karnataka

08:45 - April 24, 2018

హైదరాబాద్ : కన్నడ నాట రాజకీయం హీటెక్కుతోంది. అక్కడి ప్రధాన పార్టీలు కత్తులు దూస్తుంటే.. బీజేపీని దెబ్బకొట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారు. మోదీని దెబ్బతీసేందుకు ఏ ఒక్క అవకాశం వచ్చినా వదల కూడదని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలుగు ఓటర్లను ప్రభావితం చేస్తున్న టీడీపీ
కర్నాటకలో అత్యధిక సంఖ్యలో తెలుగు వారు నివసిస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారే ఎక్కువ. ఎన్నికల్లో వీరు గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆంధ్రుల సత్తా ప్రధాని నరేంద్ర మోదీకి చూపాలని చంద్రబాబు ఇప్పటికే పావులు కదిపారు. 
నరేంద్రమోదీని టార్గెట్‌ చేసిన చంద్రబాబు
ఇటీవలే ప్రత్యేక హోదా విషయంలో కర్నాటకలోని తెలుగు వారు చంద్రబాబును కలువగా బీజేపీని ఓడించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను నమ్మించి ద్రోహం చేసిన నరేంద్రమోదీకి కర్నాటక ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా గెలిచే వారికి ఓటు వేయాలని చెప్పారే కానీ ఏ పార్టీకి ఓటు వేయాలో మాత్రం చంద్రబాబు స్పష్టంగా చెప్పలేదు. అయితే గెలిచే వారికి ఓటు వేయమని చెప్పడం పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని సూచించినట్లయింది. టీడీపీకి వ్యతిరేక పార్టీయైన కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదు కానీ బీజేపీ ఓడిపోవాలనేదే చంద్రబాబు అభిమతం. బెంగళూరు సిటీ, ఏపీ బోర్డర్‌లోని జిల్లాల్లో తెలుగువారు, వారి బంధువులు అధికంగానే ఉన్నారు వీరందరిని ఉపయోగించి మోదీకి తన సత్తా చూపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పురందేశ్వరిని రంగంలోకి దింపిన బీజేపీ
మరోవైపు  కర్నాటకలో తెలుగు వారిని తమ వైపుకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకుగాను ఎన్టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరిని బీజేపీ నేతలు రంగంలోకి దింపారు. దాదాపు నాలుగు నెలలుగా కర్నాటకలో మకాం వేసిన పురందేశ్వరి..... ఎన్టీఆర్‌ అభిమానుల ఓట్లు బీజేపీ పడేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలు వంటి సెంట్‌మెంట్‌లతో తెలుగు వారికి కళ్లెం వేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇటువంటి  ప్రయత్నాలన్నీ ఎన్డీఏ నుండి వైదొలగక ముందునుంచే చంద్రబాబు చేస్తున్నట్లు బీజేపీ ఆరోపిస్తోంది. గుజరాత్‌లో కూడా బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు ప్రయత్నించాడని మంత్రి నారా లోకేష్‌, తన ఇద్దరు మిత్రులకు డబ్బులు ఇచ్చి గుజరాత్‌కు పంపారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.  
ఆంధ్రులు ఎవరిని అందలం ఎక్కిస్తారో ? 
ఏది ఏమైనా చంద్రబాబు అక్కడి తెలుగువారికి బీజేపిని ఓడించమని సూచించటం బహిరంగ రహస్యమే... ఏపీ ప్రజల్లో కూడా ప్రత్యేకహోదా సెంటిమెంట్‌ బాగా ఉండటంతో కాగల కార్యం గందర్వులే తీర్చినట్లు భావిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. ప్రభుత్వ పరంగా వైఫల్యాలు, ఆరోపణలతో కొట్టుమిట్టాడుతున్న బీజేపికి కర్నాటకలోని తెలుగువారి ఓట్లు మింగుడుపడటం లేదు. మరి కర్ణాటకలో ఆంధ్రులు తమ సత్తా ఏమాత్రం చూపుతారో ఎవరిని అందలం ఎక్కిస్తారో చూడాలి. 

