబెట్టుకుని వెళ్లి మరీ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాను కలిసి గవర్నర్‌ పదవి ఇవ్వాల్సిన ఆవశ్యకతను వివరించారు. మిత్రపక్షం కింద ఇవ్వాల్సిన పదవుల కేటాయింపులో ఆలస్యం జరిగిందని.. ఇప్పటికైనా వీలైనంత త్వరగా మోత్కుపల్లిని గవర్నర్‌గా నియమించాలని కోరారు చంద్రబాబు. దీనికి అమిత్‌షా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రానున్న ఖాళీల భర్తీల మోత్కుపల్లి పేరుంటుందని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం.

తమిళనాడు నియమిస్తారని వార్తలు .....

వాస్తవానికి తమిళనాడు గవర్నర్‌ రోశయ్య పదవీకాలం ముగిసిన వెంటనే మోత్కుపల్లి తమిళనాడు గవర్నర్‌గా పదవి ఇస్తారని వార్తలు వినిపించాయి. అయితే నాటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. కాగా.. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ పదవీ కాలం వచ్చే నెలలో ముగియనుంది. ఈ నేపథ్యంలో దేశంలో ఖాళీగా ఉన్న పలు రాష్ట్రాల గవర్నర్ల పదవులను కూడా భర్తీ చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీంతో ఈ దఫాలో మోత్కుపల్లికి అవకాశం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

తెలంగాణకు కేరళ గవర్నర్‌ రిటైర్డ్‌ జస్టిస్‌ పి.సదాశివం....

అయితే.. మోత్కుపల్లిని ఏ రాష్ట్రానికి కేటాయిస్తారనే చర్చ మాత్రం కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో అరుణాచల్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్ల పదవులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా మే నెల చివరికి ఏపీ, తెలంగాణల ఉమ్మడి గవర్నర్‌ పదవి కూడా ఖాళీ కానుంది. ఇప్పటికే నరసింహన్‌ పదవీకాలం ఒకసారి పొడిగించడంతో ఆయన స్థానంలో మరొకరిని నియమించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ప్రస్తుతం కేరళ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న రిటైర్డ్‌ జస్టిస్‌ పి.సదాశివంను తెలంగాణకు రప్పించి.. కేరళ రాష్ట్రానికి మోత్కుపల్లిని పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎప్పటినుంచి ఎదురుచూస్తున్న గవర్నర్‌ పదవి మోత్కుపల్లిని వరించే అవకాశం కనిపిస్తోంది. 

17:16 - March 15, 2017
21:59 - January 30, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రెండున్నర ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలపై చర్చించేందుకు రాజ్‌భవన్‌ వేదిక కాబోతోంది. ఫిబ్రవరి 1న ఇరు రాష్ట్రాల ప్రతినిధుల భేటీకి గవర్నర్‌ నరసింహన్‌ ఆతిథ్యం ఇస్తున్నారు. విభజన నుంచి నానుతోన్న సమస్యలకు ఈ భేటీలోనైనా పరిష్కారం లభిస్తుందని ఇరు రాష్ట్రాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తరపున చర్చించే అంశాల అజెండాను సీఎం కేసీఆర్‌ గవర్నర్‌కు అందించారు. 
ఇరు రాష్ట్రాల సీఎంలతో గవర్నర్‌ భేటీ 
రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న చాలా సమస్యలు ఇప్పటికీ కొలిక్కిరాలేదు.   ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గవర్నర్‌ నరసింహన్‌ రెండు మూడుసార్లు ప్రత్యేకంగా భేటీ అయ్యి... సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.  సీఎంల చొరవతో కొన్ని సమస్యలు పరిష్కారం అయినా.. చాలా వరకు అపరిష్కృతంగానే  ఉన్నాయి.  హైకోర్టు విభజన, నీటి పంపకం, 9, 10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజన, సచివాలయ భవనాల అప్పగింత, ఉద్యోగుల బదిలీల్లాంటివి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
ప్రతినిధులతో కమిటీలు ఏర్పాటు 
నీటి పంపకాలపై ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల మధ్య మాటలయుద్ధమే నడిచింది. ఇలా అయితే పరిష్కారం కావని భావించిన సీఎంలు.. తమ ప్రతినిధులతో కమిటీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి, జి.వివేక్‌లతో కమిటీ వేయగా... ఏపీ సర్కార్‌ యనమల, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాస్‌తో కమిటీ నియమించింది. ఇక ఏ సమస్య పరిష్కారం కావాలన్నా ఈ కమిటీల ద్వారానే చర్చించుకోవాలని నిర్ణయించారు.
తెలుగు రాష్ట్రాల ప్రతినిధులతో ఫిబ్రవరి 1న తొలి భేటీ 
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీలు ఫిబ్రవరి 1న మొట్టమొదటి సారి గవర్నర్‌ సమక్షంలో భేటీ కావాలని నిర్ణయించాయి. ఇందుకోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు నిపుణులతో డ్రాప్ట్‌ను సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు.   విభజన చట్టం ప్రకారం నీటి వాటాలతోపాటు.. కొత్తగా నిర్మించ తలపెట్టిన సచివాలయం ఏర్పాటు అవసరాలపై  కేసీఆర్‌  గవర్నర్‌తో చర్చించినట్టు సమాచారం. ఏపీకి కేటాయించిన భవనాలను తమకు అప్పగించాలని కోరినట్టు తెలుస్తోంది.
పరిష్కారం అయ్యే అవకాశం..!
బుధవారం జరిగే ఇరు రాష్ట్రాలకు చెందిన కమిటీల భేటీలో... ఉద్యోగులతో పాటు హైకోర్టు విభజన, సచివాలయం అప్పగింతపై ప్రధానంగా చర్చించే అవకాశముంది. తొమ్మిది, పదవ షెడ్యూల్‌లోని సంస్థలపైనా చర్చించనున్నారు. మరికొద్ది రోజుల్లో పదవీకాలం పూర్తి చేసుకోబోతున్న గవర్నర్‌ నరసింహన్‌కు రెండు రాష్ట్రాలు, వాటి సమస్యల మీద పూర్తి అవగాహన ఉండడం, ఆయన సమక్షంలోనే ఇరు రాష్ట్రాల ప్రతినిధులు భేటీ కావడం మంచి పరిణామమని ప్రజాస్వామ్యవాదులు చెబుతున్నారు. ఇలాంటి సమావేశాల ద్వారా త్వరగా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

