karimnagar politics

15:27 - October 11, 2018

కరీంనగర్ : కరీంనగర్...ఉద్యమాల ఖిల్లా అనే పేరుంది. మరి ఈ కోటాలో ఈసారి పాగా వేసే వారు ఎవరు ? పాలకుల పాలనతో ఇక్కడి ప్రజలు సంతృప్తితో ఉన్నారా ? మరలా వారికే పట్టం కడుతారా ? కొత్త వారికి అవకాశం ఇస్తారా ? తెలంగాణ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ మరోసారి చక్రం తిప్పుతారా ? కీలక నేత ఈటెల రాజేందర్ కూడా ప్రభావం చూపిస్తారా ? తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల కూత కూయడంతో ఇక్కడి రాజకీయాలు రంజుగా మారాయి. ఇక్కడ 2 పార్లమెంట్, 13 అసెంబ్లీ స్థానాలున్నాయి.  
కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ గతంలో కంచుకోటగా ఉండేది. ప్రస్తుతం బీటలు పడిపోయాయి. 2014 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు పార్లమెంట్‌ స్థానాలతోపాటు 12 అసెంబ్లీ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ఎన్నికలు జరగడంతో గులాబీకి ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య నువ్వా..నేనా అనే పోటీ జరిగినా చివరకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించారు. ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాన్నికాంగ్రెస్ దక్కించుకొంది. కాంగ్రెస్+సీపీఐ, టీడీపీ+బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేయగా టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసింది. Image result for karimnagar town
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ‘కారు’కు బ్రేకులు వేయాలని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా శత్రువులుగా ఉన్న పార్టీలు ఏకమౌతున్నాయి. మహా కూటమి పేరిట పొత్తుల చర్చలు కొనసాగుతున్నాయి. టిడిపి..కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తులు కుదురుతాయని తెలుస్తోంది. కానీ ముందే అభ్యర్థులను ప్రకటించేసిన ‘గులాబీ’ ప్రచార పర్వంలో దూసుకెళుతోంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ అక్కడక్కడ అసంతృప్తులు వ్యక్తమౌతున్నాయి. టికెట్ వస్తుందని ఆశించి భంగపడిన వారు రెబెల్‌గా దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విపక్ష పార్టీలకు చెందిన నేతలు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఏ పార్టీకి వెళుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. అధికారంలోకి వచ్చిన అనంతరం ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయలేదని విపక్ష పార్టీలు ప్రజల మెదల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. అరకొరగా హామీలు అమలు చేయడంతో వచ్చే ఎన్నికల్లో ప్రజలు కారుకు పంక్చర్ చేస్తారని నేతలు అంటున్నారు. తమ అభివృద్దే తమను గెలిపిస్తుందని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

2014లో గెలుపొందిన అభ్యర్థులు

నియోజకవర్గం

అభ్యర్థి పేరు వచ్చిన ఓట్లు
కోరుట్ల కె.విద్యాసాగర్ రావు 20,585
జగిత్యాల  టి.జీవన్ రెడ్డి 8,114
ధర్మపురి (ఎస్సీ) కొప్పుల ఈశ్వర్  18,679
రామగుండం సోమారపు సత్యనారాయణ 2,235
మంథని పుట్టా మధు 9,366
పెద్దపల్లి  దాసరి మనోహర్ రెడ్డి 62,663
కరీంనగర్ గంగుల ప్రభాకర్  24,673
చోప్పదండి (ఎస్సీ)  బి.శోభ 54,981
వేములవాడ సీ.హెచ్.రమేష్ బాబు  5,268
సిరిసిల్ల కె.తారకరామారావు 52,538
మానకొండూరు (ఎస్సీ)  రసమయి బాలకిషన్ 46,832
హుజూరాబాద్ ఈటెల రాజేందర్ 57,637
హుస్నాబాద్ వి.సతీష్ కుమార్ 34,269
2018 టీఆర్ఎస్ అభ్యర్థులు...
నియోజకవర్గం అభ్యర్థి పేరు
కరీంనగర్  గంగుల కమలాకర్‌ 
హుజూరాబాద్ ఈటెల రాజేందర్ 
మానుకొండూరు రసమయి బాలకిషన్
సిరిసిల్ల కల్వకుంట్ల తారకరామారావు 
వేములవాడ చెన్నమనేని రమేష్
జగిత్యాల సంజయ్ కుమార్ 
కోరుట్ల కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
ధర్మపురి కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి  దాసరి మనోహర్‌రెడ్డి
మంథని  పుట్టా మధుకర్
రామగుండం సోమారపు సత్యనారాయణ

