kcr speech

18:27 - November 18, 2017

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు అప్రజాస్వామికంగా జరిగాయని సీఎల్పీ డిప్యూటి లీడర్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి  అధికార పార్టీ సభ్యుల భజనలు మినహా ప్రజా సమస్యలపై చర్చంచలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్‌ మెయింటెన్స్‌లో, గురుకుల పాఠశాలల నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

21:43 - November 17, 2017

హైదరాబాద్ : అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరిరోజు తెలుగు మహాసభలు, ఎస్సీ నిధులు, ఎంబీసీ జాబితా, పంచాయతీ రాజ్ కొత్త చట్టం అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో ఎస్సీ నిధులు ఖర్చు చేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గీతారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ నిధులపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్‌ సభలో ప్రకటించారు. ఎంబీసీల సమస్యపై సీపీఎం శాసనసభాపక్ష నేత సున్నం రాజయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు. సామాజికంగా వివక్షకు గురవుతున్న ఎంబీసీల కోసమే సీపీఎం మహాజన పాదయాత్ర చేపట్టిందని... దానిఫలితంగానే ప్రభుత్వం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిందన్నారు. కాని ఇంతవరకు ఎంబీసీ కేటగిరీలో వచ్చే కులాల జాబితాను ప్రకటించలేదని సున్నం రాజయ్య సభదృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్‌ ఎంబీసీల సమస్యలపై చర్చించేందుకు డిసెంబర్‌ 3న అన్ని పార్టీల్లోని బీసీల ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామని సభలో ప్రకటించారు.

విజ్ఞప్తి మేరకే హైదరాబాద్‌ జిల్లాను మార్చలేదు
అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకే హైదరాబాద్‌ జిల్లాను మార్చలేదన్నారు సీఎం కేసీఆర్‌. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన సంవత్సరం గడుస్తున్నా... సౌకర్యాలు కల్పించడం లేదన్న పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేసీఆర్‌ సమాధానమిచ్చారు. మధ్యాహ్నం కొత్త పంచాయతీరాజ్‌ చట్టంపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. కొత్త చట్టం రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. కేంద్రం నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత.. మరోసారి కొత్త పంచాయతీరాజ్‌ చట్టంపై సమగ్రంగా చర్చిద్దామని సభకు తెలిపారు. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ మధుసూధనాచారి ప్రకటించారు. 

18:08 - November 17, 2017

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలను ప్రచారం కోసమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాడుకుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రైతురుణమాఫీలో వడ్డీభారాన్ని భరిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం మాటతప్పిందన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దాటవేత ధోరణి అనుసరించిందని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. 

18:07 - November 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. కొత్త పంచాయతీరాజ్‌ చట్టంపై స్వల్పకాలిక చర్చ అనంతరం సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ మధుసూధనాచారి ప్రకటించారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు 16 రోజుల పాటు జరిగాయి. 11 బిల్లులకు ఆమోదం లభించగా.... 6 స్వల్పకాలిక అంశాలపై చర్చించారు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకే హైదరాబాద్‌ జిల్లాను మార్చలేదన్నారు సీఎం కేసీఆర్‌. ప్రజలకు అనుకూలంగా ఉండాలనే జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు కేసీఆర్‌. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన సంవత్సరం గడుస్తున్నా... సౌకర్యాలు కల్పించడం లేదన్న పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేసీఆర్‌ సమాధానమిచ్చారు.

15:17 - November 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఈ సమావేశాలు మొత్తం 69 గంటల 25 నిమిషాల పాటు కొనసాగాయి. అసెంబ్లీ మొత్తం 11 బిల్లులకు ఆమోదం తెలిపింది. మండలిలో 11, 6 స్వల్పకాలిక చర్చలు జరిగాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

