karimnagar

21:27 - February 13, 2017

హైదరాబాద్‌ : ఇందిరా పార్క్‌ వద్ద ఈనెల 22న నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని తెంలగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. కరీంనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన నిరుద్యోగ సన్నాహాక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. లక్ష ఉద్యోగ నియామకాలకు సంబంధించి జాబ్‌ క్యాలెండర్‌ను రూపొందించి అమలు పరచాలని ఆయన డిమాండ్‌ చేశారు.

16:45 - February 11, 2017

హైదరాబాద్: కరీంనగర్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఏఎస్సై పదోన్నతి శిక్షణ కోసం వచ్చి కానిస్టేబుళ్లు మృత్యువాతపడుతుండటం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. కఠినతరమైన శిక్షణ వల్లే చాలామంది కానిస్టేబుళ్లు అనారోగ్యం బారిన పడటంతో పాటు.. ప్రాణాలు కోల్పోతున్నారని సహచరులు అంటున్నారు. అయితే ఇటీవల చనిపోయిన పోలీసులంతా ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ విభాగానికి చెందినవారే కావడంతో పోలీసు శాఖలో వివక్ష కొనసాగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

1980 దశకంలో పోలీసుశాఖలో ఏఆర్‌ విభాగంలో ..

1980 దశకంలో పోలీసుశాఖలో ఏఆర్‌ విభాగంలో చేరిన 372 మంది హెడ్‌కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించడంతో జనవరి 18న కరీంనగర్‌ పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌కు శిక్షణకు వచ్చారు. వీరిలో చాలామంది వయస్సురీత్యా, ఆరోగ్యం సహకరించక రిటైర్మెంట్‌కు దగ్గర ఉన్న హెడ్‌ కానిస్టేబుళ్లు అనారోగ్యం బారిన పడుతున్నారు. అయితే.. ఉన్నతాధికారులు వయస్సును పట్టించుకోకుండా శిక్షణ ఇవ్వడంతో.. పోలీసులు చనిపోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ మధ్యే మీర్జాత్‌ అజ్మత్‌అలీ, మధుతో పాటు.. యాదవ్‌రావు పరేడ్‌ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు వదిలారు. మరికొంత మంది కఠోర శిక్షణ చేయలేక అనారోగ్యం పాలవడం.. ప్రమాదాల బారిన పడుతున్నారు. అయితే.. ఇవేమీ బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు

సివిల్‌ పోలీసులకు లేని నిబంధనలు మాకెందుకు...

అయితే.. సివిల్‌ పోలీసులకు లేని నిబంధనలు మాకెందుకు అని ఏఆర్‌ పోలీసులు వాపోతున్నారు. శాంతి భద్రతల విధులు నిర్వహించని తమకు కఠినతరమైన శిక్షణ ఎందుకు అంటున్నారు. రిటైర్మెంట్‌ వయసు దగ్గరకు వచ్చినా.. హోదా పెరిగితే జీతం పెరుగుతుందనే ఆశతో శిక్షణకు వస్తే.. కఠినతరమైన శిక్షణతో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు శిక్షణతో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నారు.

పదోన్నతి కోసం వచ్చే హెడ్‌కానిస్టేబుళ్లకు కఠినతరమైన శిక్షణ...

ఇదిలావుంటే.. పదోన్నతి కోసం వచ్చే హెడ్‌కానిస్టేబుళ్లకు కఠినతరమైన శిక్షణ ఏమీ ఇవ్వడం లేదని పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రిన్సిపాల్‌ అంటున్నారు. వారికి ముందు నుంచే అనారోగ్యం ఉండటం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటున్నారు. ఈ మధ్య మృతి చెందిన యాదవరావు.. రన్నింగ్‌ చేస్తూ చనిపోవడంలో వాస్తవం లేదన్నారు. నాలుగేళ్ల క్రితం గుండె ఆపరేషన్‌ చేయించుకున్న యాదవరావు.. ఈ విషయాన్ని దాచిపెట్టి తప్పుడు మెడికల్‌ సర్టిఫికెట్‌ సమర్పించాడంటున్నారు. అయితే.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు రిటైర్మెంట్‌కు దగ్గరున్న తమకు.. కఠిన తరమైన శిక్షణ లేకుండా ప్రమోషన్లు కల్పించాలని ఏఆర్‌ కానిస్టేబుళ్లు కోరుతున్నారు.

