Heavy Rainfall

08:05 - December 13, 2017

శ్రీనగర్ : జమ్ము-కశ్మీర్‌ను మంచు దుప్పటి కప్పేసింది. మంచు వర్షం నేపథ్యంలో శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిని మూసివేయడంతో దేశంలోని ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ హిమపాతం కారణంగా ఐదుగురు జవాన్లు అదృశ్యమయ్యారు.
విస్తారంగా మంచు వర్షం 
జమ్ముకశ్మీర్‌లో మంగళవారం తెల్లవారుజాము నుంచి విస్తారంగా మంచు వర్షం కురుస్తోంది. ఈ సీజన్‌లో కశ్మీర్‌ లోయను తొలిసారిగా మంచు దుప్పటి కప్పేసింది. రోడ్లన్నీ హిమపాతంతో నిండిపోయాయి.... వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి....జనజీవనం స్తంభించింది....
మంచు కారణంగా ప్రజలకు ఇబ్బందులు 
మంచు కురిసే వేళలో కశ్మీర్‌ లోయ అందాన్ని వర్ణించడానికి పదాలు చాలవు.... కానీ మంచు కారణంగా అక్కడి ప్రజలు మాత్రం బయటకు రాలేని పరిస్థితి. హిమపాతంతో చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలి నుంచి తట్టుకోవడానికి నిప్పుల కుంపట్లను ఆశ్రయిస్తున్నారు.
విమాన రాకపోకల నిలిపివేత
మంచువర్షం నేపథ్యంలో శ్రీనగర్ విమానాశ్రయానికి విమాన రాకపోకలను నిలిపేయడంతోపాటు శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిని మూసివేశారు. దీంతో కశ్మీర్‌ లోయకు దేశానికి మధ్య సంబంధాలు తెగిపోయినట్లయింది. వైష్ణోదేవి ఆలయానికి బ్యాటరీ కారు మార్గంలో వెళ్లే రహదారిని కూడా మూసివేశారు. డిసెంబర్‌ 15 వరకు హిమపాతంతో పాటు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఐదుగురు సైనికులు అదృశ్యం
హిమాపాతం కారణంగా ఐదుగురు సైనికులు అదృశ్యమయ్యారు. గురేజ్‌ సెక్టార్‌లో ముగ్గురు, కుప్వారాలోని నౌగామ్‌ సెక్టార్‌లో ఇద్దరు జవాన్ల ఆచూకి తెలియడం లేదని ఆర్మీ పేర్కొంది. ఐదుగురు జవాన్లను రక్షించేందుకు ఆర్మీ ఆపరేషన్ చేపట్టింది. నౌగామ్‌ సెక్టార్‌లో విపరీతంగా మంచు కురుస్తుండడంతో సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఐదుగురు సైనికులు సోమవారం రాత్రి నుంచి కనిపించడం లేదు. గురేజ్‌ సెక్టార్‌లో సైన్యంలో పోర్టర్‌గా పనిచేస్తున్న 29 ఏళ్ల గులాం కాదిర్‌ ఖాన్‌ హిమపాతానికి ప్రాణాలు కోల్పోయాడు.
ఉత్తర భారతదేశంలో పలుచోట్ల మంచు 
మరోవైపు హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లా, మనాలీలోలో మంచు కురుస్తోంది. పచ్చగా ఉండాల్సిన చెట్లు మంచుతో తెల్లగా మిళ మిళ మెరుస్తున్నాయి. చలి విపరీతంగా ఉండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలో పలుచోట్ల మంచు కురుస్తోంది.


 

07:04 - November 17, 2017

శ్రీకాకుళం : భారీ వర్షాలు ఉత్తరాంధ్రను అతలాకుతలం చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో వంశధారనది ఉధృతంగా ప్రవహిస్తోంది. వేల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. వందలాది మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతూనే ఉంది. దీనిప్రభావంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది.రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాలు వణికిపోతున్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. విశాఖపట్నం, భీమునిపట్నం, కళింగపట్నం ఓడరేవుల్లో మూడోనంబర్‌ ప్రమాదహెచ్చకలు జారీ చేశారు.

