GST

20:19 - October 18, 2017

హైదరాబాద్ : దీపావళి రోజు ప్రతి ఇల్లు దీపాలతో కళకళలాడుతుంది. ముఖ్యంగా దీపాలను వెలిగించడానికి రంగురంగుల ప్రమిదలకు ప్రాముఖ్యతనిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి హైదరాబాద్‌లో వ్యాపారులు వెరైటీ ప్రమిదలను తయారు చేసి ఆకట్టుకుంటున్నారు. వివిధ దేవతల ఆకృతులలో.. లక్ష్మీ దేవి రూపాల్లో తయారు చేసిన ప్రమిదలు కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రమిదలు కొనడానికి విదేశీయులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక దీపావళి రోజు లక్ష్మీపూజ చేసేందుకు పలు డిజైన్లలో తయారు చేసిన ప్రమిదలను కొనడానికి మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే గతంలో కంటే ధరలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు మహిళలు. మొత్తానికి రేటు సంగతి పక్కన పెడితే మార్కెట్‌లోకి వచ్చిన వెరైటీ ప్రమిదలను మాత్రం కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. 

13:39 - October 18, 2017

తమిళనాడు : దీపావళి అంటేనే వెలుగుల పండుగ. వెలుగులతో అందరికీ ఆనందాన్ని పంచే పండుగ. మరి మన ఆనందాల వెనుక లక్షల కుటుంబాలు చీకటి కథలున్నాయి. సంతోషంతో వెలిగించే ప్రతి టపాసుల మాటున వేల వ్యథలున్నాయి. దీపావళి పండుగొస్తుందంటే ఠక్కున గుర్తుకు వచ్చేది శివకాశి బాణసంచా తయారీనే. ఈ కేంద్రంలో లక్షలాదిమంది నిత్యం బాణసంచా తయారు చేస్తూ మనకు ఆనందాన్ని పంచుతున్నారు. దీపావళి సందర్భంగా... శివకాశిలో బాణసంచా తయారీపై 10టీవీ ప్రత్యేక కథనం..
టపాసులకు అడ్డా శివకాశి పట్టణం
దీపావళి రోజున మన ఇష్టంగా కాల్చే టపాసుల్లో  70శాతం దాదాపు తమిళనాడులోని శివకాశిలోనే తయారవుతాయి. మనం ఏడాదికోసారి వేడుకగా జరుపుకునే దీపావళి కోసం దాదాపు ఏడు లక్షల మంది కార్మికులు ఏడాదంతా కష్టపడుతారు.  బాణసంచా తయారే వారి జీవనాధారం. అదే వారి జీవితం. తమిళనాడు రాజధాని చెన్నైకి 550 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శివకాశి పట్టణం. విరుద్‌ నగర్‌ జిల్లాలో ఉన్న ఈ పట్టణంలో వందేళ్ల కిందటే బాణాసంచా తయారీ ప్రారంభమైంది.  ఇదే ప్రాంతానికి చెందిన షణ్ముగ అయ్యర్‌ నాడార్‌ 1908లో 30 మందితో చిన్నపాటి బాణాసంచా తయారు చేసే కుటీర పరిశ్రమను ఏర్పాటు చేశారు.  అది రెండేళ్లలోనే 12 యూనిట్లుగా అభివృద్ధి చెందింది. అనంతరం కాలక్రమేణా ఇదే వ్యాపారం వేలాది కర్మాగారాలు, కుటీర పరిశ్రమలు ఏర్పాటుతో దినదినాభివృద్ధి చెందింది. ప్రపంచంలోనే బాణాసంచా తయారీలో అతిపెద్ద కేంద్రంగా శివకాశి నిలిచింది. ఇప్పుడు లక్షలాది మందికి ఉపాధి నిస్తోంది. 
బాణాసంచా తయారీ కేంద్రాల్లోనే ఉపాధి 
శివకాశి... దాని చుట్టూరా ఉన్న ప్రాంతాల ప్రజలంతా బాణాసంచా తయారీ కేంద్రాల్లోనే ఉపాధి పొందుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు బాణాసంచా తయారీలో పాలుపంచుకుంటారు. ఇక్కడి ప్రజలకు మరో పని తెలియదు. వారికి తెలిసిందల్లా బాణాసంచా తయారీనే. ఏళ్లుగా చేస్తున్న పనికాబట్టి అందులో వారు నైపుణ్యం సాధించారు. తక్కువ సమయంలో ఎక్కువ బాణాసంచా తయారు చేస్తున్నారు. 
నష్టాలను చవిచూస్తోన్న బాణాసంచా వ్యాపారం
ఏళ్ల తరబడి బాణసంచా వ్యాపారం లాభదాయకంగా సాగింది. కానీ ప్రస్తుతం ఈ పరిశ్రమ భారీ నష్టాలను చవిచూస్తోంది.  కార్మికుల జీవితాల్లో కన్నీళ్లను తెప్పిస్తోంది. ఏదైనా వస్తువును తయారు చేయడం ఎంత ముఖ్యమో.. దానికి మార్కెట్‌ కల్పించడం అంతకంటే ముఖ్యం.  మార్కెటింగ్‌ సరిగా లేకపోతే నష్టాలు వస్తాయి. ఇప్పుడు  శివకాశి బాణసంచా వ్యాపారం కూడా భారీ నష్టాల బారిన పడుతోంది.  శివకాశి పట్టణంలో మొత్తంగా 4700 ఏజెన్సీల ద్వారా ఈ దీపావళి సీజన్‌లో 100 మిలియన్‌ డాలర్ల మేర విక్రయాలు జరిపినట్టు వ్యాపారులు చెబుతుననారు.  గతేడాది కంటే ఈసారి కొనుగోళ్లు భారీగా తగ్గాయి. డిమాండ్‌ తగ్గడంతో ధరలు కూడా 40శాతానికి పడిపోయాయి.  దీంతో వ్యాపారులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.  పర్యావరణ పరిరక్షణ పేరుతో టపాసులను పేల్చవద్దంటూ ఆదేశాలు వస్తుండడంతో విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో కార్మికులకు జీవనోపాధి దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. దేశంలోనే అతిపెద్ద పరిశ్రమైన బాణసంచా తయారీ నష్టాలను చవిచూస్తోంది.  దీంతో ఇందులో పనిచేస్తోన్న కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతోంది. బాణసంచా తయారీని నమ్ముకుని జీవిస్తున్న లక్షలాది మంది కార్మికుల జీవితాలు రోడ్డునపడే ప్రమాదముంది. 
 

