Hyderabad Citizens

21:46 - October 15, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని చిన్నా, పెద్ద ప్రాజెక్టుల్లో జలకళ వచ్చింది. పలు జిల్లాల్లో  కుండపోత వానలతో పంటలు నీటిపాలయ్యాయి. ఇటు హైదరాబాద్‌ను మరోసారి భారీవర్షం ముంచెత్తింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌ జామ్‌లతో సిటీజనం నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు బంగాళాఖాతంతో అల్పపీడనం ఏర్పడటంతో మరో 3 రోజులు ఏపీ, తెలంగాణలకు భారీవర్షాలు తప్పవని విశాఖ వాతావరణశాఖ తెలిపింది.
హైదరాబాద్‌ను వదలని వరుణుడు  
హైదరాబాద్‌ను వరుణుడు వదలడంలేదు. భారీవర్షాలు ముంచెత్తడంతో సిటీ జనం అవస్థలు పడుతున్నారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్‌, హయత్‌నగర్‌లో కుండపోతగా వర్షం కురిసింది. గత పది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం అతలాకుతలమైంది. ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో నగరంలోని ఆయా ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. అటు శివారు ప్రాంతాల్లో కూడా భారీగానే వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే డ్రైనేజీలన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. భారీవర్షాలతో  అటు  నిజమాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలు నాశనం అయ్యాయి. నిజామాబాద్‌జిల్లాలో వరిపంటను వర్షాలు దారుణంగా దెబ్బతీయగా.. కామారెడ్డి జిల్లాలో చేతికవచ్చిన పత్తిపంట నేలపాలయిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.  
ఏపీలోనూ 
ఏపీలోనూ భారీవర్షాలకు పంటలు నేలరాలాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో  ఇటీవల కురిసిన  వర్షాలకు  మొత్తం 31.161 హెక్టార్లలో వివిధ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లావ్యాప్తంగా దాదాపు 834  కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, అలాగే 365  కిలోమీటర్ల మేర పంచాయతీ రాజ్ రోడ్లు దెబ్బతిన్నాయని జిల్లా అధికారులు లెక్కలు వేశారు.  
నిండుకుండలా ఆల్మట్టీ, శ్రీరాం సాగర్, శ్రీశైలం
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ జలకళతో తొణికిసలాడుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆల్మట్టీ, శ్రీరాం సాగర్, శ్రీశైలం, సింగూరు , నిజాంసాగర్, తదితర ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ నీటితో నిండుకుండలా మారాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో నాగార్జున సాగర్‌ నీటి మట్టం అమాంతం పెరిగుతోంది.  అయితే నాగార్జున సాగర్ నిండడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అటు  నిజామాబాద్ జిల్లాలోని  శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. 
బంగాళాఖాతంలో అల్పపీడనం
ఇదిలావుంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల  భారీవర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తెలంగాణలో  ఉపరితల ఆవర్తనం కొనసాగుతూనే ఉంది. భారీగా క్యూములోనింబస్‌ మేఘాలు ఏర్పడి.. హైదరాబాద్‌తోపాటు, పలు జిల్లాల్లో మరో 3రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

 

12:40 - October 12, 2017

 

హైదరాబాద్ : ప్రతీ ఏడాది చలికాలంలో వచ్చే సీతాఫలాల కోసం నగరవాసులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ అమృతఫలానికున్న ప్రత్యేకతలు అనేకం. వీటి మధురమైన రుచి, కమ్మదనం మరే పండులోనూ దొరకదు కాబట్టి.. సీజనల్ ఫ్రూట్స్‌లో ది బెస్ట్‌ ఫ్రూట్ కస్టడ్‌ ఆపిల్. సీతాఫలం పండ్లల్లో రారాజు. దీనికున్న ఔషధ గుణాలు మరే పండుకు ఉండవంటే అతిశయోక్తి కాదు. ఇందులో ఉండే పొటాషియం కండర బలహీనతను పోగొడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. సీతాఫలాలలోని విటమిన్‌ ఎ చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఈ పళ్లు తినడం వల్ల కళ్లకూ ఎంతో మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. అజీర్ణ సమస్య తొలగించడంతో పాటు, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే దీంతో ఉన్న ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు.

