land grabbing

17:05 - July 20, 2017

విశాఖ : జిల్లాలో భూబకాసురులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూమిని సైతం కబ్జా చేస్తున్నారు. తాజాగా 130 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ ధృవపత్రాలు సృష్టించి విక్రయించేశారు కొందరు కబ్జాకోరులు. చివరకు పోలీసులకు చిక్కారు. 
24.05 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా
విశాఖలో భారీ భూకుంభకోణం వెలుగు చూసింది. విశాఖ వ్యాలీ స్కూల్ వద్ద 24.05 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసిన ఓ ముఠా నకిలీ ధృవపత్రాలలు సృష్టించి కోట్ల రూపాయలకు ఆ భూమిని విక్రయించింది. తాజాగా వారి మోసం బయటపడటంతో పోలీసులు కబ్జాకోరుల్ని అరెస్టు చేశారు. అయితే ఈ భూకుంభకోణం వెనుక పెద్ద కథ నడిచినట్లు పోలీసుల విచారణలో తేలింది. 
ప్రభుత్వ భూములపై కన్నేసిన సుధాకరరాజు అండ్ గ్యాంగ్
విశాఖ జిల్లా ఎండాడ, రుషికొండ ప్రాంత పరిసరాల్లో సర్వే నంబర్ 35, 37, 38లలో 26.08 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఇక్కడ ఎకరం రూ.5 కోట్లు పలుకుతోంది. ఈ భూమిపై చేకూరి సుధాకరరాజు అండ్ కో కన్ను పడింది. దాన్ని కబ్జా చేయడానికి ఆ గ్యాంగ్ స్కెచ్ వేసింది. ఈ భూముల్ని గతంలో ప్రభుత్వం ఒమ్మి ఇంటిపేరున్న వ్యక్తులకు కేటాయించి.. ఆ తరువాత రద్దు చేసినట్లు తెలుసుకుంది. దీంతో సుధాకరరాజు అండ్ కో భూముల్ని కబ్జా చేయాలంటే ఒమ్మి ఇంటిపేరున్న వ్యక్తులైతే ఇబ్బందులు ఉండవనుకుంది. దీంతో ఒమ్మి దాలినాయుడు అనే పేరుతో ఓ వ్యక్తిని రంగంలోకి దింపింది. 
నకిలీ ధృవ పత్రాలతో ప్రభుత్వ భూమి విక్రయం
వాస్తవానికి ఒమ్మి దాలినాయుడు అనే వ్యక్తి లేనే లేడు. ఆ పేరున్న వ్యక్తిని అధికారులకు చూపించాలి కాబట్టి సుధాకరరాజు తన అనుచరుడు.. హైదరాబాద్‌కు చెందిన బొడ్డి పిచ్చయ్యను రంగంలోకి దించాడు. ఇతను హైదరాబాద్‌లోని ఓ కుక్కర్ల సంస్థలో  సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి వీలుగా అతని పేరుతో దొంగ సంతకాలు చేసి, నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి.. పట్టాదారు పాసుపుస్తకాలను కూడా సంపాదించడమే కాకుండా ఆ భూముల్ని విక్రయించారు. ఈ భూకబ్జా భాగోతం విశాఖ గ్రామీణ తహసిల్దారుగా ఉన్న సుధాకరనాయుడు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 2016లో పీఎం.పాలెంలో కేసు నమోదైంది. తరువాత నిందితుడు పరారీ కావడం, దాలినాయుడు పేరుతోనే  పిచ్చయ్య ముందస్తు బెయిల్‌ తెచ్చుకోవడంతో కేసు మరుగున పడినట్లైంది
పలు కోణాల్లో కేసు విచారణ 
అయితే ఈ కేసును పీఎం పాలెం పోలీసులు పలు కోణాల్లో విచారణ చేశారు. దస్తావేజుల్లో దాలినాయుడిగా చూపిన ఫొటో ఎవరి ఫొటోతోనైనా సరిపోలుతుందేమోనన్న కోణంలో సోషల్ మీడియాలో జల్లెడ పట్టారు. అది బొడ్డి పిచ్చయ్య ఫోటోతో సరిపోయింది. కూపీ లాగి అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అసలు సూత్రధారి చేకూరి సుధాకరరాజును అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. 
చేకూరి సుధాకరరాజుపై ఇప్పటికే 13 కేసులు
చేకూరి సుధాకరరాజుపై ఇప్పటికే 13 కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు సుధాకరరాజుతోపాటు భూ దందాలో పలువురు ప్రజా ప్రతినిధులు ఉన్నట్లు వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ కేసులో నిందితులపై అధికారులు ఏం చర్యలు చేపడతారో వేచి చూడాలి. 