14:33 - November 17, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో పది జిల్లా పరిషత్ లు కొనసాగుతున్నాయని, హైదరాబాద్ మినహా 30 జిల్లా పరిషత్ లు ఏర్పాటు అవుతాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. చట్టాల్లో ఉన్న లొసుగుల ఆధారంగా కోర్టులకు వెళుతున్నారని తెలిపారు. పంచాయతీ రాజ్ కు ప్రభుత్వం నిధులు ఇవ్వాలని..కొత్త పంచాయతీ రాజ్ చట్టం..కొత్త మున్సిపాల్టీ చట్టాల రూపకల్పన విషయంలో సభ్యులు అనుభవాలు..క్షుణ్ణంగా అధ్యయనం చేసి సూచనలు.. ఇవ్వాలని సూచించారు. దీనిపై ఇప్పుడు వేసిన కమిటీ వివిధ రాష్ట్రాలను పరిశీలిస్తోందని తెలిపారు. నీతి ఆయోగ్ కమిటీ మీటింగ్ లో ప్రధానితో ఈ అంశంపై మాట్లాడడం జరిగిందని, తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం జరిగిందన్నారు. దేశ..రాష్ట్రాల బడ్జెట్ రూ. 38 లక్షల కోట్లు కేటాయించి ఖర్చు చేయడం జరుగుతోందని కానీ స్థానిక సంస్థలు పనిచేయకపోతే దేశం వికాసం చెందదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం జరిగిందన్నారు. అధికారం..విధులు..డబ్బులు..ఇవ్వాల్సి ఉంటుందని..అందుకే పంచాయతీ రాజ్, మున్సిపాల్టీ చట్టంలో అధికారాలు..విధులు కల్పిస్తామన్నారు. 

14:28 - November 17, 2017

హైదరాబాద్ : తనపై సీఎం కేసీఆర్..కు అందరికీ ఎందుకంత కోపం ఉంటదని టి.కాంగ్రెస్ సభ్యుడు సంపత్ సభలో ప్రశ్నించారు. జిల్లాల విభజన అంశంపై శుక్రవారం టి. అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవాంతరాలు అధిగమించే విధంగా డీ లిమిటైజేషన్ ఉండాలని సూచించారు. కుల్వకుర్తి నియోజవకర్గం మూడు డివిజన్ లలో ఉందని..ఒక సమస్యను పరిష్కరించాల్సి వస్తే ముగ్గురు ఆర్డీవో లతో మాట్లాడాల్సి వస్తోందని..ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో మార్పులు..చేర్పులు చేస్తున్నట్లు చెబితే తాము ప్రిపేర్ అవుతుండే వారమన్నారు. 

11:09 - November 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు విపక్ష సభ్యులతో మంతనాలు జరుపుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగింపుపై ఆయన చర్చిస్తున్నారు. 50 రోజులు సభలు జరుపుతామని..విపక్షాలు ఎన్ని రోజులు కోరితే అన్ని రోజులు సమావేశాలు కొనసాగిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ శుక్రవారం ఒక్కసారిగా ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చింది. శాసనసభను నేటితో ముగింపు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా విపక్ష సభ్యులతో మాట్లాడి ఒప్పించే బాధ్యత మంత్రి హరీష్ రావు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో శుక్రవారం జానారెడ్డి ఛాంబర్ లో జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. కానీ సభ ముగింపు విషయంలో కాంగ్రెస్ ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఎస్సీ అభివృద్ధిపై సమయం ఇవ్వాలని కాంగ్రెస్ కోరగా ఇందుకు మంత్రి హరీష్ అంగీకరించినట్లు తెలుస్తోంది. సమావేశాలు ముగించేందుకు బీజేపీ..టిడిపి పార్టీలు అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. 