- మధుసూధన్ తూపురాణి

13:45 - July 10, 2018

జగిత్యాల : జిల్లాలో అవిశ్వాస రాజకీయం రసవత్తరంగా మారింది. కథలాపూర్‌ ఎంపీపీ తోట నర్సుపై అవిశ్వాసం ప్రక్రియలో లక్షలాది రూపాలయలు చేతులు మారినట్టు ఆరోపణలొస్తున్నాయి. ఎంపీపీకి మద్దతు ఇచ్చే విషయంలో నాలుగేళ్ల చీకటి ఒప్పందం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్‌ ఎంపీపీకి మద్దతు ఇస్తే ఒక్కో ఎంపీటీసీకి 4 లక్షలు చెల్లించినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఎంపీపీ తోట నర్సుపై అవిశ్వాసం నేపథ్యంలో బీజేపీ ఎంపీటీసీ మద్దతు ఉపసంహరించుకోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మద్దతు విరమిస్తే 20లక్షలు చెల్లించాలని కాంగ్రెస్‌ నేతలు పట్టుబడుతున్నారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్‌ నేతలు ఖండిస్తున్నారు. బీజేపీ ఎంపీటీసీ తమకు స్వచ్ఛందంగానే మద్దతు తెలిపారి చెబుతున్నారు. ఒప్పంద పత్రంపై దూలూరు బీజేపీ ఎంపీటీసీ సౌజన్య భర్త గంగాధర్‌ సంతకం చేశారు. తాజా క్యాంపు నుంచి రెండు రోజులకే సౌజన్య ఇంటికి చేరింది. గ్రామస్థుల ముందే ఒప్పందం గురించి ఎంపీపీ వర్గీయులు నిలదీశారు. అధికారం కోసం జరిగిన చీకటి ఒప్పందంపై స్థానికులు విస్మయం చెందుతున్నారు.

21:37 - July 9, 2018

కరీంనగర్ : రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సంచలన ప్రకటన చేశారు. గత కొన్ని రోజులుగా రామగుండంలో జరుగుతున్న రాజకీయా పరిణామాలతో మనస్తాపం చెందిన సోమారపు... రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే... మున్సిపల్‌ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానంలో మంత్రి కేటీఆర్‌ మందలించడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది.

రాజకీయల నుంచి తప్పుకున్న ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ
రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో మనస్తాపానికి గురై సోమారపు... రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేగానే కాకుండా... ఆర్టీసీ చైర్మన్‌ పదవి నుంచి కూడా తప్పుకోనున్నట్లు తెలిపారు.

టీఆర్‌ఎస్‌ అధిష్టానం కార్పొరేటర్లు అవిశ్వాసం
కొన్ని రోజుల క్రితం రామగుండం మేయర్‌ లక్ష్మీనారాయణపై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు కలెక్టర్‌కు ఇచ్చారు. అయితే.. టీఆర్‌ఎస్‌ అధిష్టానం కార్పొరేటర్లు అవిశ్వాసం ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని సోమారపుకు బాధ్యతలు అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సోమారపు కార్పొరేటర్లతో చర్చించి.. అవిశ్వాస తీర్మానం ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే కొంతమంది కార్పొరేటర్లు ఇందుకు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన సోమారపు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తన మాటలు కార్పొరేటర్లు పట్టించుకోనప్పుడు.. వారి ప్రతినిధిగా ఉండాల్సిన అవసరం లేదంటున్నారు.

