Kerala CM Pinarayi Vijayan

08:56 - April 20, 2018

హైదరాబాద్ : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ పోలీసింగ్ వ్యవస్థను పరిశీలించారు. కేసుల పరిష్కారాలు, మౌలిక సదుపాయాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాల అమలును  పరిశీలించారు. అనంతరం పోలీసులను విజయన్ అభినందించారు. హైదరాబాద్ పోలీస్ సాంకేతిక పరిజ్ఞానం, సేవలు తెలుసుకోవడానికి వచ్చానని  విజయన్‌ అన్నారు.  తెలంగాణ పోలీసులు పౌరులకు మెరుగైన సేవలు అందిస్తున్నారని  ఆయన కొనియాడారు.

 

14:42 - April 19, 2018

హైదరాబాద్ : దేశంలోనే రెండవ అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌ అవార్డు పొందిన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను కేరళ సీఎం పినరయి విజయన్‌ సందర్శించనున్నారు. కేసులో పరిష్కారాలు, మౌలిక సదుపాయాలు, ఫ్రెండ్లీ పోలిసింగ్...విధానాల అమలును పరిశీలించనున్నారు. కేరళ సీఎం రాకతో పోలీసులు పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు. 

22:02 - April 10, 2018

కేరళ : తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్ర ఆర్థికమంత్రులు సమావేశమయ్యారు. 15వ ఆర్థికసంఘం సిఫారసులపై దక్షిణాది రాష్ట్రాల మంత్రులు మండిపడ్డారు. కలిసి పోరాడుదాం అన్న కేరళ ప్రభుత్వ ఆహ్వానం మేరకు కేరళ, ఆంధ్రప్రదేశ్‌, పాండిచేరి, కర్నాటక  రాష్ర్టాల మంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. తెలంగాణ, తమిళనాడు రాష్ర్టాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశానికి రాలేదు. 2011 జనాభా లెక్కలను పరిగణలోనికి తీసుకోని నిధులు కేటాయించాలన్న ఆర్థిక సంఘం సిఫార్సులపై మండిపడ్డాయి. 1971 జనాభా లెక్కల ప్రాతిపథికనే నిధులు కేటాయించాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా దక్షిణ రాష్ట్రాల్లో జనాభారేటు తగ్గుముఖం పట్టగా.. ఉత్తరాధి రాష్ట్రాల్లో మాత్రం జనాభా శాతం భారీగా పెరిగింది. దీంతో 2011 జనాభా లెక్కలను పరిగణలోనికి తీసుకుని నిధులు కేటాయిస్తే.. తాము భారీగా నష్టపోతామని దక్షిణాది రాష్ట్రాల మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

20:43 - April 10, 2018

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుందా..? ఇక దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయా..? ఇక కేంద్రం దిగిరాక తప్పదా..? ఆదాయం ఇచ్చే దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుందా ? నిధులన్నింటినీ పందేరం చేస్తుందా ఉత్తరాదికి, తిరువనంతపురంలో జరుగుతున్న ఆర్థిక మంత్రుల సమావేశం ఎలాంటి సంకేతాలు పంపింది. 15 వ ఆర్థిక సంఘం సిపార్సులపై దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు మండిపడుతున్నాయి. 
నిజంగా నష్టం జరుగుతుందా..? ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ నేత దేవీప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నేత కార్తీక్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమేందర్ రెడ్డి, సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబురావు పాల్గొని, మాట్లాడారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

10:23 - September 2, 2017

డిల్లీ : లెఫ్ట్‌పార్టీల నేతల నాహీరోలని హీరో కమల్‌హాసన్‌ అన్నారు. శుక్రవారం కేరళ సీఎం పినరాయి విజయన్‌తో భేటీ తర్వాత కమల్ ఈవ్యాఖ్యలు చేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలో చేరబోమని ఆయన స్పష్టంచేశారు. తన పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన కమల్... వామపక్షనేతలను కలుసుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇరువురి మధ్య భేటీ స్నేహపూర్వకమేనని కేరళ సీఎంవో వర్గాలు తెలిపాయి.

09:21 - March 20, 2017

సీపీఎం నిర్వహించిన మహాజన పాదయాత్ర చరిత్రాత్మక పాదయాత్ర అని, 150 రోజులకు పైబడి సాగిన ఈ యాత్ర చరిత్ర సృష్టించిందని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ కు ఆదివారం వచ్చారు. ఈసందర్భంగా టెన్ టివి అసోసియేట్ ఎడిటర్ శ్రీధర్ ఆయనతో ముచ్చటించారు. అన్ని వర్గాల ప్రజలు పాదయాత్ర నినాదాలపై ఆసక్తిని కనబరిచి వారు మద్దతిచ్చారని తెలిపారు. కిలోమీటర్ల కొద్ది పాదయాత్రతో కలిసి సాగారని, ఏది ఏమైనా ఇది ఘనవిజమన్నారు. కేరళ రాష్ట్రంలో పేదలు లబ్దిపొందేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదలు చాలా సమస్యల్లో ఉన్నారని, సామాజిక న్యాయం అన్నది తమ దృష్టిలో ప్రధానాంశమన్నారు. అభివృద్ధి సామాజిక న్యాయంపైనే ఆధారపడిందని, ఈ దిశగా తాము నాలుగు మిషన్లను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా తాము నవ కేరళలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం పినరయి స్పష్టం చేస్తున్నారు.