 

15:08 - April 19, 2018

ఢిల్లీ : కర్ణాటక పీఠం ఎక్కేదెవ్వరు..? మోదీ అమిత్‌ షా మంత్రం కర్ణాటకలో పని చేస్తుందా.? సిద్దరామయ్య పథకాలు ఓటర్లను ఆకర్షిస్తాయా..? రాహుల్‌ ప్రచారం కాంగ్రెస్‌కు కలిసి వస్తుందా..? ఇలాంటి ప్రశ్నలతో కన్నడ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. దీంతో దేశమంతా ఇప్పుడు కర్ణాటక వైపు చూస్తోంది. రాజకీయ సమీకరణలు మారుతున్న కొద్దీ ప్రధాన పార్టీల మధ్య పోరు హోరాహోరీగా మారుతుంది.

కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. మే 12న ఎన్నికలు జరగనుండగా.. 15న ఫలితాలను ప్రకటించనున్నారు. దీంతో అందరి దృష్టి కన్నడ రాజకీయాల వైపు మళ్లింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాక ముందు నుంచే రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు ప్రచారంతో హీటెక్కిస్తే.. ఇక షెడ్యూల్‌ వచ్చాక నువ్వానేనా అనే పరిస్థితి వచ్చింది. దీంతో ప్రధాన పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగునుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌పై బీజీపీ పైచేయి సాధిస్తుందని ప్రచారం జరుగుతున్నా. సిద్దరామయ్య ప్రభుత్వం పథకాల జోరు పెంచడంతో ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేదన్న అభిప్రాయం వ్యక్త మవుతోంది.

ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న బీజేపీ చీఫ్ అమిత్‌ షా.. కర్ణాకటపై స్పెషల్‌ ఫోకస్ పెట్టారు. గుజరాత్‌ ఫార్ములానే కర్ణాటకలో ప్రయోగిస్తూ..ఆలయాలు, పీఠాధిపతులను సందర్శిస్తూ హిందూ ఓటర్లకు గాలం వేసే పనిలో ఉన్నారు. మరో వైపు లింగాయతులను ప్రత్యేక మతస్తులుగా గుర్తిస్తూ సిద్దరామయ్య సర్కార్‌ నిర్ణయం తీసుకోవడం, కావేరి జలాలపై కర్ణాటక రాష్ట్రానికి ఊరటనిచ్చేలా తీర్పు రావడం కూడా కాంగ్రెస్‌కు కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో దెబ్బతిన్న జేడీఎస్‌ సీఎం సిద్దరామయ్యకు గట్టి గుణపాఠం చెప్పాలని కృతనిశ్చయంతో ఉంది. అందుకు తగ్గట్లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించేందుకు బీజేపీతో లోపాయకారీ ఓప్పందం కుదుర్చుకోనుందని తెలుస్తోంది. అయితే మతతత్వ పార్టీగా ముద్ర పడిన బీజేపీతో చేతులు కలిపితే మైనరిటీ ఓట్లు చీలుతాయని భావిస్తున్న జేడీఎస్ కర్ర విరగకుండా.. పాము చావకుండా ద్విముఖ వ్యూహాన్ని ప్రదర్శించాలని చూస్తోంది.

