indian politics

19:31 - January 17, 2017

గుజరాత్ : పాటీదార్ ఆందోళన్‌ ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌ 6 నెలల తర్వాత ఇవాళ స్వరాష్ట్రం గుజరాత్‌కు చేరుకోనున్నారు. కోర్టు ఆదేశం మేరకు ఆయన ఆరు నెలల పాటు రాజస్థాన్‌లో గడిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో పాటీదార్‌ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని హార్దిక్‌ పటేల్‌ గుజరాత్‌లో పెద్ద ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దేశద్రోహం కింద పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేయగా..6 నెలల ముందు బెయిలుపై విడుదలయ్యారు. 6 నెలల పాటు గుజరాత్‌ వెలుపల నివసించాలన్న కోర్టు ఆదేశం నేటితో ముగిసింది. పటేల్‌కు ఘనస్వాగతం పలికేందుకు పాటీదార్‌ ఉద్యమకర్తలు గుజరాత్‌ సరిహద్దులో హార్దిక్‌ ఏర్పాట్లు చేశారు. ఈ ర్యాలీలో 5 వందల కార్లు, లక్షమంది కార్యకర్తలు పాల్గొనున్నారు.

21:27 - January 16, 2017

ఢిల్లీ : కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వస్తు, సేవల పన్ను జీఎస్‌టీ అమలు జూలై ఒక‌టవ‌ తేదీకి వాయిదాపడింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరున్ జైట్లీ ప్రకటన చేశారు. జీఎస్టీ మండ‌లి స‌మావేశం అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ముందు అనుకున్నట్లు జీఎస్టీని ఏప్రిల్ ఒక‌టి నుంచి అమ‌లు చేయ‌డం లేద‌ని, దాన్ని జూలై ఒక‌ట‌వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ప‌న్ను అధికారాల‌పై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌ని కార‌ణంగా జీఎస్టీ అమ‌లు వాయిదా ప‌డిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు.

21:17 - January 16, 2017

ఢిల్లీ : సమాజ్‌వాది పార్టీ సింబల్‌ సైకిల్‌ పోరులో ములాయం సింగ్‌ యాదవ్‌కు భంగపాటు తప్పలేదు. ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌కే సైకిల్‌ గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. దీంతో సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడిగా...ముఖ్యమంత్రిగా అఖిలేష్‌ యాదవ్‌ పూర్తి ఆధిపత్య చలాయించనున్నారు. ములాయం సింగ్‌ యాదవ్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. ఉత్తరప్రదేశ్‌ అధికార పార్టీలో పెత్తనం కోసం గత కొన్నిరోజులుగా సాగుతున్న వివాదానికి తెరపడింది. సమాజ్‌వాదీ పార్టీ సింబల్‌ సైకిల్‌ గుర్తు కోసం జరిగిన పోరులో అఖిలేష్‌ తండ్రిపై విజయం సాధించారు. సైకిల్‌ గుర్తును అఖిలేష్‌ వర్గానికే కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సమాజ్‌వాదీలో 50 శాతానికి పైగా పదాధికారులు అఖిలేష్ వైపు ఉన్నందునే ఆయనదే అసలైన సమాజ్‌వాది పార్టీగా ఈసీ పేర్కొంది.

అఖిలేష్ వర్గంలో సంబరాలు..
ఈసీ నిర్ణయంతో అఖిలేష్‌ వర్గంలో సంబరాలు మిన్నంటాయి. లక్నోలోని ఎస్పీ పార్టీ కార్యాలయం ముందు కార్యకర్తలు సందడి చేశారు. ఈసీ నిర్ణయంతో సమాజ్‌వాది పార్టీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ సొంతమైంది. ఎస్పీ అధ్యక్షుడిగా అఖిలేష్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ముందుకు నడపడనున్నారు. అఖిలేశ్‌కు సైకిల్‌ గుర్తు పక్కా కావడంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. యూపీ మహాకూటమి ఏర్పాటు ఖాయమని అఖిలేశ్‌ వర్గంలో కీలక నేత రాంగోపాల్‌ యాదవ్‌ అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలో కాంగ్రెస్‌, ఆర్‌ఎల్‌డీ, ఆర్‌జేడీ పార్టీలతో మహా కూటమిని ఏర్పాటుచేస్తామని, ఈ మేరకు అవసరమైన చర్చలు ప్రారంభమయ్యాయని రాంగోపాల్‌ తెలిపారు.

