khammam

19:32 - April 28, 2017

ఖమ్మం : వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కార్యాలయం ఎదుట మిర్చి రైతులతో కలసి .. టీడీపీ ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య ఆందోళన చేపట్టారు. మిర్చి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే..దానికి  ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని  సండ్రా వెంకట వీరయ్య హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కింటాకు పది వేల చొప్పున ఇచ్చి మిర్చిని కొనుగోలు చేయాలని కోరారు.

 

15:32 - April 24, 2017

భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట మండలం దేవునిగుట్టలో గిరిజనులపై పోలీసులు, అటవీశాఖ అధికారులు చేసిన దాడిని సీపీఎం ఖండించింది. పదిహేడేళ్లుగా అడవిలో ఉంటూ, భూములను సాగుచేసుకుంటున్న గిరిజనులను తరిమికొట్టడాన్ని తప్పుపట్టింది. 2006 అటవీ చట్టం ప్రకారం అటవీ భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాల్సింది పోయి, భూముల నుంచి తరిమికొడుతారా ? అని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇళ్లను తగులబెట్టి, పసు సంపదను పోలీసులు, అటవీశాఖ అధికారులు తీసుకెళ్లారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

17:39 - April 23, 2017

హైదరాబాద్ : కారు పార్టీలో కమిటీల కయ్యం ప్రకంపనలు రేపుతోంది. స్థానిక నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. పదవుల్లో అధికశాతం మంత్రి తుమ్మల వర్గానికే దక్కడంపై.. ఎంపీ పొంగులేటి సహా ఇతర ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వారికి గాని, టిఆర్ఎస్ పార్టీని వెన్నంటి ఉన్నవారిని.. మండల అధ్యక్షులు, కార్యదర్శులుగా నియమించకుండా.. కొత్తగా పార్టీలో చేరిన వారిని అందలమెక్కిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి తుమ్మల తనకు గాని, తన అనుచరులకు గాని ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఎంపి పొంగులేటి వర్గం అసహానాన్ని వ్యక్తం చేస్తోంది. ఎవరికి వారు పైచేయి సాధించేందుకు పోటీపడుతున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పువ్వాడ వ్యూహాలతో మంత్రి తుమ్మల, ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెక్ పెట్టి తనదైన శైలీలో ముందకు పోతున్నారు. నియోజకవర్గంలోని 50 డివిజన్‌ కమిటీలకు గాను.. 47 కమిటీలు వేశారు. మిగతా ఒకటో డివిజన్, 49, 50 డివిజన్లు పాలేరు నియోజకవర్గంలో ఉండటంతో..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ మూడు కమిటీలను వేయాల్సి ఉంది. రఘునాథపాలెం మండల కమిటీతో పాటు గ్రామ కమిటీలను కూడా వేశారు.

పాలేరు నియోజకవర్గంలో...
పాలేరు నియోజకవర్గంలో మంత్రి తుమ్మల తన అనుచరులకు మండల అధ్యక్షులు, గ్రామ కమిటీ, మార్కెట్ కమిటీలలో అవకాశాలు కల్పించారు. నేలకొండపల్లి , కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం అధ్యక్షులను నియమించారు. అయితే పాలేరులో ఎంపి పొంగులేటి తన వర్గాన్ని మండల అధ్యక్షులుగా నియమించుకోలేకపోయారు. ఇక వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్, ఎంపి పొంగులేటి అనుచర వర్గాలు ఎవరికి వారే కమిటీలు ప్రకటించుకున్నారు. వైరా ఎమ్మెల్యే తనను సంప్రదించకుండానే గ్రామ, మండల కమిటీలు వేసుకున్నారనే ఆగ్రహంతో ఎంపీ గ్రామ, మండల కమిటీలను ప్రకటించారు.

