janasena

19:59 - October 15, 2018

రాజమండ్రి: ముఖ్యమంత్రి పదవిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారసత్వంతో ముఖ్యమంత్రులు కాలేరు అని పవన్ కళ్యాణ్ అన్నారు. తాత ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి కావాలని నారా లోకేష్ అనుకున్నప్పుడు, తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి కావాలని వైఎస్ జగన్ అనుకున్నప్పుడు.. ఒక మున్సిబు ముని మునవడు, పోస్ట్ మ్యాన్ మనవడు, కానిస్టేబుల్ కొడుకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు కాలేడు? అని పవన్ ప్రశ్నించారు. నేను కచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతాను అని పవన్ అన్నారు. అయితే సీఎం పదవి తనకు అలంకారం కాదని పవన్ స్పష్టం చేశారు. ఇక సభలో 'సీఎం..సీఎం' అంటూ అభిమానులు చేసిన నినాదాలపై స్పందించిన పవన్ 'మీరు చేసే నినాదం సత్యమై తీరుతుంది' అని అన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం వంతెనపై జనసేన కవాతు ముగిసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

10:30 - October 15, 2018

తూర్పుగోదావరి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టే కవాతు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3గంటలకు పిచ్చుకలంక నుంచి జనసేన కవాతు ప్రారంభం కానుంది. పిచ్చుకలంక నుంచి ధవళేశ్వరం కాటన్ విగ్రహం వరకు బ్యారేజీ పై రెండున్నర కిలోమీటర్ల వరకు జనసేన కవాతు జరగనుంది. సాయంత్రం 5గంటలకు ధవళేశ్వరం కాటన్ బ్రిడ్జి దగ్గర పవన్ కల్యాణ్ బహిరంగ సభ జరగనుంది..

రాజకీయ జవాబుదారితనమే జనసేన కవాతు ఉద్ధేశ్యమన్న పవన్ కల్యాణ్  నవతరం రాజకీయాల కోసమే జనసేన ప్రజాపోరాటయాత్ర చేస్తుందన్నారు. కవాతులో పాల్గొనబోతున్న జనసైనికులందరికి ట్విట్టర్ ద్వారా పలు సూచనలు చేశారు పవన్. మీరు క్షేమంగా వచ్చి క్షేమంగా ఇంటికి చేరాలి, ఒక క్రమశిక్షణతో ముందుకు వెళదాం, కలిసి నడుద్దాం, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు.

ధవళేశ్వరం బ్యారేజ్‌ పై నిర్వహిస్తున్న జనసేన కవాతుకు రెండు లక్షల మంది వస్తారని పార్టీ నాయకుల అంచనా. మధ్యాహ్నం 3గంటలకు పిచ్చుకలంక నుంచి కవాతు ప్రారంభమై ధవళేశ్వరం కాటన్‌ విగ్రహం వరకు సాగుతుందని, అక్కడ సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ఉంటుందని స్పష్టం చేశారు పార్టీ నేతలు. ధవళేశ్వరం-వేమగిరి రోడ్డు ఫేసింగ్‌లో సభ నిర్వహించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి వచ్చే అభిమానులు, కార్యకర్తల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  ఎక్కడికక్కడ తాగునీరు, భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఈ కవాతుకు సంబంధించి ఇరిగేషన్‌, పోలీస్‌, మత్స్యశాఖ, రెవెన్యూశాఖల నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని జనసేన నాయకులు తెలిపారు..

బ్యారేజ్‌వద్ద కవాతు జరిగే సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా రక్షణ ఏర్పాట్లు చేశారు. బ్యారేజ్‌కు ఇరువైపులా గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేశామన్నారు పార్టీ నాయకులు.. కవాతుకు వచ్చినవారు సురక్షితంగా ఇంటికి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేశామని, 1200మంది వలంటీర్లను నియమంచామని, కవాతు జరిగే ప్రదేశం నుంచి సభ జరిగే ప్రాంతం వరకు 15 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు..

