ias officers

11:49 - June 20, 2017

గుంటూరు : ఏపీలో ఐపీఎస్‌ల బదిలీల లిస్ట్‌ రెడీ అయింది. బదిలీల నేపథ్యంలో ఐపీఎస్‌లతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎస్పీలు, రేంజ్‌ డిజీలు, జోనల్‌ ఐజీలతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. అధికారుల సమర్ధత, పని తీరుపైన నివేదిక తెప్పించుకున్నారు. భేటీ అనంతరం బదిలీల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. 

18:54 - May 18, 2017

హైదరాబాద్: బంగారు తెలంగాణ సాధించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగా కొత్త పథకాలు, ప్రాజెక్టులను ప్రారంభిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో వీటిని అమలు చేసేందుకు అధికార యంత్రాంగం లేక పాలకులు అల్లాడుతున్నారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధనకు తూట్లు పడుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పాలకులు తీసుకునే నిర్ణయాల అమలు బాధ్యత అధికారులదే

ప్రభుత్వ పాలనలో కార్యనిర్వాహక వర్గానిదే కీలకపాత్ర. పాలకులు తీసుకునే నిర్ణయాలను అమలు చేసే బాధ్యత అధికార యంత్రానిదే. ప్రభుత్వ పథకాలు అమల్లో వీరిదే ముఖ్య భూమిక. దిగువ స్థాయిలో అటెండర్‌ నుంచి కార్యనిర్వాహక వర్గం అధిపతిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు ఎవరి బాధ్యతలు వారికి ఉన్నాయి. అందరూ సమన్వయంతో పని చేస్తేనే ఫలితాలు వస్తాయి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరతాయి. ప్రాజెక్టులు అమలవుతాయి. కానీ తెలంగాణ పాలన ఇందుకు విరుద్ధంగా సాగుతోంది. అధికారుల కొరతతో పాలన కుంటుపడుతోంది.

ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబాకర్‌...

పథకాలు, ప్రాజెక్టులు పెరుగుతున్న విధంగా అధికారులు పెరగడంలేదు. ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబాకర్‌, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు..ఇలా పథకాలన్నీ ప్రజలతో ముడిపడి ఉన్నవే. వీటి అమల్లో రెవెన్యూ యంత్రాంగానిదే కీలక బాధ్యత. అటువంటి రెవెన్యూ శాఖలో గ్రామ స్థాయిలో గ్రామ పరిపాలనాధికారి, గ్రామ రెవెన్యూ అధికారి నుంచి రాష్ట్ర స్థాయిలో భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌ వరకు చాలా ఖాళీలు ఉన్నాయి. సీసీఎల్‌ఏ లేకపోవడంతో ఈ బాధ్యతలను కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌ చూస్తున్నారు. దీంతో రెవెన్యూ వ్యవస్థలో పాలన అస్తవ్యస్తంగా మారిందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

ఐఏఎస్‌లలో జూనియర్లకు పదోన్నతి కల్పించి కలెక్టర్లుగా నియామకం

గత ఏడాది అక్టోబర్‌లో తెలంగాణలో కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేశారు. ఐఏఎస్‌ అధికారుల్లో జూనియర్లకు పదోన్నతి కల్పించి, జిల్లా కలెక్టర్లుగా నియమించారు. వీరికి సరైన పరిపాలన అనుభవం లేకపోవడంతో ప్రభుత్వ పథకాల అమల్లో సమస్యలు ఎదురవుతున్నాయని సచివాలయ అధికారులు చెబుతున్నారు. అనుభవంలేని ఐఏఎస్‌లను కలెక్టర్లుగా నియమించడంతో ఉద్యోగులు, వీరికి మధ్య సమన్యయం ఉండటంలేదంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని చెబుతున్న కలెక్టర్లు, వీకిటి సంబంధించిన మార్గదర్శకాలు గురించి అడిగే తెలియదని చెప్పే పరిస్థితి ఉంది. దీంతో అటు అధికారులు, ఉద్యోగులు, ఇటు జిల్లా కలెక్టర్ల మధ్య అంతరం పెరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో పథకాల అమల్లో జాప్యం జరుగుతోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిన 30 మంది ఐఏఎస్‌ అధికారులను కేంద్రం మంజూరు చేస్తే ఇలాంటి పరిస్థితులు ఉండవంటున్నారు.