సోమారపుపై మండిపడ్డ మంత్రి కేటీఆర్‌
అయితే... సోమారపు నిర్ణయం వెనక పార్టీ అంతర్గత కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం విసయంలో పార్టీ అధిష్టానం సోమారపుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు.. మంత్రి కేటీఆర్‌ సోమారపుపై మండిపడినట్లు పార్టీ వర్గాలంటున్నాయి. పార్టీ అధిష్టానం, కేటీఆర్‌ సీరియస్‌ నేపథ్యంలోనే సోమారపు కార్పొరేటర్ల చర్చలు జరిపినట్లు... అవి ఫలించకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే... సోమారపు నిర్ణయం పట్ల పార్టీలో చర్చ కొనసాగుతోంది. మరోవైపు కార్పొరేటర్లు కూడా సోమారపుపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతిపరులను ప్రోత్సహిస్తున్నారని... పట్టణాన్ని అభివృద్ధి చేయలేని వారికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని సోమారపు... గోదావరిఖనిలో బొగ్గుగని కార్మికుల వద్ద వెల్లబోసుకున్నారు. ఓవైపు పార్టీ అధిష్టానం ఆదేశాలు.. మరోవైపు అవిశ్వాసం వెనక్కి తీసుకోవడానికి కార్పొరేటర్లు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన సోమారపు రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు.

2 రోజుల్లో ఎమ్మెల్యేగా రిలివ్‌ అవతానంటూ వెల్లడి
ఇక సోమారపు.. ఆర్టీసీ చైర్మన్‌ పదవి నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. రామగుండలో ఎవరికీ టికెట్‌ ఇచ్చినా గెలుస్తారని.. ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటానన్నారు. అయితే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను కానీ... విశ్రాంతి తీసుకుంటానన్నారు సోమారపు. మొత్తానికి మేయర్‌పై కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం.. సోమారపు రాజకీయ జీవితంపై ప్రభావితం చూపించింది. ఓవైపు పార్టీ అధిష్టానం ఆదేశం... మరోవైపు కార్పొరేటర్ల తీరుతో సోమారం రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నారు. అయితే... ఈ పరిణామాలపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

16:18 - July 9, 2018

కరీంనగర్‌ : టీఆర్‌ఎస్‌లో ముసలం ముదురుతోంది. రామగుండం మేయర్‌పై అవిశ్వాసం విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు మెజార్టీ కార్పొరేటర్లు ఒక్కసారి నోటీసు ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కార్పొరేటర్లు స్ఫష్టం చేశారు. రాజకీయాలకు దూరమన్న సోమారపు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు.విశ్వాస తీర్మానంలో మేము నెగ్గుతాం, నెగ్గని పక్షంలో రాజీనామా చేస్తాం కార్పొరేటర్లు ధీమా వ్యక్తంచేశారు. 

16:08 - July 9, 2018

కరీంనగర్ : రామగుండం నగరపాలక సంస్థ అవిశ్వాస రాజకీయాలు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మెడకు చుట్టుకున్నాయి. రామగుండం మేయర్‌, డిప్యూటీ మేయర్‌పై టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకునే విధంగా చేయాలని మంత్రి కేటీఆర్‌ సోమారపు సత్యనారాయణను ఆదేశించారు. అవిశ్వాసం ప్రతిపాదించిన కార్పొరేటర్లతో సోమారపు సత్యనారాయణ చర్చలు జరిపినా వెనక్కి తగ్గలేదు. దీంతో మనస్తాపానికి గురైన సోమారపు సత్యనారాయణ రాజకీయాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ఆర్టీసీ చైర్మన్‌ పదవిలో కూడా కొనసాగనని తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల్లో పోటీచేయబోనంటున్న సత్యనారాయణ పేర్కొన్నారు. 

15:45 - July 9, 2018

కరీంనగర్ : టీఆర్‌ఎస్‌పార్టీలో అవినీతి పరులను ప్రోత్సహిస్తున్నారని ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారయణ అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీతో కుమ్మక్కై రామగుండం కార్పొరేషన్‌ మేయర్‌పై అవిశ్వాసం పెట్టి తన ప్రతిష్టను దెబ్బతీశారని సోమారపు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరిఖనిలోని సింగరేణి కార్మికులతో భేటీ అయిన సోమారపు సత్యనారాయణ... తాను రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించారు. 

