Kadapa Steel Factory

12:29 - October 13, 2018

ఢిల్లీ : ఏపీ ఎంపీలు కడప ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం మరింత ఉధృతం చేశారు. గతంలో ఎంపీ సీఎం రమేశ్ దీక్ష చేసిన సంగతి తెలిసిందే. సుమారు వంద రోజులైనా కేంద్రం ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో శనివారం టీడీపీ ఎంపీలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ను కలిశారు. విభజన హామీలు అమలు చేయాలని, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో ఈ విషయంపై క్లారీటీ ఇస్తామని బీరేంద్ర సింగ్ వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి ఎదుట ఎంపీలు పలు ప్రతిపాదనలు పెట్టారు. కేంద్ర ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి పరిశ్రమ ఏర్పాటు చేయడం..ప్రభుత్వాలు ప్రైవేటు ఏజెన్సీతో నిర్మాణం చేయడం...పూర్తి స్థాయిలో ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం..లాంటి ప్రతిపాదనలు చేశారు. మరి ఈ ప్రతిపాదనలకు కేంద్రం ఒకే అంటుందా ? లేదా ? అనేది చూడాలి. 

17:27 - June 13, 2018

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం మరోసారి నీళ్లు చల్లింది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాతో పాటు తెలంగాణలోని బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్ల ఏర్పాటు ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆయా ప్రాంతాల్లో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మాత్రమే సూచనలు ఉన్నాయని సుప్రీంకోర్టుకు చెబుతూ అఫిడవిట్‌ దాఖలు చేసింది. తాము అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే స్పష్టమైన నివేదిక ఇచ్చామని, ఆ ప్రాంతాల్లో ఉక్కు కర్మాగారాలు సాధ్యం కావని చెప్పామని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న ఉక్కు పరిశ్రమలు నష్టాల్లో ఉన్నాయని చెప్పుకొచ్చింది. గతంలోనే ఈ విషయంపై తాము స్పష్టమైన ప్రకటన చేశామని కేంద్ర ప్రమభుత్వం పేర్కొంది. సాధ్యాసాధ్యాలపై టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని..మెకాన్ సంస్థ కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరుపుతున్నామనీ కేంద్రం దాటవేత ధోరణిని అవలంభించింది. 

11:01 - March 2, 2018

కడప : 'ప్రత్యేక హోదా మా జన్మ హక్కు' అంటూ కడప జిల్లా వాసులు నినదిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ సామాన్యుడి నుండి ప్రజా ప్రతినిధులు..మేధావులు రగిపోతున్నారు. విభజన హామీలు అమలు చేయడంతో పాటు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అంటూ సమర శంఖాన్ని పూరిస్తున్నారు. కరవు కాటకాలతో జీవనం సాగిస్తున్న కడప జిల్లా వాసులపై మొండి చూపడంపై జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విభజన హామీలు..ప్రత్యేక హోదా కల్పించాలని...జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కడప జిల్లా వాసులు..ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:31 - December 22, 2017

కడప : ఉక్కు కర్మాగార ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేంద్రమంత్రి బీరేందర్‌సింగ్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 27న క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ - డీవైఎఫ్‌ఐ వరుస ఆందోళనలతో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కదిలింది.

ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ - డీవైఎఫ్‌ఐ చేస్తోన్న పోరాటం ఫలించేలా కనిపిస్తోంది. కొన్నాళ్లుగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ - డీవైఎఫ్‌ఐ వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించాయి. జీపుజాతాలు, బైక్‌ ర్యాలీలు నిర్వహించాయి. ఈనెల 12న కడపలో భారీ బహిరంగ సభను సైతం నిర్వహించాయి. ఈ సభకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ సైతం హాజరయ్యారు. విభజన హామీలోని హామీని వెంటనే అమలు చేయాలని నేతలంతా నినదించారు. లేకుంటే ప్రజాందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ - డీవైఎఫ్‌ఐ ఆందోళనలతో కేంద్రంలో కదలిక వచ్చింది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్రాటుపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఛాంబర్‌లో గురువారం సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో కేంద్రమంత్రులు బీరేందర్‌సింగ్‌, సుజనాచౌదరి, ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డితోపాటు టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి బీరేందర్‌సింగ్‌ స్పష్టం చేశారు. ఈ అంశంపై ఏర్పడిన కమిటీ నెల క్రితమే నివేదిక ఇచ్చిందన్నారు. మరో నెలలో పూర్తిస్థాయి నివేదిక వస్తుందని చెప్పారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందో చెప్పాల్సి ఉందన్నారు. ఈనెల 27న జరిగే సమావేశంలో ఎలాంటి పరిశ్రమ, ఎవరు ఏమేం సమకూర్చాలి అనే అంశాలపై రోడ్‌ మ్యాప్‌ ఖారరయ్యే అవకాశముందన్నారు.

సంక్రాంతి నాటికి ఉక్కు కర్మాగారంపై తుది నిర్ణయం వెలువడే అవకాశముందని కేంద్రమంత్రి సుజనాచౌదరి చెప్పారు. ఈనెల 27న టాస్క్‌ఫోర్స్‌ కడప జిల్లాలో పర్యటిస్తుందని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత ఉక్కుపరిశ్రమ ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మొత్తానికి విద్యార్థి, యువజన సంఘాల ఆందోళనలతో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.

Don't Miss

Subscribe to RSS - Kadapa Steel Factory