KTR

19:26 - November 11, 2017

ఆసిఫాబాద్ : మంత్రులు కడియం శ్రీహరి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్నలు.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా.. సిర్పూర్ నియోజకవర్గంలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కడియం శ్రీహరి కాగజ్‌నగర్‌లోని ఉన్నత పాఠశాలలోని డిజిటల్‌ తరగతులను ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నూతనంగా నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. అక్కడే జూనియర్ కాలేజ్‌ విద్యార్థులకు కోనేరు ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అందిస్తున్న మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి సిర్పూర్‌లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనాన్ని ప్రారంభించారు.. అలాగే ఆశ్రమ పాఠశాల భవనానికి భూమి పూజ చేశారు.

 

17:25 - November 4, 2017

ఖమ్మం : చెమట చుక్క చిందించకుండా డబ్బులు సంపాదించాలి. ఖద్దర్‌ చొక్కా ఇస్త్రీ నలగకుండా కోట్లు కూడబెట్టుకోవాలి. ఇలాంటి ఆలోచనలతోనే..ఓ మంత్రి అనుచరులు ఆదివాసి భూములపై కన్నేశారు. అసైన్డ్‌ భూములను అప్పనంగా దోచేశారు. అంగబలం, అర్థబలంతో భూములను హస్తగతం చేసుకున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు మాముళ్ల మత్తులో జోగడంతో తమకు అడ్డే లేదన్నట్లుగా చెలరేగిన అక్రమార్కులపై 10టీవీ స్పెషల్ రిపోర్ట్. పవర్‌లో మనపార్టే ఉందన్న తెగింపుతో రెచ్చిపోయారు. మమ్మల్ని కదిలించేదెవరన్న ధైర్యంతో విజృంభించారు. మంత్రి అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారపార్టీ నేతలు భూదోపిడికి పాల్పడ్డారు. ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని చెలరేగిపోయారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3500 ఎకరాల భూమిని కొట్టేశారు. నకిలీ పత్రాలు సృష్టించి దర్జాగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి చూడటంతో..వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీల భూమిని గద్దల్లా తన్నుకుపోయిన అధికార పార్టీ నేతల భూభాగోతం బయటపడింది. దమ్మపేట మండలం నల్లకుంట గ్రామంలో సర్వే నంబర్‌ 273-1, జేఎం బంజర గ్రామంలో సర్వే నంబర్ 884-1, లింగాల పల్లిలో 148-1 అనుబంధ సర్వే నంబర్లలో 3 వేల 500 ఎకరాల భూమిని స్వాహా చేసిన తీరు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. అసైన్డ్‌ భూముల్ని మాయంచేయడంలో వారు చూపించిన చాతుర్యం చూస్తే ఔరా అనిపించక తప్పదు.

3500 ఎకరాల భూములను...800 ఆదివాసీ కుటుంబాలకు ప్రభుత్వం పట్టాలివ్వడంతో..1976 నుండి 1998 వరకు సాగుచేస్తూ జీవనం సాగించారు. పెట్టుబడులు లేక వ్యవసాయం చేయలేని దుర్భర పరిస్థితిల్లో ఆదివాసీలు తమ భూములను ఆదివాసేతరులకు కౌలుకిచ్చారు. మనుగడకోసం వారు వేసిన అడుగులే..వారి పాలిటశాపంగా మారాయి. మొదట్లో నామ మాత్రపు కౌలును చెల్లించిన ఆదివాసేతరులు..అడవిబిడ్డల అమాయకత్వాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. వేలిముద్రలు తీసుకొని తమ పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

సమాచార హక్కు చట్టం ద్వారా విషయం తెలుసుకున్న బాధితులు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. అసైన్డ్‌ భూములను రిజిస్ట్రేషన్‌ చేయడాన్ని ప్రభుత్వం నిషేధించినప్పటికీ మూడు గ్రామాలకు చెందిన భూములను అక్రమార్కులు తప్పుడు ధృవీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అసైన్డ్‌ భూములను పట్టా భూములుగా పేర్కొంటూ దమ్మపేట మండల రెవెన్యూ అధికారులు 167 ఎన్‌ఓసీ జారీ చేయడంతో...సత్తుపల్లి రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్లు చకచకా జరిగిపోయాయి. 1998 నుంచి 2014 వరకు రిజిస్ట్రేషన్ల తంతు యద్ధేచ్ఛగా కొనసాగింది. సుమారు 350 కోట్ల విలువైన భూములను అప్పనంగా కొట్టేసిన వైనం...ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం రేపుతోంది. తమకు జరిగిన అన్యాయంపై ఆదివాసీలు.. కలెక్టర్‌ సహా ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా..వారికి చుక్కెదురైంది. ఇదేంటని అడిగితే తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

