Hyderabad

11:27 - April 22, 2018

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలు నేటితో ముగియనున్నాయి. కాసేపట్లో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశం జరగనుంది. ఇవాళ నూతన కమిటీని, కార్యదర్శిని ఎన్నుకోనున్నారు. మహాసభల ముగింపు సందర్భంగా సాయంత్రం సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మలక్‌పేట నుంచి రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల కవాతు ప్రారంభం కానుంది. టీవీ టవర్‌ నుంచి ర్యాలీగా బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. సీపీఎం అగ్రనాయకత్వమంతా ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. 

11:21 - April 22, 2018

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని డైమండ్ హౌస్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 31 మందిపై కేసులు నమోదు చేశారు. ఒక లారీ, 13 కార్లు, 2 ఆటోలు, 18 ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

11:14 - April 22, 2018

హైదరాబాద్ : న్టీఆర్‌ స్టేడియంలో 9వరోజూ హైదరాబాద్‌ ఫెస్ట్‌ ఉత్సాహభరితంగా సాగింది. హైదరాబాద్‌  ఫెస్ట్‌కు జనం భారీగా తరలివచ్చారు. కళాకారుల ఆటపాటలు సందర్శకులను కట్టిపడేశాయి. విజ్ఞానంతోపాటు వినోదాన్ని హైదరాబాద్‌ ఫెస్ట్‌ నగర ప్రజలకు పంచుతోంది. శనివారం ఫెస్ట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ  వీసీ ఎస్వీ సత్యనారాయణ.. మనసున్న మనుషులను కలవడానిక ఫెస్ట్‌కు కొచ్చానని చెప్పారు.

హైదరాబాద్‌ ఫెస్ట్‌... ఎన్టీఆర్‌ స్టేడియంలో ఉత్సాహంగా సాగుతోంది. 9వ రోజైన శనివారం సందర్శకులకు హైదరాబాద్‌ విజ్ఞానంతోపాటు వినోదాన్ని అందించింది. సుద్దాల హన్మంతు కళావేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఉర్రూతలూగించాయి.

ఢిల్లీకి చెందిన జననాట్య మంచ్‌ కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు.. పాటలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రేక్షకులు సైతం వారితోపాటు పాటలకు డ్యాన్సులు చేస్తూ తెగ ఎంజాయ్‌ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జీవిత చరిత్రపై కళాకారులు ప్రదర్శించిన నృత్యరూపకం అందరినీ ఆలోచింప చేసింది.

హైదరాబాద్‌ ఫెస్ట్‌కు ముఖ్య అతిథులుగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీ ఎస్వీ సత్యానారాయణ, ప్రముఖ సినీనటుడు అజయ్‌గోష్‌, ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర హాజరయ్యారు. హైదరాబాద్‌ ఫెస్ట్‌ పేరుతో జరుగుతున్న జన జాతరను ప్రతి ఒక్కరూ సందర్శించాలని ఎస్వీ సత్యనారాయణ అన్నారు. మనుషులంతాకలిసి ఒకచోట చేరి మమతలు పంచుకోవాలన్నారు. ఆ మనుషులను కలవడానికే తాను హైదరాబాద్‌ ఫెస్ట్‌కు వచ్చినట్టు ఎస్వీ సత్యనారాయణ చెప్పారు.  ఇలాంటి ఉత్సవాలు నగరంలో మరిన్ని జరగాలని అభిప్రాయపడ్డారు. 

మానవ విలువలు మాయమైపోతున్న వేళ.. కులం, మతం పేరుతో మనుషులను విడదీస్తున్న వేళ.. హైదరాబాద్‌ ఫెస్ట్‌ నిర్వహించడం గొప్ప ప్రయత్నమని సినీ నటుడు అజయ్‌ ఘోష్‌ అన్నారు. హైదరాబాద్‌ ఫెస్ట్‌ అంటే విజ్ఞానం, వినోదమే కాదు.. ఒక ప్రత్యామ్నాయ వేదిక అన్నారు. మనిషిని మనిషి దోపిడీచేసే సంస్కృతి పోవాలంటే జనాన్ని చైతన్యం చేయాలని.. అందుకోసం ఇలాంటి ఫెస్ట్‌లు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.

