Hardik Patel

17:21 - July 25, 2018

గుజరాత్ : పాటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్‌కు గుజరాత్‌లోని ఓ స్థానిక కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 2015లో పాటిదార్ ఆందోళన సందర్భంగా విస్‌నగర్‌లోని బీజేపీ ఎమ్మెల్యే రుషికేశ్ పటేల్ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఈ కేసులో హార్దిక్ పటేల్‌తో పాటు లాల్‌జీ పటేల్‌‌ను విస్‌నగర్ న్యాయస్థానం దోషులుగా నిర్దారించింది. వీరికి రెండేళ్ల జైలుశిక్షతో పాటు 50 వేల చొప్పున జరిమానా కూడా విధించింది. జరిమానా ద్వారా వచ్చిన లక్ష రూపాయలను బాధితుడికి నష్టపరిహారంగా చెల్లించనున్నారు. ఆందోళన సందర్భంగా హార్దిక్‌ పటేల్‌ నేతృత్వంలో 5 వందల మంది కార్యకర్తలు బిజెపి ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేశారు. విద్యా, ఉద్యోగాల్లో తమకు ఓబీసీ కేటగిరీ కింద రిజర్వేషన్ కల్పించాలంటూ పటేల్ వర్గీయులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. రిజర్వేషన్లపై ఆగస్టు 25 నుంచి హార్దిక్‌ పటేల్‌ మళ్లీ దీక్ష చేపట్టనున్న నేపథ్యంలో కోర్టు తీర్పు వెలువడడం గమనార్హం.

14:42 - December 30, 2017

గుజరాత్ : కొత్తగా ఏర్పాటైన గుజరాత్‌ కాబినెట్‌లో అప్పుడే విభేదాలు పొడసూపాయి. మొన్నటివరకు మంత్రివర్గంలో నెంబర్‌ టూగా వెలుగొందిన డిప్యూటి సిఎం నితిన్‌ పటేల్‌కు కీలక శాఖలు దక్కకపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. ఆర్థిక శాఖ, పట్టాణాభివృద్ధి, పెట్రోలియం శాఖలు దక్కకపోవడంతో నితిన్‌ ఇంతవరకు బాధ్యతలు స్వీకరించలేదు. ఆర్థిక శాఖను సౌరభ్‌ పటేల్‌కు అప్పగించగా, పెట్రోలియం, పట్టణాభివృద్ధి శాఖలను సీఎం రూపానీ తనవద్దే అట్టిపెట్టుకున్నారు. నితిన్‌ పటేల్‌కు రోడ్లు, భవనాలు, ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం, నర్మదా-కల్పసర్‌ ప్రాజెక్టు శాఖలను కేటాయించారు. దీన్ని అవమానంగా భావిస్తున్న నితిన్‌ పటేల్ అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు 48 గంటల అల్టిమేటం ఇచ్చినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. కాబినెట్‌లో కలహాల నేపథ్యంలో నితిన్‌ పటేల్‌ బిజెపిని వదిలి కాంగ్రెస్‌లో చేరాలని హార్దిక్‌ పటేల్‌ సలహా ఇచ్చారు.

20:54 - December 19, 2017

గెలవటమైతే గెలిచారు.. కానీ, గెలిచిన ఆనందం లేకుండా పోతున్న తరుణం.. మసకబారుతున్న ప్రభ.. వరుసగా తగ్గుతున్న సీట్లు..ఓట్ల శాతం.. క్రమంగా లైట్ తీసుకుంటున్న గుజరాత్ ప్రజలు.. గుజరాత్ మోడల్ అంటూ ఊదరగొడుతున్న మాటల్లో డొల్లతనం.. ఆఖరికి మతం, జాతీయత లాంటి ఎమోషనల్ ఎలిమెంట్స్ వాడితే తప్ప ప్రయోజనం సాధించలేనితనం.. ముగ్గురు యువకులను చూసి వణికిపోయిన పరిస్థితి. ఇవన్నీ చూస్తే గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ .. గెలిచిందా? ఓడిందా అనే సందేహం రాకమానదు. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. 
బీజేపీది ప్రగల్భాలే.. 
బీజెపీది ప్రగల్భాలే తప్ప.. వాస్తవంలో అంత లేదని గణాంకాలు చెప్తున్నాయి. మరోపక్క యువరక్తం గుజరాత్ లో చూపిన దూకుడు చర్చనీయాంశంగా మారింది. అక్కడ మారుతున్న పరిణామాలను, రాజకీయాలను స్పష్టం చేస్తోంది.  గుజరాత్ ప్రజలు మత సామరస్యాన్ని, లౌకిక రాజకీయాలను కోరుతున్నారని ఇదే పాఠాన్ని అసెంబ్లీ ఎన్నికల ద్వారా నేర్పారని అర్ధమవుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:57 - December 18, 2017