 

14:29 - January 30, 2017

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రంగంలోకి దిగనున్నారు. ఫిబ్రవరి 1న ఇరు రాష్ట్రాల మంత్రులతో గవర్నర్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో అంశాల వారీగా విభజన సమస్యలపై చర్చించనున్నారు. గవర్నర్ తో సమావేశానికి ఏపీ నుంచి మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు హాజరు కానున్నారు. ఈ సమావేశంతోనైనా ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కారమైతాయో లేదో చూడాలి మరి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:28 - January 30, 2017

హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలపై గవర్నర్‌ నరసింహన్‌తో చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాసేపటి క్రితమే రాజ్‌భవన్‌ వెళ్లారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివిధ అంశాలైన భవనాల అప్పగింతపై తెలంగాణ రాష్ట్రం తరపున మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో ఎంపీ వివేక్‌, మంత్రి జగదీష్‌రెడ్డి సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఇక ఏపీలో మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో మంత్రి అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాస్‌లు సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఫిబ్రవరి 1న తొలిసారిగా ఈ అంశాలపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల తరపున సభ్యులు రాజ్‌భవన్లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌తో చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్ వెళ్లారు.

09:30 - January 3, 2017

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రిని డైన‌మిక్ సీఎం అన్న గ‌వ‌ర్నర్‌పై కాంగ్రెస్‌ నిప్పులు చెరుగుతోంది. ఇప్పటికే న‌రసింహన్‌ వ్యవహరశైలిపై గుర్రుగా ఉన్న హ‌స్తం నేత‌లు.. తాజా ప్రశంసల‌తో గ‌వ‌ర్నర్‌పై ముప్పెట దాడికి దిగారు. రాజ్యాంగబద్ద ప‌ద‌విలో ఉండి ..సీఎం భ‌జ‌న చేయ‌డం ఏంట‌ని మడిప‌డుతున్న నేత‌లు.. మాకొద్ది గ‌వ‌ర్నర్ అంటున్నారు. తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ తీరుపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. న‌రసింహన్‌ను గవర్నర్‌గా త‌మ హ‌యాంలో నియ‌మించినా.. తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత ఆయ‌న వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ నేతలు విమ‌ర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ గవర్నర్‌ను కలిసి సర్కార్‌పై ఫిర్యాదు చేసినా ఆయన మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

గవర్నర్ స్పందిస్తారా ?
తాజాగా గ‌వ‌ర్నర్‌...నూతన సంవత్సరం సందర్భంగా కేసీఆర్ డైన‌మిక్ సీఎం అంటూ ప్రశంసలు కురిపించడంతో కాంగ్రెస్‌ నేతలు మరింత ఉడికిపోతున్నారు. రాజ్యాంగ బద్ద పదవిలో.. హోదాను మరిచి సీఎంను పొగుడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. ఏ అంశంలో కేసీఆర్ డైన‌మిజం క‌న‌బ‌డిందో చెప్పాలంటున్న హ‌స్తం నేత‌లు.. సీఎంకు గ‌వ‌ర్నర్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారార‌ని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్, రైతుల ఆత్మహ‌త్యలు, ఎన్నికల హామీలు, వీసీల నియామ‌కాలు.. ఇలా చాలా అంశాల‌పై గ‌తంలో కాంగ్రెస్‌ నేతలు గ‌వ‌ర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే.. ఒక్కసారి కూడా గ‌వ‌ర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్నిమంద‌లించకపోవ‌డాన్నిజీర్ణించుకోలేక‌పోతున్నారు హ‌స్తం నేత‌లు. అంతేకాదు.. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన తలసానితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారని గవర్నర్‌ను విమర్శిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు ఇక నుంచి ఫిర్యాదులు చేయకుండా.. బాయ్‌కాట్‌ చేస్తామంటున్నారు హస్తం పార్టీ నేతలు. కాంగ్రెస్‌ నేతల కామెంట్లపై గవర్నర్‌ నరసింహన్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

Pages

Don't Miss

Subscribe to RSS - governor