ఐఏఎస్‌లపై పెరుగుతున్న పని ఒత్తిడి....

ఒక్కో ఐఏఎస్‌ అధికారి రెండు నుంచి మూడేసి శాఖల బాధ్యత చూడాల్సి వస్తోంది. దీంతో పని ఒత్తిడి పెరుగుతోంది. ఏ శాఖపైనా ప్రత్యేకంగా దృష్టిపెట్టే అవకాశంలేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 27 విభాగాలకు అధిపతులు లేరు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ కూడా సీసీఎల్‌ఏతోపాటు, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో సీఎస్‌ కూడా ఊపిరిసల్పని పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. తెలంగాణ కేడర్‌ నుంచి కేంద్ర సర్వీసుకు వెళ్లిన ఐఎస్‌ఎస్‌ అధికారులను వెనక్కి రప్పించినా కొంత వరకు అధికారులపై పనిభారం తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వ పాలనలో ముఖ్య భూమిక నిర్వహించే ఐఏఎస్‌ అధికారుల కొరత తీరాలంటే మరో రెండేళ్లు పట్టొచ్చు. అప్పటి వరకు ఆగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే ప్రభుత్వ పథకాలు సజావుగా సకాలంలో అమలు కావడంతోపాటు, ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని ఉద్యోగ సంఘాల నేతలు సూచిస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