సత్తుపల్లి..
సత్తుపల్లి నియోజకవర్గంలోని 6 మండలాల్లో తుమ్మల అనుచరులకే పదవులు దక్కాయి. సత్తుపల్లి ఇంఛార్జీగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఉన్నా..మంత్రి తుమ్మలదే పైచేయిగా మారింది. అటు మధిర నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. మధిర పట్టణ అధ్యక్షుడిగా దేవిశెట్టి రంగా.. అలే కార్యదర్శిగా అరక శ్రీనివాసరావు..మధిర మండల అధ్యక్షుడిగా దొండపాటి నాగేశ్వరరావును నియమించారు. బోనకల్ మండల అధ్యక్షుడిగా బందం శ్రీనువాసరావు..చింతకాని మండల అధ్యక్షుడిగా పెండ్యాల పుల్లయ్య...కార్యదర్శిగా నోముల కొండ దుర్గాచారిని నియమించారు.

ఇల్లందు నియోజకవర్గం..
ఇల్లందు నియోజవకర్గం విషయానికి వస్తే ఎమ్మెల్యే కొరం కనకయ్య, ఎంపి సీతారాం నాయక్ మధ్య వర్గపోరు కొనసాగుతోంది. నియోజవకర్గంలోని 7 మండలాల్లో ఒక్క కారేపల్లికి మాత్రమే అయిలయ్యను నియమించారు. ఎంపి, ఎంఎల్ఏ మధ్య అధిపత్య పోరుతో ఇల్లందు, గార్ల బయ్యారం, టేకులపల్లి, గుండాలలో మండల కమిటీలు, గ్రామ కమిటీలు వేయలేదు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్, మంత్రి తుమ్మల, ఎంపి పొంగులేటి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. కనుగట్లు బాలకృష్ణ, బరిపటి వాసుదేవ్ రావు, మచ్చా శ్రీనివాసరావు, నాదేటి సంతోష్, వీరభద్రం పేర్లను ఎంపీ పొంగులేటి, తుమ్మల వర్గం ప్రాతిపాదించింది. ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ మాత్రం అధ్యక్షులుగా కిలారు నాగేశ్వరరావు, రాజు గౌడ్, సండ్రా వెంకటేశ్వర్లు, గంగాధర్ , కాలువ భాస్కర్, మల్లెల రవిచంద్ర , మురళీ, మధును నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. తన వర్గానికి చెందిన శివారెడ్డి, జానకి రెడ్డి, ముత్తయ్యను అధ్యక్షులుగా నియమించాలని ఎంపి పొంగులేటి పట్టు బడుతున్నారు. పాల్వంచ పట్టణంలోనూ ఇదే పరిస్థితి.

పినపాక నియోజకవర్గంలో..
పినపాక నియోజకవర్గంలో బూర్గంపాడులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనుచరునికే అధ్యక్ష పదవి దక్కింది. పినపాక, గుండాల,అళ్లపల్లి, కరకగూడెం, అశ్వాపురం మండలాల్లోనూ తన అనుచరులతో కమిటీలు వేశారు. అశ్వారావు పేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తుమ్మల వర్గం కావడంతో..అన్ని మండల, గ్రామ కమిటీలు తుమ్మల అనుచరులకే దక్కాయి. భద్రాచలం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, జెడ్ పి చైర్మన్ గడిపల్లి కవిత తుమ్మల అనుచర వర్గం కావటంతో తుమ్మల సమ్మతితోనే కమిటీలు వేశారు. నేతల మధ్య విభేదాలతో కమిటీల నియామకం మందకొడిగా సాగుతోంది.

18:03 - April 22, 2017

ఖమ్మం :జిల్లా వైద్యాధికారి విధులను అడ్డుకున్న... స్వాతి హాస్పిటల్‌ యజమాని లక్ష్మణరావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆ ఆస్పత్రిని అధికారులు సీజ్‌ చేశారు. ప్రమాణాలు పాటించడం లేదని పలుమార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని..అందుకే ఆస్పత్రిని సీజ్‌ చేశామని జిల్లా వైద్యాధికారి చెప్పారు. అయితే ఇన్‌పేషంట్లను దృష్టిలో పెట్టుకుని...ఐదు రోజుల పాటు వారికి ఆస్పత్రిలో చికిత్స జరిగేలా అనుమతి ఇచ్చామని చెప్పారు. 

