jammu kashmir

20:36 - September 27, 2017

పాకిస్తాన్ : టమాట కేజీ వంద రూపాయలంటేనే మనం అల్లాడిపోతాం....అలాంటిది పాకిస్తాన్‌లో కేజీ టమాటా 300 రూపాయలు పలుకుతోంది. లాహోర్‌, పంజాబ్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో కిలో టమోటో ౩ వందలు, రావల్పిండి, ఇస్లామాబాద్‌లో 2 వందలు రూపాయలు ఉంది. భారత్‌ నుంచి సరఫరా తగ్గిపోవడంతో పాకిస్తాన్‌కు ఈ సమస్య వచ్చింది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా భారత్‌ నుంచి మాత్రం టమోటోను దిగుమతి చేసుకునేది లేదని పాక్‌ ఆహార భద్రత మంత్రి సికందర్‌ హయత్‌ బోసన్‌ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాక్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. బలుచిస్తాన్‌లో టమాట కోతకు వచ్చిందని మరి కొద్ది రోజుల్లో ధరలు తగ్గనున్నాయని చెబుతున్నారు.

 

21:56 - August 19, 2017

శ్రీనగర్ : కశ్మీర్‌లోని షోపియా జిల్లాలో దాక్కున్న ఆరుగురు ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా 9 గ్రామాలను భద్రతాదళాలు చుట్టు ముట్టాయి. భారీగా ఎత్తున మోహరించి పోలీసులు, ఆర్మీ కలిసి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్‌ చేపట్టారు. చకూరా, మాత్రిబుగ్, ప్రతాప్‌పోరా, టకీపోరా, రత్నీపోరా, రాణిపోరా, దాన్‌గామ్, వన్‌గామ్‌ గ్రామాల్లో భద్రతాదళాలు ప్రతి ఇంటిని సోదా చేస్తున్నాయి. గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు బయటవ్యక్తులను అనుమతించడం లేదు. గత రాత్రి వాహనాల్లో ఉగ్రవాదులు సంచరించారన్న సమాచారం మేరకు పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి.

15:56 - August 16, 2017

శ్రీనగర్ : ఉగ్రవాదులకు నిధులు ఆపేందుకు గాను జమ్ముకశ్మీర్‌లో 12 చోట్ల ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది. కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదులకు, రాళ్లు విసిరే అల్లరి మూకలకు నిధులు సమాకూర్చుతున్నారన్న ఆరోపణల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ ఈ దాడులు చేసింది. శ్రీనగర్‌, హంద్వాడా, బారాముల్లా లోని 12 చోట్ల ఎన్‌ఐఏ బృందం సోదాలు నిర్వహించింది. ఎన్‌ఐఏ నిర్వహించిన సోదాల్లో వేర్పాటువాద నేతల బంధువులు, హవాలా వ్యాపారుల ఇళ్లు కూడా ఉన్నాయి. ఎన్‌ఐఏ హురియత్‌ నేత గిలానీని టార్గెట్‌ చేస్తోంది. హవాలా వ్యాపారులకు వేర్పాటువాద నేతలతో సంబంధాలున్నాయని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చకుండా విచారణ జరపాలన్న కేంద్రం ఆదేశాల మేరకు ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. గిలానీ పాత్రపై ఆయన కుమారులు నయీం, నసీంలను ఎన్‌ఐఏ విచారిస్తోంది. త్వరలోనే గిలానీని కూడా విచారించే అవకాశం ఉంది. ఉగ్రవాదుల నిధులకు సంబంధించి ఎన్‌ఐఏ ఇప్పటికే చాలామందిని విచారించింది. ఏడుగురు వేర్పాటువాద నేతలను అరెస్ట్‌ చేసింది.

 

21:56 - August 13, 2017

శ్రీనగర్ : జమ్ము, కశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. భద్రతా దళాలపై కాల్పులుకు తెగబడ్డారు. ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య హోరాహోరీ జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతమయ్యారు. వీరిని కుల్గామ్‌కు చెందిన ఉమర్‌ మజీద్‌ మీర్‌, మల్దురా వాసి ఇర్ఫాన్‌ షేక్‌, సోపియాన్‌కు చెందిన ఆదిల్‌ మాలిక్‌గా గుర్తించారు. సోపియాన్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు ఇళయరాజా, గొవాయ్‌ సుమేధ్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. బందిపొరా జిల్లాలోని జైనాపొరలో  జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. క్షతగాత్రులను శ్రీనగర్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

 

15:56 - August 12, 2017

శ్రీనగర్ : పాకిస్తాన్‌ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జమ్ముకశ్మీర్‌లోని మెండర్‌ సెక్టార్‌లో పాకిస్తాన్‌ కాల్పులు జరిపింది. పాక్‌ ఆర్మీ మోర్టార్లతో జరిపిన కాల్పుల్లో 45 ఏళ్ల మహిళ మృతి చెందడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఎల్వోసి వద్ద పాకిస్తాన్‌ సేనకు భారత్‌ తగినరీతిలో జవాబు చెప్పింది. పాకిస్తాన్‌ ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 250 సార్లు సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. మరోవైపు కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు నిన్న అర్ధరాత్రి దాటాక దూరం నుంచి కాల్పులు జరిపారు. జవాబుగా ఆర్మీ కూడా కాల్పులు జరపడంతో చీకటిని ఆసరగా చేసుకుని ఉగ్రవాదులు పారిపోయారు. ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