18:36 - May 7, 2018

పెద్దపల్లి : జిల్లా మంథనిలో శివాలయం వేదికగా టీఆర్‌ఎస్‌లో రెండు వర్గాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తుమ్మిచెరువు ఆధునీకరణలో భాగంగా.. కట్టపై ఉన్న పురాతనమైన శివలింగం, నంది విగ్రహాలను తొలగించి మట్టిపోయడంతో వివాదం తలెత్తింది. అయితే ఈ పనిని ఎమ్మెల్యే పుట్టా మధు దగ్గర ఉండి చేయించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా మరోనేత సునీల్‌రెడ్డి ఆ విగ్రహాలపై మట్టిని తొలగించి పాలాభిషేకం చేశాడు. విషయం తెలుసుకున్న పుట్టా మధు గ్రామసభ నిర్వహించి.. సునీల్‌రెడ్డిపై ఫైర్‌ అయ్యాడు. సునీల్‌రెడ్డి వ్యక్తే కాదని ఆరోపించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానికులు, బ్రాహ్మణులు సునీల్‌రెడ్డికి మద్దతుగా నిలవడంతో... పుట్టా మధు వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్రాహ్మణుల సంఖ్య ఎంత ? మీరు ఏం చేస్తారు ? అని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో సీటు రాదనే ఉద్దేశంతోనే పుట్టా మధు ఇలా వివాదాలు సృష్టిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇద్దరి నేతల మధ్య విభేదాలు సరికాదని.. దీనిపై అధిష్టానం దృష్టి సారించాలని స్థానిక నేతలు కోరుతున్నారు. 