17:27 - April 19, 2017

ఖమ్మం : జిల్లాలోని తల్లాడ మండలం మల్లారంలో అప్పుల బాధతో మిర్చి రైతు కటికి నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు. నాగేశ్వరరావు రెండు ఎకరాల మిర్చి, మూడు ఎకరాల పత్తి సాగుచేశాడు. మిర్చికి గిట్టుబాటు ధర లేకపోవడంతో చేసిన అప్పులు తీరేమార్గం లేదన్న బాధతో మిరప తోటలోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగేశ్వరరావు ఆత్మహత్యలో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. 

08:05 - April 19, 2017

ఖమ్మం : ఆడవాళ్లు ఆకాశంలో సగం.. అన్నింటా సగం అని చెప్పుకునే నేటి సమాజంలో ఆడబిడ్డ పుట్టింది అంటేనే పాపంగా పరిగణిస్తున్న వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తికాదు. పుట్టబోయేది ఆడబిడ్డ అని తెలియగానే కడుపులోనే ఆడబిడ్డను చంపేస్తున్నారు. కాసుల కక్కుర్తితో కొంత మంది వైద్యులు లింగ నిర్థారణ పరీక్షలు యథేచ్ఛగా చేస్తూ ఆడపిల్లల ఊసురు పోసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో పెరిగిపోతున్న భ్రూణ హత్యలపై 10 టీవీ ప్రత్యేక కథనం.
చట్ట విరుద్ధంగా లింగ నిర్థారణ పరీక్షలు 
కొన్ని గ్రామాల్లో ఆడపిల్ల పుట్టిందంటేనే భారంగా భావిస్తున్నారు. కట్న కానుకలకు భయపడి కడుపులోనే ఆడపిల్లను చంపేస్తున్నారు. నిరుపేదలే కాదు బడాబాబులు కూడా భ్రూణ హత్యలకు పాల్పడడం విస్మయాన్ని కలిగిస్తోంది. వైద్యులకు డబ్బు ఆశ చూపి లింగ నిర్థారణ పరీక్షలు చేయిస్తూ ఆడపిల్ల అని తెలియగానే పిండాన్ని పిండేస్తున్నారు. వైద్యులు చట్ట విరుద్ధంగా లింగ నిర్థారణ పరీక్షలకు పాల్పడడంతో భ్రూణ హత్యలు ఖమ్మం జిల్లాలో ఎక్కువైపోతున్నాయి. 
భ్రూణహత్యలు అరికట్టడంలో అధికారులు విఫలం
ఖమ్మం నగరంలోని కొన్ని ఆసుపత్రులు, స్కానింగ్‌ కేంద్రాలు విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ భ్రూణహత్యలే పనిగా వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యకృత్యంగా మారిన భ్రూణహత్యలను అరికట్టడంలో ఉన్నతాధికారుల మొబైల్ బృందం పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గర్భంలోనే ఆడశిశువులను చిదిమేసే వారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం 1994లో లింగ నిర్ధారణ నిరోధక చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే వారికి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. కానీ జిల్లాలో లింగ నిర్థారణ పరీక్షలు ఎక్కువైనా అధికారులు కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. 
రంగంలోకి వైద్యాధికారులు 
భ్రూణ హత్యలపై ఫిర్యాదులు ఎక్కవ అవడంతో ఎట్టకేలకు వైద్యాధికారులు రంగంలోని దిగారు. నగరంలోని పలు ప్రయివేటు ఆసుపత్రుల్లో దాడులు నిర్వహించి ఎలాంటి అనుమతి లేని ఆస్పత్రులను సీజ్ చేశారు. లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నామని పోలీస్ కమిషనర్ ఇక్బాల్ తెలిపారు. ఇప్పటికైనా జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భ్రూణ హత్యలపై అధికారులు ఉక్కుపాదం మోపి ఆడపిల్లల బంగారు భవిష్యత్‌ను కాపాడాలని సామాజిక వేత్తలు, మేధావులు కోరుతున్నారు. 