07:55 - March 20, 2017

సామాజిక న్యాయం..సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర నిన్నటితో ముగిసింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగసభ జరిగింది. ఈ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరితో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలపై వక్తలు విమర్శలు గుప్పించారు. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్షాలు ఆయనపై పలు విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో చెరుపల్లి సీతారాములు (సీపీఎం), తాడూరి శ్రీనివాస్ రెడ్డి (టీఆర్ఎస్), శ్రీధర్ (బీజేపీ), బెల్లం నాయక్ (టి.కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

06:50 - March 20, 2017

హైదరాబాద్ : తెలంగాణలోని నాలుగున్నర లక్షల మంది మలయాళీల అభివృద్ధికి కృషి చేస్తానని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన విజయన్‌.. అనంతరం మలయాళీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. సీపీఎం నిర్వహించిన సమర సమ్మేళనం సభకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌ వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్‌.. మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలుసుకున్నారు. ప్రగతిభవన్‌కు వచ్చిన ఆయనకు కేసీఆర్‌ విందు ఇచ్చారు. అనంతరం ఇరువురు పలు అంశాలపై చర్చించారు. కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విజయన్‌ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ నుంచి శబరిమల వెళ్లే భక్తుల కోసం అక్కడ ఓ భవనాన్ని నిర్మించే అంశాన్ని కూడా కేసీఆర్‌.. విజయన్‌ దృష్టికి తెచ్చారు. దీనికి అవసరమైన భూమిని సమకూర్చుతామని విజయన్‌ హామీ ఇచ్చారు.

ఆత్మీయ సమ్మేళనం..
హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణమండపంలో జరిగిన మలయాళీల ఆత్మీయసమ్మేళనం కార్యక్రమంలో కేరళ సీఎం విజయన్ పాల్గొన్నారు. తెలంగాణలో ఉంటున్న నాలుగన్నర లక్షల మలయాళీల అభివృద్ధికి కృషి చేస్తానని విజయన్ తెలిపారు. కేరళ భవన్‌ను త్వరతగతిన పూర్తిచేయాలని.. హైదరాబాద్ నుంచి నేరుగా కేరళకు బస్సులు నడపాలని సీఎం కేసీఆర్‌ను కోరానని చెప్పారు. అలాగే కేరళ వాసులకు డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లు కట్టించి ఇవ్వాలని కేసీఆర్‌ను కోరినట్టు తెలిపారు. మరోవైపు విజయన్ పర్యటన సమయంలో ఆర్టీసీ కళాభవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేరళ సీఎం గోబ్యాక్ అంటూ ఏబీవీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

06:48 - March 20, 2017

హైదరాబాద్ : సబ్బండ వర్గాల సమరసైన్యం హైదరాబాద్‌లో సమరశంఖం పూరించింది. ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసింది. ఎర్రదళం భాగ్యనగరి వీధుల్లో కవాతు తొక్కింది. ఎక్కడ చూసినా లాల్‌, నీల్‌ జెండాల రెపరెపలే దర్శనమిచ్చాయి. మెడలో కండువాలు, చేతిలో జెండాలు, లాల్‌,నీల్‌ దుస్తులు ధరించి సాగిన ర్యాలీ... హైదరాబాద్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దారులన్నీ సరూర్‌నగర్‌కే అన్నట్టుగా ఎటుచూసినా జనసంద్రమే తలపించింది. పదం పాడుతూ... కదం కదుపుతూ ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. హైదరాబాద్‌లో ఆదివారం ఎక్కడ చూసినా ఎర్రజెండాలు, నీల్‌ జెండాలే రెపరెపలాడాయి. దీంతో హైదరాబాద్‌ లాల్‌నీల్‌ వర్ణశోభితమైంది. కులవివక్షత, సామాజిక అసమానతలపై అవి దండోరా మోగించాయి. సామాజిక న్యాయం - సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వంపై సమరశంఖం పూరించాయి.

154 రోజులు..
తెలంగాణ వ్యాప్తంగా మహాజన పాదయాత్ర 154 రోజులు కొనసాగింది. 4200 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఆదివారం పాదయాత్ర ముగింపు సందర్భంగా సమర సమ్మేళనం సభ జరిగింది. ఈ సభకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి తమ్మినేని నేతృత్వంలో పాదయాత్ర బృందం సభ్యులు, పార్టీ కార్యకర్తలు సభా ప్రాంగణానికి పాదయాత్రగా చేరుకున్నారు. ఈ పాదయాత్రకు హైదరాబాద్‌ జనం అడుగడుగునా జేజేలు పలికారు. తమ అభిమానాన్నంతా పూలవర్షంలా కురిపించారు. పాదయాత్ర వస్తున్న ప్రధాన కూడళ్లలో కార్యకర్తలు బాణాసంచాలలు కాల్చి ఘన స్వాగతం పలికారు. జై భీం, లాల్‌సలాం నినాదాలతో హోరెత్తించారు. దీంతో పాదయాత్ర సాగిన దారులన్నీ కోలాహలంగా జన జాతరను తలపించింది.