వాస్తవానికి అసైన్డ్‌ భూములు కొనడం, అమ్మడం నేరమని అసైన్డ్‌మెంట్‌ చట్టం స్పష్టం చేస్తోంది. దళితులు, ఆదివాసీల వద్ద ఈ భూములు కొన్నా అవి చెల్లవు. ఒకవేళ కొనుగోళ్లు జరిగినా వాటిని రద్దు చేసి తిరిగి బాధితులకు అప్పగించే అధికారం రెవెన్యూ చట్టం కల్పించింది. అయినప్పటికీ దమ్మపేట మండల అసైన్డ్‌ భూముల విషయంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులు నీళ్లు నములుతున్నారు. మరోవైపు తమ భూములు అప్పగించాలని కోరుతూ కొందరు బాధితులు జాతీయ ST కమిషన్‌ను ఆశ్రయించారు.

ఇవేకాదు గతంలో తెలంగాణలో పంపిణీ చేసిన 25 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములు ఇప్పుడు పేదల చేతుల్లో లేవు. అయితే జిల్లాల వారీగా అసైన్డ్‌ భూముల వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపాలని సీఎం కేసీఆర్ ఇటీవల కలెక్టర్లను ఆదేశించారు. దీంతో జిల్లాలోని రెవెన్యూ యంత్రాంగం వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో జరిగిన భూదోపిడిని అధికారులు బయటపెడతారో, లేక ఆదివాసీలే అనుభవిస్తున్నారని నివేదిక ఇస్తారో చూడాలి. 

21:25 - November 3, 2017
17:26 - November 3, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి మూడున్నరేళ్లు గడిచినా ఎస్సీ కమీషన్‌ ఏర్పాటు చేయకపోవడం దుర్మార్గమని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో 15 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలున్నారని..వారికి కమీషన్లు లేకపోవడం దారుణమన్నారు. ఆ వర్గాలపై జరుగుతున్న దాడుల గురించి కమీషన్లకు చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని విచారం వ్యక్తం చేశారు. 

17:25 - November 3, 2017

హైదరాబాద్ : నకిలీ, నాసిరకం, కల్తీ విత్తనాల బెడద నివారణకు జారీచేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభ ప్రస్తుత సమావేశాల్లోనే దీనిపై బిల్లు ప్రవేశపెడతామని ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. 

18:07 - November 1, 2017
15:13 - November 1, 2017

నిజామాబాద్ : నిజామాబాద్‌ పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటైంది. తాత్కాలిక పాలక మండలి ఏర్పాటైంది. కలెక్టర్‌ చైర్మన్‌గా, మున్సిపల్‌ కమిషనర్‌ వైస్‌ చైర్మన్‌గా వ్యవహరించే నుడాలో ఐదుగురు సభ్యులు ఉంటారు. నిజామాబాద్‌ నగరం నలుదిశలా వ్యాపించింది. ఒకప్పుడు నగరానికి దూరంగా ఉన్న గ్రామాలు ఇప్పుడు నిజామాబాద్‌లో కలిసిపోయాయి. నగరం విస్తరించడంతో శివారు ప్రాంతాల్లో భూముల రేట్లకు రెక్కలు వచ్చాయి. గ్రామ పంచాయతీల్లో అక్రమ లే అవుట్లు, నిర్మాణాలు పెరిగిపోయాయి. దీంతో అభివృద్ధి అస్తవ్యస్తంగా జరుగుతోంది. నియంత్రణ లేకపోవడంతో రియల్టర్లు, బిల్డర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏ రకమైన అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తున్నారు. రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్‌ సౌకర్యం లేకుండానే ప్లాట్లు అమ్ముతున్నారు. వీటన్నింటినీ నియంత్రించి క్రమపద్ధతిలో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంలో నిజామాబాద్‌ పట్టణాభివృద్ధి సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ప్రభుత్వ రికార్డుల ప్రకారం నగరలో 3,10,153 మంది జనాభా
నిజామాబాద్‌ జనాభా విపరీతంగా పెరిగింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం నగరలో 3,10,153 మంది జనాభా ఉన్నారు. కొత్తగా ఏర్పాటైన పట్టణాభివృద్ధి సంస్థలో ఏడు మండలాల్లోని 61 గ్రామాలను కలపడంతో జనాభా 4,96,209 మందికి చేరింది. నిజామాబాద్‌ పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటుతో పంచాయతీ సర్పంచ్‌లు కొంత అధికారం లోప్పోయినా.. శివారు ప్రాంతాల్లో సత్వరం మౌలికసదుపాయాల అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు. నిజామాబాద్‌ పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటుతో శివారు ప్రాంతాల్లో అస్తవ్యస్త అభివృద్ధికి చెక్‌ పడుతుందని భావిస్తున్నారు. క్రమపద్ధతిలో అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నారు. 