మాజీ సీఎం, బీజేపీ సీనియర్‌ నేత యడ్యూరప్ప ఈ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గతంలో యెడ్డీ పాలనపై అవినీతి ముద్ర పడడంతో అవనీతిపరుడు కావాలా..? సిద్దరామయ్య లాంటి పనిచేసే వ్యక్తి కావాలా..? అంటూ కాంగ్రెస్‌ విస్తృత ప్రచారం చేస్తోంది. అయితే మూడు దశబ్దాలుగా అధికార పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చిన చరిత్ర కర్ణాటకలో లేదు. కానీ దీనిని సిద్దరామయ్య అధిగమిస్తారని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత.. అత్యంత అవినీతి సర్కార్‌ యడ్యూరప్పదే అంటూ నోరు జారిన అమిత్‌ షా వ్యాఖ్యలను కాంగ్రెస్‌ విస్తృతంగా వాడుకుంటూ ఆ విడియోను వైరల్‌ చేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో ఒకే దశలో మే 12న పోలింగ్‌ నిర్వహించి, 15న కౌటింగ్‌ నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 24 నామినేషన్‌ ఫైనలింగ్‌ తేదీగా ఉండగా.. ఏప్రిల్‌ 27ని ఉపసంహరణ తేదీగా నిర్ణయించారు. ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్‌, బీజేపీలలో ఏ పార్టీని కన్నడ ప్రజలు అధికార పీఠంపై కుర్చోబెడతారో తెలియాలంటే మే15న వెలువడే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

14:59 - April 19, 2018

ఢిల్లీ : కర్నాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. కర్నాటకలో సాధారణ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2019ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావిస్తున్న జాతీయ పార్టీలు కర్నాటక పీఠాన్ని దక్కించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. కర్నాటక రాజకీయాల్లో కింగ్‌ మేకర్‌గా వ్యవహరిస్తున్న జేడీయస్ పార్టీ మరోసారి అధికారం కోసం పావులు కదుపుతోంది. కర్నాటక ఎన్నికల రణరంగంపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ...

కర్నాటకలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నాయకుల్లో అలజడి రెట్టింపవుతోంది. నువ్వా- నేనా అన్న రీతిలో పోటా పోటీగా ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం సాగిస్తుంటే.. మరికొందరు ఆశావాహులు టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రకటించిన మొదటి విడత జాబితాలో టికెట్‌ దక్కనివారిలో కొందరు అసమ్మతిని వెళ్లగక్కుతుంటే... మరికొందరు పార్టీ ఆఫీసులోని ఫర్నీచర్ ధ్వంసం చేసి, దిష్టి బొమ్మలను తగలబెడుతున్నారు.. ఈ సారి కాంగ్రెస్, బీజేపీల్లో దేనికీ సంపూర్ణ మెజారిటీ రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికార పీఠం దక్కించుకోవడంలో జేడియస్ పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషించే ఆవకాశం కనబడుతోందని అంటున్నారు.

కన్నడలో మే12న పోలింగ్‌ జరుగనుంది. అదేనెల 15న ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తానికి కర్నాటక పీఠం కాషాయానిదా లేక కాంగ్రెస్‌దా అన్నది ఫలితాలు వెలుడితేగాని తేలదు. ఆరున్నర కోట్ల జనాభాలో.. నాలుగు కోట్ల తొంభై ఆరు వేల మంది ఓటర్లకు గాను... 56,696 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్. 224 శాసన సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నూటా పదమూడు స్థానాల్లో విజయం సాధించిన పార్టీకే అధికారం దక్కనుంది. కర్నాటకలో లింగాయితులు ఇరవై ఏడు శాతం ఉన్నారు. వీరి మద్ధతు ఏపార్టీకి ఉంటే వారిదే విజయం.

ఈ సారి అన్ని ప్రధాన పార్టీల అగ్రనేతలు తమ వారసులను రంగంలోకి దించేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.. నామినేషన్ల దాఖలుకు 24వతేది ఆఖరు కావడంతో కాంగ్రెస్, బీజేపీ, జేడియస్‌లు అభ్యర్థుల ఎంపికపై కరత్తును ముమ్మరం చేశాయి. మైసూర్ జిల్లాలోని వరుణ నియోజక వర్గంలో పోటీ ఆసక్తికరంగా మారనున్నాయి. వరుణ నియోజక వర్గం నుంచి ముఖ్యమంత్రి సిద్దారామయ్య కుమారుడు యతీంద్ర, బిజేపి ముఖ్యమంత్రి అభ్యర్థి బీ.ఎస్.యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర ఇక్కడి నుంచే పోటికి దిగనున్నారు. 

