High Temperatures

07:36 - May 21, 2017

హైదరాబాద్ : భానుడి ప్రతాపానికి కండక్టర్లు , డ్రైవర్లు విలవిల్లాడుతున్నారు. ఎండల కారణంగా విధి నిర్వహణలో వారికి తిప్పలు తప్పడం లేదు. రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు డ్యూటీలో ఉండేవారు.. సాయంత్రం ఆరు వరకు ఎండ వేడిమిలోనే డ్యూటీ చేయాల్సి వస్తోంది. అలాగే ఉదయం ఆరుగంటలకు వచ్చే కార్మికులు తొమ్మిది గంటల నుంచే ఎండ బారిన పడుతున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు మండుటెండలో ఇళ్లకు చేరుతున్నారు. దీంతో ఆర్టీసీ కార్మికులు వడదెబ్బకు గురవుతున్నారు. ఈ మండుటెండలకు విధులు నిర్వహించడం చాలా కష్టంగా ఉందని కండక్టర్లు అంటున్నారు. వేసవితాపం నుంచి నగర కండక్టర్లను, డ్రైవర్లను రక్షించేందుకు చర్యలు తీసుకున్నామని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. మజ్జిగ, ఓఆర్‌ఎస్‌, చల్లని నీరు అందుబాటులో ఉంచుతున్నామని వెల్లడించింది. కానీ ఆ ఏర్పాట్లన్నీ అరకొరగానే ఉన్నాయి. కనీసం మంచినీరు కూడా అందుబాటులో లేదని డ్రైవర్లు, కండక్టర్లు వాపోతున్నారు. ఇప్పటికైనా మంచినీరు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ఎండలను లెక్క చేయకుండా... ఆర్టీసీ కార్మికులు తమ విధులు నిర్వహిస్తున్నారు. వారి సంరక్షణకు... ఆర్టీసీ యాజమాన్యం పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

19:26 - May 20, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భానుడి దెబ్బకు జనం ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం గణనీయంగా తగ్గి.. పెద్ద ఎత్తున వడగాడ్పులు వీస్తున్నాయి. దీంతో చాలామంది అస్వస్థతకు గురై.. ప్రాణాలు కోల్పోతున్నారు. ఎండల ధాటికి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోనే రెండు రోజుల్లో ఐదుగురు వడదెబ్బతో మృతిచెందారు.

తూ.గో జిల్లాలో నలుగురు మృతి

అలాగే వడగాల్పులకు తూర్పు గోదావరి జిల్లాలోనూ నలుగురు మృతి చెందారు. జిల్లాలోని 14 మండలాల్లో తీవ్ర ఎండలు ఉన్నాయని...ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... కలెక్టర్‌ కార్తీకేయ మిశ్రా సూచించారు.

చిట్యాలలో తండ్రి, కొడుకులు మృతి...

అలాగే నల్గొండ జిల్లా చిట్యాలలో భానుడి ఉగ్ర రూపానికి తండ్రి, కొడుకులు బలయ్యారు. జ్యోతిష్యం చెప్పుకుంటూ జీవనం సాగించే కొండే దశరథ, కొండే శివ వడదెబ్బ ధాటికి కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయారు.

వరంగల్ లో ఓ బాలుడు మృతి...

అలాగే వరంగల్లో నగరంలో వడదెబ్బకు ఓ బాలుడు మృతి చెందాడు. పెరుక‌వాడ‌కు చెందిన ల‌క్ష్మీ, లక్ష్మణ్‌ల మూడో సంతానం శివ ఎండలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని ఎంజీఎం ఆస్పత్రిలో చూపించి... ఇంటికి తీసుకువ‌స్తుండగా.. మార్గమధ్యలో ప్రాణాలు వదిలాడు.

47 డిగ్రీల వరకు....

మొత్తమ్మీద తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాలో, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ... అత్యధికంగా 47 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడు నాలుగు రోజుల్లో తీవ్రస్థాయిలో వడగాల్పులుంటాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

15:32 - May 20, 2017

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భానుడి దెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో రెండు రోజుల్లో ఐదుగురు వడదెబ్బతో మృతిచెందారు. యార్లగడ్డ ఏసురత్నం, కామేశ్వరరావుతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. వీరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతంలో కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతోనే జనం మృత్యువాత పడుతున్నారని వైద్యులు చెప్పారు.

చిట్యాలలో...