 

13:33 - October 18, 2017

కాకినాడ : పండగంటే ఉత్సాహం.. పండగంటే సంబరం.. పండగంటే ఆనందం. అందులోనూ దీపావళి పండగ అంటే అందరికీ ఎంతో ఇష్టం. టపాసులు కాలుస్తూ పిల్లలు చేసే సందడి.. ప్రతీ ఇంటిలో కొత్త కాంతులు నింపుతుంది. కానీ ఈ ఏడాది ఆ ఆనందానికి అడ్డుకట్ట పడుతోంది. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అటు వ్యాపారులు, ఇటు కొనుగోలుదారులు కలవరపడుతున్నారు. దీపావళి సామాగ్రి మీద పడిన జీఎస్టీ భారంతో నిరాశ ఆవహించింది. 

దీపావళి.. వెలుగులు నింపి చీకట్లను పారద్రోలే పండగ. టపాసులు కాలుస్తూ పిల్లలు చేసే సందడి. కానీ ఈ ఏడాది దీపావళి సంబరాలు అంతంతమాత్రంగానే ఉండేలా ఉన్నాయి. 

కేంద్రం జీఎస్టీపై తీసుకున్న నిర్ణయం ఇప్పటికే పలు రంగాల మీద పడింది. చివరకు ప్రధాని కూడా జీఎస్టీ దోషం తనది కాదన్నట్టుగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీపావళి పండగ పూట నాలుగు టపాసులు కాలుద్దామనుకున్నవారికి..జీఎస్టీ మోత మోగిస్తోంది. జేబు నిండా డబ్బులతో వెళ్లినా సంచినిండా సరుకులు తెచ్చుకునే అవకాశం కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం జీఎస్టీ భారమేనన్నది మార్కెట్ వర్గాల వాదన. ఏకంగా 28 శాతం జీఎస్టీ విధించడంతో దీపావళి బాణసంచా ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. 