16:37 - June 4, 2017

కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎవరికి వారే పార్టీలను బలోపేతం చేసుకునే పనిలో పడ్డారు. సర్వేలతో టీఆర్‌ఎస్, ఆకర్ష్‌తో బిజెపి, పునర్వైభవం కోసం టిడిపి పాకులాడుతున్నాయి. ఇక ఉద్యమాలతో వామపక్షపార్టీలు అధికార పార్టీని ముప్పు తిప్పలు పెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు జిల్లా వ్యాప్తంగా దూకుడు పెంచిన రాజకీయ పార్టీలపై టెన్ టీవీ ప్రత్యేక కథనం. 
కుస్తీపాట్లు 
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు రంజుగా మారాయి. పట్టు సడలకుండా కొన్ని పార్టీలు..పట్టు సాధించే పనిలో కొన్ని పార్టీలో కుస్తీపాట్లు పడుతున్నాయి. టిఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న జిల్లాలో గత ఎన్నికల్లో 13 శాసన సభ స్థానాల్లో 12 స్థానాలతో పాటుగా రెండు లోక్ సభ స్థానాలను గులాబి పార్టీ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే జిల్లాలో పూర్వ వైభవం కోసం బిజెపి,టిడిపి,కాంగ్రెస్ పార్టీలు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాయి. జాతీయ పార్టీలైన బిజెపి,కాంగ్రెస్‌లు ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో సత్తా చాటిన పార్టీలే. అయితే మారుతున్న రాజకీయ సమీకరణలతో ప్రజలకు దూరం అయ్యాయి. ఇక తెలంగాణ ఉద్యమ  ప్రభావం టిడిపిపై తీవ్ర ప్రభావాన్ని చూపడంతో కరీంనగర్ జిల్లాలో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది.  
పార్టీ కేడర్‌ను పెంచే పనిలో సీఎం కేసీఆర్
కరీంనగర్ జిల్లాలో టిఆర్‌ఎస్ బలంగా ఉన్నప్పటికీ మిగతా పార్టీలు బలం పెంచుకునే పనిలో ఉండటంతో సీఎం కేసీఆర్ ఇంకా పార్టీ కేడర్‌ను పెంచే పనిలో పడ్డారు. గతంలో ఓ వెలుగు వెలిగిన బిజెపి ప్రస్తుతం సరికొత్త వ్యూహాలు రచిస్తూ పుంజుకునే పనిలో ఉండంతో పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం కలుగుతోంది. మోడీ ఇమేజ్‌ జిల్లాలో ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బిజెపి శ్రేణులు తీవ్రంగా పనిచేస్తున్నాయి. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచనలతో  కాంగ్రెస్,టిడిపిలలో ఉన్న బలహీన నేతల్ని పార్టీలోకి తీసుకువచ్చేందుకు రహస్య మంతనాలు పూర్తయ్యాయి. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు బిజెపిలో చేరేందుకు మొగ్గుచూపుతున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. 
ఒకప్పుడు జిల్లాలో కాంగ్రెస్ హవా 
కాంగ్రెస్ పార్టీ ఒకప్పడు కరీంనగర్ జిల్లాలో తన హవా కొనసాగించింది. అలాంటి పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో  ప్రజా వ్యతిరేక ఉద్యమాలతో తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. కమలనాథులు ఎంత ప్రయత్నించినా బలపడరని..టిడిపిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్న కాంగ్రెస్‌ నేతలు టిఆర్‌ఎస్‌కు ధీటైన ప్రత్యామ్నాయం తామేననే ధీమాలో ఉన్నారు. అందులో భాగంగా గ్రామస్థాయి మొదలు జిల్లా,రాష్ట్ర స్థాయి నేతలను కలుపుకుని పోయే ప్రయత్నాలు చేస్తూనే ఇతర పార్టీలు వేస్తున్న ఆకర్ష్ వలలో పడకుండా జాగ్రత్తలు పడుతున్నారు. రాహుల్‌ గాంధీ సభ విజయవంతం కావడంతో హస్తం పార్టీ నేతలు మరింత జోష్‌కు ముందుకు సాగుతున్నారు. 
పునర్వైభవం కోసం తపిస్తున్న టిడిపి
రెండు దశాబ్దాల పాటు చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీ తిరిగి పూర్వ వైభవం కోసం తపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ జగిత్యాల వాసి కావడంతో ఈసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టు సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హుజురాబాద్‌లో నిర్వహించిన సభ సక్సెస్ కావడంతో ప్రస్తుతం పార్టీ శ్రేణుల్లో కాస్త ఉత్సాహం కనిపిస్తోంది. అయితే ఒకరిద్దరు నేతలు బిజెపివైపు మొగ్గు చూపుతున్నారన్న సమాచారంతో ఎవరిని విశ్వసించాలో తెలియని అయోమయంలో పడ్డారు టిడిపి సీనియర్‌ నేతలు. 
పోరాటాలతో ముందుకు సాగుతున్న వామపక్ష పార్టీలు
టిఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తు ముందుకు సాగుతున్నాయి వామపక్షా  పార్టీలు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి జిల్లా వాసి కావడంతో తరుచు పర్యటనలు చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తూ పట్టు సాధించే పనిలో పడ్డారు. ఈ ధపా జరగబోయే ఎన్నికల్లో హుస్నాబాద్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే పట్టుదలతో సిపిఐ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం చేపట్టిన పాదయాత్ర,ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో నిర్వాసితుల పక్షాన చేసిన ఆందోళనలతో ప్రజల్లో ఆ పార్టీకి మంచి ఆదరణ లభించింది. 
పార్టీలు.. ఎత్తులు..పైఎత్తులు
మొత్తానికి జిల్లాలో అన్ని పార్టీలు ఎత్తులు..పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి. తీరా ఎన్నికల సమయానికి ఏ నేత ఏ పార్టీ కండువాతో ప్రజల్లోకి వస్తాడో మాత్రం సస్పెన్సే. ఇక పార్టీ సమీకరణలు ఏ విధంగా ఉంటాయో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే. 