21:27 - August 5, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌లో ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ జవానుకు గాయాలయ్యాయి. ఉత్తర కశ్మీర్‌లో అమర్‌గర్‌లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు నిన్న అర్ధరాత్రి దాటాకా భద్రతా బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు సిఆర్‌పిఎఫ్‌ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదుల నుంచి మూడు రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు బందిపొరా జిల్లాలోని సంబోల్‌ ప్రాంతంలో భద్రతాబలగాల వాహనాలపై స్థానిక యువకులు రాళ్లతో దాడి చేశారు. అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు స్థానికులు గాయపడ్డారు.

 

21:49 - August 1, 2017

శ్రీనగర్ : కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా హక్రిపొరలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో కరుడుకట్టిన ఉగ్రవాది, లష్కరే తోయిబా  కమాండర్‌ అబూ దుజానా కూడా ఉన్నారు. లష్కరేకే చెందిన మరో ఉగ్రవాది ఆరీఫ్‌ కూడా హతమయ్యాడు. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భీకరపోరు జరిగింది. హక్రిపొరలో మరో ఇద్దరు ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంలో భద్రతా దళాలు ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. అబూ దుజానా తలపై పది లక్షల రూపాయల  రివార్డు ఉంది. ఈ ఏడాది మే లో భద్రతా దళాలు చుట్టుముట్టినప్పుడు కళ్లుకప్పి తప్పించుకున్నాడు. అబూ దుజానా ఎన్‌కౌంటర్‌ తర్వాత హక్రిపొరలో హింస చెలరేగింది. దుజానా ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ ఆందోళనకారులు భద్రతా దళాలపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు, సైనికులు భాష్ఫబాయుగోళాలను ప్రయోగించారు. 

12:07 - July 30, 2017

ఢిల్లీ : ఇండియా అంటే ఇందిరాగాంధీనే అంటూ జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కొనియాడారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోది గొప్పవారని పొగుడుతూనే.. ఇందిరాగాంధీపై ప్రశంసలు కురిపించారు. కొంతమందికి ఇది ఇష్టం లేకపోవచ్చు కానీ...నాకు మాత్రం ఇందిర అంటే భారతదేశం...నేను మళ్లీ అలాంటి భారత్‌ను చూడాలని అనుకుంటున్నానని తెలిపారు. కశ్మీర్‌ బాధను, కష్టాన్ని, ఏడ్పును తనదిగా భావించే భారత్‌ను మళ్లీ చూడాలని ఉందని మెహబూబా పేర్కొన్నారు. కశ్మీర్‌ అంటే మినీ భారత్‌ అని...ఇక్కడ అన్ని మతాల, ప్రాంతాల ప్రజలు ఉన్నారని భావోద్వేగంతో చెప్పారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను వెనక్కి తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ముఫ్తి హెచ్చరించారు.

 

14:04 - July 17, 2017

శ్రీనగర్ : పాకిస్తాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో పాకిస్తాన్‌ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఏడేళ్ల బాలికతో పాటు ఓ జవాను అమరుడయ్యాడు. మృతి చెందిన జవానును నాయక్‌ ముదస్సర్‌ అహ్మద్‌గా గుర్తించారు. 37 ఏళ్ల అహ్మద్‌కు ఇద్దరు పిల్లలున్నారు. పాక్‌ కాల్పుల్లో మరో ఇద్దరు పౌరులు కూడా గాయపడ్డారు. ఉదయం ఏడున్నర ప్రాంతంలో రాజౌరిలోని బంకర్‌పై పాక్‌ బలగాలు మోర్టార్‌ షెల్స్‌తో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. పాక్‌ దాడులకు దీటైన జవాబు చెబుతామని మిలటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ స్పష్టం చేశారు.

21:30 - July 16, 2017

జమ్మూ కాశ్మీర్ : అమర్‌నాథ్‌ యాత్రలో మరో విషాదం నెలకొంది. లోయలో బస్సు పడటంతో 16 మంది మృతి చెందారు. గుజరాత్‌ నుంచి జమ్ము వస్తున్న బస్సు రాంబాన్‌ జిల్లాలోని జాతీయరహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. దాంతో 16 మంది మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు, ఆర్మీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హెలికాప్టర్లలో చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. బస్సు అమర్‌నాథ్‌ యాత్రకు వస్తున్నట్లు ఎలాంటి బోర్డు పెట్టుకోలేదు. ఈ ఘటన వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాదుల హస్తం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అమర్‌నాథ్‌ యాత్రికుల ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదంలో యాత్రికుల మృతి అత్యంత బాధాకరమని ప్రధాని ఆవేదన వ్యక్తంచేశారు. బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - jammu kashmir