09:41 - February 8, 2017

పెద్దపల్లి : జిల్లాలో దారుణం జరిగింది. సెంటినరీ కాలనీకి చెందిన ఓ యువతిపై గోదావరిఖనికి చెందిన రాకేశ్‌ అనే యువకుడు బ్లేడుతో దాడిచేశాడు. ఈ దాడిలో యువతి మణికట్టు దగ్గర గాయం అయ్యింది. తీవ్ర రక్తస్రావం కావడంతో..యువతిని గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు. అమ్మాయిపై దాడి అనంతరం రాకేశ్‌కూడా తనను తాను గాయపరుచుకున్నాడు. యువతికి రెండురోజుల క్రితమే పెళ్లికుదరడంతో..రాకేశ్‌ ఈ దాడి చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. దాడికి పాల్పడిన రాకేశ్‌ను రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

19:25 - February 7, 2017

కరీంనగర్‌ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహదేవపూర్ మండలం అన్నారం మలుపు వద్ద 2 వాహనాలు అదుపుతప్పిన ఘటనలో... 40 మందికి గాయాలయ్యాయి. వీరిలో 18 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

17:44 - February 6, 2017

కరీంనగర్‌ :జిల్లాలో ఓ రవాణాశాఖ అధికారి ఏసీబీ వలలో చిక్కారు. జమ్మింకుట కొత్తపల్లిలో లోని ఆర్టీవో అధికారి గౌస్‌బాబా ఇళ్లలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. అటు జిల్లాకేంద్రం కొత్తగూడెంలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈసోదాల్లో పలు అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. గౌస్‌బాబా ప్రస్తుతం భద్రాచలం ఆర్టీవో గా విధులు నిర్వహిస్తున్నారు.

19:58 - February 3, 2017

పెద్దపల్లి : ఓపెన్‌కాస్ట్‌ గనుల వల్ల కాంట్రాక్టర్లకే ప్రభుత్వం మేలు చేకూర్చుతుందన్నారు టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరుగుతున్న రెండో అంతర్జాతీయ గని కార్మికుల సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్‌ కోదండరాం.. మైనింగ్‌ పాలసీని ప్రభుత్వం తుంగలో తొక్కి కొందరి స్వార్థం కోసం పాలసీలను మారుస్తున్నారని విమర్శించారు. ఈనెల 22న జరిగే నిరుద్యోగ యువకుల ర్యాలీని విజయవంతం చేయాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ఈ మహాసభలకు దాదాపు 30 దేశాల నుండి విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. 

 

19:00 - January 30, 2017

కరీంనగర్ : గతమెంతో ఘన చరిత్ర కలిగిన చేనేత పరిశ్రమ ఇప్పుడు నేత కార్మికుడికి కంటతడి పెట్టిస్తోంది. రోజంతా కష్టపడినా కడుపు నిండని పరిస్థితి. కుటుంబ పోషణ భారం అవుతుండటంతో కార్మికుడు విలవిల్లాడుతున్నాడు. పెద్దనోట్ల రద్దు వస్త్ర పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టివేయడంతో నష్టాల ఊబిలో నుంచి చేనేత పరిశ్రమ ఒడ్డున పడే పరిస్థితి కనపడడం లేదు. కరీంనగర్ జిల్లాలో బోసిపోతున్న చేనేత పరిశ్రమపై 10టీవీ ప్రత్యేక కథనం..! 
ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్న చేనేత కార్మికులు
కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లిలో చేనేత పారిశ్రామిక, సహకార ఉత్పత్తి, విక్రయ కేంద్రానికి 67ఏళ్ల చరిత్ర ఉంది. అనాడు చేనేత పరిశ్రమ వందల మంది నేతన్నలకు ఉపాధి చూపింది. వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులు ఈ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపడంతో ప్రస్తుతం చేనేత పరిశ్రమ కుదేలైంది. రోజంతా కష్టపడ్డా ఆదాయం లేకపోవడంతో నేతన్నలకు పూట గడవడం కష్టాంగా మారింది. దీంతో వారు ఉపాధి మార్గాలను వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.
కార్మికులకు పని దొరకని పరిస్థితి
1949లో పల్లెర్ల లక్ష్మీపతి స్థాపించిన ఈ సంఘంలో ఎంతోమంది నేత కార్మికులకు ఉపాధి దొరికింది. 1983లో ఎన్టీ రామారావు ప్రవేశ పెట్టిన జనత వస్త్రాల ఉత్పత్తితో సంఘం వ్యాపారం ఊపందుకుంది. పరిశ్రమ ఆరంభంలో 1500 మంది కార్మికులతో కళకళలాడిన చేనేత సంఘం ప్రస్తుతం 221 మంది కార్మికులతో నెట్టుకొస్తోంది. ప్రస్తుతం ఉన్న కార్మికుల్లో కనీసం 120 మందికిపైగా పని లేదు. కరీంనగర్ జిల్లా పరిధిలోని రామడుగు, గంగాధర, చొప్పదండితో పాటు 37 గ్రామాలకు చెందిన కార్మికులు యారన్లు తీసుకెళ్లి, బట్టలను నేసి సంఘానికి అందించేవారు. ప్రస్తుతం క్యాష్ క్రెడిట్ ద్వారా యారన్, కూలీలకు డబ్బులు చెల్లిస్తూ.. పాలక మండలి సంఘాన్ని భుజాన వేసుకొని నడిపిస్తున్నారు. ప్రభుత్వం ఆప్కో ద్వారా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో కొత్తపల్లి చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి, విక్రయ కేంద్రంలో ఆరు నెలలుగా 60 లక్షల వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. 
ప్రస్తుతం నష్టాలను ఎదుర్కొంటున్న సంఘం
గతంలో ఆప్కో కొనుగోలు చేసిన వస్త్ర నిల్వలకు సరైన చెల్లింపులు చేయకపోవడంతో సంస్థ ఆర్ధికంగా నష్టాలను ఎదుర్కొంటోంది. నూతన వస్త్రం తయారీకి అవసరమైన యారన్ లేక, కార్మికుల వేతనాలు చెల్లించకలేక సంఘం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికీ ఆప్కో నుంచి 10 లక్షల బకాయిలు వస్తే సంస్థకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. నిల్వ ఉన్నవస్త్రాలను క్లియర్ చేసేందుకు డిస్కౌంట్ ప్రకటించినప్పటికీ కొనుగోలుదారుల నుంచి స్పందన లేదు. మరోవైపు పెద్దనోట్ల రద్దు నిర్ణయం వస్త్ర వ్యాపారంపై తీవ్ర ప్రభావాన్ని చూపడంతో... ప్రస్తుతం చేనేత పరిశ్రమ కొలుకునే పరిస్థితి కనపడడం లేదు. ఇప్పటికైనా రాష్ర్ట ప్రభుత్వమే ఆదుకోవాలని నేతన్నలు వేడుకుంటున్నారు. 
చేనేత వస్ర్తాలకు ఆదరణ కరువు
చేనేత వస్ర్తాలకు ప్రజల నుంచి కూడా ఆదరణ కరువవుతోంది. నేత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం... పాలిస్టర్ వస్త్రాలను ఆర్డర్ ఇచ్చినప్పటికీ వాటి నుంచి సరైన ఆదాయం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చేనేత కార్మికులకు ఉపాధి చూపించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపాలని చేనేత కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 