12:41 - April 22, 2017

గుంటూరు : అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులు చేస్తున్న ఏపీ సర్కార్‌.. విడతలవారీగా ఉన్నతాధికారుల బదిలీలు చేపడుతోంది. ఇప్పటికే ఓ విడత ఐఏఎస్‌లను ట్రాన్స్‌ఫర్‌ చేన ప్రభుత్వం.. త్వరలో మరోసారి బదిలీలకు కసరత్తు చేస్తోంది. తాజాగా ఐపీఎస్‌లకు స్థానభ్రంశం కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. బదిలీల విషయంలో సర్కార్‌ స్పీడ్‌కు సొంతపార్టీ నేతలే బ్రేక్‌లు వేస్తున్నారు. ప్రక్రియను కొంతకాలం నిలుపుదల చేయాలని కొందరు నేతలు కోరుతుండగా .. మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం.. తక్షణం బదిలీలను చేపట్టాల్సిందిగా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. కొంతమంది అధికారులు తమ మాట వినడంలేదని ఇటీవల జరిగిన సంఘటనలను ఉదాహరణగా చూపుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సంకటపరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కొందరు నేతల తీరుపై బాబు అసహనంగా ఉన్నట్టు పార్టీనేతలు చెప్పుకుంటున్నారు. ఇటీవల చేపట్టిన ఐఏఎస్‌ల బదిలీల ప్రక్రియ నేతలమధ్య విమర్శలకు దారితీసినట్టు తెలుస్తోంది. తమ అభిప్రాయాలు తీసుకోకుండా.. కొందరి మాటకే కట్టుబడి బదిలీలు చేపట్టారని నేతలు బహిరంగంగానే బాబుతీరును విమర్శిస్తున్నారు. ఈనేపథ్యంలో పోలీస్ అధికారులను బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుండటంతో.. నేతల మధ్య కస్సుబుస్సుల పంచాయితీలు మరింత పెరుగుతున్నట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబుపై ఒత్తిడి...
మరోవైపు అధికారులు కూడా తాము కోరుకున్న ప్లేస్‌కు బదిలీలకోసం ముఖ్యమంత్రిపై విజ్ఞాపనలతో ఒత్తడి చేస్తున్నట్టు సమాచారం. అధికారపార్టీ నేతల అశీస్సులు ఉన్న చోట పోస్టింగులకోసం తహతహలాడుతున్నారని సమాచారం. దీనికోసం కొందరు అధికారులు.. మంత్రులు, అధికారపార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటంతో చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోందని పార్టీనేతలు చెప్పుకుంటున్నారు. అటు నాయకుల డిమాండ్లను, ఇటు అధికారుల విన్నపాలను సమన్వయం చేయడానికి సీఎం చంద్రబాబు విస్తృతంగానే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఒకేచోట రెండేళ్లుగా పనిచేస్తున్న అధికారుల్లో ఎవరిని ఎక్కడికి పంపాలన్న దానిపై ప్రభుత్వం విస్తృతంగా కసరత్తు చేస్తోంది. గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ్ నాయక్, గుంటూరు అర్బన్ ఎస్పీ త్రిపాఠి, కృష్ణాజిల్లా ఎస్పీ విజయకుమార్, పశ్చిమ గోదావరి భాస్కర భూషణ్, తూర్పుగోదావరి ఎస్పీ రవి ప్రకాష్, చిత్తూరు ఘట్టమనేని శ్రీనివాస్, అనంతపురం ఎస్పీ రాజశేఖర్ బాబు, కర్నూలు రవికృష్ణ లాంటి సీనియర్ ఐపీఎస్ అధికారులతోపాటు ఇతర అధికారులకు ఆయా స్థానాల్లో రెండేళ్లు గడువు పూర్తయింది. వీరందర్నీ ఏ స్థానాలకు బదిలీ చేయనున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే కోస్తాంధ్రకు చెందిన ఒక సీనియర్ అధికారిని బదిలీ చేయాలని భావించినా.. మావోయిస్టుల కదలికలు, సరిహద్దుల్లో ఎన్ కౌంటర్లను దృష్టిలో పెట్టుకుని సదరు అధికారిని అక్కడే కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుపస్తోంది.  
ప్రభుత్వ పెద్దల అశీస్సులు...
కమ్యూనిటీ పోలీసింగ్ తో చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, ముద్రగడ కాపు ఉద్యమం అంశంలో తూర్పుగోదావరి ఎస్పీ రవి ప్రకాష్ ప్రభుత్వ పెద్దల నుంచి ప్రశంసలు అందుకున్నారు. దీంతో ఈసారి బదిలీల్లో వారికి కీలక స్థానాల్లోకి పోస్టింగ్స్ ఉండవచ్చని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి ఎస్పీ రవిప్రకాశ్‌కు కీలక పోస్టింగ్‌ కల్పించాలని కొందరు మంత్రులుకూడా పట్టబడుతున్నట్టు సమాచారం. అటు అధికారుల నుంచికూడా ముఖ్యమంత్రికి విన్నపాలు వెల్లవెత్తుతున్నట్టు తెలుస్తోంది. ఏసీబీ, సీఐడీ, గ్రే హౌండ్స్, పీటీసీ లాంటి విభాగాల్లో ఉన్న సీనియర్ అధికారులు కొందరు ఈసారి బదిలీల్లో తమకు ప్రాముఖ్యత ఇవ్వాలని కూడా కోరుతున్నారని సమాచారం. ఎక్కువగా మంది పోలీస్ అధికారులు జిల్లా ఎస్పీలుగా పోస్టింగ్‌లు కావాలని తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు భోగట్టా. అటు కేంద్ర సర్వీసుల నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన పోలీస్‌ అధికారులు కూడా తమకు ఉన్నత పోస్టింగ్‌ల కోసం ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే..త్వరలో చేపట్టబోయే బదిలీ కోసం ఆయా విభాగాల్లో రెండేళ్లు పాతుకుపోయిన సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను, వారి ట్రాక్ రికార్డులను డీజీపీ నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. బదిలీలు అత్యంత పారదర్శకంగా ఉండాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయంలో కలుగజేసుకోకుండా నేరుగా సీఎం చంద్రబాబే కొందరి పేర్లను ఇప్పటికే సిద్ధం చేసినట్టు సమాచారం. మొత్తానికి .. అటు నాయకులు, ఇటు అధికారుల హడావిడితో.. ఏపీలో అధికారుల బదీల ప్రక్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపుగా సర్కస్‌ ఫీట్లు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