ఢిల్లీ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఈవీఎంల టాంపరింగ్‌కు పాల్పడిందని పాటీదార్‌ సామాజిక ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ ఆరోపించారు. ఎవరికి అనుమానం రానివిధంగా టాంపరింగ్‌ జరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి ఎలాంటి చాణక్య రణనీతి చూపలేదని...కేవలం డబ్బులు వెదజల్లి గెలుపొందిందని హార్దిక్‌ విమర్శించారు. బిజెపికి వ్యతిరేకంగా పాటీదార్‌ రిజర్వేషన్ల డిమాండ్‌తో పాటు రైతులు, నిరుద్యోగం తదితర సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

14:55 - November 22, 2017

ఆహ్మదాబాద్ : గత కొన్నాళ్లుగా పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి కాంగ్రెస్‌ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. తమ సమస్యల పరిష్కారానికి...పాటీదార్లకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్‌ అంగీకరించిందని పాటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ స్పష్టం చేశారు. సెక్షన్‌ 31, సెక్షన్‌ 46 కింద పాటీదార్లను బీసీల్లో చేర్చడానికి కాంగ్రెస్‌ ఒప్పకుందన్నారు. కాంగ్రెస్‌ ఫార్ములాను తాము అంగీకరిస్తున్నట్లు... 50 శాతానికి పైగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు అవకాశం ఉందని హార్దిక్‌ పటేల్‌ వెల్లడించారు. రాజకీయంగా తమకు ఏ పార్టీతో సంబంధం లేదని...కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు హార్దిక్‌ పటేల్‌ తెలిపారు. పాటీదార్ల ఓట్లను చీల్చేందుకు బిజెపి 2 వందల కోట్ల నిధులు ఏర్పాటు చేసినట్లు ఆయన ఆరోపించారు.

 

22:02 - November 18, 2017

ఢిల్లీ : పటేళ్ల రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి కాంగ్రెస్‌కు డెడ్‌లైన్‌ పెట్టింది. 24 గంటల్లో కాంగ్రెస్‌ వైఖరేంటో స్పష్టం చేయాలని హెచ్చరించింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పటీదార్లకు ఎన్ని స్థానాలు కేటాయిస్తున్నారో తేల్చాలని హార్దిక్‌ పటేల్‌ వర్గం డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్‌ అధిష్టానంతో చర్చలు జరిపేందుకు పటీదార్‌ అనామత్‌ నేతలు శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. చర్చలకు రమ్మని పిలిచిన కాంగ్రెస్‌...తమతో సమావేశం కాకుండా అవమానించిందని పటేల్‌ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్‌ ఎన్నికల్లో పటేళ్లకు 30 స్థానాలు కేటాయించాల్సిందిగా పీఏఏఎస్‌ డిమాండ్‌ చేస్తోంది. ఈ విషయంలో అంతా సవ్యంగా జరుగుతుందని, విజయం తమను వరిస్తుందన్న ఆశాభావాన్ని హార్దిక్‌ పటేల్‌ వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌-పటీదార్‌ నేతల మధ్య వడోదరాలో సాయంత్రం మళ్లీ సమావేశం జరగనుంది.

 

21:28 - November 14, 2017

గుజరాత్ : రాష్ట్ర ఎన్నికల ముందు పాటీదార్‌ ఉద్యమనేత హర్దిక్‌ పటేల్‌ సెక్స్‌ సీడీ క్లిప్పింగ్‌లు హల్‌చల్‌ చేస్తున్నాయి. సీడీలో ఉన్నది హార్దిక్‌ పటేలేనని మాజీ అనుచరుడు అశ్విన్‌ అన్నారు. సీడీలో ఉన్నది తాను కానని హార్దిక్‌ పటేల్‌ చెబుతున్నారు. తనపై బురద చల్లేందుకు బిజెపి నీచ రాజకీయాలకు ఒడిగట్టిందని ఆరోపిస్తున్నారు. ఈ సీడీ వ్యవహారంలో దళిత యువనేత జిగ్నేష్‌ మేవాని హార్దిక్‌ పటేల్‌కు అండగా నిలిచారు. శృంగారం అనేది ప్రాథమిక హక్కని...దానికి భంగం కలిగించే హక్కు ఎవరికి లేదని పేర్కొన్నారు. తాజాగా మే 22కు చెందిన ఓ వీడియోలో హార్దిక్‌ పటేల్‌ తన సహచరులతో పాటు ఓ మహిళ కూడా కనిపిస్తోంది.

సోమవారం కూడా మే 18కి చెందిన ఓ వీడియో వెలుగు చూసింది. ఇందులో ఓ మహిళతో హార్దిక్‌ పటేల్‌ ఉన్నట్లుగా ఉంది. ఈ వీడియో వ్యవహారంపై దళిత యువ నేత జిగ్నేశ్‌ మెవానీ స్పందించారు. ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదని హర్దిక్‌ పటేల్‌కు మద్దతుగా నిలిచారు. ''హర్దిక్ నీ వెంట నేనున్నా. శృంగారం అనేది ప్రాథమిక హక్కు. ఏకాంతానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు'' అని జిగ్నేష్‌ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. వీడియోలో ఉన్నది అతనే అయినా తప్పేం కాదని.. ఆ వీడియోను ఎవరైతే బయటపెట్టారో వారిని హర్దిక్‌ కోర్టుకు ఇడ్చాల్సిందే అని జిగ్నేశ్‌ సలహా ఇస్తున్నారు.