11:51 - October 13, 2018

విజయవాడ : రాష్ట్ర ప్రయోజనాలు దక్కించుకోవడానికి అఖిలపక్ష సమావేశాన్ని టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. విజయవాడలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వమతప్రార్థనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పవన్‌తో పాటు పార్టీలో చేరిన నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ పలు విషయాలపై మాట్లాడారు. తాను విమర్శించే సమయంలో బీజేపీని వెనకేసుకొస్తున్నారంటున్నారని..ఇక్కడ తనకు బీజేపీ ఏమీ బంధువు కాదని..మోడీ తన అన్న కాడని...అమిత్ షా తన బంధువు కాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవాలని..అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని..తాను సమావేశానికి హాజరవుతానని..ఢిల్లీకి తీసుకెళితే ప్రధాన మంత్రి మోడీతో మాట్లాడుదామన్నారు. కానీ హోదాపై భిన్నమైన వ్యాఖ్యలు చేయవద్దన్నారు. హోదాపై ముఖ్యమంత్రి ఎన్ని భిన్నమైన మాటలు మాట్లాడారో అందరికీ తెలిసిందేనన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాన్ బాధితులను తాను పరామర్శించకపోవడం బాధిస్తోందని కానీ అక్కడకు వెళితే సహాయక చర్యలకు ఆంటకం కలుగుతుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే వైజాగ్ వెళ్లి 17న శ్రీకాకుళంలో పర్యటన చేస్తామని, ఈ పర్యటనలో నాదెండ్ల మనోహర్ కూడా ఉంటారని వెల్లడించారు. నాదెండ్లవి..తనవి అభిప్రాయాలు ఒక్కటేనన్నారు. పార్టీ కోసం ఆయన సలహాలు..సూచనలు తీసుకొనేవాడినని, తప్పులు జరుగకూడదని..సరికొత్త రాజకీయం చేయాలని..బాధ్యతతో కూడుకున్న పనులు చేయడం..సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశ్యం తమలో ఉందన్నారు. 
రాజకీయాల్లో కొత్తతరమైన నాయకత్వం తీసుకరావాలని ఉద్దేశ్యం..ఒక ధృడ సంకల్పం ఆయనలో ఉందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇచ్చిన మాటకు నిలబడి ఉంటామని, రాష్ట్రం ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తాము పాటుపడుతామని వెల్లడించారు. 15వ తేదీ నిర్వహించే కవాతులో యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. 

21:40 - October 12, 2018

విజయవాడ : వెంకటేశ్వరస్వామి సన్నిధిలో మనస్ఫూర్తిగా నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజలకు అండగా ఉండటానికి బలమైన కుటుంబం కావాలన్నారు. పార్టీని ముందుకు నడిపించడానికి బలమైన వ్యక్తిత్వమున్న వ్యక్తులు కావాలని..ఆలాంటి వ్యక్తి నాదేండ్ల మనోహర్ అని పవన్ తెలిపారు. పార్టీలో నాదెండ్ల తనకు పెద్దన్నలాంటి వారని కొనియాడారు. 

 

14:40 - October 11, 2018

విజయవాడ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన జనసేనలో చేరబోతున్నారు. ఆయన పార్టీలో చేరితే కృ‌ష్ణా, గుంటూరు జిల్లాలో సామాజిక సమీకరణాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. కానీ నాలుగేళ్లుగా పవన్‌తో నాదెండ్ల మైత్రి పూర్వక సంబంధం కొనసాగిస్తున్నారు. పవన్ నిర్వహించే సభలు..సమావేశాలకు మనోహర్ సూచనలు చేస్తున్నారు. జనసేన భావజాలం, పవన్ వ్యక్తిత్వం..నాదెండ్ల నిర్ణయానికి దోహదం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కులాల మధ్య సఖ్యత పెంచాలని ఇరువురి మధ్య ఏకాభిప్రాయం ఉందనే చెప్పవచ్చు. అంతేగాకుండా జనసేనకు దూరంగా ఉన్న సామాజిక వర్గాన్ని అక్కున్న చేర్చుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. నాదెండ్ల మనోహర్ వ్యక్తిగతంగా వివాదరహితుడిగా పేరొందారు. మరి నాదెండ్ల ఎంతమేరకు సక్సెస్ అవుతారు ? ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

08:57 - October 9, 2018

ఏలూరు: పోరాట‌యాత్ర‌లో భాగంగా ప‌శ్చిమగోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఏపీ మంత్రి నారా లోకేష్ పై విమ‌ర్శ‌లు చేశారు. లోకేష్ కెపాసిటీ ఏంటో ప‌వ‌న్ వివ‌రించారు. లోకేష్ కనీసం సర్పంచ్‌గా కూడా గెలవలేడ‌ని , ఆయ‌న‌కు అంత స‌త్తా లేద‌ని ప‌వ‌న్ తేల్చేశారు.జనసేనకు భయపడే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదని ప‌వ‌న్ విమర్శించారు. పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తే.. ఎక్కడ జనసేన క్షేత్రస్థాయిలో బలంగా పాతుకుపోతుందోనని చంద్రబాబు భయపడుతున్నారని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొయ్య‌ల‌గూడెంలో ప‌వ‌న్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్వాసితులకు సరైన న్యాయం జరగలేదని ప‌వ‌న్ వాపోయారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని  చెప్పారు. జనసేన అధికారంలోకి వస్తే కౌలు రైతులకు అండగా ఉంటామని, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని ప‌వ‌న్ భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రతీ గ్రామంలో జనసేన జెండా ఎగురుతుందని, గ్రామాలకు నిస్వార్థంగా సేవ చేసే సర్పంచ్‌ల అవసరం ఉందని స్పష్టం చేశారు. 