అనంతరం హైదరాబాద్‌ ఫెస్ట్‌ విజయవంతానికి కృషి చేసిన వారందరికీ ఫెస్ట్‌ నిర్వాహకులు మెమొంటోలు అందజేశారు.  సుద్దాల హన్మంతు కళావేదికపై అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫెస్ట్‌లో స్టాళ్లను ఏర్పాటు చేసిన వారందరికీ సర్టిఫికెట్స్‌ ప్రదానం చేశారు. సాంస్కృతిక వేదికపై కళాకారులు ఆటపాటలతో అందరిలోనూ ఉత్తేజం నింపారు. ఫెస్ట్‌ నేటితో ముగియనుంది.

21:09 - April 21, 2018

హైదరాబాద్ : టాలీవుడ్‌లో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు.. సినీ పెద్దలు నడుం బిగించారు. శనివారం ఉదయం నుంచీ సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. అటు తెలంగాణ సినిమాటొగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తోనూ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఇండస్ట్రీలో కో-ఆర్డినేటర్ల వ్యవస్థ లేకుండా చేస్తామని, అన్ని వివాదాలను రెండు రోజుల్లోగా పరిష్కరిస్తామని వారు మంత్రికి తెలిపారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సాయం అందిస్తామని మంత్రి సినీ పెద్దలకు హామీ ఇచ్చారు.

నటి శ్రీరెడ్డి లేవనెత్తిన క్యాస్టింగ్‌ కౌచ్‌ వివాదం.. పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు.. తెరవెనుక పాత్రధారిని తానేనన్న దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ప్రకటనల నేపథ్యంలో.. పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం ఫిల్మ్‌ చాంబర్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు . సమస్య పరిష్కారానికి సినీ పెద్దలకు 24 గంటల గడువిచ్చారు. ఈ నేపథ్యంలో.. సినీ పెద్దలు శనివారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. భేటీ అనంతరం.. మీడియాతో కలవకుండానే వారు వెళ్లిపోయారు. నేరుగా తెలంగాణ సినిమాటొగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో సమావేశమయ్యారు.

సినీరంగంలో లైంగిక వేధింపుల అంశంపై ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘం.. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలను వివరించాలంటూ అందులో కోరింది. ఈ నేపథ్యంలో తలసాని శ్రీనివాసయాదవ్‌తో సినీ ప్రముఖుల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. టాలీవుడ్‌లో ఇప్పుడు జరుగుతున్న ఘటనలు పునరావృతంకాకుండా చూస్తామని సినీ ప్రముఖులు మంత్రికి వివరించారు. ఇండస్ట్రీలో మధ్యవర్తులు, సమన్వయ కర్తలు లేకుండా చూస్తామని చెప్పారు. ఫిర్యాదుల కోసం ఎఫ్‌డీసీలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి వారికి తెలిపారు. వివాదాన్ని కొనసాగించకుండా ఇంతటితో ఆపాలని సినీ పెద్దలకు తలసాని శ్రీనివాస యాదవ్‌ సూచించారు.

టాలీవుడ్‌లోని సమస్యలను పరిష్కరించేందుకు.. సినీ ప్రముఖులు ప్రభుత్వాన్ని రెండు రోజుల గడువు కోరినట్లు సమాచారం. తాను విధించిన గడువుపై.. సినీ ప్రముఖులు స్పందించి.. చర్చలు సాగిస్తున్న వేళ.. సంయమనం పాటించాలంటూ తన అభిమానులకు పవన్‌ కల్యాణ్‌ సూచించారు. 

19:31 - April 21, 2018

హైదరాబాద్ : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై కాషాయ నేతలు మండిపడుతున్నారు. ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ధర్మపోరాట దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలయ్య ప్రధాని మోడీని ఉద్ధేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సరియైంది కాదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఖండించకపోవడం దారుణమని, వెంటనే బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే శనివారం సాయంత్రం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని ముట్టడించేందుకు బిజెపి నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. అక్కడనే ఉన్న పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. ఇరువర్గాల మధ్య తోపులాట..వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. బాలకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ముందస్తు చర్యలో భాగంగా బాలకృష్ణ ఇంటి వద్ద రెండంచెల భధ్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. 