17:48 - March 31, 2017

మెదక్ : ప్రజలు తమ పనులకోసం అధికారులను అడుక్కునే పరిస్థితి రాకూడదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ మాణిక్‌ రాజ్‌కణ్ణన్‌ అన్నారు. వినూత్న విధానాలతో ప్రజలకు చేరువవుతూ, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ జిల్లా అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్న సంగారెడ్డి కలెక్టర్ మాణిక్ రాజ్ కణ్ణన్‌ తో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈమేరకు ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉన్న హక్కులను అమలు చేయడమే అధికారుల బాధ్యతన్నారు. విద్యార్థుల ఇంటికే వెళ్లి ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలను అందచేస్తున్నామని తెలిపారు. ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ విద్యార్థులు తిరగకుండా చూస్తున్నామని చెప్పారు. ఉపాధిహామీ పథకంతో పేద రైతుల బీడు భూములను చదును చేస్తున్నామని పేర్కొన్నారు. 6వేల ఎకరాల్లోని బీడు భూముల్లో ఈ ఏడాది ఉపాధిహామీ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. 6వేల ఎకరాలను చదును చేస్తే.. వాస్తవంగా సాగులోకి వచ్చేది 2వేల ఎకరాలు ఉంటుందని తెలిపారు. ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకునేందుకు వెనకాడుతుంటారు..అలాంటి వారికోసం.. లైబ్రరీల్లో కాంపిటీటివ్‌ బుక్స్‌కు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. 

 

07:57 - March 24, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిలో పలువురికి పదోన్నతులు కల్పించగా మరి కొందరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ డీజీగా పూర్ణచందర్‌రావు..పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌గా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. 
15 మంది ఐపీఎస్‌ల బదిల
రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో పలువురికి పదోన్నతులు కల్పించగా మరొకొందరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐపీఎస్‌ల బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి. 
ఏసీబీ అదనపు డీజీగా జె. పూర్ణచంద్రరావు
సీఐడీ అదనపు డీజీగా గోవింద్ సింగ్ 
టీఎస్‌పీఏ డైరెక్టర్‌గా జితేందర్
టీఎస్‌పీఏ డిప్యూటీ డైరెక్టర్‌గా బి. నవీన్ కుమార్ 
పశ్చిమ మండలం ఐజీగా స్టీఫెన్ రవీంద్ర
ఎక్సైజ్ డీజీగా అకున్ సబర్వాల్
నిజామాబాద్ డీఐజీగా శివశంకర్‌రెడ్డి
సైబరాబాద్ జాయింట్ సీపీగా షానవాజ్ ఖాసీం
ఖమ్మం కమిషనర్‌గా ఎక్బల్ 
కరీంనగర్ డీఐజీగా సి. రవివర్మ 
హైదరాబాద్ ట్రాఫిక్ సంయుక్త కమిషనర్‌గా వి. రవీందర్
రాచకొండ సంయుక్త కమిషనర్‌గా తరుణ్ జోషి
ఏసీబీ అదనపు డైరెక్టర్‌గా ఎ.సత్యనారాయణ
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా టీవీ శశిధర్ రెడ్డి 
పోలీస్ సంక్షేమం ఐజీగా సౌమ్యా మిశ్రాకు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. 

17:45 - March 20, 2017

హైదరాబాద్‌: యూసుఫ్‌గూడలోని ఓ అపార్టుమెంట్‌ వద్ద దొరికిన డ్రైవర్ నాగరాజు డెడ్‌బాడీ కేసులో పురోగతి సాధించారు పోలీసులు.. పక్కా ప్లాన్‌ ప్రకారమే నాగరాజును అంతం చేసిన ఐఏఎస్‌ అధికారి వెంకటేశ్వర్‌రావు పుత్రరత్నం వెంకట్‌ సుకృత్‌ బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు..సీసీ ఫుటేజీలు..ఇతర ఆధారాలు దొరికిన తర్వాత పోలీసులు సుకృత్‌ను అదుపులోకి తీసుకున్నారు...ఈ కేసులో కొడుకుకి సాయం చేసినందుకు వెంకటేశ్వర్‌రావును కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు....

ఆలస్యంగా వెలుగులోకి ఘటన..