భారీవర్షాలతో శ్రీకాకుళంజిల్లా అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపిలేని వర్షంతో పలు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. గ్రామాల చుట్టూ నీరుచేరడంతో జనం భయం గుప్పిట్లో బతుకుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో కుండపోతగా వర్షం నమోదైంది. ఎడతెరిపిలేని వర్షాలతో పలు గ్రామాల్లో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. జీవనాధారం అయిన జీవాలు చనిపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని గొర్రెల కాపరులు వాపోతున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరిపంట గంగపాలైంది. నిండామునిగిన పంటపొలాన్ని చూసి అన్నదాతలు కన్నీరు పెట్టుకుంటున్నారు. భారీ వర్షాల్లో సైతం పంటను కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. పొలం నుంచి నీటిని బయటికి పంపించేందుకు తిప్పలు పడుతున్నారు. తమ పంటలన్నీ తుడిచిపెట్టుకు పోయాయని వజ్రపుకొత్తూరు మండల రైతులు ఆవేదన చెందుతున్నారు.

మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశగా 80 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు దక్షిణ నైరుతి దిశగా 210 కిలోమీటర్ల దూరంలోనూ వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది స్థిరంగా కొనసాగుతున్న వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోందని, ఆ తర్వాత ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరాలకు చేరువగా వచ్చి క్రమంగా బలహీన పడుతుందని అధికారులు బెబుతున్నారు. దీని ప్రభావంతో ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50-55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. 

11:55 - November 7, 2017

నెల్లూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాకేంద్రంలో

డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయి . భూగర్భ డ్రైనేజీ , వాటర్ పైప్లైన్ల కోసం మొత్తం రోడ్లన్నీ తవ్వేసి ఉండడంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది . ఆత్మకూరు బస్టాండ్ ,ముత్తుకూరు బస్టాండ్ వద్దనున్న అండర్ బ్రిడ్జిల్లో నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఎదురయింది.

వెంకటగిరిలోనూ

అటు జిల్లాలోని చేనేతకు ప్రసిద్ధి చెందిన వెంకటగిరిలోనూ వర్షం కష్టాలు తెచ్చిపెట్టింది. కుండపోత వర్షంతో వెంకటగిరి శివారుప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ వర్షాలతో చేనేత కార్మికులు తీవ్రంగా ఇబ్బందుల పడుతున్నారు. మగ్గం గుంతల్లోకి నీరు చేరడంతో పనులన్నీ ఆగిపోయాయి. మరో రెండు నెలల వరకు మగ్గాలపై పనిచేయడానికి వీలుకాదని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు.

వెంకటగిరి చేనేత కార్మికులు ఆందోళన

వర్షపునీటిలీ కాలనీలు మునిగిపోతున్నా.. నాయకులు, అధికారులు ఎవరూ తిరిగిచూడటంలేదని వెంకటగిరి చేనేత కార్మికులు ఆందోళన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నిలిచిపోయిన వర్షపునీరు త్వరగా వెళ్లిపోయేలా డ్రైనేజిలు, కాల్వలు క్లీన్‌ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

21:46 - October 15, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని చిన్నా, పెద్ద ప్రాజెక్టుల్లో జలకళ వచ్చింది. పలు జిల్లాల్లో  కుండపోత వానలతో పంటలు నీటిపాలయ్యాయి. ఇటు హైదరాబాద్‌ను మరోసారి భారీవర్షం ముంచెత్తింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌ జామ్‌లతో సిటీజనం నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు బంగాళాఖాతంతో అల్పపీడనం ఏర్పడటంతో మరో 3 రోజులు ఏపీ, తెలంగాణలకు భారీవర్షాలు తప్పవని విశాఖ వాతావరణశాఖ తెలిపింది.
హైదరాబాద్‌ను వదలని వరుణుడు  
హైదరాబాద్‌ను వరుణుడు వదలడంలేదు. భారీవర్షాలు ముంచెత్తడంతో సిటీ జనం అవస్థలు పడుతున్నారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్‌, హయత్‌నగర్‌లో కుండపోతగా వర్షం కురిసింది. గత పది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం అతలాకుతలమైంది. ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో నగరంలోని ఆయా ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. అటు శివారు ప్రాంతాల్లో కూడా భారీగానే వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే డ్రైనేజీలన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. భారీవర్షాలతో  అటు  నిజమాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలు నాశనం అయ్యాయి. నిజామాబాద్‌జిల్లాలో వరిపంటను వర్షాలు దారుణంగా దెబ్బతీయగా.. కామారెడ్డి జిల్లాలో చేతికవచ్చిన పత్తిపంట నేలపాలయిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.  
ఏపీలోనూ 
ఏపీలోనూ భారీవర్షాలకు పంటలు నేలరాలాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో  ఇటీవల కురిసిన  వర్షాలకు  మొత్తం 31.161 హెక్టార్లలో వివిధ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లావ్యాప్తంగా దాదాపు 834  కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, అలాగే 365  కిలోమీటర్ల మేర పంచాయతీ రాజ్ రోడ్లు దెబ్బతిన్నాయని జిల్లా అధికారులు లెక్కలు వేశారు.  
నిండుకుండలా ఆల్మట్టీ, శ్రీరాం సాగర్, శ్రీశైలం
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ జలకళతో తొణికిసలాడుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆల్మట్టీ, శ్రీరాం సాగర్, శ్రీశైలం, సింగూరు , నిజాంసాగర్, తదితర ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ నీటితో నిండుకుండలా మారాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో నాగార్జున సాగర్‌ నీటి మట్టం అమాంతం పెరిగుతోంది.  అయితే నాగార్జున సాగర్ నిండడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అటు  నిజామాబాద్ జిల్లాలోని  శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. 
బంగాళాఖాతంలో అల్పపీడనం
ఇదిలావుంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల  భారీవర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తెలంగాణలో  ఉపరితల ఆవర్తనం కొనసాగుతూనే ఉంది. భారీగా క్యూములోనింబస్‌ మేఘాలు ఏర్పడి.. హైదరాబాద్‌తోపాటు, పలు జిల్లాల్లో మరో 3రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