మరోవైపు రాజకీయ పార్టీల్లో  కుటుంబ పాలనపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నాటక రాజకీయాల్లో చక్రం తిప్పతున్న  జేడియస్‌లో కుటుంబ పాలన కొనసాగుతోందంటూ.. ఆ పార్టీ నేతలే అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు.. ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు దేవేగౌడ తన మొదటి కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి గౌడకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక రెండో కుమారుడైన రేవణ్ణగౌడ కుమారుడు ప్రజ్వల్ గౌడకు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్నందున ఈసారి ప్రజ్వల్ గౌడకు ఎమ్మెల్యేగా పోటీ  చేసేందుకు అవకాశం ఇవ్వాలని కొందరు నాయకులు కోరుతున్నారు. ఒక వేళ ప్రజ్వల్ గౌడ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పదవి అడుగుతారన్న ఆలోచనతో... కుమారస్వామి గౌడ సిఎం పదవికి ఎసరుపెట్టకుండా ముందుచూపుతోనే మనుమడైన ప్రజ్వల్ గౌడను ఈసారి పార్లమెంట్  అభ్యర్థిగా ప్రకటించి.. పార్టీలో అసమ్మతితోపాటు..  కుటుంబ కలహాలకు కూడా అడ్డుకట్ట వేశారని విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు.

ఇక సుమారు వంద స్థానాల్లో లింగాయితులు గెలుపును శాసించగలరన్న విషయం గత ఎన్నికల్లో రుజువైంది.. వీరి తర్వాత స్ధానం ఎస్సీ. ఎస్టీ సామాజిక వర్గాలదే. ఇరవైఐదు శాతం ఉన్న  ఎస్సీ, ఎస్టీలు ప్రధాన పార్టీల జయాపజయాలను  ప్రభావితం చేయనున్నారు. దీంతో  బీజేపీ ఎస్టీలకు  ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించింది. అందులో భాగంగానే బళ్లారి జిల్లా మొలకాల్మూరు నియోజక వర్గం నుంచి శ్రీరాములును దింపి... ఆ వర్గం ఓటర్లకు గాలం వేస్తోంది.. కానీ..  సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామిని కాదని.. బళ్ళారి ఎంపిగా ఉన్న శ్రీరాములుకు టికెట్టు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.  ప్రచారం చేస్తున్న ఎం.పి శ్రీరాములుపై చీపురులు, చెప్పులతో దాడులు కూడా జరిగాయి. ఇక కాంగ్రెస్‌లో పదకొండుమంది సిట్టింగులకు చోటు దక్కలేదు. జాబితాలో  పేర్లు లేని నేతలు ఆగ్రహంతో విధ్వంసం సృష్టించారు. బెంగళూరులోని కర్నాటక కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తలు ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. కర్నాటకలో ఎక్కువ భాగం  ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో ఉండటంతో...  తెలుగువారి ఓట్లు సైతం కర్నాటక ఎన్నికల్లో  కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని అస్ర్తంగా చేసుకుని తెలుగు ఓటర్లకు గాలం వేయాలని చూస్తోంది కాంగ్రెస్. కాగా.. బీజేపీ మాత్రం  కర్నాటక  అభివృద్దికి భారీగా నిధులు కేటాయిచామన్న అంశాన్ని ప్రచారం చేయాలని చూస్తోంది.  మొత్తానికి హోరాహోరీగా సాగుతున్న కర్నాటకలో అధికారపీఠం ఎవరిదన్న చర్చ జోరుగా సాగుతోంది. అది తెలియాలంటే మే 15 వరకు వేచి చూడాల్సిందే.

