Koluvu Kolkata

21:25 - December 4, 2017

హైదరాబాద్ : నిరుద్యోగ సమస్యకు కచ్చితమైన పరిష్కారం లభించేంతవరకు ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కొలువులకై కొట్లాట సభ సక్సెస్‌ అయ్యిందన్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్‌లో జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొలువులన్నీ భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ... మూడేళ్లైనా ఆ హామీని నెరవేర్చలేదన్నారు. దీంతో నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. నిరుద్యోగ సమస్యను ఎజెండాపైకి తీసుకురావడం కేసీఆర్‌ సర్కార్‌కు నచ్చడం లేదన్నారు. అందుకే ఉద్యమకారులను, టీజేఏసీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

20:26 - December 4, 2017

మన ఉద్యోగాలు..మనవే..నినాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి..అంకె భారీగా ఊరిస్తూనే ఉంది.. అమలుపైనే అసలు సందేహాలు..ఓ పక్క సమర్ధింపులు.. మరోపక్క కొట్లాటలు..మూడున్నరేళ్లు గడుస్తుంది.. ఇంకెప్పుడని రోడ్డెక్కుతున్నారు.. ఆందోళనకు దిగుతున్నారు.. తెలంగాణలో నిరుద్యోగులకు ఒరిగిందేమిటి? లక్షల ఉద్యోగాలంటూ ప్రభుత్వం చెప్పేది కాకి లెక్కలేనా? నిరుద్యోగుల ఆశలు నెరవేరేదెపుడు? కొలువుల కొట్లాట ఏ దారిలో నడవనుంది? కొలువు దొరుకుతుందన్న నమ్మకం లేదు. సర్టిఫికెట్లు దేనికీ పనికి రానివిగా మారిపోతున్నాయి. కోచింగ్ సెంటర్లలో ఏళ్లు గడిచిపోతున్నాయి.. ఆశలు తీరవు..హామీలు ఆగవు.. బతుకుపోరు నానాటికీ బరువుగా మారుతున్న దృశ్యం..

 

అసలు తెలంగాణలో ఎందరు నిరుద్యోగులున్నారు? ఎన్ని ప్రభుత్వోద్యోగాలు ఖాళీగా ఉన్నాయి? సర్కారు గతంలో ఏం చెప్పింది.. ఇప్పుడేం చెప్తోంది?తెలంగాణ ప్రభుత్వం గత మూడున్నరేళ్లలో ఎన్ని ప్రభుత్వోద్యోగాలు కల్పించింది? ప్రైవేటురంగం ఎన్ని ఉద్యోగాల కల్పనకు అవకాశాలు ఇచ్చింది? అంకెలు స్పష్టంగా కనపడుతున్నాయి.. నిరుద్యోగుల సంఖ్య స్పష్టంగా కనిపిస్తోంది. సర్కారు దాటవేతలూ స్పష్టమౌతున్నాయి.. ఉపాధి కల్పన సర్కారు బాధ్యత కాదా? ఉద్యోగాలు జనరేట్ అయ్యే పరిస్థితులు కల్పించాల్సిన ప్రభుత్వాలు ఒప్పందాల ఆడంబరాలకే పరిమితమౌతున్నాయా? తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారమేనా?దేశంలో ప్రభుత్వోద్యోగాలు తగ్గిపోతున్నాయి. సర్కారు తన బాధ్యతలను వదుల్చుకుంటున్న తరుణంలో, పబ్లిక్ సెక్టార్ నుంచి చాలా బాధ్యతలు ప్రైవేటు పరం అవుతున్నాయి.. కానీ, ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయని ప్రభుత్వాలు ప్రైవేటు రంగాన్ని కూడా అంతే నిర్లక్ష్యం చేయటం ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం.. చిన్నా చితకా పని దొరకటానికే నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి. ఆ మధ్య పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏలు చదివిన వారు కూడా రావటం పరిస్థితి తీవ్రత అద్దం పడుతోంది.

 

ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కచ్చితంగా ప్రభుత్వానిదే. ఉపాధి అవకాశాలు పెరిగే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ప్రభుత్వ రంగ ఖాళీలను భర్తీ చేయాల్సిన పని సర్కారుదే.. కానీ, సరళీకరణ విధానాల పరుగులో ప్రభుత్వాలు పెట్టుబడులు, లాభాలు అంటూ నేలవిడిచి సాము చేస్తూ ప్రజాసంక్షేమాన్ని గాలికొదులుతున్నాయి. మాటలకే పరిమితమౌతూ కార్పొరేట్ పెద్దలకు అనుకూల నిర్ణయాలతో నిరుద్యోగులను నట్టేట ముంచుతున్నాయి.. ఈ పరిస్థితిలో మార్పు రాకపోతే … తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ లోకానికి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమించటమే మార్గం అవుతుంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

 

 

 


 

 

