kadapa

06:59 - April 21, 2017

గుంటూరు : . ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులతో పాటు.. రాజధాని డిజైన్స్‌పై చర్చించనున్నారు. అమరావతిలో నిర్మించనున్న ప్రభుత్వ భవనాల సముదాయాలపై మంత్రులు, అధికారుల అభిప్రాయాలు చంద్రబాబు తెలుసుకోనున్నారు.
డ్రాఫ్ట్‌ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం?
వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చే సందర్భంలో విధించే నాలా చార్జీల తగ్గింపుపై ఆంధ్రప్రదేశ్‌ భూమార్పిడి చట్టం 2006లో మార్పులు చేస్తూ రూపొందించిన డ్రాఫ్ట్‌ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గం ఆమోదం తర్వాత ఈ బిల్లును త్వరలో జరగబోయే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఇక రాష్ట్రంలో వేడి తీవ్రత కారణంగా పెరిగిన తాగునీటి సమస్యకు పరిష్కారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. అలాగే భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం చేపట్టిన నీరు-ప్రగతి కార్యక్రమంపై మరింత లోతుగా చర్చించే అవకాశం కనిపిస్తోంది.
ఆదరణ పథకం పునరుద్ధరణపై చర్చ
ఇక గతంలో ఉన్న ఆదరణ పథకం పునరుద్ధరణపై మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పసుపు, కంది పంటలకు మద్దతు ధర, మిర్చి ధరలు పడిపోవడంతో రైతులను ఆదుకునేందుకు కేంద్ర సాయం కోరడంపైన కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇక జీఎస్టీ బిల్లును ఆమోదించడం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించే అంశంపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది. అలాగే స్పోర్ట్స్‌ పాలసీని ఆమోదించడంతో పాటు శ్రీకాకుళంలోని రణస్థలంలో 130 ఎకరాల భూమిని పరిశ్రమలకు డెవలప్‌ చేసుకునేందుకు అనుమతిచ్చే అవకాశం ఉంది.ఇక మంత్రివర్గ సమావేశానికి ముందే ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో టీడీపీ కో-ఆర్డినేషన్‌ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో టీడీపీ సంస్థాగత ఎన్నికలు, మహానాడు నిర్వహణ, నంద్యాల ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థి ఎంపికపై చర్చించే అవకాశం ఉంది.

 

18:42 - April 20, 2017

కడప: కడప మార్కెట్ యార్డును వైసీపీ నేతలు సందర్శించారు. ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు అంజాద్‌ భాష, రఘురామిరెడ్డిలు.. పసుపు రైతు పడుతున్న కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

18:40 - April 20, 2017

కడప: జిల్లాలో తమ్ముళ్లను పక్కన పెట్టిన.. తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బే తగిలేలా ఉంది. ఇక తాడోపేడో తేల్చుకోవడానికి టీడీపీ సీనియర్ నేతలు సిద్ధమవుతున్నారు. దానికి ఫలితమే ఇదిగో ఈ ఆమరణ నిరాహార దీక్ష. తమ ఉనికి కోసం నిరసన బాట పట్టారు.

కడప జిల్లాలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న టీడీపీలో...

కడప జిల్లాలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న టీడీపీలో చెలరేగుతున్న అసంతృప్తి.. పార్టీ అధిష్టానికి తలనొప్పిగా మారుతోంది. జిల్లాలో టీడీపీ పట్టు సాధించడం అంత సులువు కాదన్న విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. ఈ మధ్యే వైసీపీలోని బలమైన నాయకత్వాన్ని టీడీపీ అధిష్టానం పార్టీలోకి తీసుకుంది. వైసీపీ నేతలు టీడీపీలోకి రావడాన్ని కొందరు వ్యతిరేకించారు. కానీ పార్టీ పటిష్టత కోసం రాజీ పడ్డారు.

పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి పోరాడిన సీనియర్లను కాదని..

పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి పోరాడిన సీనియర్లను కాదని.. వైసీపీ నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యమివ్వడం.. జిల్లా తెలుగు దేశంలో కాక పుట్టిస్తోంది. ఇటీవలే జమ్మలమడుగులో టీడీపీ కార్యకర్తలు ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. ఆందోళనకు దిగారు. అది చల్లారక ముందే కడప నగరంలో సీనియర్ టీడీపీ నాయకులు రోడ్డెక్కారు. తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ ఏకంగా ఎన్టీఆర్‌ విగ్రహం ముందు నిరాహార దీక్షకు దిగారు. అయితే వారి దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

వైసీపీలోంచి వచ్చిన వారి హవానే...