17న ఐఏఎస్‌ అధికారి వెంకటేశ్వర్‌రావు వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగరాజు డ్యూటీ వెళ్లి ఇంటికి రాలేదు.. మధ్యలో భార్య ఫోన్ చేస్తే స్విచ్చాఫ్‌ రాగా..ఆ తర్వాత తానే ఫోన్ చేసి సారు వద్ద ఉన్నానని చెప్పాడు..ఆ తర్వాత తిరిగి రాలేదు...ఇదిలా ఉంటే అదే అర్ధరాత్రి నాగరాజు ఓ యువకుడితో కలసి యూసుఫ్‌గూడలోని సాయికల్యాణ్‌ అపార్ట్‌మెంట్‌ పైకి వెళ్లాడు...ఆ తర్వాత ఎవరూ చూడలేదు.. మర్నాడు ఉదయం అదే యువకుడు అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లి ఓ మూటను తరలించేయత్నం చేయగా వృద్దుడు ప్రశ్నించడంతో అక్కడే వదిలేసి వెళ్లాడు...తీరా అది విప్పిచూస్తే అందులో డెడ్‌బాడీ ఉంది....

హత్యకు గురయింది డ్రైవర్ నాగరాజు..

కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా పరిశోధిస్తే వివరాలు బయటపడ్డాయి...సీసీ ఫుటేజీ పరిశీలించగా అందులో ఉన్న యువకుడు ఐఏఎస్‌ వెంకటేశ్వర్‌రావు కొడుకు వెంకట్‌ సుకృత్‌గా గుర్తించారు..నాగరాజును దారుణంగా చంపి మూటగట్టి తరలించే ప్రయత్నం చేసినట్లు తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...

ఐఏఎస్‌ కొడుకు మహిళను చిత్రహింసలు చేశాడా..?

డ్రైవర్ నాగరాజును ఎందుకు హత్య చేశాడన్నది అనుమానం...పోలీసుల దర్యాప్తు చేస్తుంటే తెలిసిన విషయాలను బట్టి చూస్తే వెంకట్‌ సుకృత్‌ తీరే బాగోలేదని తెలుస్తోంది...కొద్ది రోజులు క్రితమే వెంకట్ ఓ మహిళను తీసుకొచ్చి ఆమెని చిత్ర హింసలకు గురి చేశాడు .. అయితే సమయం లో ఆమ్మాయిని వేదిస్తున్న దృశ్యాలు ను డ్రైవర్ నాగరాజు సెల్ ఫోన్ లో చిత్రికారించాడా ? ఆ భయం తోనే నాగరాజు ను హత్యకు కారణామా ? లేక నాగరాజు భార్యపై వెంకట్ కన్నేశాడా..? ఇలా ఎన్నో అనుమానాలు కలుగుతుండడంతో అసలు కథ తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు వేగం చేశారు... ఈ హత్య కేసులో ఐఏఎస్ కుమారుడు నిందితుడుగా ఉండడంతో తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని బాధిత కుటుంబం ఆందోళన చేసింది...అయితే కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో శిక్ష పడేలా వ్యవహరిస్తామని పోలీసు అధికారులు చెప్పారు...మూడు కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉందంటున్నారు పోలీసులు...నాగరాజు , వెంకట్ సుకృత్‌ కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.

09:37 - November 7, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల రాకతో నియోజకవర్గాల నిధుల కేటాయింపుపై అయోమయ పరిస్థితి నెలకొంది. కొత్త జిల్లాల అమలుతో ఒక్కో నియోజకవర్గం రెండుకు పైగా జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. దీంతో వీటికి నిధులను ఏ ప్రాతిపదికన విడుదల చేయాలన్న సందిగ్ధత నెలకొంది. దీనిపై దృష్టిసారించిన అధికారులు తీవ్ర కసరత్తుల తర్వాత ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు.