నల్గొండ జిల్లా చిట్యాలలో భానుడి ఉగ్ర రూపానికి తండ్రి, కొడుకులు బలయ్యారు. జ్యోతిష్యం చెప్పుకుంటూ జీవనం సాగించే కొండే దశరథ, కొండే శివ వడదెబ్బ ధాటికి కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయారు. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

15:27 - May 20, 2017

ఆదిలాబాద్‌ : జిల్లాలో భానుడి భగభగలకు జనం విలవిల్లాడుతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్ర

13:40 - May 20, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. గత వారంరోజులుగా భారీగా నమోదవుతున్న ఊష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వచ్చే మూడు నాలుగు రోజుల్లో తీవ్రస్థాయిలో వడగాల్పులుంటాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తూ.గో జిల్లాలో రాబోయే 3,4 రోజుల్లో భారీ ఊష్ణోగ్రతలు నమోదవుతాయని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిత్ర తెలిపారు. దీంతో అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మ.12.30 నుంచి మ.3 వరకు షాపులు మూసివేయాలని కలెక్టర్‌ సూచించారు. వారం రోజులుగా అన్ని తెలుగు రాష్ట్రాల్లోని చాలో చోట్ల దాదాపు 43 నుంచి 45 డిగ్రీల ఊష్ణోగ్రత నమోదువుతోంది. ఇక రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో అయితే 47 డిగ్రీలకు పైనే టెంపరేచర్‌ నమోదవుతోంది. దీంతో ఎండల ధాటిని తట్టుకోలేక జనం విలవిలల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఎండల ధాటికి తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు తీవ్ర పిట్టల్లా రాలిపోతున్నారు. ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఏసీలు ఉన్నా..ఉక్కపోత మాత్రం తగ్గడంలేదు. ఇళ్లల్లో ఉక్కపోత తట్టుకోలేక జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎండవేడితో పళ్ల రసాలు, కొబ్బరిబోండాలు, కూల్‌ డ్రింక్‌లకు విపరీతంగా గిరాకీ పెరిగింది. 

09:45 - May 20, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు జనం విలవిలలాడిపోతున్నారు. మునుపెన్నడు లేన్నంతగా రికార్డు స్ధాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కాలు బయట పెట్టాలంటేనే జనం హడలిపోతున్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా తిరువూరులో అత్యధికంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక తెలంగాణలోని మంచిర్యాలలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. కొత్తగూడెంలో 46 డిగ్రీలు, ఖమ్మంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

కారులో మంటలు....
ఎండ తీవ్రతకు వాహనాలు కూడా హీటెక్కిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో ఓ కారులో మంటలు అంటుకున్నాయి.. నందనవనం దగ్గర ఎండవేడికి కారులో మంటలు చెలరేగాయి. మంటల్ని గమనించిన ప్రయాణికులు వెంటనే కారులో నుంచి కిందకు దిగారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది కారులో మంటల్ని అర్పేశారు. అప్పటికే కారు కాలిబూడిదైంది. ప్రయాణికులు మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలో మరో ఘటన జరిగింది. కృష్ణాజిల్లా బండిపాలెంకి చెందిన భార్యాభర్తలు... వివాహంకోసం భద్రాద్రి జిల్లా పాల్వంచకు బైక్ పై వస్తున్నారు.. జూలూరుపాడు వచ్చాక ఎండ వేడికి స్కూటర్‌కు మంటలు అంటుకున్నాయి.. ఈ విషయం గమనించిన దంపతులు బండి దిగారు.. అంతలోనే మంటలు వేగంగా వ్యాపించి స్కూటర్‌ డిక్కీలోఉన్న 6వేల రూపాయలు కాలిబూడిదయ్యాయి

రోడ్డుపై ఉన్న వేడితోనే ఆమ్లేట్‌
ఎండలు ఎంతగా మండుతున్నాయంటే.. రోడ్డుపై ఉన్న వేడితోనే ఆమ్లేట్‌ వేసుకునే పరిస్థితికి చేరాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఎండలు ఎంతగా మండుతున్నాయో అధికారులకు తెలియజేసేందుకు కొంతమంది యువకులు రోడ్డుపైనే ఆమ్లేట్‌ వేసి చూపించారు. ఇది చూసిన ప్రజలంతా.. బాబోయ్‌ ఇవేమీ ఎండలురా బాబు అని భయపడుతున్నారు. మధ్యాహ్నం వేళ ఎండలో బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు, మజ్జిక ప్యాకెట్లు లాంటివి అందించాలని జనం కోరుతున్నారు.

 

14:46 - May 6, 2017

విజయవాడ : అసలే మే నెల..ఓవైపు భానుడి ఉగ్రరూపం..మరోవైపు ఉక్కపోత..వెరసి జనం ఉడికిపోతున్నారు. ఏపీలో సూర్యుడు విజృంభిస్తుండటంతో..జనం సతమతమవుతున్నారు. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి బొండాలు, పళ్ల రసాలు, తాటిముంజలు లాగించేస్తున్నారు. భానుడి దెబ్బకుశ్రీకాకుళం జిల్లాలో తాటిముంజలకు గిరాకి పెరిగింది. పల్లెల్లో విరివిగా లభించే తాటిముంజలు పట్టణాల్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పిల్లలనుండి పెద్దల వరకు వేసవిలో తాటిముంజల రుచులను ఆస్వాదిస్తున్నారు. మరోవైపు తాటిముంజల్లో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఉండటం.. వేడిలో చల్లదనానివ్వడంతో తాటిముంజలను ఇష్టంగా తింటున్నారు జనం.