 

08:01 - July 17, 2017

విశాఖ : విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్‌ భూ అక్రమాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. గోవింద్‌ ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నట్టు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన కుటుంబ సభ్యుల పేరుమీద ఏకంగా 48.55 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టు విమర్శలు ఉన్నాయి. ఆనందపురం మండలం రామవరంలో సర్వే నంబర్‌ 126, 127, 128,130లో 95.89 ఎకరాల భూమిని కాజేసినట్టు ఎమ్మెల్యే గోవింద్‌పై ఆరోపణలు ఉన్నాయి. గోవింద్‌ అండ్‌ కో ఈ 95.89 ఎకరాలను తమ పేర్లమీద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. దాదాపు 14 మంది పేరిట రాయించుకున్నారు. వీరిలో ఎమ్మెల్యే గోవింద్‌తోపాటు ఆయన బంధువుల పేర్లు కూడా ఉన్నాయి.

సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అడంగల్‌
ప్రభుత్వ భూములను కాజేయడానికి పీలా గోవింద్‌ అండ్‌ కో... సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అడంగల్‌ రికార్డును ట్యాంపర్‌ చేసినట్టు సిట్‌ గుర్తించింది. ఆ రికార్డులో కొన్నిచోట్ల రెడ్‌ ఇంక్‌తో దిద్దినట్టు తహసీల్దార్‌ నివేదిక సమర్పించారు. సర్వే నంబర్‌ 130 /2లోని 11.45 ఎకరాలకు అప్పటి కాంగ్రెస్‌ నేత ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి కలెక్టర్‌ లవ్‌ అగర్వాల్‌ దగ్గర ఎమ్మెల్యే ఎన్‌వోసీ తీసుకున్నారు. ఆ భూమి పక్కనే ఉన్న మరో 48.55 ఎకరాల ప్రభుత్వ భూమినీ వదల్లేదు. వాటిపై కన్నేసి రికార్డులను తారుమారు చేసి దర్జాగా ఆక్రమించుకున్నారు. దశాబ్దాలుగా ఆ భూమిద్వారా వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తున్నారు. అంతేకాదు... సర్వేనంబర్‌ 130లో 60 ఎకరాలు ఉండగా సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అండగల్‌ మార్చేసి అందులో 17 సబ్‌ డివిజన్లు సృష్టించారు. వీటిలో కొన్ని భూములను పీలా కుటుంబీకుల పేరుమీదకు 10(1) అండగల్‌లో నమోదు చేశారు.

పాస్‌ పుస్తకాలను, టైటిల్‌ డీడ్‌లను రద్దు
ఆనందపురం భూముల కేసు ఆర్‌డీవో కోర్టుకు విచారణకు రావడంతో ఎమ్మెల్యేగారి అక్రమాల బాగోతం బయటపడింది. పీలా గోవింద సత్యనారాయణ అండ్‌ కో స్వాధీనంలో ఉన్న భూముల్లో 48.55 ఎకరాలు ప్రభుత్వ భూములని తేల్చారు. వాటికి జారీ అయిన పాస్‌ పుస్తకాలను, టైటిల్‌ డీడ్‌లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మిగిలిన 47.34 ఎకరాల భూమికి సంబంధించి అటు జమీందార్ల కుటుంబంగానీ, ఇటు పాకలపాటి, పీలా కుటుంబంగానీ సరైన రికార్డులు చూపించకపోవడంతో వాటికి సంబంధించిన హక్కులు ఎవ్వరికీ లేకుండా రద్దు చేసింది. ఈ వివాదం కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. తక్షణమే పీలా కుటుంబీకుల స్వాధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలని ఆనంతపురం తహసీల్దార్‌ను ఆదేశించారు. తనపై వస్తున్న భూ ఆక్రమణ ఆరోపణలపై ఎమ్మెల్యే పీలా గోవింద్ ఎట్టకేలకు స్పందించారు. తనపై కొంతమంది కావాలనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సిట్‌ విచారణకైనా తాను సిద్దమేనని చెప్పారు.పీలా గోవింద్‌ అక్రమాల డొంక కదిలించేందుకు సిట్‌ సిద్ధమవుతోంది. మరి సిట్‌ ఏం తేలుస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