ఇప్పుడు కడప జిల్లాలో వైసీపీలోంచి వచ్చిన వారి హవానే నడుస్తోంది. వాళ్లకే కాంట్రాక్టులు, పదవులు, ప్రాధాన్యత దక్కుతోందని టీడీపీ సీనియర్ నేతలు వాపోతున్నారు. ఇటీవల కడప నగరానికి దాదాపు 15 కోట్ల పనులకు నిధులు విడుదల అయ్యాయి. ఇందులో చాలా వరకు వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చిన వారికి కాంట్రాక్టులు ఇచ్చారు. సీనియర్ కార్యకర్తల్ని ఎవరినీ పట్టించుకోవడం లేదని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ అధిష్టానం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెబుతున్నారు. మొత్తానికి కడప జిల్లాలో టీడీపీ మినీ వైసీపీగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. 

07:09 - April 20, 2017

 

గుంటూరు : ఏపీలో రైతు సమస్యలపై పోరాటానికి ప్రతిపక్ష వైసీపీ సిద్ధమైంది. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తోన్న పార్టీ అధినేత జగన్‌.. రెండు రోజుల పాటు దీక్షను చేపట్టనున్నారు. గుంటూరులో అధినేత దీక్షకు వైసీపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి.

రైతులకు గిట్టుబాటు..

ఏపీలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న డిమాండ్‌తో మరో పోరాటానికి విపక్ష వైసీపీ సిద్ధమవుతోంది. పార్టీ అధినేత జగన్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ రెండు రోజుల పాటు దీక్ష చేయనున్నారు. ఈ దీక్షకు గుంటూరును వేదికగా ఎంచుకున్నారు. ఈ నెల 26, 27 తేదీలలో దీక్ష చేయనున్నట్టు వైసీపీ ప్రకటించింది.

మిర్చి ధరలు పడిపోతున్నాయి..
ఇటీవల గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో ధరలు పడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నది వైసీపీ ఆరోపణ. ఇటీవలే పార్టీ అధినేత జగన్‌.. గుంటూరు మిర్చియార్డును సందర్శించి, రైతుల కష్టాలను తెలుసుకున్నారు.

ప్రభుత్వ ఉదాసీనత.....
పార్టీ శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, మిర్చి మాత్రమే కాకుండా ఇతర పంటలకూ మార్కెట్లలో ఇదే పరిస్థితి ఉందని ఆయన భావిస్తున్నారు. పంటను మార్కెట్లో అమ్ముకునేందుకు వచ్చిన రైతులను దళారులు మోసం చేస్తున్నారనీ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉదాసీనత వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో జగన్‌, ఈనెల 26, 27 తేదీలలో దీక్షకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే ప్రారంభించాయి. 

06:57 - April 20, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక భూమా, శిల్పా వర్గాల్లో చిచ్చు రేపుతోంది. తాము పోటీ చేస్తామంటే.. తామే పోటీ చేస్తామని ఇరు వర్గాలు సిద్ధమవుతున్నాయి. తన తండ్రి అకాల మరణంతో ఖాళీ అయిన స్థానంలో పోటీ చేసే అవకాశం తమకే దక్కుతుందని భూమా అఖిలప్రియ అంటుండగా.. ఎన్నికల్లో పోటీ చేయకపోతే తన కేడర్‌ చెదిరిపోతుందని శిల్పా మోహన్‌రెడ్డి అంటున్నారు. దీంతో చంద్రబాబు ఇరు వర్గాలతో చర్చలు ప్రారంభించారు.
నంద్యాల ఉప ఎన్నికపై టీడీపీలో హీట్‌
భూమా నాగిరెడ్డి అకాల మృతితో ఖాళీ అయిన నంద్యాల ఉప ఎన్నికపై టీడీపీలో హీట్‌ పెరుగుతోంది. ఖాళీ అయిన స్థానం తమ కుటుంబానికే చెందుతుందని మంత్రి అఖిలప్రియ చెబుతుండగా.. ఖచ్చితంగా తానే పోటీ చేస్తానని నంద్యాల టీడీపీ నేత శిల్పా మోహన్‌రెడ్డి చెబుతున్నారు. అయితే.. ఈ ఇద్దరు నేతలు సీఎం చంద్రబాబును కలవడంతో పోటీ చేసేందుకు ఎవరికి అవకాశం దక్కుతుందా అనే టెన్షన్‌ పెరిగిపోయింది.
పార్టీ మారనున్న శిల్పా మోహన్‌రెడ్డి 
గత కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్న శిల్పా మోహన్‌రెడ్డి పార్టీ మారనున్నట్లు ప్రచారం జరిగింది. వైసీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైన్నట్లు తెలుస్తోంది. అయితే.. చివరి నిమిషంలో రంగంలోకి దిగిన మంత్రులు, నేతలు శిల్పాను చంద్రబాబు దగ్గరకు తీసుకువచ్చారు. చంద్రబాబుతో భేటీ అయిన శిల్పా సోదరులు గంటసేపు నంద్యాల ఉప ఎన్నికపై చర్చించారు. తన నిర్ణయాన్ని చంద్రబాబుకు చెప్పినట్లు, ఎట్టి పరిస్థితుల్లోనూ కేడర్‌ను పోగొట్టుకునే పరిస్థితుల్లో లేనని చెప్పినట్లు శిల్పా మోహన్‌రెడ్డి తెలిపారు. అయితే తొందరపడవద్దని చంద్రబాబు సూచించారన్నారు. మండలి చైర్మన్‌ పదవి తమ్ముడికి ఇచ్చినా.. నేను పోటీలో లేకుంటే కేడర్‌ చెదిరిపోతుందని నూటికి నూరుపాళ్లు పోటీ చేయాలనుకుంటున్నట్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు శిల్పా మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
శిల్పా సోదరులు బాబుతో భేటీ
ఇక ఉప ఎన్నికపై మంత్రి అఖిలప్రియ కూడా స్పందించారు. శిల్పా సోదరులు బాబుతో భేటీ అయ్యేందుకు వచ్చిన సమయంలో ఆమె కూడా చంద్రబాబును కలిశారు. సాధారణంగా మంత్రి, ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి మృతి చెందితే ఆ కుటుంబం నుంచే అభ్యర్థిని ఎన్నుకోవడం సంప్రదాయంగా వస్తుందని.. ఆ మేరకు అందరూ సహకరిస్తారనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. మొత్తానికి ఉప ఎన్నిక ఇరు వర్గాల మధ్య చిచ్చు రేపుతోంది. మరి ఈ సమస్యను చంద్రబాబు ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి. 