21:39 - April 13, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌, బీజేపీ కబంద హస్తాల నుంచి దేశ ప్రజలను కాపాడేందుకే ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిని ముందుకు తీసుకువెళ్తున్నట్లు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ మూస రాజకీయ విధానాలతో దేశ సమస్యలు పరిష్కారం కావని ఆయన అన్నారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు కాంగ్రెస్‌, బీజేపీ పాలనే కారణమని కేసీఆర్‌ విమర్శించారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రాల మధ్య సాగునీటి యుద్ధాలు సృష్టించి తమాషా చూస్తున్నాయని మండిపడ్డారు. బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అయిన కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌తో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి
కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటు ప్రయత్నాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా బెంగళూరు వెళ్లిన కేసీఆర్‌.. జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ్‌తో భేటీ అయ్యారు. కేసీఆర్‌ వెంట నటుడు ప్రకాశ్‌రాజ్‌, కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయతలపెట్టిన ఫెడరల్‌ ఫ్రంట్‌పై ఇరువురు నేతలు చర్చించారు.

దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చ
దేవెగౌడతో జరిపిన భేటీలో కేసీఆర్‌.. తాను ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చించారు. తన ఉద్దేశాలను దేవెగౌడకు వివరించారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఇద్దరు నేతలు చర్చించారు. ప్రజా సమస్యలతోపాటు రాష్ట్రాల మధ్య జలవివాదాలు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అన్నదాతల ఆత్మహత్యలు వంటి అంశాలపై చర్చించారు. డెబ్బై సంవత్సరాలుగా దేశం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కాంగ్రెస్‌, బీజేపీయే కారణమన్న అంశంపై సమాలోచనలు జరిపారు. కర్నాటక-తమిళనాడు మధ్య కావేరీ నదీ జలాల వివాదంపై చర్చించారు. అలాగే కృష్ణా జలాల పంపిణీకి 2004లో ఏర్పాటు చేసిన జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. మోదీ నేతృత్వంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చినా మెరుగైన పాలన అందించలేకపోయిందని, 2019 ఎన్నికల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ కీలక పాత్ర పోషిస్తుందని కేసీఆర్‌ అన్నారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటయ్యే ఫెడరల్‌ ఫ్రంట్‌లో ఏ రాజకీయ పార్టీనైనా చేరవచ్చని మాజీ ప్రధాని దేవెగౌడ ఆహ్వానించారు.

గుణాత్మక మార్పుల కోసం : కేసీఆర్
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయ రాజకీయ కూటమికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని నటుడు ప్రకాశ్‌రాజ్‌ విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి భేటీ కావాలని కేసీఆర్‌, దేవెగౌడ నిర్ణయించారు

15:42 - April 13, 2018

కర్ణాటక : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్ తరుపున ప్రచారం చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటుపై దేవెగౌదతో చర్చలు జరిపిన కేసీఆర్‌.. ఎన్నికల ప్రచారం గురించిన మీడియా అడిగిన ప్రశ్నలపై స్పందించారు. జేడీఎస్‌ ఎక్కడ కోరుకుంటే అక్కడ ప్రచారం చేస్తానని చెప్పారు. హైదరాబాద్ సంస్థానం నుంచి వేరుపడి కర్నాటకలో ప్రచారం చేయమన్నా చేస్తానన్నారు.

కాంగ్రెస్, బీజేపీపై విరుచుకుపడ్డ కేసీఆర్..
దేశంలో కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. దేశాన్ని 65 సంవత్సరాలకుపైగా పాలించిన కాంగ్రెస్‌, బీజేపీలు ప్రజా సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై బెంగళూరులో జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడతో చర్చలు జరిపిన కేసీఆర్‌.. కాంగ్రెస్, బీజేపీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రాల మధ్య సాగునీటి సమస్యలు తలెత్తడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని కేసీఆర్‌ విమర్శించారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటయ్యే ఫెడరల్‌ ఫ్రంట్‌లో ఏ రాజకీయ పార్టీలైనా చేరవచ్చని మాజీ ప్రధాని దెవెగౌడ ఆహ్వానించారు. 