21:09 - April 20, 2018

హైదరాబాద్ : బీజేపీ ఓటమికి అవసరమైన విధివిధానాలపై సీపీఎం జాతీయ మహాసభ చర్చిస్తోందని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కరత్‌ తెలిపారు. పొలిట్‌బ్యూర్‌ ఆర్గనైజేషనల్‌ రిపోర్ట్‌పై శనివారం చర్చిస్తామన్న కరత్‌.. పార్టీ రాజకీయ తీర్మానం తుది దశకు వచ్చిందన్నారు. సీపీఎం జాతీయ మహాసభలు హైదరాబాద్‌లో మూడోరోజు కొనసాగాయి. వివిధ అంశాలపై సభ తీర్మానాలు చేసింది. మహాసభలో అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానం తుది రూపుకొచ్చింది. శనివారం పొలిట్‌బ్యూరో ఆర్గనైజేషనల్‌ రిపోర్ట్‌పై చర్చ ఉంటుంది. మతతత్వ ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలో సాగే బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా రాజకీయ తీర్మానంపై చర్చలు సాగుతున్నాయి.

రాజకీయ ముసాయిదా తీర్మానంపై చర్చతో పాటే సీపీఎం జాతీయ మహాసభ.. వివిధ అంశాలపై తీర్మానాలనూ ఆమోదించింది. ముఖ్యంగా.. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలపై సమావేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశంలోని సమాఖ్య స్పూర్తికి... ఆర్థిక సంఘం విధివిధానాలు విఘాతంగా పరిణమించాయని, జనాభా నియంత్రణకు కృషి చేసిన రాష్ట్రాలు ఈ విధానాల వల్ల తీవ్రంగా నష్టపోతాయని మహాసభ అభిప్రాయపడింది.

కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ.. స్వల్పకాలిక పరిమితి కలిగిన ఉద్యోగాలను ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తోందని.. దీనికి సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించాలని సీపీఎం జాతీయ మహాసభ డిమాండ్‌ చేసింది. దీంతోపాటే.. త్రిపుర రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసను మహాసభ ఖండించింది. సిరియాపై అమెరికా దాడులకు వ్యతిరేకంగానూ మహాసభ తీర్మానం చేసింది. మహాసభల వివరాలు మీడియాకు వివరించిన పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కరత్‌.. ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.. పార్లమెంటు ప్రసంగాలతో రూపొందిన.. పీపుల్స్‌ స్ట్రగుల్‌ అన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

18:09 - April 20, 2018

హైదరాబాద్ : హైదరాబాద్‌ ఫెస్ట్‌లో కేఎల్‌ యూనివర్సిటీ ఓ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు విజయవాడకే పరిమితమైన ఈ యూనివర్సిటీ హైదరాబాద్‌లోనూ బ్రాంచ్‌ ఏర్పాటు చేయనున్నట్టు సిబ్బంది చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:05 - April 20, 2018

హైదరాబాద్ : హైదరాబాద్‌ ఫెస్ట్‌ జనంతో కిటకిటలాడుతోంది. ఫెస్ట్‌ ముగియడానికి సమయం దగ్గరపడుతుండడంతో జనం భారీగా తరలివస్తున్నారు. హైదరాబాద్‌ ఫెస్ట్‌లో ఏర్పాటు చేసిన బ్రిల్లియంట్‌ స్కూల్‌ స్టాల్‌ సందర్శకులను ఆకట్టుకుంటోంది. తమ పిల్లలకు నాణ్యమైన విద్యనందించడానికి బ్రిలియంట్‌ స్కూల్‌ స్టాల్‌లో ఎంక్వైరీ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:02 - April 20, 2018

హైదరాబాద్‌ : నగర ప్రజలను హైదరాబాద్ ఫెస్ట్ విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఫెస్ట్‌కు ప్రజల తాకిడి ఎక్కువైంది. ఈ ఫెస్ట్‌లో గీతం యూనివర్సిటీ తన స్టాల్‌ను ఏర్పాటు చేసి విద్యార్థులు, తల్లిదండ్రుల అనుమానాలను నివృత్తి చేస్తోంది. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:00 - April 20, 2018

హైదరాబాద్‌ : నగరంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ ఫెస్ట్‌ ఏడవరోజు ఉత్సాహంగా సాగింది. కళాకారుల ఆటపాటలు వీక్షకులను ఉర్రూతలూగించాయి. సృజనస్వరంలో నిర్వహించిన పాటలపై చర్చ ఆలోచింపచేసింది. సైన్స్‌హబ్‌ అందరిలోనూ ఆకస్తిని రేకెత్తించింది. హైదరాబాద్‌ ఫెస్ట్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో ఉత్సాహంగా సాగుతోంది. ఈ ఫెస్ట్‌లో బాలూ హెర్బల్స్‌ ఏర్పాటు చేసిన స్టాల్‌ సందర్శకులను ఆకట్టుకుంటోంది. దీనిపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - Hyderabad