 

 

 

 

18:48 - April 19, 2017

విజయవాడ : రానున్న నంద్యాల ఉపఎన్నికలలో తమ కుటుంబం నుంచే పోటీ చేస్తామని..త్వరలో అభ్యర్థిని ప్రకటిస్తామని టూరిజం శాఖా మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. విజయవాడ భవానీ ద్వీపాన్నీ అఖిలప్రియ పరిశీలించారు. పున్నమీఘాట్‌ నుంచి బోట్‌లో భవానీ ద్వీపానికి వెళ్లి అక్కడి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాధారణంగా మంత్రి, ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి మృతి చెందితే ఆ కుటుంబం నుంచే అభ్యర్థిని ఎన్నుకోవడం సంప్రదాయంగా వస్తుందని...ఆ మేరకు అందరూ సహకరిస్తారని అనుకుంటున్నామన్నారు.         

18:45 - April 19, 2017

అమరావతి: రైతులకు గిట్టుబాటు ధరల పతనం, పంటలకు మద్దతు ధర తగ్గడాన్ని నిరసిస్తూ... వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. దీక్షకు సిద్ధమయ్యారు. ఈనెల 26,27 తేదీల్లో గుంటూరులో 2 రోజుల పాటు ఆయన దీక్ష చేపట్టనున్నారు. వైసీపీ నాయకులు ఈ విషయాన్ని తెలిపారు. గిట్టుబాటు ధర లభించక రైతులు.. ఇబ్బందులు పడుతున్నా... చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు.

 

11:17 - April 19, 2017

కర్నూలు : మాజీ మంత్రి, కర్నూలు జిల్లా టిడిపి సీనియర్‌ నేత శిల్పా మోహన్‌రెడ్డి పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం అందుకుంది. వైసీపీలోకి శిల్పామోహన్‌రెడ్డి వెళ్తున్నారంటూ టీడీపీలో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఈనెల 21 లేదా 22న శిల్పా మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

 