ఈ వీడియో క్లిప్‌ను ఒకప్పుడు హార్దిక్‌కు సహచరుడిగా ఉన్న అశ్విన్‌ బయటపెట్టాడని ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియో విషయంలో తనకు, బిజెపికి ఎలాంటి సంబంధం లేదని అశ్విన్ సంకడ్‌ సరియా పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ దక్కనివారే ఈ పనికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ వీడియోలో ఉన్నది హార్దిక్‌ పటేలా...కాదా...అన్నది తేల్చాలన్నారు. ఈ సిడిని ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపాలని డిమాండ్‌ చేశారు.

ఈ వీడియోలు ఫేక్‌వనీ...అందులో ఉన్నది తాను కానని....గుజరాత్ ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ తనపై బురదజల్లేందుకు నీచ రాజకీయాలకు ఒడిగడుతోందని హార్దిక్‌ పటేల్‌ విమర్శించారు. ఆ వీడియోలో ఉన్నది తానే అయితే ధైర్యంగా ఒప్పుకుంటానని తెలిపాడు. ఎవరు ఏం చేసినా చేసుకోండి.... ఇలాంటి వాటికి తాను భయపడి వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశాడు. నన్ను అవమానించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని హార్దిక్‌ చెప్పాడు.

ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కావాలని కోరుతూ హార్దిక్‌ పటేల్‌ నేతృత్వంలో గుజరాత్‌లో భారీ ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. పాటీదార్‌ సామాజికవర్గం రిజర్వేషన్లపై అధికార బిజెపి వెనకడుగు వేయడంతో ఈ ఎన్నికల్లో ఆ వర్గం కమలానికి దూరమైంది. హార్దిక్‌ పటేల్‌ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడంతో బిజెపి పటేల్‌ను టార్గెట్‌ చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

20:00 - October 31, 2017

ఆహ్మదబాద్ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో యువనేతలు హల్‌చల్ చేస్తున్నారు. పటేల్‌ సామాజిక నేత హార్దిక్‌ పటేల్‌ బాటనే దళిత సామాజిక వర్గానికి చెందిన యువనేత జిగ్నేష్‌ మేవాని కూడా ఎంచుకున్నారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశానికి ముందు ఆయన కొన్ని షరతులు విధించారు. రాహుల్‌గాంధీతో దొంగచాటుగా సమావేశం జరిపే ప్రసక్తే లేదని జిగ్నేష్‌ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. దళితుల అంశంపై కాంగ్రెస్‌ తమ వైఖరిని తెలియజేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గుజరాత్‌లో దళిత సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 7 శాతం ఉండడంతో రాహుల్‌-జిగ్నేష్‌ల మధ్య భేటి రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. హార్దిక్‌ పటేల్, జిగ్నేష్‌ మేవానీల షరతులతో కాంగ్రెస్‌ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. 

19:59 - October 31, 2017

ఆహ్మదబాద్ : పాటీదార్‌ సామాజికవర్గ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ కాంగ్రెస్‌ పార్టీకి తామిచ్చిన గడువును మరోసారి గుర్తు చేశారు. పటేల్ రిజర్వేషన్లపై రోడ్‌ మ్యాప్‌ వేసేందుకు ఎంతో సమయం లేదు...ఈలోగా నిర్ణయం తీసుకోకుంటే కాంగ్రెస్‌ సభలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. శుక్రవారం రాహుల్‌ గాంధీ సూరత్‌లో జరిపే సభను అడ్డుకుంటామని హార్దిక్‌ పటేల్‌ హెచ్చరించారు. పటేల్‌ రిజర్వేషన్లపై నవంబర్ 3వ తేదీలోగా స్పష్టమైన హామీ ఇవ్వాలని కాంగ్రెస్‌కు ఆయన గడువు విధించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు తాము వ్యతిరేకం కాదని చెప్పిన హార్దిక్‌ పటేల్‌ ఇపుడు రిజర్వేషన్లపై మెలిక పెట్టారు. హార్దిక్‌ పటేల్‌ డెడ్‌లైన్‌పై కాంగ్రెస్‌ ఇంతవరకు స్పందించలేదు.

21:58 - February 7, 2017

ఢిల్లీ : పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాడిన ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌ శివసేనలో చేరారు. ఆయనను గుజరాత్‌ పార్టీ నేతగా శివసేన ఎంపిక చేసింది. గుజరాత్‌ ఎన్నికల్లో పటేల్‌ సారథ్యంలో పార్టీ ఎన్నికల్లో పోటీచేస్తుందని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాక్రే ప్రకటించారు. బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే ఏడాది గుజరాత్‌లో 182 స్థానాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో కాకుండా విడిగా పోటీచేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. 

Pages

Don't Miss

Subscribe to RSS - Hardik Patel