కొత్త జిల్లాల రాకతో నియోజక వర్గ నిధుల కేటాయింపై సందిగ్ధత
కొత్త జిల్లాల రాకతో నియోజక వర్గాల్లో కన్‌ఫ్యూజన్ మొదలైంది. ప్రధానంగా నియోజకవర్గ అభివృద్ధి నిధులపై సమస్యలు నెలకొన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలోని దాదాపు 30 కంటే ఎక్కువ నియోజకవర్గాలు రెండు, మూడు జిల్లాల్లోకి వెళ్లాయి. దీంతో సీడీపీ నిధులను ఏవిధంగా ఖర్చు చేయాలన్న అంశంపై కలెక్టర్లలో సందేహం చోటుచేసుకుంది. ఈ అంశంపై సుదీర్ఘ కసరత్తులు చేసిన ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది. సీడీపీ అభివృద్ధి నిధులు..నియోజక వర్గ కేంద్రం ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా కలెక్టర్‌ ద్వారా ఖర్చు చెయ్యాలని నిర్ణయించింది.
ఎమ్మెల్యే ప్రతిపాదన మేరకు నియోజకవర్గ నిధుల కేటాయింపు
ప్రభుత్వ మార్గ దర్శకాల ప్రకారం నియోజక వర్గ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న జిల్లా కలెక్టర్ సీడీపీ నిధులను విడుదల చేస్తారు. ఒక నియోజక వర్గం రెండు, మూడు జిల్లాల్లో ఉంటే ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే ప్రతిపాదనల మేరకు అభివృద్ధి పనులను కలెక్టర్ మంజూరు చేయాలి. ఇప్పటికే నిధులు విడుదలై పనులు పూర్తికానిచోట కొత్తగా ఏర్పడిన జిల్లా కలెక్టర్ పీడీ అకౌంట్‌లో ఆ నిధులను జమ చేస్తారు. ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీలలో విడుదల చేసిన నిధుల వినియోగం తరువాత ఏవైనా మిగిలితే అవికూడా కొత్త జిల్లా కలెక్టర్ పీడీ అకౌంట్‌కు పంపించాలి. నిధులతోపాటు యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇప్పటికే పనులకు అనుమతి ఇచ్చి వివిధ దశలలో ఉంటే ..ఆ నిధులు ఏ జిల్లా పరిధిలో ఉంటే ఆ జిల్లా పరిధిలోకి బదిలీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సీనియర్ ఐఏఎస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
కొత్త జిల్లాల్లో పరిపాలనాపరంగా వస్తున్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. దీంతో ఇందుకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

 

08:43 - October 26, 2016

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ ఏర్పాటుపై ఉద్యోగ సంఘాల మధ్య లడాయి ప్రారంభమైంది. టాస్‌ ఏర్పాటును రెవిన్యూ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే... గ్రూప్‌ వన్‌ అధికారులు సమర్ధిస్తున్నారు. టాస్‌ అవసరంలేదని రెవిన్యూ అధికారులు వాదిస్తుంటే.... జిల్లాల విభజన నేపథ్యంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ తప్పనిసరని గ్రూప్‌ వన్‌ అధికారులు చెబుతున్నారు.

గ్రూప్‌-1 అధికారులు / రెవెన్యూ అధికారులు
తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌... టాస్‌.. ఇప్పుడు ఉద్యోగ సంఘాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర సర్వీస్‌ అధికారుల తరహాలో తెలంగాణలో రాష్ట్ర సర్వీస్‌ క్యాడర్‌ అధికారులు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివలన అన్ని విషయాల్లో కేంద్ర సర్వీస్‌ అధికారులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని రాష్ట్రం భావించింది.

టాస్‌ ఏర్పాటును పరిశీలించేందుకు ఎంజీ గోపాల్‌ అధ్యక్షతన కమిటీ
టాస్‌ ఏర్పాటును పరిశీలించేందుకు మున్సిపల్‌ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్‌ అధ్యక్షతన ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ ఆదేశాల ప్రకారం గ్రూప్‌ వన్‌ అధికారుల సంఘం, రెవిన్యూ అధికారుల సంఘాలను వివిధ రాష్ట్రాల్లో పర్యటించి, ఆయా రాష్ట్రాల్లో ఉన్న విధానాలపై నివేదికలు సమర్పించాలని కోరింది. గ్రూప్‌ వన్‌ అధికారులు కేరళ, కర్నాటక, రాజస్థాన్‌, జార్ఖండ్‌, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో పర్యటించి టాస్‌కు అనుకూలంగా నివేదిక సమర్పించింది. రెవిన్యూ ఉద్యోగుల సంఘం మాత్రం ఒకే రాష్ట్రంలో పర్యటించింది. గ్రూప్‌ వన్‌ అధికారుల నివేదికను రెవిన్యూ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది.