శ్రీకాకుళం జిల్లా తాటిచెట్లు అధికంగా....

ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో తాటి చెట్లు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో తాటి కల్లు విక్రయించే గీత కార్మికులు ఏప్రిల్,మే నెలల్లో తాటి కాయలు,ముంజలు అమ్ముతూ జీవనం సాగిస్తారు. వేసవిలో తాటిముంజలకు గిరాకి ఉండటంతో.. పట్టణాల్లో వాటిని విక్రయిస్తున్నారు. తాటిముంజలను ఒలిచి డజన్లలో అమ్ముతున్నారు. ఎండాకాలంలో మాత్రమే వచ్చే తాటి ముంజలు ఎండ వేడిమిని తగ్గించి శరీరానికి చలవ చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. మొత్తంగా సిక్కోలు వాసులు తాటిముంజలు తింటూ భానుడి భగభగల నుంచి ఉపశమనం పొందుతుంటే... వీటి విక్రయాలతో గీత కార్మికులు అదనపు ఆదాయం పొందుతున్నారు.

12:44 - April 29, 2017

ఖమ్మం : భానుడి ప్రతాపం ప్రాణాల్ని హరిస్తోంది. ఖమ్మం జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. దీంతో ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఖమ్మం జిల్లాలో.. నెల రోజుల్లోనే వడదెబ్బతో ఐదుగురు మృతి చెందారు. అనధికార లెక్కల ప్రకారం 12 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. వడదెబ్బతో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఆపద్బంధు పథకం కింద 50 వేల రూపాయలు అందిస్తోంది. ప్రతీ ఏడాది ఎండలకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నా.. అధికారులు కొందరికే పరిహారం అందిస్తున్నారనే విమర్శలున్నాయి. గతేడాది 100 మంది వడదెబ్బతో మృతి చెందగా.. అందులో సగం బాధిత కుటుంబాలకు కూడా పరిహారం అందలేదు.

ఆపద్బంధు పథకం కింద రూ. 50 వేలు
60 ఏళ్ల లోపు ఉండి వడదెబ్బతో చనిపోతే.. వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆపద్బంధు పథకం కింద రూ. 50 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. దీనికి అన్ని ధృవీకరణ పత్రాలు, నివేదికలు అందితేనే సాయమందుతుంది. అర్హులను గుర్తించడానికి తహసీల్దార్, వైద్యుడు, ఎస్సైలతో తీమెన్ కమిటీ ఉంటుంది. అయితే వడదెబ్బతో చనిపోయినవారికి ఆర్థిక సాయం అందుతుందనే అవగాహన .. చాలా మంది నిర్ధారణ పరీక్షలు లేకుండానే అంత్యక్రియలు చేసేస్తున్నారు. తరువాత తెలిసినా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ రాయడానికి, పంచనామా చేయడానికి ముందుకు రావడం లేదు.

ఈ నెలలో పెళ్లిళ్లు....
ఈ నెలలో పెళ్లిళ్లు ఎక్కువగా జరగనున్నాయి. పెరుగుతున్న ఎండల తీవ్రతతో పెళ్లిళ్ల నిర్వహకులు ఠారెత్తిపోతున్నారు. దూర ప్రయాణాలు చేయడానికి, పత్రికలు పంచడానికి అపసోపాలు పడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. పనులకు, ఉద్యోగాలకు వెళ్లే వారు ఎండ నుంచి రక్షణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గొడుగులు, మాస్క్‌లు వాడుతున్నారు. అత్యవసరమైతే తప్పా బయటికెళ్లొద్దని, ఉదయం..సాయంత్రం మాత్రమే పనులు చూసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. నీటితోపాటు పండ్ల రసాలు తీసుకోవాలని చెబుతున్నారు.

వేడి గాలులు..
వడగాలులు, ఉక్కపోతకు తట్టుకోలేక జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు ఎండతో పాటు వేడి గాలులు వీస్తున్నాయి. ఏప్రిల్‌లోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే.. మేలో పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎండ ఇప్పుడే రోహిణిలో ఉన్నంత మండిపోతుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. ప్రతీ 2 గంటలకోసారి నీరు తాగాలని డాక్టర్లు చెబుతున్నారు. లేదంటే డీ హైడ్రేషన్‌ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 

16:59 - April 22, 2017

అమరావతి: ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరిగిపోతుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఉదయం ఏడున్నర ఎనిమిది గంటల నుంచే ప్రచండ భానుడి భగభగలు మొదలవుతున్నాయి. మండుతున్న ఎండల కారణంగా ప్రజలు రోడ్లపైకి రావడానికే జంకుతున్నారు.