గతేడాది 100 రూపాయలున్న మతాబుల కట్ట ప్రస్తుతం 200 రూపాయలకు చేరుకుంది. కాకరపువ్వుల బాక్స్‌ 80 నుంచి 150కి చేరింది. తారాజువ్వల వంటివాటి గురించి ఇక చెప్పక్కర్లేదు. ఇలా అన్ని రకాల బాణసంచా సామాగ్రి ధరలు అమాంతంగా పెరిగాయి. అన్ని వస్తువుల మీద పన్నుల భారం పెరగడంతో హోల్‌సేల్‌ మార్కెట్‌లోనూ ధరలు పెంచక తప్పడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. 

బాణసంచా తయారీకి ఉపయోగించే ముడి సరుకు ధరలు భారీగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో బాణసంచా కాల్చాలంటే సామాన్యుడికి సాధ్యం కాని పరిస్థితి దాపురించింది. అయినా పిల్లల కోసం ఎంతో కొంత కొనక తప్పని పరిస్థితి ఉండడంతో చేతి చమురు ఎక్కువగానే వదిలించుకోవాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. 

పండగను కూడా ప్రశాంతంగా జరుపుకోనివ్వకుండా.. జీఎస్టీ భారం సామాన్యుడిని సతమతమయ్యేలా చేస్తోంది. పెరుగుతున్న భారం ప్రజలను పండగకు దూరం చేస్తోంది. 

16:32 - October 15, 2017

విజయవాడ : చేనేత కార్మికులకు జీఎస్టీ పోటు తప్పడంలేదు. చేనేతను ఆదుకుంటామని చెప్పే పాలకుల మాటలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. అండగా ఉంటామన్న వారు ఆమడదూరంలో ఉంటూ ఆర్భాటపు ప్రకటనలు చేయడంతో సగటు చేనేత కార్మికుడి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. 
జీఎస్టీతో తగ్గిన ఉత్పత్తి
దేశంలోనే అత్యధిక జీవనాధారమైన చేనేత రంగంపై జీఎస్టీ దెబ్బ గట్టిగానే పడింది. వస్తుసేవల పన్ను ప్రభావం చేనేత కళాకారులు, రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సంప్రదాయ వస్త్రకళకు కొత్త డిజైన్లతో వన్నె తెస్తామన్న దేశ ప్రధాని ఆ హామిని నెరవేర్చలేదు సరికదా జీఎస్టీ తీసుకొచ్చి చేనేత పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీశారు. జీఎస్టీ అమలుతోనే ఉత్పత్తిదారుల వద్ద 50 శాతానికి పైగా ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో నిల్వలు పేరుకుపోయి 30 శాతానికిపైగా ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. 
జీఎస్టీతో నేతన్నలపై మోయలేని పెనుభారం
చేనేత ఎగుమతుల్లో వృద్ధి సాధించాలంటే నిఫ్ట్‌ లాంటి సంస్థల సాయం తప్పనిసరి. అధునాతన మగ్గాల ఏర్పాటుకు చేనేత ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు అవసరం ఉన్నా ప్రభుత్వాలు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి.  ఇలాంటి అంశాలను విస్మరించిన కేంద్రం చేనేతపై జీఎస్టీని తెచ్చి నేతన్నలపై మోయలేని పెనుభారాన్ని వేసింది. దీంతో ఎన్నడూ లేని విధంగా చేనేత ముడి సరుకు మొదలుకొని ఉత్పత్తుల వరకు పన్ను పోటు ఎక్కువైంది. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. 
కాటన్‌, వూల్‌ కొనుగోలు నుండి 5 శాతం జీఎస్ టీ 
వస్త్ర ఉత్పత్తికి కావలసిన ముడిసరుకైన కాటన్‌, వూల్‌ కొనుగోలు నుండే జీఎస్ టీ 5 శాతం పడుతోంది. దేశంలోనే అత్యధిక మగ్గాలున్న అనంతపురం జిల్లాలో చేనేత పరిశ్రమే జీవనాధారం. ఆంధ్రప్రదేశ్‌లో 1.75 లక్షల మగ్గాలుంటే ఒక్క అనంతపురం జిల్లాలోనే 75 వేల మగ్గాలున్నాయి. ఎక్కువ శాతం ఉత్పత్తయ్యే పట్టు వస్త్రాలకు దారం కొనుగోలు చేయాలంటే కిలో రూ. 4వేలకు పైనే ధర ఉంది. జీఎస్టీతో అది రెండువందలు పెరిగింది. చేనేత మగ్గంపై తయారైన వస్త్రానికి మరో 5 శాతం పన్ను అదనంగా విధిస్తున్నారు. అది సాధారణ వస్త్రమైనా, చీరైనా బాదుడు తప్పడంలేదు. అయితే మరో 18 శాతం అదనపు పన్ను చెల్లింపు అనివార్యంగా మారింది.
చేనేతపై పన్నును 15 శాతం పెంచిన కేంద్రం
చేనేత పన్నును 5 శాతానికి పరిమితం చేస్తామన్న కేంద్రం 15 శాతం పెంచింది. పట్టు చీర ఖరీదు 5వేలు ఉంటే, దానిపై జీఎస్టీ 750 విధించి చీర ఖరీదు కాస్తా 5,750 చేస్తున్నారు. దీంతో మహిళలు చీరలు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంలేదు. ఫలితంగా స్టాకు నిల్వలు పెరిగిపోతున్నాయని ఉత్పత్తిదారులు ఆవేదన చెందుతున్నారు.
ముడిసరుకు కొనుగోలుకు 5 శాతం జీఎస్టీ 
ముడి సరుకు కొనుగోలుకు 5 శాతం జీఎస్టీ చెల్లించిన ఉత్పత్తిదారుడు తాను తయారు చేసిన వస్త్రానికి కూడా బిల్లువేసి వెంటనే జీఎస్టీ చెల్లించాలి. అదే రిటైలర్లు షాపులో కస్టమర్‌ నుండి జీఎస్టీ వసూలు చేసినా ఏడాది తర్వాత అయినా ఉత్పత్తిదారులకు మొత్తం సొమ్ము ఇస్తారన్న గ్యారెంటీ లేదు. దీంతో ఈ భారం ఉత్పత్తిదారులపై పడుతోంది. 
చేనేత రంగం సంక్షోభంలో 
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల చేనేత రంగం సంక్షోభంలో పడిందంటున్నారు విపక్షాలు. కేంద్రంపై ఒత్తిడి తెస్తే తప్ప పరిస్థితులు చక్కబడే పరిస్తితులు కనిపించడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి చేనేత కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