తిరుగులేని అధిపత్యం..
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడిగా నిన్నమొన్నటి వరకూ తిరుగులేని ఆధిపత్యం సాగించిన ములాయం సింగ్ యాదవ్‌కు భంగపాటు తప్పలేదు. కుటుంబంలో చీలికలు ఏర్పడి చులకనైపోయిన తరుణంలో సైకిల్ గుర్తు కూడా దక్కకపోవడంతో ములాయం షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నారు. అంతకు ముందు లక్నోలో జరిగిన కార్యకర్తల సమావేశంలో యుపి సిఎం అఖిలేష్‌ తన మాట వినడం లేదని వాపోయారు. అఖిలేష్‌ను ముస్లిం వ్యతిరేకని ఆరోపించారు. అఖిలేష్‌ తన మాట వినకుంటే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొడుకుపైనే నేరుగా పోటీకి దిగ‌నున్నట్లు ములాయం తేల్చిచెప్పారు. పార్టీ సింబల్‌ను కోల్పోయిన ములాయం-భవిష్యత్తు కార్యాచరణ ఏంటన్నది ఆసక్తిగా మారింది.

19:10 - January 16, 2017

ఉత్తర్ ప్రదేశ్ : గత కొద్ది రోజులుగా తండ్రి..కొడుకుల మధ్య జరుగుతున్న పోరుకు ఈసీ తెరదించింది. గత కొద్ది రోజులుగా ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ల మధ్య తారాస్థాయిలో పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ పేర్కొన్న అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ గుర్తు తనకే కేటాయించాలని వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఈసీని అభ్యర్థించింది. ఇందుకు అఫిడవిట్లు దాఖలు కూడా చేసింది. దీనికి ప్రతిగా అఖిలేష్ తరపున శివపాల్ యాదవ్ అఫిడవిట్లు దాఖలు చేశారు. అంతేగాకుండా జాతీయ కార్యవర్గ సమావేశంలో అఖిలేష్ ను పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఎంపీలు, 200 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బలంతో పాటు లక్షలాది మంది కార్యకర్తల బలం ఉందంటూ అఫిడవిట్లలో పేర్కొన్నారు. పార్టీ యునైటెడ్ గానే ఉందని, సీఎం అభ్యర్థి అఖిలేష్ అని ములాయం పేర్కొన్నారు. కానీ సోమవారం పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ గుర్తు కోసం..పార్టీ కోసం తాను తీవ్రంగా కృషి చేయడం జరిగిందని, అఖిలేష్ పైనే పోటీ చేస్తానని ములాయం ప్రకటించడంతో కలకలం రేగింది. చివరకు సాయంత్రం ఎస్పీ గుర్తు సైకిల్ ను అఖిలేశ్ కు కేటాయిస్తూ ఈసీ వెల్లడించింది. దీనితో అఖిలేష్ వర్గాలు సంబరాల్లో మునిగితేలాయి. దీనిపై ములాయం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

15:44 - January 16, 2017

పంజాబ్ : రాష్ట్రాన్ని రక్షించడానికే తాను కాంగ్రెస్‌లో చేరినట్లు మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ అన్నారు. డ్రగ్స్‌ మాఫియాతో అధికారంలో ఉన్న పంజాబ్‌ నేతలకు సంబంధముందని ఆరోపించారు. పంజాబ్‌ హరిత విప్లవానికి చిహ్నమని...డ్రగ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారకూడదన్నారు. పంజాబ్ హక్కుల కోసం పోరాటం చేస్తానని సిద్ధూ స్పష్టం చేశారు. పంజాబ్‌ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ-తొలిసారిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజయ్‌మాకెన్‌తో కలిసి ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

సొంతిళ్లు..
కాంగ్రెస్‌లో చేరడం తిరిగి సొంతింటికి వెళ్లినట్లుగా ఉందని సిద్ధూ పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ నేతగానే జన్మించానని... దేశ స్వాతంత్య్రం కోసం తన కుటుంబం పోరాటం చేసిందని గుర్తు చేశారు. తన తండ్రి 40 ఏళ్లు కాంగ్రెస్ కోసం పని చేశారని తెలిపారు. హరిత విప్లవానికి గుర్తింపుగా ఉన్న పంజాబ్‌ డ్రగ్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని సిద్ధూ అన్నారు. అన్నదాతలు అడుక్కునే పరిస్థితి ఏర్పడిందన్నారు. పంజాబ్ యువత డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాక్‌ సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్‌, గుజరాత్‌లో లేని డ్రగ్స్‌ సమస్య పంజాబ్‌లోనే ఎందుకుందని ప్రశ్నించారు.