 

13:21 - January 6, 2017

కరీంనగర్ : తెలంగాణ ఉద్యమంలో ఐక్య సంఘాలై కలిసి వచ్చిన అధికారులు..ఇప్పుడు అధికార పార్టీ నేతలకే తలనొప్పిగా మారుతున్నారు. అధికారుల ఐక్యత గులాబి పార్టీలో ముళ్లులా గుచ్చుకుంటుండటంతో...సీనియర్ నేతలంతా అసంతృప్తితో రగిలి పోతున్నారు. ఇంతకీ అధికారులు నేతల మాటలు ఎందుకు వినడం లేదు ..?

అధికారులు, నేతల మధ్య లోపించిన సమన్వయం
కరీంనగర్‌ జిల్లా అధికారుల తీరుతో.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసహనంతో ఉన్నారు. అధికారులతో నిర్వహించిన ప్రతి సమావేశంలోనూ అభివృద్ధిలో పురోగతి కనిపించక పోవడంతో నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆక్షేపనీయంగా ఉందని.. స్వయంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులే చెప్పడం పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్ధరం అవుతోంది. ప్రగతిని పక్కన పెట్టి స్వాహాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. నిన్నమొన్నటి వరకు పోస్టింగ్‌ కోసం తమ ఇళ్ల చుట్టూ తిరిగిన అధికారులు.. ఇప్పుడు తమ మాట పెడచెవిన పెడుతున్నారని..సాక్షాత్తు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వెల్లడిస్తున్నారు.

ఎమ్మార్వో తీరుపై తీవ్రంగా మండిపడ్డ ఎమ్మెల్యే బొడిగె శోభ
గతంలో చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ మొదటిసారి ఎమ్మార్వో తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదంటూ బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక.. అధికారుల తీరుపై ఉన్నతాధికారులకు కూడా పిర్యాదు చేశారు. కానీ శోభ పిర్యాదుపై ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఒకానొక దశలో ఎమ్మెల్యే శోభ తీరునే తప్పుపట్టారు.

అధికారులపై సీరియస్‌ అయిన మంథని ఎమ్మెల్యే
ఆ తర్వాత అటవీశాఖ అధికారులు సామాన్యులను వేధిస్తున్నారనే ఆవేదనతో మంథని ఎమ్మెల్యే అధికారులపై సీరియస్‌ అయ్యారు. అప్పట్లో మధు అధికారులను చీవాట్లు పెడుతున్న వీడియో సంచలనం రేపింది. అప్పుడు కూడా మధును తప్పు పడుతూ దూకుడు తగ్గించుకోవాలని సీనియర్‌ నేతలు హెచ్చరించారు. అధికారులు ప్రజాభివృద్ధికి సహకరించడం లేదంటూ మధు సమీక్షా సమావేశాల్లోనూ పలుమార్లు చెప్పినప్పటికీ కనీస స్పందన కరువైంది.

నేతలు, అధికారుల మధ్య సయోధ్య కుదిర్చిన మంత్రి ఈటెల
అధికారుల తీరు పట్ల ఎమ్మెల్యేలు తరచుగా పిర్యాదులు చేయడంతో.. ఆర్థికశాఖ మంత్రి జోక్యం చేసుకుని అధికారులు, నేతల మధ్య రాజీ కుదిర్చి అందరూ కలిసి పనిచేయాలంటూ సూచించారు. జిల్లాకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్‌ నేతలు, అధికారుల మధ్య సయోధ్య కుదర్చడంతో వివాదం సద్దుమణిగింది. కానీ కొన్ని రోజులకే మళ్లీ కథ మొదటికొచ్చింది. ఏకంగా పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్‌ సమీక్షా సమావేశంలో అప్పటి జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌తో పాటు అధికారులపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నారని, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