21:11 - April 16, 2017

కడప : పొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక వ్యవహారం.. రణరంగాన్ని తలపించింది. ఎన్నిక వాయిదా వేయాలంటూ టీడీపీ నేతలు... జరిపి తీరాల్సిందేనంటూ వైసీపీ నేతలు పట్టుబట్టారు. పంతం నెగ్గించుకునేందుకు ఇరువర్గాలూ హంగామా సృష్టించాయి. టీడీపీ సభ్యులు బల్లలు, కుర్చీలు విరిచేయగా... వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ఏకంగా ఆర్ డీవోను కొట్టినంత పనిచేశారు. 
కుర్చీలు విసిరివేత  
తమ్ముళ్లు కోపంతో కుర్చీలు విరిచేశారు. అదే ఊపులో బల్లలు పగలగొట్టారు. తామేమీ తక్కువ తినలేదన్నట్లు వైసీపీ నేతలూ తిట్లపురాణం అందుకున్నారు. అధికారులను అడ్డుకునే క్రమంలో దాదాపు కొట్టినంత పని చేశారు.
నేతల హంగామా 
ఇదీ ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల్లో నేతల ప్రవర్తన తీరు.. రెండోరోజూ మున్సిపల్ చైర్మన్‌ ఎన్నికలోనూ నేతలు హంగామా సృష్టించారు.. ఆదివారం ఉదయం... ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి, ఆర్‌డీవో వినాయకం, జాయింట్‌ కలెక్టర్‌ శ్వేత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు.. కౌన్సిలర్ల పేర్ల నమోదు కార్యక్రమం చేపట్టారు..  అధికారుల విజ్ఞప్తితో వైసీపీ కౌన్సిలర్లు తమ పేర్లు నమోదు చేయించుకున్నారు.. టీడీపీ కౌన్సిలర్లు మాత్రం పేర్ల నమోదుకు ముందుకు రాలేదు.. తమ పార్టీకిచెందిన ఏడుగురు కౌన్సిలర్లు వైసీపీకి మద్దతు ఇస్తున్నారని... ఎన్నిక జరిగితే చైర్మన్‌ పదవి తమకు దక్కదని తెలుగు తమ్ముళ్లు భావించారు.. ఎన్నిక వాయిదావేయాలంటూ మున్సిపల్ ఇంచార్జ్ చైర్మన్‌ జాబీవుల్లా, కౌన్సిలర్‌ గణేశ్‌ బాబు, మరో 12మంది కౌన్సిలర్లు నిరసనకు దిగారు.. బెంచీలు, కుర్చీలు ధ్వంసం చేశారు.. 
ఎన్నిక ప్రక్రియ వాయిదా 
ఉదయం 11నుంచి మధ్యాహ్నం ఒకటిన్నరవరకూ ఈ ఆందోళన కొనసాగింది. ఉద్రిక్తత నేపథ్యంలో ఎన్నిక ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఆర్‌డీవో ప్రకటించారు. ఈ సమస్యను ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకువెళుతున్నట్లు తెలిపారు. ఈ వాయిదాపై టీడీపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నిక వాయిదాపడగానే వైసీపీనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎమ్మెల్యే రాచమల్లు తమ పార్టీ కౌన్సిలర్లతోకలిసి   ఆర్‌డీవోతో వాగ్వాదానికి దిగారు.. ఇష్టంవచ్చినట్లు తిడుతూ దాదాపు కొట్టినంత పనిచేశారు. ఎన్నిక జరిపేంతవరకూ అక్కడినుంచి కదలమంటూ నేలపై పడుకుని ఆర్‌డీవోను అడ్డుకున్నారు..  
ఉద్రిక్త పరిస్థితి 
వైసీపీ నేతల నిరసనతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల సహాయం తీసుకున్న ఆర్‌డీవో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అటు ఎన్నిక వాయిదాపై మండిపడ్డ రాచమల్లు..... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.    తన కాలిచెప్పునుతీసుకొని చేతిపై కొట్టుకుంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇంత భద్రత ఉన్నా ఎందుకు ఎన్నిక నిర్వహించలేకపోయారని ప్రశ్నించారు.. 
సీఎం చంద్రబాబు ఆగ్రహం 
కొద్దిసేపటి తర్వాత రెండువర్గాలకు చెందిన కౌన్సిలర్లు అక్కడినుంచి వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది.. శనివారం కూడా ఇదే తరహా హంగామాతో ఎన్నిక వాయిదా పడింది. సండేరోజూ ఇదే పరిస్థితి కొనసాగడంతో మరోసారి వాయిదాపడింది. ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక వ్యవహారం గందరగోళంగా మారడంపై సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని... హింసాత్మక ధోరణి సరికాదని పార్టీలన్నీ సంయమనం పాటించాలని సూచించారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు..  తమ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించారు. 

15:48 - April 16, 2017

కడప : ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ వైసీపీ ఎమ్మెల్యే రాజమల్లు తన నిరసనను తెలిపారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాజమల్లు తనను తాను చెప్పుతో కొట్టుకున్నాడు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాజమల్లు హెచ్చరించారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి ఎన్నికను వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టి తీసుకెళ్తానని అధికారి తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులకు టీడీపీ వర్గ విభేదాలే కారణమని తెలుస్తోంది.

Pages

Don't Miss

Subscribe to RSS - kadapa