అన్ని బజార్లలో సీతాఫలాల అమ్మకాలు
ప్రస్తుతం సీతాఫలాలు హైదరాబాద్‌లో విరివిగా కనిపిస్తున్నాయి. ప్రకృతి వర ప్రసాదిత సీతాఫలాలు ఊళ్లు, పల్లెలు దాటి పట్నానికి చేరుకున్నాయి. రాజధాని నగరంలోని అన్ని బజార్లలో సీతాఫలాల అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది సీతాఫలాలు త్వరగా వచ్చాయి. సాధారణమైన పళ్లు డజన్‌ 50 రూపాయలకు అమ్ముతున్నారు. ఇక ఫస్ట్‌ క్లాస్ పండ్లు డజన్‌కు 100 నుంచి 350 చొప్పున అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ సారి వర్షాలు భారీగా కురవడంతో గతేడాది కంటే.. ఫలాలు కాస్త తక్కువ సంఖ్యలో నగరానికి చేరుకుంటున్నాయి. వర్షాలు పడుతుండటంతో పండ్లల్లో నాణ్యత తక్కువగా ఉంది. దీంతో కొనుగోలుదారులు వీటిని కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. గతేడాదితో పోలిస్తే ఈ సారి అమ్మకాలు తక్కువగానే ఉన్నాయని అమ్మకందారులు అంటున్నారు.

దీపావళికి ముందే నగరానికి
పల్లెవాసులు, గిరిజనులు సీతాఫలాలను దీపావళికి ముందే నగరానికి తరలించి అమ్ముతుంటారు. కొందరికి ఇది జీవనోసాధిగా కూడా మారింది. ముఖ్యంగా కరీంనగర్‌, మెదక్‌, శామీర్‌పేట్‌, గజ్వేల్, శంషాబాద్‌, కర్తాల్‌, సిద్ధిపేట జిల్లాలకు చెందిన..100 గ్రామాల నుంచి నగరానికి సీతాఫలాలు దిగుమతవుతుంటాయి. నగరంలోని పికెట్, ఎంజీబీఎస్, కొత్తపేట్‌, కూకట్‌పల్లి, బాలానగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ తదితర ప్రధాన మార్కెట్లలో ఏడు దశాబ్దాలకు పైగా నగరవాసులు ఈ పండ్లను కొంటున్నారు. ప్రకృతిలో పుట్టి ఏ రసాయనం ఉపయోగించకుండా పండే ఫ్రూట్‌ సీతాఫలం ఒక్కటే మరి.

 

07:45 - September 12, 2017

హైదరాబాద్ : గ్రేటర్‌ వాసులకు మెట్రో ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. గత కొంత కాలంగా మెట్రో రైల్‌ నిర్మాణ పనులతో ట్రాఫిక్‌ను మళ్లించడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇందులో భాగంగా అమీర్‌పేట, సికింద్రాబాద్‌, చిలకలగూడ చౌరస్తా ఏరియాలో ట్రాఫిక్‌ను మళ్లించారు. దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే వాహనదారులు 5 కిలో మీటర్లు అదనంగా ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఒలిఫెంటా వద్ద రైల్వే ట్రాక్‌పై మెట్రో సిబ్బంది స్టీల్‌ బ్రిడ్జ్‌ నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఈ బ్రిడ్జ్‌ నిర్మాణం కోసం అధికారులు సుమారు 90 లక్షల రూపాయలు వెచ్చించారు. స్టీల్‌ బ్రిడ్జ్‌ నిర్మాణమే కాకుండా బ్రిడ్జ్‌కి ఇరువైపులా సిసి రోడ్డు నిర్మాణం చేపట్టారు. గతంలో ఈ బ్రిడ్జి కింద నుండి ప్రయాణం చేయాలంటే బురద నీటిలోనే వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం స్టీల్‌ బ్రిడ్జ్‌ నిర్మాణంతో ఆ బ్రిడ్జ్‌ కింద రోడ్డు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అధికారులు శరవేగంగా పనులు పూర్తి చేయడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మెట్రో పనులు కూడా శరవేగంగా పూర్తి కావస్తుండడంతో నగర వాసులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.