పద్ధతి మార్చుకోవాలని రెవిన్యూ సమావేశంలో కేసీఆర్ హెచ్చరికలు
జిల్లాకు చెందిన ఆర్థిక మంత్రి ఈటల సైతం అభివృద్ధికి సహకరించాలంటూ.. పలు కార్యక్రమాల్లో అధికారులకు సూచించారు. అయినా.. ఫలితం లేకపోవడంతో.. పద్ధతి మార్చుకోవాలని రెవిన్యూ సమావేశంలో హెచ్చరికలు కూడా చేశారు. కేసీఆర్‌ బంధువు, కరీంనగర్‌ ఎంపీ మాటే చెల్లుబడి అయ్యేలా... రాజకీయంగా అధికారులు తన మాట వినేలా చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై అధికారులు నోరు మెదపాలంటే.. కేసీఆర్‌కు వినోద్‌కు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుని మిన్నకుండిపోతున్నారు. అయితే.. చివరకు వినోద్‌కు సైతం అధికారులు కొరకరాని కొయ్యలా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో చివరకు వినోద్‌ కూడా అధికారుల తీరుపై మండిపడటమే అందుకు నిదర్శనం. ఓవైపు బంగారు తెలంగాణ కోసం పాటు పడుతుంటే.. అధికారులు సహకరించకపోవడం దారుణమని, ఉద్యమస్ఫూర్తితో అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉందని ఎంపీ వినోద్‌ సూచించారు.

ఈ కోల్డ్ వార్ తో అభివృద్ధి కుంటుపడుతుందన్న వాదనలు
కరీంనగర్ జిల్లాలోని అధికార యంత్రాంగానికి ప్రజా ప్రతినిధులకు జరుగుతున్న కోల్డ్ వార్‌తో.. జిల్లాలో అభివృద్ధి కుంటుపడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికారులను ఐక్యం చేసిన గులాబీ పార్టీ వారి ఐక్యతను సహించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

09:49 - October 10, 2016

కరీంనగర్ : ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువైన కరీంనగర్ రాజకీయాలు దేశ, రాష్ట్రస్థాయిలో పరిపాలనను శాసించాయి. చాలా మంది నేతలకు రాజకీయ ఓనామాలు నేర్పి... తిరుగులేని నేతలుగా రాజకీయ భవిష్యత్తును అందించింది. అలాంటి కరీంనగర్‌లో జిల్లాల పునర్వీభజనతో రాజకీయంగా భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. కరీంనగర్‌లో జిల్లా విభజనతో మారనున్న రాజకీయ సమీకరణలపై 10టీవీ ప్రత్యేక కథనం...!

జిల్లాల విభజనతో మారబోతున్న కరీంనగర్ రాజకీయాలు
తెలంగాణలో జిల్లాల పునర్విభజనతో కరీంనగర్ రాజకీయాలు పూర్తిగా మారబోతోన్నాయి. జిల్లాను పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలుగా విభజించి కొత్త జిల్లాల్లో టీఆర్ఎస్‌కు ఎదురు లేకుండా చేయడానికి ముఖ్యమంత్రి వ్యూహత్మకంగా వ్యవహారించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్‌లో చేరుతారనే ఊహగానాలు
కరీంనగర్ లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య రానున్న రోజుల్లో త్రిముఖ పోటి ఉండనుంది. గతంలో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన గంగుల కమలాకర్ కు, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, కాంగ్రెస్ తరపున పోటి చేసిన చలిమెడ లక్ష్మినరసింహరావులు గట్టి పోటీనిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్ధి చలిమెడ లక్ష్మినరసింహరావు టీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ఎంపీ పోన్నం ప్రభాకర్ కూడా కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. పొన్నం ప్రభాకర్ ను టీఆర్ఎస్ లో చేర్చుకున్నట్లయితే కాంగ్రెస్ బలమైన నేతను కొల్పోవలసి వస్తుంది. హుజురాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్ జిల్లా రాజకీయల్లో కీలక నేతగా ఎదిగే అవకాశాలు సుగమం అయ్యాయి. హుజురాబాద్ నియోజక వర్గాన్ని వరంగల్ లో కలుపుతారనే ప్రచారం మొదటగా జరిగినప్పటికి రాజకీయంగా ఈటెలకు కొంత నష్టం జరిగే అవకాశం ఉండడంతో నిర్ణయం వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

