High Court

18:36 - October 12, 2018

విజయవాడ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు చోటుచుచేసుకుంది. విజయవాడ కోర్టులో కేసు సంబంధించిన రికార్డులన్నీ ధ్వంసమయ్యాయని ప్రత్యేక దర్యాప్తు సంస్థ హైకోర్టుకు తెలిపింది. హైకోర్టులో కేసు నడుస్తున్న సమయంలోనే రికార్డులు ధ్వంసమయ్యాయని సిట్ తెలిపింది. రికార్డుల ధ్వంసంపై విచారణకు హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని రిజిస్ట్రార్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేసింది.

2007, డిసెంబర్‌ 26న అర్ధరాత్రి ఆయేషా మీరా అత్యంత దారుణంగా హత్యకు గురైంది. నిమ్రా కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న ఆయేషా, విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఓ హాస్టల్లో హత్యకు గురైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సత్యంబాబును నిర్దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు నివ్వడం తెలిసిందే.

 

16:33 - October 12, 2018

హైదరాబాద్ : తెలంగాణ అపద్ధర్మ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ రద్దుపై ప్రభుత్వ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ వేసిన పిటిషన్‌తోపాటు అసెంబ్లీ రద్దుపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. దీంతో అసెంబ్లీ రద్దుపై అడ్డంకులు తొలగిపోయాయి. గత నెల 6న తెలంగాణ అసెంబ్లీ రద్దైన సంగతి తెలిసిందే.

 

15:44 - October 12, 2018

హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్-2కు లైన్ క్లియర్ అయింది. గ్రూప్-2 పరీక్షలో వైట్నర్, డబుల్ బబ్లింగ్ చేసిన 267 మందిని తొలగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-2 పరీక్షలో వైట్నర్, డబుల్ బబ్లింగ్ చేసినవారిని తొలగించాలని గతంలో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్-2 పరీక్షల్లో 3,147 మంది సెలెక్ట్ అయ్యారు. వీరిలో వైట్నర్, డబుల్ బబ్లింగ్ చేసిన 267 మందిని తొలగిస్తూ హైకోర్టు ఆదేశించింది. 1/2 పద్ధతిలో సెలక్ట్ అయినవారికి ఇంటర్వ్యూలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. 

 

19:14 - October 11, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఓటర్ల జాబితాపై ఉత్కంఠకు తెరపడింది. ఓటర్ల జాబితా ప్రకటనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓటర్ల జాబితా విడుదలకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఓటర్ల జాబితా ప్రింట్‌కు హైకోర్టు ఆమోదం తెలపడంతో జాబితాను రేపు విడుదల చేసేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.

 రాష్ట్రంలో ఓటు హక్కు కోసం మొత్తం 33 లక్షల 14 వేల 6 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కొత్తగా ఓటు హక్కు కోసం 22 లక్షల 36 వేల 677 దరఖాస్తులు వచ్చాయి. అయితే 30 లక్షల 872 దరఖాస్తులకు ఈసీ ఆమోదం తెలిపింది. 3 లక్షల 12 వేల 335 దరఖాస్తులను తిరస్కరించింది. రేపు ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. లోపాలు లేకుండా ఓటరు జాబితా ప్రకటిస్తామని ఆయన చెప్పారు. 

 

11:33 - October 11, 2018

హైదరాబాద్ : స్పెషల్ ఆఫీసర్ల పాలనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు  నియమించడం రాజ్యంగ విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. మూడు నెలల వరకు పంచాయతీల్లో స్సెషల్ ఆఫీసర్ల పాలన ఉంటుందని తెలిపింది. అనంతరం ఎన్నికల నిర్వాహణకు ఈసీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆగస్టు 1వ తేదీ నుండి స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొత్త బీసీ జనాభాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ కోర్టును ఆశ్రయించారు. బీసీల జనగణన కోసం మరింత సమయం కావాలని కోర్టును ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యసాధ్యాలపై ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చించి కోర్టులో కౌంటర్ వేసే అవకాశం ఉంది. 

