Hyderabad Task force Police

06:32 - August 29, 2018

హైదరాబాద్ : ప్రధాని మోదీ హత్య కుట్ర కేసులో అరెస్ట్‌ చేసిన విరసం నేత వరవరరావును.. పోలీసులు ఈరోజు పుణె కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిన్న ఉదయం హైదరాబాద్‌లోని వరవరరావు నివాసంలో సోదాలు నిర్వహించి... అనంతరం అరెస్ట్‌ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు సూచనల మేరకు పుణె తరలించారు. ప్రధాని మోదీని హత్య చేసేందుకు మావోయిస్టులు చేసిన కుట్రలో వరవరరావు పేరు ఉన్నట్లు గతంలో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు మావోయిస్టులు రాసిన లేఖలో వరవరరావు పేరు ఉన్నట్లు గుర్తించిన పుణె పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

హైదరాబాద్‌లోని వరవరరావు నివాసంలో సోదాలు చేసిన పోలీసుల.. ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, సాహిత్య పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుంటే తమను ఏడు గంటల పాటు నిర్బంధించి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని వరవరరావు సతీమణి హేమలత ఆరోపించారు. కనీసం మంచినీళ్లు, టీ కూడా తాగేందుకు అనుమతివ్వలేదన్నారు. ఇక వరవరరావుపై పోలీసులు ఉపా చట్టం కింద కేసులు నమోదు చేశారు. దేశంలో ఐదుగురిపై మాత్రమే ఈ యాక్ట్‌ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ యాక్ట్‌లో ఉన్న సెక్షన్‌ 15, 16, 17 కింద కేసు నిరూపితమైతే టెర్రరిస్ట్‌గా భావించి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపులంటున్నారు. 

వరవరరావు అరెస్టును ప్రజాసంఘాలు, సీపీఎం పార్టీ నేతలు ఖండించారు. వరవరరావుపై కుట్రపూరిత కేసును ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. వరవరరావుపై తప్పుడు అభియోగాలు మోపి భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వరవరరావు గొంతు నొక్కడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.  మూడు నెలల కింద దొరికిన లేఖను ఇప్పుడు ప్రస్తావించి పోలీసులు అరెస్ట్‌ చేయడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

15:41 - August 28, 2018

హైదరాబాద్ : విరసం నేత వరవరరావును పూణె పోలీసులు అరెస్టు చేశారు. సోదాలు ముగిసినంతరం వరవరరావును అదుపులోకి తీసుకుని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్సలు చేసిన అనంతరం ఆయన్ను నాంపల్లి కోర్టుకు తరలించారు. ఇక్కడి నుండి పూణెకు వరవరరావును తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. మోడీ హత్య కేసులో భాగంగా పూణె పోలీసులు నగరానికి చేరుకుని వరవరావు, ఆయన కూతుళ్ల నివాసాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. సుమారు 7గంటల పాటు విచారించారని, మావోయిస్టుల లేఖలో ఆయన పేరు ఉన్నందునే వేధిస్తున్నట్లు వరవరరావు సతీమణి ఆవేదన వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:37 - July 10, 2018

హైదరాబాద్ : కత్తి మహేష్‌పై విధించిన నగర బహిష్కరణను డీజీపీ వెంటనే ఎత్తివేయాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ డిమాండ్‌ చేశారు. ఇది నగర బహిష్కరణ కాదని.. కుల బహిష్కరణగానే తాము భావిస్తున్నామన్నారు. కత్తి మహేష్‌ వ్యాఖ్యలు భావ ప్రకటన స్వేచ్చను అధిగమించినట్లయితే... దళిత, గిరిజనులను అవమానిస్తూ వ్యాఖ్యానించిన వారిపై డీజీపీ చర్యలు తీసుకోగలరా ? అని మందకృష్ణ ప్రశ్నించారు. ఇక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కోసం ఆగస్టు 8న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో సింహగర్జన నిర్వహించనున్నట్లు మందకృష్ణ తెలిపారు. 

21:44 - July 9, 2018

హైదరాబాద్ : కత్తి మహేష్‌ను హైదరాబాద్‌ నగరం నుంచి బహిష్కరించారు పోలీసులు. హిందూ ధర్మంపై కత్తి మహేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. హిందూ ధార్మిక సంఘాలు ఆందోళనలకు దిగాయి. అంతేకాకుండా భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేశాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. నగరంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా కత్తి మహేష్‌ను నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు.

వివాదాస్పద వ్యాఖ్యల కత్తి మహేశ్ పై చర్యలు
గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యల చేస్తున్న సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్‌ నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. తమ అనుమతి లేకుండా హైదరాబాద్‌లోకి అడుగు పెట్టవద్దని ఆదేశించారు. అంతేకాకుండా కత్తి మహేష్‌ను అదుపులోకి తీసుకుని ఏపీ పోలీసులకు అప్పగించారు.