12:12 - July 16, 2017

ప్రకాశం : నీరు చెట్టు పథకంకింద దళితుల భూముల్లో చెరువుల తవ్వకాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లాలో వైసీపీ ఆందోళన చేపట్టింది. ఇవాళ సభ నిర్వహణకు తీర్మానించింది. దీంతో పోలీసులు పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లోని పలువురు వైసీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పర్చూరు మండలం దేవరపల్లిలో దళితుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన నియోజకవర్గ ఇంచార్జ్ గొట్టిపాటి భరత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని అర్ధరాత్రి నుంచే గృహనిర్భందించారు.

 

08:50 - July 16, 2017

ప్రకాశం : పర్చూరు మండలం దేవరపల్లిలో దళితుల భూములు లాక్కోవడాన్ని నిరసిస్తూ నేడు వైసీపీ సభ నిర్వహించనున్నారు. సభ నేపథ్యంలో సీపీఎం, వైసీపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి హౌస్ అరెస్టు చేశారు. ఒంగోలులో సీపీఎం నగర కార్యదర్శి కొండారెడ్డి, వైసీపీ నగర అధ్యక్షుడు ప్రసాద్ ముందస్తు అరెస్టు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:13 - July 16, 2017

సూర్యపేట : బకాసురులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ రైతుల భూములు కనిపించినా ఆక్రమించేస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో గ్రామ కంఠం భూముల్ని సైతం వదిలిపెట్టలేదు. కొన్నేళ్లుగా రైతులు వ్యవసాయం చేసుకుంటున్న 117 ఎకరాల భూమిని జువారీ సిమెంట్ యాజమాన్యం కబ్జా చేసింది. అక్కడితో ఆగకుండా సమితి నిధులతో నిర్మించిన రోడ్డును కూడా ఆక్రమించేసారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. 
గ్రామకంఠం భూములపై కన్నేసిన జువారీ సిమెంట్స్ యాజమాన్యం
సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం రేవూరులో ప్రభుత్వ భూములను అక్రమార్కులు కబ్జాచేశారు. 850 సర్వే నంబర్‌లో 117 ఎకరాల గ్రామ కంఠం భూమి ఉంది. ఇందులో 30 ఎకరాలు రైతుల ఆధీనంలో ఉంది. ఆ భూమిలో రైతులు కొన్నేళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే పక్కనే ఉన్న జువారి సిమెంట్స్ యాజమాన్యానికి ఈ గ్రామకంఠం భూములపై కన్నుపడింది. ఇంకేం నిదానంగా.. ఆభూములను ఆక్రమించేసుకున్నారు. అక్కడితో ఆగకుండా రేవూరు-దొండపాడును కలుపుతూ సమితి నిధులతో రోడ్డు నిర్మిస్తే  దాన్ని సైతం జువారీ సిమెంట్స్‌ యాజమాన్యం కబ్జా చేసి అక్రమ మైనింగ్‌ చేస్తోంది. 
కబ్జాకు గురైన భూములను పరిశీలించిన భూ నిర్వాసితుల కమిటీ
కబ్జాకు గురైన రైతుల భూములను భూ నిర్వాసితుల రాష్ట్ర కన్వీనర్ వెంకట్, సీపీఎం జిల్లా కార్యదర్శి ములకలపల్లి రాములు, గిరిజన సంఘం నాయకుడు రవినాయక్ పరిశీలించారు. తెలంగాణ వస్తే మన నీరు .. మన భూములు అన్న కేసీఆర్ రైతుల భూముల్ని కార్పొరేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తే భూ నిర్వాసితుల కమిటీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించి రైతుల భూముల్ని వారికి అప్పగించే వరకు తమ పోరాటం ఆపేది లేదని భూ నిర్వాసితుల కమిటీ సభ్యులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