21:21 - October 31, 2017

హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీ ఖతం అయినందున గత్యంతరం లేక స్వలాభం కోసం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌-టీడీపీ ఉనికి అంతంత మాత్రంగానే ఉందని ఆయన అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో టీఆర్‌ఎస్‌ స్పష్టంగా ముందుకు వెళ్తుందన్నారు. ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధిచెబుతారని జూపల్లి కృష్ణారావు అన్నారు. 

19:41 - October 31, 2017

నిజామాబాద్ : జిల్లా నవివేట మండలంలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. నవీపేటకు చనిపోయిన చేప పిల్లలను పంపిన మత్స్యశాఖ దీంతో మత్స్యకారులు చేప పిల్లలను తిరిగి మత్స్యశాఖకు పంపారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పేరుతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

07:16 - October 21, 2017

వరంగల్ : వస్త్రప్రపంచంలో ఒకప్పుడు దేశానికే తలమానికంగా నిలిచిన ఓరుగల్లుకు పూర్వవైభవం రాబోతోంది. దేశ, విదేశీ సంస్థల భాగస్వామ్యంతో.. రూ.11వేల కోట్ల పెట్టుబడులతో.. మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కాటన్ టు క్లాత్ పేరుతో సంగెం మండ‌లం చింత‌ల‌ప‌ల్లి, గీసుగొండ మండ‌లం శాయంపేట గ్రామాల స‌రిహ‌ద్దులో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను నిర్మించబోతోంది టీ-సర్కారు. ఈనెల 22న సీఎం కేసీఆర్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

నిజాం కాలంలో ఏర్పాటు చేసిన అజాంజాహి మిల్లు
వరంగల్‌ జిల్లాలో నిజాం కాలంలో ఏర్పాటు చేసిన అజాంజాహి మిల్లు ఒకప్పుడు వెలుగువెలిగింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేలమందికి ఉపాధి కల్పించింది. ఐదు దశాబ్దాల ఆజంజాహి చరిత్ర ఏలికల నిర్లక్ష్యం ఫలితంగా కాలగర్భంలో కలిసింది. అయితే, ఇప్పుడు వరంగల్‌ జిల్లాలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మెగా టెక్స్‌టైల్‌ నిర్మాణానికి ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసిన అధికారులు ప్రాజెక్టును ఆచరణలోకి తెచ్చారు. స్పిన్నింగ్, టెక్స్‌టైల్, వీవింగ్, నిట్టింగ్ ప్రాసెసింగ్, ఉవెన్ ఫ్యాబ్రిక్, యార్న్‌డైయింగ్, టవల్-షీటింగ్, ప్రింటింగ్ యూనిట్స్, రెడీమేడ్ వస్ర్త పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. టెక్స్‌టైల్ పార్కువల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షా 87వేల 539 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని రాంకీ సంస్థ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. వరంగల్ రూరల్ జిల్లాలో ఏర్పాటు కానున్న ఈ పార్కుకు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుగా నామకరణం చేసినట్లుగా గత ఆర్థిక సర్వేలో సర్కార్‌ పేర్కొంది. టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం కోసం ప్రభుత్వం సుమారు 1200 ఎకరాల భూమి సేకరించింది. గీసుగొండలోని శాయం పేట, రాయినికుంట, వెంకటాపూర్‌, ఊకల్‌, సంగెం మండలంలోని చింతలపల్లి, కాట్రపల్లి, వెంకటాపూర్‌ గ్రామాల్లో 2800 ఎకరాల భూములను సేకరించాలని నిర్ణయించారు. ఎకరాకు రూ.9.95లక్షల చొప్పున రైతులకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. దీనికోసం 110కోట్లు చెల్లించారు. బహిరంగ మార్కెట్‌ విలువకు.. ఇచ్చే పరిహారానికి పొంతన లేదని అన్నదాతలు పెదవివిరుస్తున్నారు.

6.75 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు
పత్తి ఉత్పత్తిలో రాష్టంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా రెండో స్థానంలో వుంది. జిల్లాలో 6.75 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేస్తున్నారు. వరంగల్ తోపాటు కరీంనగర్, ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల రైతులు వరంగల్ మార్కెట్ కే పత్తిని తీసుకొస్తున్నారు. ఇక్కడ తయారైన పత్తి బేళ్ళను కోయంబత్తూరు, సేలం, మధురైలోని స్పిన్నింగ్ మిల్లులకు ఎగుమతి చేస్తున్నారు. మెగాటెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుతో పత్తి రైతులకు మద్దతు ధరతో పాటు ప్రోత్సాహం లభించనుంది. సీఎం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ రంగంలోకి దిగారు. ముందస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సేకరించిన భూ వివరాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకోబోతున్న చర్యలపై ఆరా తీశారు. మొత్తంగా మెగాటెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుపై ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. 

Pages

Don't Miss

Subscribe to RSS - KTR