 

06:46 - June 3, 2017

హైదరాబాద్ : వర్షాకాలం వచ్చేస్తోంది. వర్షాలు ఎప్పుడైనా కురువొచ్చు. అయితే... హైదరాబాద్‌లోని నాలాల్లో పూడికతీత పనులు పూర్తి కాకపోవడంతో నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీళ్లు నిలుస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నాలాల పూడికతీత పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ.. అధికారుల నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన కొనసాగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇబ్బందులు తప్పవా అని ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు.. వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు ప్రతి ఏడాది జీహెచ్‌ఎంసీ.. ప్రధాన నాలాలు, కాలువల్లో పూడిక తీస్తుంది. ఇందుకోసం 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. అయితే ఈ ఏడాది నాలాల శుద్ధి కోసం 317 పనులుగా విభజించి టెండర్లు పిలిచారు. ఇందుకుగాను 28 కోట్ల 49 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. వీటిలో 114 పనులు మనుషుల ద్వారా.. 58 పనులు మిషన్ల ద్వారా చేయించడంతో పాటు.. మిగిలిన వాటిని ఇతర మార్గాల ద్వారా చేయించాలని నిర్ణయించారు. ఈ పనులన్నీ మే 31 వరకు పూర్తి చేయాల్సి ఉంది. కానీ.. ఇప్పటివరకు కేవలం 56 శాతం పనులు మాత్రమే పూర్తి అయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో సౌత్‌జోన్‌లో 90 శాతం పనులు కాగా.. ఈస్ట్‌జోన్‌లో 76 శాతం, నార్త్‌జోన్‌లో 63 శాతం, వెస్ట్‌జోన్‌లో 39 శాతం పనులు పూర్తయ్యాయి. సెంట్రల్‌ జోన్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కేవలం 32 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.

పలువురు అధికారుల సస్పెన్షన్..
గతేడాది వర్షాకాలం ఇబ్బందుల సమయంలో ఏడాది పొడవునా నాలాల్లో పూడికతీత పనులు చేస్తామని మంత్రితో పాటు.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ చెప్పారు. కానీ.. పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. పైగా నాలాల్లో పూడికతీత వ్యవహారంలో భారీ కుంభకోణం బయటపడింది. 18 మంది కాంట్రాక్టర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు కాగా... 12 మంది అసిస్టెంట్‌ ఇంజనీర్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. అయినా కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పనులు నత్తనడకన కొనసాగుతుండడంపై నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మాటలు చెప్పడం మానేసి చేతల్లో చూపించాలంటున్నారు. మరీ.. జీహెచ్‌ఎంసీ నాలాల పూడికతీత పనుల్లో వేగం పెంచుతుందా.. లేక ప్రతి ఏడాది మాదిరిగానే నగరవాసులను ఇబ్బందికి గురి చేస్తుందా.. చూడాలి !

06:55 - April 24, 2017

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌లో 9 లక్షల 12 వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. నగరంలో చాలా చోట్ల రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతుంది. ఇది వేసవి కాలంలో అయితే ఎప్పుడు నీళ్లు వస్తాయో అర్ధం కాని పరిస్థితి. కానీ ప్రస్తుతం జలమండలి తీరు ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. నీళ్లు సక్రమంగా రాకపోయినా.. నీటి బిల్లులు మాత్రం భారీగా పంపిస్తున్నారు.

జలమండలి అధికారులపై నగరవాసులు ఆగ్రహం.....

జలమండలి అధికారులపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో కనెక్షన్‌పై 500 నుంచి 800 రూపాయల వరకు అధికంగా బిల్లులు బాదుతున్నారని ప్రజలంటున్నారు. మరోవైపు పని చేయని నీటి కనెక్షన్లకు సైతం బిల్లులు వసూలు చేస్తున్నారంటున్నారు. వినియోగించిన నీటి పరిమాణం ఆధారంగానే నీటి బిల్లులు వేయాల్సి ఉన్నప్పటికీ.. నీళ్లు విడిచిన సమయం ప్రకారం.. వాటర్‌ రాకపోయినా బిల్లులు వసూలు చేయడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాలనా సౌలభ్యం కోసం గ్రేటర్‌ను జలమండలి ని...