 

18:55 - July 15, 2017

సూర్యాపేట : జిల్లా మేళ్లచెర్వు మండలం రేవూరు గ్రామకంఠం భూమిని జువారీ సిమెంట్స్‌ ఫ్యాక్టరీ ఆక్రమించుకోవడంపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ భూముల్లో కొన్ని సంవత్సరాలు రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే ప్రక్కనే ఉన్న జువారి సిమెంట్స్‌ యాజమాన్యం ఆ భూములను ఆక్రమించుకుంది. ఈ విషయంపై భూ నిర్వాసితుల రాష్ట్ర కన్వీనర్ వెంకట్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి ములకలపల్లి రాములు, గిరిజన సంఘం నాయకుడు రవినాయక్‌ పరిశీలించారు. 850 సర్వే నెంబర్‌లోని 117 ఎకరాల గ్రామ కంఠం భూమిలో 30 ఎకరాలు రైతుల ఆధీనంలో ఉంది. అయితే భూమిపై కన్నేసిన జువారీ సిమెంట్స్‌ యాజమాన్యం భూమితో పాటు.. రేవూరు- దొండపాడును కలుపుతూ వేసిన రోడ్డును సైతం ఆక్రమించుకుంది. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 16 సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు రైతుల భూములను కబ్జా చేస్తున్నాయని భూ నిర్వాసితుల కన్వీనర్‌ వెంకట్‌ ఆరోపించారు. 

17:55 - July 15, 2017

హైదరాబాద్ : పేదలకు సొంతింటి నిర్మాణం ఎప్పుడూ కలగానే మిగిలిపోతోంది. హైదరాబాద్‌లో అయితే సొంతింటి కలలు కల్లలే అవుతున్నాయి. భాగ్యనగరంలో సొంతిళ్లు నిర్మించుకోవడమంటే భారీ వ్యయంతో కూడుకున్న వ్యవహారం. అందుకే పేద, మధ్యతరగతి ప్రజలు పైసాపైసా కూడబెట్టుకుని ఇంటి స్థలాలు కొనుక్కుంటున్నారు. దీన్నే అదనుగా భావిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వారిని నిలువునా ముంచుతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అయితే ఈ తరహా మోసాలకు అడ్డూఅదుపూలేకుండా పోయింది. రియల్‌ వ్యాపారులు ప్రజలను నిలువునా ముంచితే న్యాయం కోసం ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తారు. మోసగాళ్ల నుంచి ప్రజలను రక్షించాల్సిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే భక్షకుడిగా మారారు.

10కోట్ల రూపాయలు వసూలు...
ప్రజల నుంచి దాదాపు 10కోట్ల రూపాయలు వసూలు చేసి దశాబ్దన్నర కాలంగా వారిని తనచుట్టూ తిప్పుకుంటున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మల్కాజ్‌గిరి ప్రాంతంలోని అమ్ముగూడలో ఏకశిలానగర్‌ పేరుతో ఓ వెంచర్‌ వేశారు. దాన్ని 125 ప్లాట్లుగా విభజించారు. అప్పటి హుడా అనుమతి ఉన్నట్టు పత్రాలు చూపించి ప్లాట్లను విక్రయించారు. దాదాపు 90 మంది పేద, మధ్యతరగతి ప్రజలు సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఆ స్థలాలను కొనుగోలు చేశారు. తాము కొనుగోలు చేసిన స్థలాల్లో ఇళ్లు నిర్మించేందుకు ఆశగా వెళ్లారు. కాప్రా మున్సిపాలిటీల్లో ఇంటి నిర్మాణ అనుమతులకు వెళ్లగా అధికారులు షాక్‌ ఇచ్చారు. ఆ స్థలం కోర్టు వివాదంలో ఉందని... అందులో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఊహించని పరిణామంతో వారి కళ్లు బైర్లు కమ్మాయి. కొంతమంది అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు.

ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఆందోళన
ఆందోళన చెందిన బాధితులు విషయం తేల్చుకునేందుకు నేరుగా ముత్తిరెడ్డి దగ్గరికే వెళ్లారు. కోర్టు వివాదంలో ఉన్న భూమిని తమకెందుకు విక్రయించారంటూ నిలదీశారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరారు. వివాదం కొన్ని రోజుల్లో పరిష్కారం అవుతుందని వారికి సర్దిచెప్పి పంపించారు. అప్పటి నుంచి బాధితులు ముత్తిరెడ్డి చూట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా తిరుగుతున్నా ప్రయోజనం లేకపోవడంతో శుక్రవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. బాధితుల ఆందోళనతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బాధితులను పిలిపించుకుని చర్చలు జరిపారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చినట్టు బాధితులు తెలిపారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గతంలోనూ పలు అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. హబ్సిగూడలోని ఓయూ స్థలంలో ముత్తిరెడ్డి ఓ హోటల్‌ నిర్మించారన్న ఆరోపణలున్నాయి. దీనిపై ఓయూ విద్యార్ధులు పలుమార్లు ధర్నాలు నిర్వహించారు. జనగామ నియోజకవర్గంలోనూ పలుచోట్ల భూములు ఆక్రమించారంటూ ప్రజల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలు మరవక ముందే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తమను మోసం చేసారంటూ హైదరాబాద్‌ బాధితులు ఆందోళన చేపట్టారు. అయితే ఎమ్మెల్యే మాత్రం తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్తున్నారు. బాధితులను రియల్టర్‌ అమరేంద్రరెడ్డి మోసం చేశారని తెలిపారు.తమ వారయినా తప్పుచేస్తే వదిలేది లేదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలుమార్లు ప్రకటించారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మరి దీనిపై ముఖ్యమంత్రి ఏ చర్యలు తీసుకుంటారు, బాధితులకు న్యాయం చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే.

15:58 - July 14, 2017

విశాఖ : విశాఖలో వెలుగుచూసిన భూ కుంభకోణంపై సిట్‌ దర్యాప్తు ముమ్మరమైంది. ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు నేడు సిట్‌ ముందు హాజరయ్యారు. భూకుంభకోణంపై ఆధారాలను సిట్‌కు అందించారు.. సిట్‌ దర్యాప్తుపై తనకు నమ్మకముందని తెలిపారు.. జిల్లాలో తనవద్దకు వచ్చిన ఫిర్యాదులను అన్నింటినీ సిట్‌ ముందుంచానని చెప్పారు. విశాఖ జిల్లాలో భూమలు అన్యాక్రాంతమవుతున్నాయని 2015లోనే సీఎం చంద్రబాబుకు లేఖ రాశానని గుర్తుచేశారు.. భూకుంభకోణాల్లో అన్ని పార్టీల నేతలున్నాయని స్పష్టం చేశారు. భూస్కాంలో హస్తం ఉన్నట్లు తేలితే ఏ పార్టీ వారినైనా విడిచిపెట్టమని అయ్యన్న ప్రకటించారు.. ఈ నెల 19న సిట్‌ను కలిసి మరిన్ని వివరాలు సమర్పిస్తామన్నారు.

13:02 - July 9, 2017

ప్రకాశం : జిల్లాలోని పర్చూరు మండలం దేవరపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. దళితుల భూముల వివాదంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దళితులను పరామర్శించడానికి వెళ్లిన ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావుసహా పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, సీపీఎం నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు బలవంతంగా సీపీఎం నేతలను అరెస్ట్‌ చేశారు. చంద్రబాబు పోలీసు రాజ్యం నడుపుతున్నారని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు దేవరపల్లిలో 144 సెక్షన్‌ విధించారు. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. 

 

21:38 - July 8, 2017

 

హైదరాబాద్ : మియాపూర్‌ భూ అక్రమ రిజిస్ట్రేషన్‌లపై గోల్డ్‌ స్టోన్ ప్రసాద్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బాధితులకు న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. మియాపూర్ పోలీసులను కలిసిన ఆయన బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోవాలని కోరారు. భూములకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - land grabbing