14:42 - October 10, 2018

హైదరాబాద్ : ఓటరు నమోదు ప్రక్రియలో హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నమోదు ప్రక్రియలో అనుమానాలున్నాయని, వివరణ ఇవ్వాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. మర్రి శశిధర్ రెడ్డి, సిద్ధిపేట వాసి శశంక్‌లు వేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. సుమారు మూడు గంటలకు పైగా వాదనలు జరిగాయి. ఓటర్ల సవరణ పూర్తయ్యిందని, ఎలాంటి అవతవకలు లేవని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిందని హైకోర్టుకు తెలిపారు. ఒకే అడ్రస్‌తో వేల ఓట్లున్నాయని దీనిపై వివరణ ఇవ్వాలని ఈసీకి చీఫ్ జస్టిస్ ఆదేశించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో 70 లక్షలకు పైగా ఓట్లు అవకతవకలు జరిగాయని, 20 లక్షలు బోగస్ అని తేల్చారని...వీటిని ఎలా తొలగిస్తారని..తొలగించిన ఓట్లను ఎలా కలుపుతారో ఈసీ చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీటిని నివృత్తి చేసిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని వాదిస్తున్నారు. మరికొన్నింటిపై హైకోర్టు 2.30గంటల తరువాత తీర్పును చెప్పనుంది. 

13:18 - October 10, 2018

హైదరాబాద్ : ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. ఓటర్ల జాబితా అంశంపై రెండు పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఇందులో సిద్ధిపేట వాసి శశాంక్ రెడ్డి పిటిషన్ కూడా ఉంది. పిటిషనర్ తరపున జంధ్యాల రవిశంకర్ వాదిస్తున్నారు. పిటిషనర్ వేసిన దానిలో ఏ ఒక్క అంశం చెల్లదని ఎన్నికల సంఘం వాదిస్తోంది. 2019 జనవరి ఓటర్ల జాబితా సవరణను అక్టోబర్‌కు కుదించడం వల్ల అన్యాయం జరుగుతుందని కోర్టుకు పిటిషనర్ తరపున న్యాయవాది తెలిపారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో 70 లక్షలకు పైగా ఓట్లు అవకతవకలు జరిగాయని, 20 లక్షలు బోగస్ అని తేల్చారని...వీటిని ఎలా తొలగిస్తారని..తొలగించిన ఓట్లను ఎలా కలుపుతారో ఈసీ చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీటిని నివృత్తి చేసిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని వాదిస్తున్నారు. 2016-2017 ఓటర్ల లిస్ట్‌ను కూడా ఇప్పుడు చూపిస్తున్నారని..ఓటర్ల జాబితాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేస్తామంటూ హైకోర్టులో ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందానే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