17:23 - December 4, 2017

హైదరాబాద్ : కోదండరాం స్వలాభం కోసం నిరుద్యోగ సమస్యపై పోరాడటం లేదని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. ఇది నిరుద్యోగులందరి సమస్య అని చెప్పారు. నిరుద్యోగ సమస్యను ఏజెండాపైకి తీసుకురావడమే కోదండరాం చేసిన తప్పా అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. అరెస్ట్‌లు, నిర్బంధాలతో ఉద్యమాలను ప్రభుత్వం ఎప్పుడూ ఆపలేదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌ నిరుద్యోగుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని గుర్తించాలని, వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమమంతా విద్యార్థుల త్యాగాల ఉద్యమమేనని ప్రజాగాయకుడు, యుద్ధనౌక గద్దర్‌ అన్నారు. కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని.... కొట్లాడే కొలువులు తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. పోరాటంతోనే హక్కులు సాధించుకోవాలన్నారు. ఈ సందర్భంగా పాటలుపాడి నిరుద్యోగులను ఉత్సాహపరిచారు. 

15:52 - December 4, 2017

హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగం తీవ్రంగా ఉందని టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్యాలెండర్ ఇయర్ ప్రకటించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కొలువులకై కొట్లాట సభకు వచ్చే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు.

15:35 - December 4, 2017

హైదరాబాద్ : విద్యార్థులో నిరాశ నెలకొందని ప్రముఖ విద్యవేత్ చుక్కా రామయ్య అన్నారు. ప్రభుత్వం దేని కోసమైతే ఏర్పాడిందో అది చేయడం లేదని, కోదండరామ్ పై విమర్శలు చేయడంపై సరికాదని, ఆయన అతని కోసమో, పదవి కోసమో పోరాటం చేయడంలేదని విద్యార్థుల కోసమే పోరాటం చేస్తున్నారని రామయ్య అన్నారు.

14:44 - December 4, 2017

హైదరాబాద్ : కొలువులకై కొట్లాట సభలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వస్తున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్‌ నేతలు తప్పు పట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిరంకుశ పాలనకు ఈ నిర్బంధమే నిదర్శనమని సీఎల్‌పీ ఉపనేత జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు అనుమతిలో నిర్వహిస్తున్న కొలువులకై కోట్లాట సభకు పోలీసులు ఆటంకాలు కల్పించడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళి రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు మార్చివేశారని టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్‌ ఆరోపించారు. 

06:57 - November 27, 2017

హైదరాబాద్ : కొలువుల కోసం కోట్లాటకు టీజాక్ రెడీ అవుతోంది. పోలీసుల అనుమతి నిరాకరణతో వాయిదా పడుతూ వస్తున్న సభను నిర్వహించాలన్న పట్టుదలతో ఉంది. కోర్టు సూచనలతో సభకోసం టీజాక్‌ ఉత్సహాంగా ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ నాలుగో తేదీన నిరుద్యోగులతో సభను నిర్వహించాలని జేఏసీ నేతలు భావిస్తున్నారు. కొలువల కొట్లాట పెరుతో భారీ సభను నిర్వహించేందుకు టీజాక్ ప్రయత్నిస్తూనే ఉంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మొదటి సారి పోలీసులు అనుమతి నిరాకరించారు. రెండో సారి కూడా ప్రభుత్వ పరంగా ప్రతిష్టాత్మకంగా పలు కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో అనుమతి దక్కడం జాక్ కు ఇబ్బంది గా మారింది. తమ సభకు అనుమతి ఇవ్వాలని కోర్టు కెక్కడంతో ఇప్పుడు కొలువుల కొట్లాల సభ వ్యవహారం కోర్టు న్యాయస్థానంలో ఉంది. తెలంగాణా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచేందుకు టీజాక్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఆరు డిమాండ్లతో సభను నిర్వహించాలని జేఏసీ నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల నియామకంపై ఏర్పడుతున్న ప్రతిష్టంభనను తొలగించి ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండర్ విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేస్తోంది. దాదాపు రెండు లక్షల ఉద్యోగాల ఖాళీ ఉన్నాయని టీజాక్ నేతలు అంటున్నారు.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు ప్రైవేటు రంగంలోకూడా తెలంగాణా స్థానికులకు రిజర్వేషన్లను అమలు చేయాలని టీజాక్‌ డిమాండ్‌ చేస్తోంది. దాంతోపాటు భూ నిర్వసితుల సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని నిర్ణయించారు. డిసెంబర్‌ 4న సభ నిర్వహణకు కోర్టు అనుమతిస్తే.. కేసీఆర్‌ సర్కార్‌ ప్రజావ్యతిరేక విధానాలపై వ్యతిరేక పోరును మరింత ఉధృతం చేస్తామని కోదండరాంమ్‌ అండ్‌ టీమ్‌ స్పష్టం చేస్తున్నారు. 

Don't Miss

Subscribe to RSS - Koluvu Kolkata