15:31 - January 29, 2017

కరీంనగర్ : జిల్లాలోని మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ లో తేనేటీగలు దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికంగా ఉన్న పోచమ్మ దేవాలయం వద్ద బోనాలు పెట్టేందుకు ఆదివారం పలువురు వెళ్లారు. అదే సమయంలో తేనేటీగలు వీరిపై విరుచకపడ్డాయి. దీనితో 20 మందికి గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ముగ్గురిని మెట్ పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

08:51 - January 28, 2017

సిద్దిపేట : జిల్లాలో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులు అన్నాచెళ్లెళ్ల ప్రాణాలను బలితీసుకున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై అన్నాచెల్లెలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లాలోని అక్కన్నపేట మండలం జనగాంలో తల్లిదండ్రులతో పాటు అన్నాచెల్లెలు రాజు, స్వరూప ఉంటున్నారు. స్వరూపకు వివాహం అయింది. ఆమె భర్త దుబాయ్ లో ఉంటున్నాడు. దీంతో ఆమె పుట్టింట్లో ఉంటుంది. అన్నాచెల్లెలు ఇద్దరూ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అన్న రాజు బిల్డింగ్ పై నుంచి పడడంతో తీవ్రగాయాలై గత కొద్దిరోజులుగా మంచానికే పరిమితమయ్యారు. ఆర్థిక పరిస్థితులు వారిని చుట్టుముట్టాయి. వయో భారమైన తల్లిదండ్రులు కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీంతో మనస్తాపం చెందిన రాజు, స్వరూపలు నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చికిత్స నిమిత్తం వారిని కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమిచడంతో నిన్న సాయంత్రం అన్న రాజు మృతి చెందగా, అర్ధరాత్రి స్వరూప మృతి చెందారు. వీరి మృతితో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.  

 

20:04 - January 22, 2017

వరంగల్ : తెలంగాణ కబడ్డీ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఖమ్మం, సిద్ధిపేట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సిద్ధిపేట్ విజయం  సాధించింది. 11 పాయింట్స్ తేడాతో ఖమ్మం పై సిద్ధిపేట్ గెలుపొందింది. ఖమ్మం 20 పాయింట్లు, సిద్ధిపేట్ 31 పాయిట్లు సాధించింది. హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కబడ్డీ ప్రీమియర్ లీగ్ పోటీలు జరుగుతున్నాయి.

Pages

Don't Miss

Subscribe to RSS - karimnagar