మరోవైపు పాలనా సౌలభ్యం కోసం గ్రేటర్‌ను జలమండలి 5,545 డాకెట్లుగా విభజించింది. ఎక్కువ లేదా తక్కువ నీళ్లు వాడుకున్నా సరే బిల్లు మాత్రం ఒకే విధంగా అధికారులు వసూలు చేస్తున్నారు. ప్రతినెలా నీటి చార్జీల కింద జలమండలి కోట్ల రూపాయలు వసూలు చేస్తోంది. ప్రజలపై 10 కోట్ల మేర అదనపు భారం పడుతుందంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి.. ప్రతిరోజు నీళ్లు సరఫరా చేయడంతో పాటు.. బిల్లులు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

06:52 - March 5, 2017

హైదరాబాద్ : మీరు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు..అన్న చందంగా ఉంది హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం వ్యవహారం. మెట్రో రైలు ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందా.. అంటూ ఎదురు చూస్తున్న జంటనగరాల ప్రజల ఆశలు ఇప్పట్లో నెరవేరే అవకాశాలు కనిపించడంలేదు. నత్తనగడకన సాగుతున్న పనులు ఊపందుకుంటే మరో పది నెలల తర్వాతే మెట్రో పరుగులు తీసే చాన్స్‌ ఉంది. లేకపోతే మరింత జ్యాపం తప్పదని భావిస్తున్నారు. మెట్రో రైలు ప్రయాణంపై జంటనగరాల ప్రజలు పెట్టుకున్న ఆశలు ఇప్పట్లో నెరవేరే అవకాశం కనిపించడలేందు. ప్రాజెక్టు పనులు నత్తనడన సాగుతున్నాయి. జాప్యంతో మెట్రో రైలు ఇప్పట్లో కూతపెట్టే అవకాశాలు లేవు. మెట్రో రైలు వస్తే ట్రాఫిక్‌ కష్టాలు గెట్టెక్కుతాయనుకుంటున్న వాహనచోదకుల ఎదురు చూపులు మరింతకాలం తప్పదని భావిస్తున్నారు.

గత ఏడాది జూన్‌ 2న ప్రారంభింస్తామన్న ప్రభుత్వం..
దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం.. పీపీపీ.. పద్ధతిలో సాగుతున్న మొదటి ప్రాజెక్టు హైదరాబాద్‌ మెట్రో రైలు. మెట్రో రైలు నిర్మాణం చేస్తున్న ఎల్‌ అండ్‌ టీ సంస్థ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఏడాది జులై నాటికి మూడు కారిడార్లలో 72 కిలో మీటర్లు మెట్రో రైలు పరుగులు తీయాల్సి ఉంది. కానీ జరుగుతున్న పనులను పరిశీలిస్తే ఒక్కమార్గంలో మెట్రో ప్రయాణించే అవకాశాలు కనిపించడంలేదు. ప్రారంభంలో వేగంగా జరిగిన మెట్రో పనులు..వివిధ కారణాలతో ఆ తర్వాత మందగించాయి. సుల్తాన్‌ బజార్‌, పాతబస్తీ, మొజాంజాహీ మార్కెట్‌, అసెంబ్లీ వంటి ప్రాంతాల్లో అలైన్‌మెంట్‌ మార్పులు, నిర్మాణానికి అవసవమైన భూసేకరణ జరగకపోవడం వంటి కారణాలతో నడకనసాగుతోంది. ప్రభుత్వంతో ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే పనులు చేపట్టాని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్ణయించినా...పనులు వేగం పుంజుకోలేదు. పనులు పూర్తైన మియాపూర్‌-ఎస్‌ఆర్‌ నగర్‌, నాగోలు-మెటుగూడ మార్గాల్లో గత ఏడాది జూన్‌ 2 నాటికే మెట్రో రైళ్లను నడపాలనుకున్నా అదీ నెరవేరలేదు.