జగిత్యాలలో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్, టీడీపీ నుంచి గట్టిపోటీ
కొత్త జిల్లాల విభజనలో జగిత్యాల జిల్లాగా ఏర్పాటు చేయాలని చాలా ఏళ్ల నుంచి డిమాండ్ ఉంది. డిమాండ్ కి అనుకూలంగానే జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌కి కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, టీడీపీ నుంచి ఎల్. రమణ గట్టి పోటీనివ్వనున్నారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలు ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు. కోప్పుల ఈశ్వర్ లకు కాంగ్రెస్ తరుపున ధీటైన అభ్యర్ధులు ఉన్నారు. జగిత్యాల రాజకీయాలో కీలక నేతలుగా ఉన్న జీవన్ రెడ్డి, ఎల్. రమణ లు ఇద్దరిలో ఒకరిని టీఆర్ఎస్ లోకి తీసుకోవాలన్నది టీఆర్ఎస్ ప్రయత్నం.

శ్రీధర్ బాబును టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు
అనుహ్యంగా తెర పైకి వచ్చిన పెద్దపల్లి జిల్లాలో రాజకీయ సమీకరణల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. పెద్దపల్లి జిల్లా రాజకీయాలతో పాటు పొరుగున ఉన్న మంచిర్యాల జిల్లాలో వివేక్ సోదరులు చక్రం తిప్పనున్నారు. రానున్న ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి వివేక్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న సుమన్ ను అవసరం అయితే ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశాలు లేక పోలేదు. ప్రస్తుతం పెద్దపల్లిలో కాంగ్రెస్, టీడీపీ పార్టీల ఉనికి లేకుండా చేయడం అధికార పార్టీ ముందున్న సవాల్. మంథని నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి శ్రీధర్ బాబుతో రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పోటి తప్పదని తెలుస్తోంది. శ్రీధర్ బాబు కు మంథని,రామగుండం ప్రాంతాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. రానున్న ఎన్నికల్లో శ్రీధర్ బాబును ఎదుర్కొవాలంటే అధికార పార్టీకి కొంత కష్టసాధ్యం కానున్న నేపధ్యంలో శ్రీధర్ బాబును టీఆర్ఎస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరగుతున్నాయి.

మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల
సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు కాంగ్రెస్, బిజేపీ నుంచి పోటీ ఎదురవుతోంది. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి కేకే మహేందర్ రెడ్డి పోటీగా నిలవనున్నారు. ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది. వేములవాడలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ తరపున ఆది శ్రీనివాస్ బలమైన పోటిని ఇస్తున్నారు. ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై దేశీయ పౌరసత్వ వివాదం కొనసాగుతుండగా రాజకీయాల్లో ఉండడంతో వ్యాపార పరంగా ఇబ్బందులు తలెత్తున్నాయనే కారణంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాడో లేదో అన్న సస్పెన్స్ కొనసాగుతుంది. బీజేపీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ను టీఆర్ఎస్ లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

కమ్యూనిస్టు పార్టీలకు చెక్ పెట్టేందుకు గులాబీ పార్టీ ప్లాన్
ఇక జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలకు చెక్ పెట్టడానికి గులాబీ పార్టీ గట్టి ప్రయత్నం చేసింది. హుస్నాబాద్ లో సీపీఎం, సీపీఐ పార్టీకి బలమైన క్యాడర్ తో గ్రామాల్లో పటిష్టమైన నాయకత్వం ఉంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీసెందుకు కమ్యూనిస్టులు నాయకత్వం ఉన్న హుస్నాబద్, కోహెడ మండలాలను సిద్దిపేటలో కలిపారు.

ప్రతిపక్షాలకు చెక్ పెట్టేందుకు యత్నాలు
మొత్తంగా కొత్త జిల్లాల్లో కాంగ్రెస్ , టీడీపీ, కమ్యూనిస్ట్ నాయకులకు చెక్ పెట్టే విధంగా జిల్లాల రూపకల్పన చేసినప్పటికీ టీఆర్ఎస్ కు కూడా ఎన్నికల్లో గట్టి పోటీ ఎదుర్కొనక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Don't Miss

Subscribe to RSS - karimnagar politics