ఇక దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని గురించి ప్రస్తావిస్తూ.. ఆయన్ను విప్ పదవి నుంచి తొలగిస్తారా? లేక ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు లేఖ రాయమంటారా? అని సీఎం చంద్రబాబును ప‌వ‌న్ హెచ్చరించారు.

09:14 - October 8, 2018

ఏలూరు:  రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌నే విషయం తెలిసిందే. ఆయా పార్టీల అవ‌స‌రాలు, ప్ర‌యోజ‌నాల కోసం ఎవ‌రితోనైనా చేతులు క‌లుపుతారు, పొత్తులు పెట్టుకుంటారు. తెలంగాణలో ఏం జ‌రిగిందో అంతా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ.. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని సంచ‌ల‌నానికి తెర‌తీసింది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకుని ముందుకెళ్తున్నాయి. ఇదే ఫార్మాల‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఫాలో అవుతారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. 2019 ఎన్నికల్లో  అధికారంలోకి వ‌చ్చేందుకు వ్యూహం ర‌చిస్తున్న ప‌వ‌న్...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.   

ఈ విశ్లేష‌ణ‌కు కార‌ణం జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లే. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాకు శత్రువు కాదు అని చెప్పి పవన్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న సృష్టించారు. జగన్ నా శత్రువు కాదు.. అస‌లు నాకు శత్రువులెవరూ కూడా లేరు అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమ‌న్నారు. నేను పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో ఎన్టీఆర్ మాదిరిగా ఉప్పెన లేదు.. నా సోదరుడు చిరంజీవి పార్టీ పెట్టిన సమయంలో అభిమానుల ప్రవాహం లేదు అని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో మంచి పాలన అందిస్తారనే ఉద్దేశ్యంతోనే తాను 2014లో టీడీపీకి మద్ద‌తిచ్చినట్టు ప‌వ‌న్ పేర్కొన్నారు. మోసాలు చేస్తే  చూస్తూ ఊరుకోనని హెచ్చ‌రించారు.
 
అయితే జగన్ శత్రువు కాదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చర్చ ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో పవన్ జగన్‌తో పొత్తు పెట్టుకుంటారా? అనే దాని గురించి చర్చించుకుంటున్నారు. అయితే గతంలో పవన్‌పై జగన్ వ్యక్తిగత విమర్శలు చేయ‌డం, ఆ విమర్శలకు పవన్ కళ్యాణ్ కూడా ఘాటుగానే స్పందించడం తెలిసిందే. కాబట్టి జ‌గ‌న్ తో పొత్తు ఉండ‌క‌పోవ‌చ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ ఊహించ‌లేరు. ఎప్పుడైనా ఏమైనా జ‌ర‌గొచ్చు.

14:03 - October 7, 2018

హైద‌రాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు తేదీలు ఖ‌రారు కావ‌డంతో అన్ని పార్టీలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ప్ర‌చార‌ప‌ర్వాన్ని ప‌రుగులు పెట్టించేందుకు సిద్ధమ‌వుతున్నాయి. ఈ విష‌యంలో టీఆర్ఎస్ ముందుండ‌గా.. ప్ర‌తిపక్షాలు ఇంకా పొత్తులు, చ‌ర్చ‌ల వ‌ద్దే ఆగిపోయాయి. టీఆర్ఎస్ కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తిప‌క్షాలు మ‌హాకూట‌మిగా ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. త‌మ మ‌హాకూట‌మిలోకి ఇత‌ర పార్టీలు కూడా రావాల‌ని కాంగ్రెస్ నాయ‌కులు ఆశిస్తున్నారు. తాజాగా టీ పీపీసీ ఎన్నిక‌ల వ్యూహ క‌మిటీ చైర్మ‌న్, ఏఐసీసీ కార్య‌ద‌ర్శి వి.హ‌నుమంత‌రావు జ‌న‌సేన గురించి ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన మ‌హాకూట‌మిలోకి వ‌స్తే ఆహ్వానిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. జ‌న‌సేన సొంతంగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయ‌ని వీహెచ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించ‌డానికి ప‌వ‌న్ మ‌హాకూట‌మిలోకి రావాల‌ని వీహెచ్ కోరారు. ప్రజాస్వామ్యంలో విలువ‌లు లేకుండా పోతున్నాయని ప‌వ‌న్ పార్టీ పెట్టారని వీహెచ్ గుర్తు చేశారు. కాగా తెలంగాణ‌లో 25సీట్ల‌లో జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయ‌ని... అయితే తెలంగాణ‌లో దొర‌ల పాల‌న‌కు తెర‌దించేందుకు విప‌క్షాల‌న్నీ ఏక‌మైన వేళ‌.. ప‌వ‌న్ ఇక్క‌డ పోటీ చేసి ఓట్లు డివైడ్ చేయ‌డం మంచి సంప్ర‌దాయం కాదని వీహెచ్ హిత‌వు ప‌లికారు. ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేసి ఓట్లు చీల్చి ప్ర‌జాస్వామ్యాన్ని అవినీతిప‌రుల‌కు ఇవ్వొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కేసీఆర్ కు వ్య‌తిరేకంగా ప‌వ‌న్ కూడా మ‌హాకూట‌మిలో క‌ల‌వాల‌ని వీహెచ్ కోరారు.

ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కావ‌డంతో కాంగ్రెస్ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింద‌ని..ఇందిరా విజ‌యర‌థం పేరుతో తాను ఎన్నిక‌ల ప్ర‌చారం చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు వీహెచ్ వెల్ల‌డించారు.

11:25 - October 6, 2018

పశ్చిమగోదావరి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో చేపట్టబోయే కవాతు వాయిదా పడినట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. ఈనెల 9వ తేదీన కవాతు నిర్వహించాలని పార్టీ నిర్వహించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా పవన్ పోరాట యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పశ్చిమ గోదావరిలో నిర్వహిస్తున్న పోరాట యాత్రలో పవన్ ప్రభుత్వం..నేతలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 

అక్టోబర్ 9వ తేదీన భారీగా కవాతు నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కొవ్వూరు నుండి రాజమండ్రి వరకు కవాతు నిర్వహించాలని పవన్ భావించారు. కొవ్వూరు, రాజమండ్రి మధ్య గోదావరిపై ఉన్న రోడ్ కమ్ రైల్వే వంతెనపై కవాతు సాగించేందుకు నేతలు నిర్ణయం తీసుకున్నారు. 

కానీ కవాతుకు అనుమతులు తీసుకోవాల్సి ఉండడం..ఇతరత్రా ఏర్పాట్లకు సమయం లేకపోవడంతో కవాతును వాయిదా వేసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కవాతు వాయిదా వేయాలా ? వద్దా ? అనే దానిపై విజయవాడలో నేతలు చర్చించారు. ఈనెల 15వ తేదీన ధవళేశ్వరం బ్యారేజీపై కవాతు ఉంటుందని రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ శ్రీ మాదాసు గంగాదరం వెల్లడించారు. పాత బ్రిడ్జీ నుండి ధవళేశ్వరం బ్యారేజీకి మారిందని, అంతేగాకుండా జనబాట కార్యక్రమం కూడా కొనసాగుతోందన్నారు. 

11:20 - October 5, 2018

విజయవాడ : ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏపీ రాష్ట్రంలోని నేతలు జనాల మధ్య ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప పేరిట యాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి సంబంధించిన నేతలు కార్యక్రమాల పేరిట జనాల్లోకి వెళుతున్నారు. జనసేన అధినేత పవన్ కూడా పోరాట యాత్ర పేరిట వివిధ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయా బహిరంగసభల్లో పాల్గొంటున్న పవన్ ప్రభుత్వం..నేతలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ రాజకీయ వేడి రగిలిస్తున్నారు. అధికార పార్టీ అవినీతిని నిలదీస్తున్న పవన్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీని సైతం వదలడం లేదు. జగన్ పార్టీని కూడా తూర్పారబడుతున్నారు. 

ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. అక్టోబర్ 9వ తేదీన భారీగా కవాతు నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కొవ్వూరు నుండి రాజమండ్రి వరకు కవాతు నిర్వహించాలని పవన్ భావించారు. కొవ్వూరు, రాజమండ్రి మధ్య గోదావరిపై ఉన్న రోడ్ కమ్ రైల్వే వంతెనపై కవాతు సాగించేందుకు నేతలు నిర్ణయం తీసుకున్నారు. 

కానీ ఈ కవాతు వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. కవాతుకు అనుమతులు తీసుకోవాల్సి ఉండడం..ఇతరత్రా ఏర్పాట్లకు సమయం లేకపోవడంతో కవాతును వాయిదా వేసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కవాతు వాయిదా వేయాలా ? వద్దా ? అనే దానిపై విజయవాడలో గురువారం సాయంత్రం నేతలు చర్చించినట్లు సమాచారం. వాయిదాకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరి కవాతు ఉంటుందా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - janasena