 

17:07 - April 18, 2017

ఖమ్మం : లింగనిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని తెలిసినా పలు ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆడపిల్ల అని తెలియగానే గర్భస్రావాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే దాడులు నిర్వహించి ఆసుపత్రులకు తాళాలు వేశారు. శ్రీశ్రీ ఆస్పత్రితో పాటు మీనాక్షి సూపర్‌ స్పెషాలిటీస్‌ ఆస్పత్రి, స్పందన ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్టన్లు, వైద్య ఆరోగ్య, రెవెన్యూ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయా ఆసుపత్రులపై దాడులు నిర్వహించారు. లింగ పరీక్షలు చేస్తున్నారని నిర్ధారించుకున్న అనంతరం ఆసుపత్రులకు తాళాలు వేశారు. పరీక్షలు నిర్వహిస్తూ భ్రూణహత్యలకు కారణమవుతున్న అధికారులను స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న షేక్‌ గఫార్, సంపేట అశోక్‌, అర్వపల్లి శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. 

14:41 - April 18, 2017

ఖమ్మం: ఇంటర్ ఫలితాల్లో రెజోనెన్స్‌ విద్యార్ధులు విజయకేతనం ఎగురవేశారు. సీనియర్‌ ఎంపీసీలో రెజోనెన్స్‌ విద్యార్ధిని కె. నిఖిత.. 993 మార్కులు సాధించి స్టేట్‌ టాపర్‌గా నిలిచింది. ఇదే విద్యాసంస్థకు చెందిన సాయిచరణ్‌ 992 మార్కులు సాధించగా... యశస్వినీ 990 మార్కులు సాధించింది. ఇక ఫస్టియర్‌లోనూ రెజోనెన్స్‌ సత్తా చాటింది. ఫస్టియర్‌ ఎంపీసీలో పూర్ణిమ 466 మార్కులు సాధించింది. సీనియర్‌ బైపీసీలో బోడా అనుషా 982 మార్కులు సాధించి రెజోనెన్స్ ఖ్యాతిని రాష్ట్రస్థాయిలో ఇనుమడింప చేసింది. విద్యార్ధులు ఉత్తమ ఫలితాలు సాధించడంపట్ల రెజోనెన్స్‌ డైరెక్టర్స్ నాగేందర్‌కుమార్‌, శ్రీధర్‌ సంతోషం వ్యక్తం చేశారు.

 

14:38 - April 18, 2017

ఖమ్మం :ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో శ్రీనారాయణ జూనియర్ కళాశాల విద్యార్ధులు సత్తాను చాటారు. ప్రథమ సంవత్సరం ఎంపిసీ విభాగంలో వాసుకీ 466 మార్కులు, మణికంఠ 463 మార్కులు సాధించారు. బైపిసీ విభాగంలో వెంకటేష్ 426 మార్కులు సాధించారు. ఇక ద్వితీయ సంవత్సరంలో ఎంపిసీ విభాగంలో పూర్ణావెంకట్ 980 మార్కులు, బైపిసీలో పద్మప్రియా 968 మార్కులు, షాహీనా 968 మార్కులు సాధించారు. టాప్‌ మార్కులు సాధించిన తమ విద్యార్థులను శ్రీనారాయణకళాశాల చైర్మన్‌, డైరెక్టర్లు అభినందించారు. 

17:47 - April 17, 2017

అదిలాబాద్ : టీఆర్ఎస్ బహిరంగసభకు నిధుల సేకరణకోసం మంత్రి జోగు రామన్న స్వీపర్‌గా మారారు.. ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేటు నర్సింగ్‌ హోంలో పారిశుద్ధ్య పనులు చేశారు. ఈ పనులకు ఆస్పత్రి యాజమాన్యం లక్షా యాభైవేల రూపాయలు ఇచ్చింది.. అక్కడినుంచి ఖానాపూర్‌వెళ్లిన మంత్రి చెరువుగట్టున మట్టి మోశారు. ఇలా రెండు లక్షల యాభైవేల రూపాయలు సంపాదించారు. ఈ డబ్బును పార్టీ ప్లీనరి అవసరాలకోసం వినియోగిస్తామని జోగు రామన్న తెలిపారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - khammam