 

21:50 - October 14, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వరుణ ప్రతాపం కొనసాగుతూనే ఉంది. ప్రవాహం పెరగడంతో.. శ్రీశైలం ఏడుగేట్లు ఎత్తి సాగర్‌కు నీటిని వదులుతున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో రాయలసీమలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఓవైపు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా... మరోవైపు ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరి... జలకళను సంతరించుకుంటున్నాయి. మరోవైపు భాగ్యనగరంలో విషాదం చోటు చేసుకుంది. నాలాలో పడి ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. 

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇంకా కురుస్తునే ఉన్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతం నుంచి వరద ప్రవాహం అధికమవడంతో శ్రీశైలంలో ఏడు గేట్లు పది అడుగుల మేర ఎత్తి .. నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి 2లక్షల 33వేల 989 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం ఆనకట్ట స్పిల్‌వే ద్వారా లక్షా 67వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. దీంతో శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. మరోవైపు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు 11వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 24వేల క్యూసెక్కులు, హంద్రీనీవా ప్రాజెక్టుకు 1688 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 884.40 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 211.95 టీఎంసీలుగా నమోదైంది.

భారీ వర్షాలతో రాయలసీమలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో కట్టలకు గండ్లు పడి... ఇళ్లలోకి నీళ్లు చేరుతున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 

కడప జిల్లా బద్వేల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. బద్వేల్ డిపోలోకి నీరు చేరడంతో.. డిపోలో పనులకు ఆటంకం ఏర్పడింది. బస్టాండ్‌కు బయట రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు జరగడంతో డిపో నుంచి నీరు బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. రోడ్డుపై నీళ్లు నిలవడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అలాగే పోరుమామిళ్లలో కూడా ఇదే స్థాయిలో వర్షం కురిసింది. పోరుమామిళ్ల బస్టాండులోకి కూడా నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదురుకున్నారు.

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడపకు సమీపంలో ఉన్న బుగ్గవంక ప్రాజెక్ట్‌ నిండుకుండను తలపిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వర్షం నీటితో ప్రాజెక్ట్‌ నిండిపోయింది. దీంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో 200 క్యూసెక్కుల నీరు చేరుతుండగా... ఒక గేటు ఓపెన్‌ చేసి 150 క్యూసెక్కుల నీటి దిగువకు వదులుతున్నారు. 

భారీ వర్షాలతో కర్నూలు జిల్లాలో హంద్రీనీవా ప్రధాన కాలువకు పత్తికొండ మండలం దూదూకొండ దగ్గర గండిపడింది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రధాన కాలువకట్ట.. బలహీనపడింది. కాలువలో ప్రవాహం ఎక్కువగా ఉంటంతో గండిపడినట్టు తెలుస్తోంది. మరో మూడు చోట్ల కూడా భారీగా గండిపడే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు.

ఇక తెలంగాణలోనూ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జీడిమెట్ల పరిధిలోని మధుసూదన్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఉధృతంగా ప్రవహిస్తున్న నాలాలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కిలోమీటర్‌ దూరంలో గణేష్‌ మృతదేహం లభించింది. 