పాతబస్తీలో..
పూర్తైన మార్గాల్లో మెట్రో రైళ్లను నడిపే విషయంలో అధికారులు ఇప్పుడు మరో ప్రజలకు ఆశలు కల్పిస్తున్నారు. ముందుగా మియాపూర్‌-ఎస్‌ఆర్‌ నగర్‌ మధ్య 11 కి.మీ. మార్గాలన్ని ప్రారంభిస్తామంటున్నారు. నాగోలు-శిల్పారామం మార్గం బేగంపేట వరకు పూర్తి చేసిన 16 కి మీ.మార్గాన్ని రెండో దశలో మెట్రో రైళ్లను నడపాలని ప్రతిపాదిస్తున్నారు. సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం సమీపంలోని ఆలుగడ్డబావి వద్ద ఆర్వోబీ, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఓలిఫెంటా బ్రిడ్జి దగ్గర స్టీలు బ్రిడ్జి నిర్మాణ పనులు జాగుతున్నాయి. అయితే నాగోలు-బేగంపేట మార్గంలో జరుగుతున్న పనులను పరిశీలిస్తే అధికారులు చెబుతున్న విధంగాఈ ఏడాదిలోగా మెట్రో రైలు కూతపెట్టే అవకాశంలేదని జనం భావిస్తున్నారు. ఇక మూడో కారిడార్‌ ఫలక్‌నుమా-జేబీఎస్‌ మార్గంలో మెట్రో రైళ్లు ఎప్పుడు నడిచేది ఎవరూ స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొనివుంది. పదిహేను కిలో మీటర్ల ఈ మార్గాన్ని ఈ ఏదాడి జనవరి నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా, మరో రెండేళ్లలో కూడా కంప్లీటయ్యే అవకాశాలు లేవు. పాతబస్తీలో మెట్రో మార్గం నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ఇంకా పూర్తికాలేదు. రైట్‌ ఆఫ్‌ వే ఇవ్వకుండా పనులు చేపట్టలేమని ఎల్‌ అండ్‌ టీ నిర్మాణ సంస్థ అధికారులు చెబుతున్నారు. జాప్యానికి ప్రభుత్వమే కారణమంటూ ఇందుకు పరిహారం కూడా చెల్లించాలన్న వాదాన్ని నిర్మాణ సంస్థ లేవనెత్తుతోంది. ఈ కారణంగా ఒప్పందం గడువును కూడా వచ్చే ఏడాది డిసెంబర్‌ వరకు ప్రభుత్వం పొడిగించింది. హైదరాబాద్‌ మెట్రో రైలు అధికారులు చెబుతున్నట్టు ఈ ఏడాదిలో మెట్రో కూతపెడితే మంచిదేనని ప్రజలు అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం, ఎల్‌ అండ్‌ టీ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

06:35 - February 27, 2017

హైదరాబాద్‌ : అజంపురాలోని నాలా ఒడ్డున మొసలి పిల్ల ప్రత్యక్షమైంది. మొసలి పిల్లను చూసి స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. వెంటనే చాదర్‌ఘాట్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన జూ అధికారులు... మొసలిపిల్లను పట్టుకుని "జూ''కు తరలించారు. అయితే.. నాలాలో మొసలి పిల్ల బయటపడడంతో ఇంకా మొసళ్లు ఉండొచ్చుననే అనుమానం స్థానికులను వెంటాడుతోంది.