కత్తి మహేష్‌పై నగర బహిష్కరణ వేటు
కత్తి మహేష్‌, హిందూ ధార్మిక సంఘాల ఆందోళనల నేపథ్యంలో... డీజీపీ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సమాజంలో అలజడి సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్న కత్తి మహేష్‌ను ఆరు నెలలపాటు హైదరాబాద్‌ నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. నగరానికి రావాలంటే తమ అనుమతి తీసుకోవాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

పరిపూర్ణానంద యాదాద్రి పాదయాత్రకు పోలీసుల అనుమతి నిరాకరణ
గత కొన్ని రోజుల క్రితం కత్తి మహేష్‌ హిందూ ధర్మాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని.. గడ్డం శ్రీధర్‌ అనే వ్యక్తి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కత్తి మహేష్‌ను పీఎస్‌కు పిలిపించి స్టేట్‌మెంట్‌ తీసుకుని పంపించి వేశారు. అయితే.. కత్తి మహేష్‌ వ్యాఖ్యలపై హిందూ ధార్మిక సంఘాలు మండిపడ్డాయి. హిందూ ధర్మాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ... శ్రీపీఠం అధిపతి పరిపూర్ణనంద స్వామి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నుంచి యాదాద్రికి పాదయాత్ర చేపట్టేందుకు సిద్దమయ్యారు. దీంతో సోమవారం ఉదయం నుంచే హైదరాబాద్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పరిపూర్ణనంద ఇంటికి చేరుకుని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. బయటకు వెళ్లకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిపూర్ణానందకు మద్దతుగా హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

పోలీసుల తీరుపై పరిపూర్ణానంద అసంతృప్తి
ఇక తనను హౌస్‌ అరెస్ట్‌ చేయడంపై పరిపూర్ణానంద అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులతో కలిసి వెళ్లడానికి పోలీసులు అనుమతివ్వకపోతే... ధర్మాగ్రహా యాత్రను నిర్వహించేందుకు తానొక్కడికి అనుమతివ్వాలని లేనిపక్షంలో అన్నపానీయాలు మానేస్తానని హెచ్చరించారు. తనకు మద్దతు ఇచ్చేందుకు వచ్చిన వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారని.. వారిని బేషరతుగా విడుదల చేయాలని పరిపూర్ణానంద డిమాండ్‌ చేశారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం : డీజీపీ మహేందర్‌రెడ్డి
హైదరాబాద్‌కు ఎవరైనా రావొచ్చు.. జీవించవచ్చని.. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం సహించేది లేదని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. మొత్తానికి రాష్ట్రంలో ఎలాంటి ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే పోలీసులు ప్రతిస్పందించారు. దీనిపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

 

15:42 - July 9, 2018

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌లోని స్వామి పరిపూర్ణానంద స్వామి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిపూర్ణనంద స్వామిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అయితే ధర్మాగ్రహ యాత్రకు వచ్చిన బజరంగదళ్‌, విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఆప్రాంతంలోతీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

13:11 - July 9, 2018

హైదరాబాద్ : శ్రీరాముడిపై సినీ క్రిటిక్ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కత్తి మహేష్ వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్మ యాత్ర చేస్తానన్న స్వామి పరిపూర్ణానంద స్వామిని గృహ నిర్భందం చేయడం..కత్తి మహేష్ ను నగర బహిష్కరణ చేయడం వంటి పరిణామాలు జరిగాయి. కత్తి మహేష్ ను ఏపీ పోలీసులు చిత్తూరు జిల్లాకు తరలించారు.

మరోవైపు పరిపూర్ణానంద స్వామి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన్ను గృహ నిర్భందం చేయడంతో వీహెచ్ పీ..భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని వారించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. 

12:07 - July 9, 2018

హైదరాబాద్ : శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడంటూ సినీ క్రిటిక్ కత్తి మహేష్ ను నగర బహిష్కరణ వేటు వేశారు. సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు కత్తి మహేష్ కు నోటీసు ఇచ్చి ఏపీ పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆయన సొంత గ్రామమైన చిత్తూరు జిల్లాకు తరలించారు. కాసేపట్లో కత్తి మహేష్ చిత్తూరుకు చేరుకోనున్నారు.

గత కొన్ని రోజులుగా కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని..వెంటనే కత్తి మహేష్ ను అరెస్టు చేయాలంటూ డిమాండ్ వినిపించాయి. శాంతిభధ్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే పేరిట కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు వేశారు. పోలీసుల అనుమతి తీసుకుని హైదరాబాద్ కు రావాలని సూచించారు. 

11:14 - July 9, 2018

హైదరాబాద్ : పరిపూర్ణానంద స్వామిని పోలీసులు ఇంటి నుండి బయటకు రానివ్వడం లేదు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసానికి సోమవారం వచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు గృహ నిర్భందం చేశారు. హిందూ ధర్మ యాత్రకు అనుమతి లేదని రాచకొండ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నుండి యాదాద్రి వరకు ఆయన యాత్ర చేపడితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సినీ క్రిటిక్ మహేష్ కత్తి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తాను హిందూ ధర్మ యాత్ర చేపడుతానని ఆదివారం పరిపూర్ణానంద స్వామి వెల్లడించిన సంగతి తెలిసిందే. బోడుప్పల్ నుండి యాదాద్రి వరకు ఈ యాత్ర ఉంటుందని..హిందువులందరూ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీనితో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

11:12 - July 9, 2018

హైదరాబాద్ : సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు పడింది. ఆయన్ను నగరం నుండి బహిష్కరిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఆయన్ను ఏపీ పోలీసులకు అప్పచెప్పారు. ఇటీవలే శ్రీరాముడి విషయంలో కత్తి మహేష్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం రేగింది. కత్తి మహేష్ పై వెంటనే అరెస్టు చేయాలని..చర్యలు తీసుకోవాలంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో ఆయన్ను అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు విచారించారు. అనంతరం ఆయన్ను వదిలిపెట్టారు. కత్తి మహేష్ వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్మాగ్రహ యాత్ర చేపడుతానని పరిపూర్ణనాంద స్వామి హెచ్చరించారు. 

Don't Miss

Subscribe to RSS - Hyderabad Task force Police