నగరంలో జోరు హోరు..
పాదయాత్ర పొడవునా తమ్మినేని బృందానికి జనం తండోపతండాలుగా తోడయ్యారు. ప్రతి కూడలి దగ్గర పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలుకుతూ..అక్కడి నుంచి వారితో కలిసి నడిచారు. టీవీ టవర్‌ చౌరస్తాకు రాగానే జనం వేలాదిగా జమఅయ్యారు. ఇక కొత్తపేట చేరుకోగానే జనం రెట్టింపయ్యారు. దీంతో దారులన్నీ సీపీఎం, సామాజిక సంఘాల కార్యకర్తలతో నిండిపోయాయి. మరోవైపు వనస్థలిపురంలోని స్పెన్సర్స్‌ నుంచి మరో ర్యాలీ సభా ప్రాంగణానికి చేరుకుంది. యువత, మహిళలు, వృద్ధులు, విద్యార్ధులు భారీగా సభకు తరలివచ్చారు. లాల్‌,నీల్‌ జెండాలు చేతబట్టి వాహనాల్లో చేరుకున్నారు. దూరప్రాంతాల వారు కొంతమంది శనివారం రాత్రే హైదరాబాద్‌ చేరుకున్నారు. దీంతో మధ్యాహ్నానికే సభ ప్రాంగణం నిండిపోయింది. ఎర్రని ఎండను సైతం లెక్కచేయకుండా జనం సభలో కూర్చొన్నారు. సభికుల సౌకర్యార్ధం సభా ప్రాంగణంలో మూడు స్క్రీన్లు ఏర్పాటు చేశారు. స్టేడియంలో తొక్కిసలా జరుగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగా జనమూ సహకరించారు. సభా ప్రాంగణానికి దూరంగా వాహనాలను నిలిపివేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో మొత్తం హైదరాబాద్‌ జన హోరు తలపించింది.

06:46 - March 20, 2017

హైదరాబాద్ : సమర సమ్మేళనం సభలో కళాకారుల ప్రదర్శనలు సభికులను కట్టిపడేశాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ పోడకలపై గాయకుల పాటలు అందరినీ ఆలోచింపజేశాయి. ప్రజాగాయకులు గద్దర్‌, గోరటి వెంకన్న, విమలక్క పాటలు అందరిలో ఉత్సాహాన్ని నింపాయి. గాయకుల పాటలకు సభికులు ఈలలువేస్తూ, నృత్యాలు చేస్తూ తమ మద్దతు తెలిపారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం గ్రౌండ్స్‌లో నిర్వహించిన సమర సమ్మేళనం సభలో కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. సభకు వచ్చిన జనాన్ని అలరించాయి. ప్రజా గాయకుడు గద్దర్‌ సభలో పాటలు పాడుతూ అందరినీ ఉత్సాహపరిచారు. అమర వీరులపై పాడిన పాట ఉర్రూతలూగించింది. ఇక పొడుస్తున్న పొద్దుమీద పాటకు సభికులు నృత్యాలు చేశారు. రచయిత, ప్రజా కవి గోరటి వెంకన్న స్టేజ్‌ను షేక్‌ చేశారు. పాటలు పాడుతూ, స్టెప్పులు వేస్తూ సభకు వచ్చిన వారిని ఉత్సాహపరిచారు. ఇక విమలక్క ప్రజా ఉద్యమాలపై జరుగుతున్న దాడిపై పాడిన పాటకు సభికుల నుంచి విశేష స్పందన లభించింది. ఆడుదాం డప్పుల్లా దరువేయరా అంటూ విమలక్క పాడితే సభికులు కదం కలుపుతూ స్టెప్పులేశారు. గాయకుడు ఏపూరి సోమన్న తన పాటలతో అందరిలో ఉత్తేజం నింపారు. కేసీఆర్‌ హామీలపై ఆయన పాడినపాటలు అందరినీ ఆలోచింపజేశాయి. రోజులు మారాలి, మా రోజులు రావాలంటూ సాగిన పాటకు సభికుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజానాట్య మండలి కళాకారులు నర్సింహ్మా పాడిన పాటలు సభలో ఉత్సాహాన్ని నింపాయి. తమ్మినేని పాదయాత్రపై ఆయన పాడిన పాటకు సభకు వచ్చిన వారు ఈలలువేస్తూ... నృత్యాలు చేస్తూ మద్దతు తెలిపారు. ప్రజానాట్యమండలి కళాకారుల ఆటపాటలు, భద్రాచలానికి చెందిన గోండు నృత్యాలు సమర సమ్మేళనం సభకే హైలెట్‌గా నిలిచాయి.

Pages

Don't Miss

Subscribe to RSS - Kerala CM Pinarayi Vijayan