12:49 - January 12, 2017

హైదరాబాద్ : చిన్న పని కోసం చెప్పులు అరిగేలా తిరగాలి.. పైసలు లేనిదే పనులు కావు... జీహెచ్‌ఎంసీలో జరుగుతున్న తీరుపై సాక్ష్యాత్తు సీఎం కేసీఆర్‌ అన్న మాటలివి. గ్రేటర్‌ వాసుల సమస్యల పరిష్కారం అవ్వాలంటే అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని.. అవినీతి లేని పాలన సాగాలని పిలుపునిచ్చారు. అందుకు తగ్గట్టుగా గ్రేటర్‌ పరిధిలో సర్కిళ్లను  పెంచింది. అయితే వాటికి అధికారాలు ఇవ్వడంలో.. కార్యాలయాలను ఏర్పాటు చేయడంలో మాత్రం అలసత్వం వహిస్తోంది. 
గ్రేట‌ర్ ప‌రిధిలో స‌ర్కిళ్ల  పెంపు 
గ్రేట‌ర్ ప‌రిధిలో ఉన్న కోటి మంది జ‌నాభాకు మెరుగైన సేవ‌లు అందించాలంటే ప్రస్తుతం ఉన్నపాల‌న‌ను పూర్తిగా మార్చాల‌ని డిసైడ్ చేసింది ప్రభుత్వం. అందులో భాగంగానే గ్రేట‌ర్ ప‌రిధిలో ఉన్న స‌ర్కిళ్లను భారీగా పెంచి ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి వ‌ర‌కు ప‌నిచేసేలా ప్లాన్‌ చేసింది. అందులో భాగంగానే 18గా ఉన్న గ్రేట‌ర్ స‌ర్కిళ్లను కొద్ది నెలల వ్యవధిలో 30 స‌ర్కిళ్లకు పెంచింది. అందుకు అనుగుణంగా అధికారుల‌ను సిబ్బందిని కేటాయించి సిటిజ‌న్స్ ప‌నులు పెండింగ్ లో ఉండ‌కుండా చూడాలని అధికారుల‌ను ఆదేశించింది ప్రభుత్వం.
ప్రభుత్వ ఆదేశాలు అమ‌లు కావ‌డం లేదు 
ఇంత వ‌ర‌కు భాగానే ఉంది కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు గ్రేట‌ర్ లో అమ‌లు కావ‌డం లేదు. స‌ర్కిళ్ల సంఖ్యను పెంచి మూడు నెల‌లు పూర్తి కావ‌స్తున్నా పూర్తిస్థాయిలో అధికారుల‌ను కేటాయించలేదు.  కొంద‌రు అధికారుల‌ను ట్రాన్స్ ఫ‌ర్ చేసినా ఇప్పటికీ వారు అక్కడ విధుల్లో చేరలేదు. కొన్ని చోట్ల అర‌కొరగా అధికారులు  నియ‌మించ‌బ‌డ్డప్పటికీ కార్యాల‌యాలు మాత్రం పాత ఆఫిసుల్లోనే కొన‌సాగుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన స‌ర్కిళ్లకు కొత్త కార్యాల‌యాల‌ను కేటాయించ‌డంలో మాత్రం బ‌ల్దియా ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విఫ‌ల‌మ‌య్యారు. 
నలుగురు డిప్యూటి క‌మీష‌న‌ర్లకు అద‌న‌పు బాధ్యతలు 
ఇక అధికారుల కేటాయింపు విష‌యంలోనూ పూర్తి స్థాయిలో పంపిణీ చేయడం లేదు. నలుగురు డిప్యూటి క‌మీష‌న‌ర్లకు అద‌న‌పు బాధ్యతలు ఇచ్చారు. స‌ర్కిల్ కు ఉండాల్సిన స్టాఫ్ కంటే చాలా మంది త‌క్కువ‌గా ఉన్నా రెగ్యులర్‌  స్టాఫ్‌ మాట ప‌క్కన పెడితే కనీసం కాంట్రాక్టు ఉద్యోగుల‌ను కూడా నియ‌మించ‌లేదు. దీంతో ఉన్న త‌క్కువ మంది సిబ్బందితోనే కొత్త పాత, స‌ర్కిళ్ల అధికారులు ప‌నులు చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న చాలా స‌ర్కిల్ కార్యాల‌యాలు ప్రజ‌ల‌కు దూరంగా ఉంటున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన స‌ర్కిళ్లకు ఆయా ప్రాంతాల్లోనే పెద్ద పెద్ద వార్డు ఆఫీసులు అందుబాటులో ఉన్నాయి. 
కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్న నగరవాసులు 
ఎక్కువ స‌ర్కిళ్లు ఎక్కువ మంది అధికారులు ఉంటే ప‌నులు వేగంగా జ‌రిగి ఎలాంటి అవినీతికి తావు ఉండ‌ద‌ని ప్రభుత్వం భావించినప్పటికీ.. ప‌రిస్థితిలో ఎలాంటి మార్పులేద‌నే విమ‌ర్శలున్నాయి. ఎప్పటి లాగే కార్యాల‌యాల చుట్టు చెప్పుల‌రిగేలా తిరుగాల్సి వ‌స్తుందంటున్నారు నగరవాసులు. ఇప్పటికైనా కొత్తగా ఏర్పాటు చేసిన సర్కిళ్లకు పూర్తి స్థాయిలో అధికారులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలందరికి సమీపంలో ఉండే ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నగర వాసులు కోరుతున్నారు. 