గ్రూప్‌ వన్‌ అధికారుల ఆవేదన
టాస్‌ ఏర్పాటు చేస్తే అధికారులందరికీ సమాన అవకాశాలు దక్కుతాయని గ్రూప్‌ వన్‌ అధికారులు చెబుతున్నారు. రెవిన్యూలో కింది స్థాయి ఉద్యోగులు కూడా ఉన్నతాధికారులుగా పదోన్నతులు వస్తుంటే, ఇతర శాఖల్లోని గ్రూప్‌ వన్‌ అధికారులకు ఈ అవకాశం లేకండా పోతోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అయితే రెవిన్యూ ఉద్యోగులు ఈ వాదాన్ని తోసిపుచ్చుతున్నారు.

అన్ని శాఖల్లో కూడా డైరెక్టర్‌ పోస్టులు సృష్టించాలి : శ్రీనివాస్ గౌడ్
పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ ఏర్పాటుచేసి, అన్ని శాఖల్లో కూడా డైరెక్టర్‌ పోస్టులు సృష్టించాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ సూచిస్తున్నారు. టాస్‌ ఏర్పాటుపై ఉద్యోగ సంఘాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో.... ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

 

20:48 - July 22, 2016

విజయవాడ : ఎపిలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్‌ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా ఆర్‌ ముత్యాలరాజును నియమించింది. విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఎం. హరినారాయణ్‌, చిత్తూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా టీ గిరీష్‌ షా, పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా శివశంకర్‌ నియమితులయ్యారు.

 

13:43 - July 13, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఇక నుంచి ఐఏఎస్ అధికారుల పాలనలో కొనసాగనున్నాయి. ఆలయాలను  మరింత అభివృద్ధి చేసేందుకు  ప్రభుత్వం ఈ  నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు కీలమైన దేవాలయాలకు కార్యనిర్వహణ అధికారులుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
ఆలయాల ఆలనాపాలనపై సర్కార్ దృష్టి 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల ఆలనాపాలనపై ఏపీ సర్కార్ దృష్టిసారించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని తిరుమల శ్రీవారి ఆలయం మినహా మిగిలిన అన్ని ప్రధాన ఆలయాలకు దేవాదాయ శాఖను చెందిన  జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులే ఈవోలుగా పనిచేస్తున్నారు.  కొందరు అధికారులు  అవినీతికి పాల్పడుతూ దేవాలయాల అభివృద్ధికి ఆటకంగా మారుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  దీంతో అనుభవం ఉన్న ఐఏఎస్ లను ఆలయాలకు ఈవోలుగా నియమించే కొత్త విధానానికి  టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  
దేవాలయాలకు ఐఏఎస్ అధికారులు కేటాయింపు 
ఇటీవల కాలంలో ఆలయాల అధికారుల వ్యవహారాలపై  ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి.  దేవుళ్లకు సంబంధించి భూములు అన్యాక్రాంతం అవుతున్నట్టు గుర్తించారు. దీంతో  ఆలయాల్లో పాలనను గాడిన పెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.  టీటీడీ తరహాలోనే ఏడు ప్రధాన ఆలయాలకు ఐఏఎస్ అధికారులను ఈవోలుగా నియమిస్తున్నారు.  తొలుత బెజవాడ  కనకదుర్గమ్మ  దేవాలయం ఈవోగా ఐఏఎస్ అధికారి సూర్యకుమారిని నియమించారు. ఈమె గతంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో టీటీడీలో సేవలందించారు. 
శ్రీశైలం మల్లన్న టెంపుల్ ఈవోగా డా. నారాయణ భరత్ గుప్తా
తాజాగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి ఈవోగా 2010 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ నారాయణ భరత్ గుప్తాను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్ ఈనెల 10న ఉత్తర్వులు వెలువరించారు. శ్రీకాళహస్తి ఆలయానికి కూడా త్వరలో ఐఏఎస్ అధికారిని ఈవోగా నియమించే యోచన చేస్తున్నారు. అలాగే సింహాచలం, అన్నవరంలోని దేవాలయాలకు కూడా ఐఏఎస్ అధికారులను నిమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దేవాదాయ శాఖ అధికారుల పాలనతో అస్తవ్యస్తంగా మారిన ఆలయాల నిర్వహణ ఐఏఎస్‌ల ఏలుబడిలో మెరుగుపడే అవకాశం ఉందని భక్తులు ఆశిస్తున్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - ias officers