08:20 - October 9, 2018

హైదరాబాద్ : తెలంగాణలో బుధవారం టెన్షన్ నెలకొంది. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన  రెండు కీలక అంశాలపై ఆ రోజు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ప్రభుత్వ వాదనతో ఏకీ  భవించి పిటిషన్లను తోసి పుచ్చుతుందా లేక.. పిటిషనర్ల వాదనను బలపరుస్తుందా అన్న  ఆందోళన అధికార, ప్రతిపక్షాల్లో నెలకొంది. ఇంతకీ బుధవారం ఏం జరగబోతోంది? ఆ  రెండు కీలక అంశాలేంటి?
ఈనెల 10న బుధవారం తెలంగాణ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్దేశించే ఓటర్ల జాబితా,  అసెంబ్లీ రద్దుపై దాఖలైన 200లకు పైగా పిటిష్లపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఓటరు  జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి లేవనెత్తిన  అభ్యంతరాలపై ఎన్నికల కమిషన్ హైకోర్టుకు కౌంటర్ దాఖలు చేసింది. ఓటరు జాబితా  సవరణ ప్రక్రియ, అభ్యంతరాలతో పాటు పరిష్కరించిన వివరాలను కోర్టుకు  సమర్పించింది. ఈసీ కౌంటర్ పై అభ్యంతరాలుంటే తెలపాలని మర్రి శశిధర్ రెడ్డిని హైకోర్టు  ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 10కి వాయిదా వేసింది. 
మరోవైపు తెలంగాణ శాసనసభ రద్దును సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ నేత డీకే అరుణ  హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ శాసనసభను రాజ్యాంగ విరుద్ధంగా రద్దు చేశారన్న  ఆమె.. ఐదేళ్లు ఉండాల్సిన సభను రాజకీయ ప్రయోజనాల కోసం మధ్యలోనే  రద్దుచేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. రద్దు చేసే ముందు సభ్యులకు సమాచారం  కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు. 
అసెంబ్లీ రద్దుపై కోరుట్ల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాములు దాఖలు చేసిన  పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వ  చర్యను తప్పుపడుతూ హైకోర్టులో దాదాపు 200 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు  దాఖలయ్యాయి. పదవీకాలం పూర్తికాకుండానే మంత్రిమండలి తమ ఇష్టానుసారంగా  అసెంబ్లీని రద్దు చేయడం రాజ్యంగ విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అభ్యంతరాలను ఎప్పుడైనా  సమర్పించవచ్చ ఈసీ.. ఈనెల 12 తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితా విడుదల  చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఓటరు జాబితా సహా.. అసెంబ్లీ రద్దుపై హైకోర్టు ఏం తీర్పు  చెప్పనుందనేది ఆసక్తి రేపుతోంది. 

 

15:07 - October 8, 2018

హైదరాబాద్ : ఓటర్ల జాబితాలో అవకతవలపై హైకోర్టులో విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఎన్నికల సంఘం  ఇవాళ కోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. దీనిపై బుధవారం కోర్టులో వాదనలు ఉంటాయి. మరో వైపు ఎన్నికల షెడ్యూల్‌ను సవాల్‌ చేస్తూ కోర్ట్‌లో నిరూప్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.

 

09:47 - October 8, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా.. లేక ఆలస్యమవుతాయా అన్నది ఇవాళ తేలిపోనుంది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై కాంగ్రెస్ నేత మర్రిశశిధర్ రెడ్డి వేసిన పిటిషన్‌.. మరికాసేపట్లో హైకోర్ట్‌లో విచారణకు రానుంది. ఈసీ ఇచ్చే నివేదికను పరిశీలించనున్న హైకోర్ట్ ఎలాంటి ఆదేశాలను జారీ చేస్తుందన్నది ఉత్కంఠను సృష్టిస్తోంది. 20 లక్షలకు పైగా ఓటర్లను తొలగించి, హడావుడిగా ఓటరు జాబితాను పూర్తి చేయడంపై మర్రిశశిధర్‌రెడ్డి అభ్యంతరం చెబుతున్నారు. దీనివల్ల ఆ 20 లక్షల మందికి ఓటు వేసే అవకాశం ఉండదంటున్నారు. అయితే.. ఎన్నికల సంఘం మాత్రం పోలింగ్‌కు ముందు వరకూ కూడా ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చంటోంది. ఓటర్ల తుదిజాబితాను ఇవాళ కోర్టుకు సమర్పించనుంది.  మరో వైపు హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న అంచనాతో.. తెలంగాణలో పోల్‌బాజా మోగించింది ఎన్నికల సంఘం. నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణకూ షెడ్యూల్ విడుదల చేసింది. ఒకవేళ ఓటర్ల తుది జాబితాకు హైకోర్ట్ ఆమోదం తెలిపితే.. షెడ్యూల్‌ ప్రకారమే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. కోర్టు గనక ఓటర్ల జాబితాలో సవరణలు చేయాలంటే మాత్రం.. షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సి వస్తుందేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - High Court