19:57 - March 27, 2018

కర్ణాటకలో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కర్నాటకలో 4.96 కోట్ల మంది ఓటర్లకు గాను..56,696 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు. దీంతో నేటి నుండే ఎన్నికల నియామావళి అమలులోకి రానుంది. మే 12న పోలింగ్, 15న ఓట్ల కౌంటింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక పీఠం ఎవరిని వరించనుంది? కాషాయానికా? కాంగ్రెస్ కా? అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై చర్చను చేపట్టింది 10టీవీ. ఈచర్చలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, బీజేపీ ప్రధానకార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పాల్గొన్నారు. 

16:56 - March 27, 2018

కర్ణాటక: బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో నోరు జారారు. కర్ణాటక మాజీ సిఎం యడ్యూరప్పను అవినీతి పరుడిగా పేర్కొంటూ వ్యాఖ్యానించారు. సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ మాట్లాడుతున్న షా...ఇప్పటిదాకా తాను గమనించిన ప్రభుత్వాల్లో యడ్యూరప్ప ప్రభుత్వమే అత్యంత అవినీతిమయమైందని చెప్పారు. ఆ సమయంలో షా పక్కనే ఉన్న యడ్యూరప్ప కంగుతిన్నారు. వెంటనే పక్కనున్న మరోనేత షా చెవిలో ఈ విషయం చెప్పగా...యడ్యూరప్ప కాదు...సిద్ధరామయ్య అని సవరించుకున్నారు. అమిత్‌ షా నిజమే మాట్లాడారంటూ కాంగ్రెస్‌ ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

11:19 - March 27, 2018

ఢిల్లీ : కర్నాటక ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ అధికారులు విడుదల చేశారు. మే 26తో కర్నాటక అసెంబ్లీ ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ అధికారులు మంగళవారం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. 224 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నియావళి తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు.

మొత్తం ఓటర్లు 4,96,82,357 ఉన్నారని, 95 శాతానికి పైగానే ఓటర్ల కార్డులను పంపిణీ చేసినట్లు తెలిపారు. 56,696 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, పోలింగ్ కేంద్రాల వద్ద మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ఉపయోగించనున్నట్లు, రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ లను ఉపయోగించ కూడదన్నారు. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి ఎన్నికల వ్యయం పరిధి రూ. 28 లక్షలుగా నిర్ధారించినట్లు సమాచారం. అన్ని స్థానాలకు ఒకే దశలో పోలింగ్...
ఏప్రిల్ 17న ఎన్నికల నోటిఫికేషనష్...
ఏప్రిల్ 24 నుండి నామినేషన్ల స్వీకరణ...
నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 27 చివరి తేదీ...
మే 12 పోలింగ్...
మే 15న ఓట్ల లెక్కింపు...

21:42 - March 21, 2018

కర్ణాటక : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శృంగేరి మఠాన్ని సందర్శించారు. సీనియర్‌ పార్టీ నేతలతో కలిసి చిక్‌మగలూర్‌లోని శృంగేరి శారదాంబ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. రాహుల్‌ సంప్రదాయ పంచెను ధరించి ఆలయానికి వెళ్లారు. శృంగేరీ మఠాధిపతి జగద్గురు శంకరాచార్యను రాహుల్‌ కలుసుకున్నారు. శృంగేరి మఠంలోని వేదపాఠశాల విద్యార్ధులతో కూడా కొద్దిసేపు ముచ్చటించారు.

18:14 - March 20, 2018

తమిళనాడు : శశికళ భర్త నటరాజన్ చనిపోవడంతో 15 రోజుల పెరోల్ మంజూరు చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అనారోగ్యం కారణంగా శశికళ భర్త నటరాజన్ తెల్లవారుజామున మృతి చెందారు. పరప్పన అగ్రహారం జైలు నుంచి పెరోల్ పై శశికళ బయటికి వచ్చారు.   

Pages

Don't Miss

Subscribe to RSS - karnataka