10:35 - October 14, 2017

 

కర్నూలు : శ్రీశైలం జలశయానికి వరద ఉధృతి పెరుగుతుండంతో అధికారలు ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రస్తుతం నీటి మట్టం 884 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 2,04276 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 2,00209 క్యూసెక్కులుగా ఉంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:31 - October 14, 2017

కడప : నగరానికి సమీపంలో ఉన్న బుగ్గవంక ప్రాజెక్ట్‌ నిండుకుండలా మారి జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వర్షం నీటితో ప్రాజెక్ట్‌ నిండిపోయింది. భారీ వర్షాలు పడిన ప్రతీసారీ బుగ్గవంక నగరవాసులను భయాందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం నీటితో నిండిపోవడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా నీటిని బయటకు వదిలేస్తున్నారు. ఒక గేటు ద్వారా 150 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అయితే ప్రాజెక్ట్‌లోకి 200 క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు తెలిపారు. 

09:30 - October 14, 2017

కడప : బద్వేల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. బద్వేల్ డిపోలోకి నీరు చేరడంతో.. డిపోలో పనులకు ఆటంకం ఏర్పడింది. బస్టాండ్‌కు బయట రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు జరగడంతో డిపో నుంచి నీరు బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. అలాగే రోడ్డులో కూడా ఎక్కువ నీరు చేరడంతో పాదచారులకు కూడా ఇబ్బంది ఏర్పడింది. అలాగే పోరుమామిళ్లలో కూడా ఇదే స్థాయిలో వర్షం కురిసింది. పోరుమామిళ్ల బస్టాండులోకి కూడా నీరు చేరడంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదురుకున్నారు. 

20:42 - October 13, 2017

హైదరాబాద్‌ : నగరంలో మళ్లీ వర్షం దంచి కొడుతుంది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మాదాపూర్‌ నుంచి మియాపూర్ వరకు, ఉప్పల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు ట్రాఫిక్‌ స్తంభించింది. 

 

11:35 - October 13, 2017

 

హైదరాబాద్ : భారీ వర్షానికి హైదరాబాద్‌ మరోసారి తడిసి ముద్దైంది. గురువారం సాయంత్రం వరకు ప్రశాంతంగానే ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కారుమబ్బులు కమ్ముకుని.. ఉరుములు, మెరుపులతో కుండపోతగా వర్షం కురిసింది. జోరు వానకు సిటీ జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గంటసేపు కురిసిన కుంభవృష్టితో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి.

గంటలో 6.4 సెంటీమీటర్ల వర్షం
పంజాగుట్ట శ్రీనగర్‌కాలనీలో అత్యధికంగా గంటలో 6.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మౌలాలిలో 4.9 సెం.మీ., అంబర్‌పేటలో 3.9 సెం.మీ., కాప్రాలో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అటు మియాపూర్‌, కూకట్‌పల్లి, ఎస్సార్‌నగర్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ సహా ప్రధాన ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ ఆగిపోయి వాహనదారులు నరకయాతన పడ్డారు. ట్రాఫిక్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది, అత్యవసర బృందాలు రంగంలోకి దిగినా పరిస్థితిని చక్కదిద్దలేక చేతులెత్తేశారు. రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్‌లోనే చిక్కుకున్న వాహనదారులు నానా అవస్థలు పడి ఇళ్లకు చేరుకున్నారు.

మరో 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు
నాంపల్లి తాజ్‌ ఐల్యాండ్‌, అఫ్జల్‌గంజ్‌ నుంచి కేంద్ర గ్రంథాలయం వరకూ 3 అడుగల మేర నీళ్లు నిండిపోవడంతో ఆర్టీసీ బస్సులు, సిటీబస్సులు రెండువైపులా భారీగా నిలిచిపోయాయి. సికింద్రాబాద్‌లోని బాంబే హోటల్‌, లక్కీ టర్నింగ్‌ వద్ద ద్విచక్రవాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. గంటవ్యవధిలోనే కుండపోత వర్షానికి సిటీలో దాదాపు 200లకు పైగా కాలనీలను వర్షపునీరు ముంచెత్తింది. మలక్‌పేట, సంతోష్‌నగర్‌, సైదాబాద్‌ ప్రాంతాల్లో వరదనీరు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి చేరింది. పాతబస్తీలో కొన్నిచోట్ల మూడడుగుల ఎత్తు నీరు ప్రవహించింది. మీరాలం మండిని వరద ముంచెత్తింది. సోమాజీగూడ యశోద ఆస్పత్రి ఏరియా, నారాయణగూడ, సికింద్రాబాద్‌లలో నాలాలకు సమీపంలోని ఇళ్లల్లోకి నీరు వెళ్లడంతో ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. ఇదిలావుంటే మరో 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల తిరోగమనానికి తోడు విదర్భ, కొంకణ్‌, మధ్య మహారాష్ట్ర, మరాట్వాడా మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా పలుచోట్ల భారీవర్షాలు కురుస్తున్నాయి.

Pages

Don't Miss

Subscribe to RSS - Heavy Rainfall