భాగ్ బాదల్..భాగ్..
పంజాబ్ ప్రభుత్వానికి, నేతలకు డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయని ఆరోపించారు. పంజాబ్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని... భాగ్... బాదల్... భాగ్ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతామని సిద్ధూ పేర్కొన్నారు. పార్టీని తల్లిగా భావిస్తామని చెప్పిన సిద్ధూ...బిజెపిని కైకేయిగా...కాంగ్రెస్‌ను కౌసల్యగా అభివర్ణించారు. పంజాబ్‌ రాజకీయాల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో సిద్ధూ రాజ్యసభకు, బిజెపి సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సిద్ధూ చేరికతో కాంగ్రెస్‌కు ఎంత లాభం చేకూరుస్తుందన్నది వేచి చూడాలి.

14:32 - January 16, 2017

చెన్నై : తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లో రావాలని కొన్నేళ్లుగా అభిమానులు, పార్టీలకతీతంగా నాయకులు కోరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం గత లోక్ సభ ఎన్నికల సమయంలో చెన్నైలోని రజనీ ఇంటికి వెళ్లి ఆయన మద్దతు కోరారు. అయినా రాజకీయ రంగ ప్రవేశంపై రజనీకాంత్‌ తన మనసులోని మాటను ఎప్పుడూ బయటపెట్టలేదు.
తమిళనాడు రాజకీయాలకు, సిని రంగానికి విడదీయలేని సంబంధం ఉంది. సినీ రంగానికి చెందినవారే తమిళ రాజకీయాలను శాసిస్తున్నారు. రజనీకాంత్‌కు కోట్లాది మంది అభిమానులున్నారు. ఆయన మద్దతు కోసం రాజకీయ పార్టీలు పోటీ పడుతుంటాయి. 1996 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా రజనీకాంత్‌ ఓ వ్యాఖ్య చేయడం తీవ్ర ప్రభావం చూపింది. జయలలితకు ఓటు వేస్తే దేవుడు కూడా తమిళనాడును కాపాడలేడంటూ రజనీ వ్యాఖ్యానించడం డీఎంకే కూటమి అధికారంలోకి రావడానికి ఉపయోగపడిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారా..? రారా..? అన్నది తమిళనాడులో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.

14:28 - January 16, 2017

ఉత్తర్ ప్రదేశ్ : సమాజ్ వాది పార్టీలో ఏం జరుగుతోంది ? తండ్రి..కొడుకుల మధ్య వివాదం సద్దుమణగలేదా ? రాజకీయ సంక్షోభం మరింత ముదిరిందా ? ఇలా అనేక ప్రశ్నలకు అవును అనే సమాధానం వస్తోంది. చీలిక దిశగా సమాజ్ వాది పార్టీ పయనిస్తోంది. కాసేపటి క్రితం లక్నోలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఆ ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. తన మాట వినడం లేదని, పార్టీ కోసం..గుర్తు కోసం ఎంతో కృషి చేయడం జరిగిందని ములాయం పేర్కొన్నారు. తన మాట వినకపోతే అఖిలేష్ యాదవ్ పై పోటీకి సిద్ధమని ములాయం ప్రకటించారు. రాంగోపాల్ యాదవ్ చేతిలో అఖిలేష్ కీలు బొమ్మగా మారారని పేర్కొన్నారు. గత కొన్ని రోజుల కిందటే పార్టీ వివాదం సద్దుమణిగిందని, సీఎం అభ్యర్థి అఖిలేష్ అని స్వయంగా ములాయం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇలా ప్రకటించిన కొద్ది రోజుల అనంతరం ములాయం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఎస్పీ గుర్తు 'సైకిల్' ఎవరికి వర్తించనుందో ఈసీ స్పష్టం చేయనుంది. మరి ములాయం వ్యాఖ్యలపై అఖిలేష్ ఎలా స్పందిస్తారా ? పార్టీ గుర్తు ఎవరికి కేటాయిస్తారు ? అనే ప్రశ్నలకు కొద్దిగంటల్లో సమాధానం రానుంది.

19:35 - January 15, 2017

ఢిల్లీ : సైన్యంలో సమస్యలపై జవాన్లు సోషల్‌ మీడియాకు ఎక్కడాన్ని ఆర్మీ సీరియస్‌గా పరిగణిస్తోంది. ఇక ముందు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఏదైనా సమస్య ఉంటే నేరుగా ఫిర్యాదు చేయాలని.. అలా సోషల్‌ మీడియాలో ప్రచారం జవాన్ల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోందని ఆర్మీ చీఫ్‌ హెచ్చరించారు. నాసిరకం తిండి పెడుతున్నారని, గంటల తరబడి పనులు చేయిస్తూ... చాలీచాలని జీతాలిస్తున్నారని బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ తేజ్‌బహదూర్‌ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టుపై ఆర్మీ అధికారులు సీరియస్‌ అయ్యారు. ఆర్మీ డే సందర్భంగా జవాన్లకు గట్టి హెచ్చరికలు కూడా జారీ చేశారు ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌. సోషల్ మీడియా ద్వారా తమ సమస్యలను చెప్పుకుంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అలా చేయడం జవాన్లతో పాటు ఆర్మీ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తోందని, అందుకు దీన్ని నేరంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని బిపిన్‌ రావత్‌ హెచ్చరించారు. జవాన్లకు ఏ సమస్య వచ్చినా తనను నేరుగా కలవవచ్చని రావత్‌ సూచించారు. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియాలో ఎలాంటి పోస్టులు చేయవద్దని స్పష్టం చేశారు.