ఉక్కపోత, వడగాడ్పులతో...

ఇళ్లల్లోనే ఉందామనుకున్నా.. ఉక్కపోత, వడగాడ్పులు ప్రజలను నానా అవస్థలకూ గురి చేస్తున్నాయి. వృద్ధులు, పిల్లలు, మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఎండలకు తాళలేక కొంతమంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు.

ఎండలు ఈ స్థాయిలో నమోదవడంపై ప్రజలు కలవరం...

రాష్ట్రంలో ఏప్రిల్‌ మాసంలోనే ఎండలు ఈ స్థాయిలో నమోదవడంపై ప్రజలు కలవరపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే, రాబోయే మే నెల రోహిణి కార్తెలో ఎండలు ఇంకెలా ఠారెత్తిస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. జూన్ మొదటి వారంలో వరుణుడు కరుణించేవారకూ ఎండ తీవ్రతను తట్టుకోవడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే, జూన్ లలో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని...44 నుంచి 47 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

ఏసీలు, ఫ్లాన్లకు ఫుల్ డిమాండ్ ...

ఎండలు అధికంగా ఉండడంతో ఏపీలో ఏసీలు, ఫ్లాన్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రజలు వేసవి తాపం నుంచి ఉపశమనానికి శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఎండాకాలంలో అన్ని వయస్సుల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా, వీలైనంత ఎక్కువ ఉండేలా జాగ్రత్త పడాలంటున్నారు. ఎండా కాలం ముగిసేంత వరకూ పిల్లలు, పెద్దలు , గర్భిణులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

13:34 - April 22, 2017

అదిలాబాద్ : ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మండే ఎండలకు తాళలేక జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పగలంతా వాతావరణం అగ్నిగుండంలా ఉంటోంది. వడదెబ్బలకు జనం ప్రాణాలు కోల్పోతున్నారు. కొమురం భీం జిల్లాలో పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది. సాక్షాత్తు సిర్పూరు ఎమ్మెల్యే కొనేరు కోనప్పకే వడదెబ్బ తప్పలేదు. భానుడు విజృంభిస్తున్నాడు. తీవ్రమైన వేడితో ప్రజల్ని అల్లాడిస్తున్నాడు.
45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత..
కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మండే ఎండలకు.. జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా ఉంటున్నాయి. కాగజ్‌నగర్‌, సిర్పూరు, బెజ్జూరు, దహేగాం, ఆసిఫాబాద్‌, కెరామేరి, రెబ్బెన, తిర్యాణి మండలాలలో తీవ్రమైన వేడి ప్రజలను అవస్థల పాల్జేస్తోంది. భానుడు విజృంభిస్తుండంతో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాడ్పులు ప్రజలను నానా ఇబ్బందులకూ గురి చేస్తున్నాయి. కాగజ్‌నగర్‌ లాంటి పారిశ్రామిక ప్రాంతంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. జనాలు లేక వ్యాపార కేంద్రాలు, సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి. వేడిని తట్టుకోవడానికి ప్రజలు చలివేంద్రాలను, చల్లటి పదార్థాలను ఆశ్రయిస్తున్నారు.
ఉపాధిహామీ కూలీల పరిస్థితి దయనీయం
వడగాడ్పుల కారణంగా, ఉపాధి హామీ కూలీల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎండలో పని చేయడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. చాలా మంది వడదెబ్బ తగిలి మంచం పట్టారు. ఇప్పటికే జిల్లాలో వడదెబ్బకు ముగ్గురు మరణించారు. దాదాపు 100 మంది వరకూ ఉపాధి హామీ కూలీలు వాంతులు విరోచనాలతో ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. సామాన్యులే కాదు సాక్షాత్తు సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా వడదెబ్బకు గురయ్యారు. బెజ్జూరు మండల పర్యటనలో వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన తనుచరులు కాగజ్‌ నగర్‌లోని.. ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోనప్ప కోలుకుంటున్నారు. ఎండల తీవ్రత వల్ల, శరీరంలో నీటి శాతం గణనీయంగా పడిపోతుందని, ఫలితంగా డీ హైడ్రేషన్‌కు గురై డయేరియా బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు అంటున్నారు. ఎక్కువగా నీరు తాగాలని, వీలైనంత వరకూ బయటకు వెళ్లకపోవడమే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

 

 

Pages

Don't Miss

Subscribe to RSS - High Temperatures