 

09:38 - December 20, 2016

హైదరాబాద్ : ఆర్థికలోటు నుంచి బయటడి..ఆదాయం పెంచుకోవడంపై జీహెచ్‌ఎంసీ దృష్టి పెట్టింది. ఇందుకోసం సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. ప్రాపర్టీటాక్స్, ట్రేడ్‌ లైసెన్స్ పేమెంట్స్‌ను ఆన్‌లైన్‌లో చెల్లించిన వారికి మెగా లక్కీ డ్రా ప్రకటించింది. తద్వారా నగరవాసుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఆదాయం పెంచడంపై జీహెచ్‌ఎంసీ దృష్టి
నోట్లరద్దుతో పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుల కోసం జీహెచ్‌ఎంసీ చేసిన ప్రయత్నం ఫలించింది. బంపర్‌ ఆఫర్ పేరుతో బల్దియా ప్రకటించిన స్కీమ్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పన్నులు చెల్లించిన వారికి నగదు బహుమతులు అందజేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది.

లక్కీడ్రా ద్వారా విజేతలను ప్రకటించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్
జీహెచ్‌ఎంసీ ప్రారంభించిన ఆన్‌లైన్‌ చెల్లింపులకు వస్తోన్న అనూహ్య స్పందనపై కమిషనర్ జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గత వారం రోజుల్లో ఆన్‌లైన్‌లో పన్నులు చెల్లించని వారి సంఖ్య 23 శాతం పెరిగిందని తెలిపారు. పన్నులు చెల్లించిన వారిలో లక్కీ డ్రా ద్వారా విజేతలను ప్రకటించారు. అల్వాల్‌కు చెందిన రాజేష్‌కుమార్‌కి 50 వేల రూపాయల నగదు బహుమతి లభించింది. అలాగే 10 వేల బహుమతులు రెండు, 2 వేల 500 రూపాయల బహుమతులు 8 మందికి ప్రకటించారు. మరో 8 మందికి 2వేల 500 కన్సలేషన్ బహుతులు ప్రకటించారు.

లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన వారితో ఫోన్ చేసిన కమిషనర్
లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన వారితో కమిషనర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఆన్‌లైన్ విధానాన్ని ఎన్నుకోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్ చెల్లింపులపై నగర ప్రజల్లో ఎంత మేర అవగాహన ఉందో తెలుసుకునేందుకు ఆయన ప్రయత్నించారు.

మరింత అభివృద్ది యత్నిస్తున్నాం : జనార్థన్ రెడ్డి
బల్దియాలోని అవకతవకలను సరిచేసి..మరింత అభివృద్ది సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని కమిషనర్ తెలిపారు. అందులో భాగంగానే ఫోర్జరీ సంతకాలు చేసి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ తయారు చేసిన వారిపై కేసులు నమోదు చేసి, విచారిస్తున్నామన్నారు. జీహెచ్‌ఎంసీని అవినీతిరహితంగా మార్చేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. 