07:20 - October 13, 2017

 

పెట్రోల్‌, డిజీల్‌ ధరలను జీఎస్‌టీ పరిధిలో చేర్చాలి. నిన్నటి వరకూ ఇది వినియోగదారుల డిమాండ్‌. ఇప్పుడు ఇదే డిమాండ్‌ ను పెట్రోల్‌, డిజిల్‌ డీలర్స్‌ కూడా వినిపిస్తున్నారు. ఈ డిమాండ్‌లో తమకి ఇబ్బందిగా ఉన్న కొన్ని సమస్యల పరిష్కారం కోసం వారు ఆందోళన బాట పట్టారు. నిజంగా చెప్పలంటే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ కఠినంగా ఉందని, ఇక్కడ ప్రజాస్వామ్యాం కనబడడంలేదని, పెట్రోల్ బంక్ లను నోట్ల రద్దు చేసినప్పుడు బ్యాంకుల మాదిరిగా మారిందని, ప్రస్తుతం మేము బత్ రూమ్ లు కడిగే స్థితికి వచ్చామని, పెట్రోబంక్ లు సులభు కాప్లెక్స్ గా వాడుతున్నారని తెలంగాణ పెట్రోల్, డిజిల్ బంక్ ల సంఘం నాయకులు రాజీవ్ అమరం అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

20:00 - October 9, 2017

 