10:57 - November 17, 2017

హైదరాబాద్ : ఎంబీసీల సమస్యలపై సీఎం కేసీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఎంబీసీల అభివృద్ధిపై సభ్యులు పలు ప్రశ్నలు అడిగారు. దీనిపై సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని మాట్లాడారు. సమస్యలు తెలుసుకొనేందుకు బీసీ కమిషన్ నియమించడం జరిగిందని, వారు నివేదిక ఇచ్చారని సభకు తెలియచేశారు. ఎంబీసీ వెనుకబాటు తనాన్ని ప్రభుత్వం గుర్తించిందని..అందుకే కార్పొరేషన్ ను నియమించడం జరిగిందన్నారు. అత్యధిక జనాభా బీసీలని..వారి సంక్షేమానికి మించిన ప్రాధాన్యత ప్రభుత్వానికి వేరేది లేదన్నారు. బీసీ డిపార్ట్ మెంట్ ఇచ్చిన వాటితో సర్వ సమగ్ర వివరాలతో బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం పెట్టే బడ్జెట్ ఎంత ? ఖర్చు పెట్టింది ఎంత ? ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు ఎంంటీ ? అనే దానిపై సుదీర్ఘంగా చర్చకు ప్రభుత్వం సానుకూలమన్నారు. ఇందుకు డిసెంబర్ 3వ తేదీన శాసనసభలో సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, చర్చ జరిగితే స్పష్టత వస్తుందన్నారు. నవంబర్ చివరి మాసంలో ఈ వివరాలను సభ్యులకు పంపడం జరుగుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 

21:20 - November 15, 2017

హైదరాబాద్ : విపక్షాల ప్రశ్నలు.. మంత్రుల సమాధానంతో తెలంగాణ అసెంబ్లీ వాడీవేడీగా సాగింది. ముఖ్యంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ప్రాధాన్యత ఇస్తోందని కాంగ్రెస్‌, సీపీఎం పక్షాలు విమర్శించాయి. దాంతోపాటు హైదరాబాద్‌లో రోడ్లు, నాలాల దుస్థితిపై బీజేపీ, ఎంఐఎం సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆర్టీసీ నష్టాలపై కూడా సభలో చర్చించారు. కాంట్రాక్టర్లకు చెల్లింపులపై తెగ హడావిడి చేస్తున్న ప్రభుత్వం.. విద్యార్థుల ఫీజు బకాయిలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విపక్షాలు విమర్శలు కురిపించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ప్రభుత్వ వైఖరిని శాసనసభలో విపక్షాలు ఎండగట్టాయి.

ఫీజు చెల్లింపులు పెండింగ్‌లో పెట్టడం వల్ల .. పేద విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని ఉత్తమ్‌ కుమారెడ్డి అన్నారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఫీజు బకాయిలతో ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చదువుతున్న పేదవర్గాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. దాదాపు 4వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఖచ్చితమైన హామీఅయినా ఇవ్వాలని సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు.

అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల విషయంలో ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంలేదని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌అన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ఫీజులు చెల్లిస్తున్నామన్నారు. చిన్న కాలేజీలకు మొదట, పెద్ద కాలేజీలకు తర్వాత ఫీజులు చెల్లిస్తున్నామని, 2016-17 విద్యాసంవత్సరానికి మరో వారం రోజుల్లో ఫీజు బకాయిలు పూర్తిచేస్తామన్నారు ఆర్థిక మంత్రి ఈటల.

అంతకు ముందు ప్రశ్నోత్తరాల సమయంలో హైదరాబాద్‌లో రవాణా, రోడ్లు, నాలాల పరిస్థితిపై విపక్షసభ్యులు ప్రశ్నలు సంధించారు. నగరంలో నాలాల పరిస్థితి అధ్వానంగా తయారైందని, వెంటనే మరమ్మతులు చేయించాలని బీజేపీ, ఎంఐఎం సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సమాధానం ఇచ్చిన మంత్రి కేటీఆర్‌...సభ్యులు ప్రశ్నలు సుదీర్ఘంగా అడగడంపై సెటైర్లు వేశారు. నగరంలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆధునిక యంత్రసామాగ్రిని జీహెచ్‌ఎంసీకి సమకూరుస్తున్నట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో రోడ్లు, డ్రైనేజీవ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

మరోవైపు నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. 2015-16లో కొత్త బస్సుల కొనుగోలుకు రూ.39కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ రూ.336కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. ఆర్టీసీలో 4వేలకు పైగా ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. అంతకు ముందు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. విద్యార్థుల సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా సమస్యలను దాటవేస్తున్నారని.. ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించి పేద విద్యార్థులను ఆదుకోవాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - kcr speech