11:06 - November 17, 2016

హైదరాబాద్ : బ‌ల్దియా అధికారుల చ‌ర్యల‌పై మున్సిప‌ల్ శాఖ‌మంత్రి కేటిఆర్ మ‌రోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. న‌గ‌రంలో రోడ్ల అభివృద్ది, ప్రజా ర‌వాణ‌ా, జంక్షన్ల డెవ‌ల‌ప్‌మెంట్‌పై దృష్టి సారించాల‌ని ఆధికారుల‌ను ఆదేశించారు.  స‌మ‌గ్ర రోడ్ల అభివృద్ది ప్రణాళిక అమ‌లుతోపాటు ప్రస్తుతం జ‌రుగుతున్న వైట్ టాపింగ్ రోడ్ల ప‌నుల‌ను కేటీఆర్ స‌మీక్షించారు.
అధికారులతో కేటీఆర్ సమీక్ష సమావేశం 
గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ పై  మంత్రి కేటీఆర్ ఫోక‌స్ పెట్టారు. న‌గ‌ర ప‌రిధిలోని ప్రభుత్వ శాఖ‌ల ఉన్నతాధికారుల‌తో  మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ది  కేంద్రంలో అధికారులతో కేటీఆర్  స‌మీక్ష స‌మావేశం నిర్వహించారు. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు  దెబ్బతిన్న రోడ్ల మ‌ర‌మ్మత్తుల‌ను 75కోట్ల రూపాయ‌ల‌తో అనుమతిచ్చిన 489 ప‌నుల్లో ఎన్ని ప‌నులు పూర్తయ్యయో అధికారుల‌ను అడిగితెల‌ుసుకున్నారు. 
రెగ్యులర్‌గా ఇబ్బందులు పునరావృతం కావద్దోన్న కేటీఆర్
ఇకపై ఇలాంటి ఇబ్బందులు  పున‌రావృతం కావ‌ద్దని, రెగ్యుల‌ర్‌గా వాట‌ర్ లాగింగ్ ప్రాంతాలు, లోత‌ట్టు ప్రాంతాల‌లో తిరిగి రోడ్లు దెబ్బతిన‌కుండా స్పెష‌ల్ ప్లాన్ రూపోందించాల‌ని మంత్రి కేటిఆర్ అధికారులను ఆదేశించారు. న‌గ‌రంలో రోడ్ల నిర్వహణ మ‌రింత స‌మ‌ర్థవంతంగా నిర్వహించేందుకు త‌గుచ‌ర్యలు తీసుకోవాల‌న్నారు. గ్రేట‌ర్ లో 480 లేన్ కిలోమీట‌ర్ల మేరా 1,275 కోట్ల రూపాయ‌లతో నిర్మించే వైట్‌టాపింగ్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక‌లు రూపొందించామ‌న్నారు.  మొద‌టి ద‌శ‌లో ర‌ద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల‌లో ఈ ప‌నులు చెప‌ట్టాల‌న్నారు. వ‌చ్చే వ‌ర్షాకాలంలోపు ఈ  వైట్‌టాపింగ్ రోడ్లు, క్యారేజి వే నిర్మాణాన్ని పూర్తిచేసేలా చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు.  
ఎస్‌.ఆర్‌.డి.పి ప్రాజెక్ట్ పై సమీక్ష 
న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల‌లో  2,631 కోట్ల  వ్యయంతో నిర్మిస్తున్న ఎస్‌.ఆర్‌.డి.పి ప్రాజెక్ట్ ప‌నుల‌ను మంత్రి కేటీఆర్ స‌మీక్షించారు.  ఐదు ప్యాకేజీల్లో ప్యాకేజి ప‌నికి  సంబంధించి నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్‌లో కొన‌సాగుతున్న కేసు త్వరిత‌గ‌తిన పూర్తయ్యేలా త‌గు చ‌ర్యలు  తీసుకోవాల‌న్నారు. ప్యాకేజి -2 కింద కామినేని జంక్షన్ వ‌ద్ద చేప‌ట్టిన ప‌నులకు అడ్డంకిగా ఉన్న  జ‌ల‌మండ‌లి వాట‌ర్ పైప్‌లైన్లు వెంట‌నే తొల‌గించాల‌ని వాట‌ర్ బోర్డు అధికారుల‌ను ఆదేశించారు. ఉప్పల్ జంక్షన్, ర‌సూల్‌పురాలో కేంద్ర ప్రభుత్వ సంస్థల‌కు చెందిన భూములు సేక‌రించాల్సి ఉన్నందున ఈ నెల 21న సంబంధిత కేంద్ర మంత్రుల‌తో మాట్లాడి లైన్ క్లియ‌ర్ చేస్తామ‌ని  మంత్రి  కేటీఆర్ చెప్పారు. ఇక జూబ్లీహిల్స్ రోడ్ నెం: 45ను క‌మ‌ర్షియ‌ల్ రోడ్‌గా ప్రక‌టించిన నేప‌థ్యంలో జూబ్లీహిల్స్ బాల‌కృష్ణ ఇంటి వ‌ద్ద నుండి పాత బొంబాయి హైవే మార్గంలో ఎలివేటెడ్  కారిడార్‌ను నిర్మించేందుకు ప్రణాళిక‌లు సిద్దం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.   

Don't Miss

Subscribe to RSS - Hyderabad Citizens