దేశంలో జీఎస్టీ అమలు ప్రారంభమైనప్పుటి నుంచి రవాణా రంగం కుంటుపడిందని, లారీ తిరిగే పరిస్థితి కనబడడం లేదని, వాహానాలు కొనుగోలు చేసినప్పుడు 48 శాతం సెస్ ఉందని, ఫైనాన్స్ తీసుకుంటే 5 శాతం వ్యాట్ విధిస్తున్నారని, సెకండ్ హ్యాండ్ వాహానాలపై కూడా జీఎస్టీ అమలు చేస్తున్నారని లారీ ఓనర్ సంఘం అధ్యక్షుడు కోనేరు రమేష్ అన్నారు. 2011 నుంచి కేంద్ర ప్రభుత్వానికి డీలర్ కమిషన్ పెంచాలని కోరమని, అందుకు కేంద్రం ఓ కమిటీ వేసిందని, ఆ కమిటీ డీలర్లకు అనుకూలంగా నివేదిక ఇచ్చిందని, అయిల్ ఇండస్ట్రీస్ కు కమిషన్ పెంచాలని కేంద్రం సూచిందని, కాని ఇంతవరకు అచరణలోకి రాలేదని పెట్రోల్ యాజమానుల సంఘం అధ్యక్షుడు చుంచు నరసింహరావు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

10:16 - October 9, 2017

హైదరాబాద్ : తెలంగాణలో లారీ యజమానులు సమ్మెబాటపట్టారు. ఇవాళ,రేపు రాష్ట్ర వ్యాప్తంగా లారీలను బంద్‌ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా లారీ యజమానులు బంద్‌కు పిలుపునిచ్చారు. జీఎస్టీ, రోజువారీ డీజిల్‌ధరల విధానంతోపాటు టోల్‌ట్యాక్స్‌ల భారాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రెండు రోజుల పాటు లారీలు నిలిచిపోనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసరాల సరఫరాతోపాటు వివిధ సరుకు రవాణాపై ప్రభావం పడనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:17 - October 6, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వస్త్రాలపై పన్నును 12 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు..ఏసీ హోటల్ బిల్లులపై సర్వీసు చార్జీ 18 నుండి 12 శాతానికి తగ్గింపు...గృహోపకరణాలపై స్వల్పంగా పన్నును తగ్గించారు. గ్యాస్ వస్తువులు..వినియోగ వస్తువులపై 28 శాతం పన్ను నుండి మినహాయించారు. ఎగుమతి దారులకు ఊతమిచ్చే విధంగా ఎగుమతులపై నామమాత్రంగా జీఎస్టీ విధించనున్నారు. వస్తు సేవల పన్ను గణింపు పరిధి రూ. 75 లక్షల నుండి కోటికి పెంచినట్లు ఆర్థిక మంత్రి జైట్లీ వెల్లడించారు. ఈ నిర్ణయంలో లక్షలాది చిన్న వ్యాపారులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పన్ను రేట్లను అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. 

19:59 - October 6, 2017

శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఊరించి ఊస్సూరుమనిపించింది. 28 శాతం శ్లాబ్ లోని 68 వస్తువులపై పన్ను తగ్గిస్తారంటూ ప్రచారం జరిగింది. దేశ ప్రజలంతా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను తగ్గిస్తారని ఆశ పడ్డారు. అయితే కౌన్సిల్ సమావేశం కొద్ది నిర్ణయాలు తీసుకుని ముగించారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చా వేదికలో శశికుమార్ (ఆర్థిక వేత్త), రాకేష్ రెడ్డి (బీజేపీ), జి.వి.రెడ్డి (కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు తెలియచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

08:36 - October 2, 2017

ముంబై : జీఎస్టీపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పన్ను శ్లాబులను కుదించే అవకాశం ఉన్నట్లు జైట్లీ సంకేతాలు పంపారు. హర్యానాలోని ఫరిదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశ ఆదాయం సాధారణ స్థితికి వస్తే శ్లాబుల కుదింపు ప్రక్రియ ఉంటుందని జైట్లీ పేర్కొన్నారు. కానీ మొదట రెవెన్యూ ఆదాయం సాధారణ స్థితికి చేరితేనే శ్లాబులపై సమీక్ష ఉంటుందన్నారు. ప్రస్తుతం 5, 12, 18, 28 శ్లాబుల కింద వస్తువులపై పన్ను విధిస్తున్నారు. కొన్ని వస్తువులపై జీఎస్టీ పన్ను మినహాయింపు, లేదా పన్ను రేటు తగ్గించాలని వివిధ రాష్ట్రాల నుండి డిమాండ్స్ వస్తున్నాయి. ప్రధానంగా 28 శాతం ఉన్న పన్నుపై నిర్ణయం తీసుకోవాలని సూచిస్తుండడం..తాజాగా జైట్లీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 

Pages

Don't Miss

Subscribe to RSS - GST