క్రమశిక్షణ ఉల్లంఘణ..
బట్టలు ఉతికించడం, బూట్లు పాలిష్‌ చేయించడం, కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లడం లాంటి పనులు చేయిస్తున్నారని ఇటీవల కొందరు జవాన్లు తమ ఆవేదనను సోషల్‌ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. దీన్ని సీరియస్‌గా పరిగిణించిన ఆర్మీ.. ఇలాంటి చర్యలు క్రమశిక్షణ ఉల్లంఘన కిందే వస్తాయని సీనియర్‌ అధికారులు ఎదురుదాడికి దిగారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ చీఫ్‌ రావత్‌.. ఆర్మీకి ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్‌ ఉందని, దాని ద్వారానే సమస్యలు చెప్పుకోవాలని సూచించారు. ఇదే సమయంలో ప్రతి అధికారికి వ్యక్తిగత పనులు చేసేందుకు ఒక వ్యక్తిని నియమించే సహాయక వ్యవస్థను కూడా రావత్‌ ఈ సందర్భంగా సమర్ధించుకున్నారు.

18:30 - January 15, 2017

చిత్తూరు : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని వెలివాడ దగ్గర రోహిత్‌ వేముల విగ్రహం దగ్గర నివాళులు అర్పించేందుకు అవకాశం కల్పించాలని ఆయన తల్లి రాధిక కోరారు. ఈనెల 17న రోహిత్‌ వర్ధంతి సందర్భంగా విద్యార్ధిలోకం తనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రోహిత్‌ వేముల విగ్రహం ఉన్న వెలివాడ ప్రాంతానికి ఎవరినీ వెళ్లనీయకుండా వీసీ అప్పారావు అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. తిరుపతిలో జరిగిన జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌లో అప్పారావుకు మిలీనియం ప్లేక్యూ అవార్డు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దళిత బిడ్డల చావుకు కారణమవుతున్నందుకు అప్పారావుకు ఈ అవార్డు ఇచ్చారా అని ప్రశ్నించారు. రోహిత్‌ వేముల కుటుంబానికి సాగుభూమిని, అతని సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఐద్వా ఏపీ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా రోహిత్‌ వేముల వర్దంతి పోస్టర్‌ను విడుదల చేశారు.

21:29 - January 13, 2017

ఢిల్లీ : నోట్ల ర‌ద్దుపై ప్రధాని న‌రేంద్ర మోదీని ప్రశ్నించే అవ‌కాశం లేద‌ని పార్లమెంటరీ క‌మిటీ స్పష్టం చేసింది. పిఏసి చైర్మన్, కాంగ్రెస్ నేత కేవీ థామ‌స్ చేసిన ప్రక‌ట‌న‌కు పూర్తి భిన్నంగా పీఏసీ స్పందించింది. నిబంధన 99 ప్రకారం క‌మిటీ ముందు సాక్ష్యం చెప్పడానికి లేదా సంప్రదింపుల కోసం ప్రధానిని పిలిచే అధికారం పీఏసీ ఛైర్మన్‌కు లేదని, ప్రధానికి స‌మ‌న్లు జారీ చేసే అధికారం పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీకి లేద‌ని బీజేపీ స‌భ్యులు నిషికాంత్ దూబె, భూపెంద‌ర్ యాద‌వ్‌, కిరీట్ సోమ‌య్య థామస్‌ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గ‌తంలో యూపీఏ ప్రభుత్వం హ‌యాంలో పీఏసీ చైర్మన్‌గా ఉన్న ముర‌ళీమ‌నోహ‌ర్ జోషి.. 2జీ స్కాం కేసులో అప్పటి ప్రధాని మ‌న్మోహ‌న్‌కు స‌మ‌న్లు జారీ చేయ‌డంపై దుమారం రేగింది. కాంగ్రెస్ స‌భ్యులు దీనికి తీవ్ర అభ్యంత‌రం చెప్పారు. అప్పుడు క‌మిటీలో కాంగ్రెస్‌కు మెజార్టీ ఉండ‌టంతో జోషి నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకోక త‌ప్పలేదు.

Pages

Don't Miss

Subscribe to RSS - indian politics