land scam

14:55 - February 6, 2018
19:04 - October 10, 2017

విశాఖ : భూ కుంభకోణంలో ఆధారాలుంటే నిరూపించాలని ప్రతిపక్షానికి ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సవాల్‌ విసిరారు. ప్రతిపక్షానికి ఆరోపణలు చేయడం అలవాటైపోయిందన్నారు. నీరు ప్రగతి, నీరు చెట్టుకు తేడా తెలియని వారు ప్రతిపక్షంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. విశాఖ పర్యటనలో ఉన్న లోకేశ్.. ఐటీ కంపెనీల ఏర్పాటు కోసం... ఎకో సిస్టంను అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. బ్లాక్ చైన్‌ కాన్ఫరెన్స్ విజయవంతం అయిందని తెలిపారు. 

 

20:01 - August 28, 2017

విశాఖ : నగర పరిధిలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తిన్నింటి వాసాలే లెక్కెట్టారు జీవీఎంసీ ఉద్యోగులు. పేదలకు రావాల్సిన ఇళ్లను బినామీ పేర్లతో ఇతరులకు అమ్మేశాడో ఘనుడు. ఓ బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు తీగ లాగగా డోంకంతా కదిలింది. ఏకంగా 33మంది దళారులపై కేసు నమోదు చేసి 13 మందిని అరెస్ట్‌ చేశారు. 
నకిలీ డాక్యుమెంట్లతో అమ్మిన దళారులు
గాజువాక నియోజక వర్గంలోని మధీనబాగ్‌లో 2006 సంవత్సరంలో 2048 జెఎన్ ఎన్ యుఆర్ ఎమ్ భవనాలను అప్పటి ప్రభుత్వం నిర్మించింది. వాటికోసం ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకున్న 1248 మందికి ఇళ్లు మంజూరు చెయ్యగా, 780 ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో కొన్ని ఇళ్లను హుద్ హుద్ తుఫానులో నష్టపోయిన వారికి కేటాయించారు.. మిగిలిన వాటిపై అక్రమార్కుల కన్ను పడింది. గతంలో జీవీఎంసీ యూడిసీ విభాగంలో పనిచేసిన ఏపిడి అధికారి మోహన్ రావు అక్రమాలకు స్కేచ్ వేశాడు. ఖాళీగా ఉన్న 363 ఇళ్లకు ఫోర్జరీ డాక్యుమెంట్ల సృష్టించి దళారుల సాయంతో అమ్మేశారు. ఒక్కో ఇంటికోసం లక్ష రూపాయాల వరకు వసూలు చేశాడు. జెఎన్ ఎన్ యుఆర్ ఎమ్ నిజమైన లబ్ధిదారుడు తన ప్లాట్ లోకి వెళ్ళి చూడగా ఇంకొక వ్యక్తి నివసించడం చూసి జీవీఎంసీ హౌసింగ్ కార్పోరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసాడు. దీంతో ఈ భారీ కుంభకోణం బయటపడింది.
అక్రమాలు జరిగాయని ప్రాథమిక నిర్ధారణ 
బాధితుడి ఫిర్యాదు అందుకున్న జీవీఎంసీ అధికారులు జెఎన్ ఎన్ యుఆర్ ఎమ్ ఇళ్లలో తనిఖీలు నిర్వహించగా ఖంగుతున్నారు. అక్రమాలు జరిగాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన  జీవీఎంసీ ఉన్నత అధికారులు గాజువాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కొంతమంది ఉన్నతాధికారుల్ని అడ్డం పెట్టుకోని అనధికార వ్యక్తులకు ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి కోట్ల రూపాయల్ని దండుకున్నారని పోలీసులు చెబుతున్నారు. స్థానికంగా ఉన్న ఇద్దరు మహిళ నేతలతో పాటుగా కొందరు మీడియా ప్రముఖులు కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణ అనంతరం ప్రధాన నిందితుడు మోహనరావుతో పాటుగా జీవీఎంసీలోని ఇద్దరు ఉద్యోగులను మరియు పదమూడు మంది దళారులను అరెస్ట్ చేసారు.. మోహనరావు అరెస్టు విషయం తెలుసుకున్న మిగతా నిందితులు పరారయ్యారు. ముఖ్యంగా ఇందులో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు మహిళల కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

 

12:34 - August 3, 2017

విశాఖ :  జిల్లాలో వెలుగుచూసిన భూ కుంభకోణం కేసులో కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు తహశీల్దార్‌ స్థాయి అధికారులపైనే ఆరోపణలు వచ్చాయి. విశాఖ రూరల్‌ తహశీల్దారుగా పనిచేసి రిటైర్‌ అమిన రామారావుతోపాటు మరికొందరు అధికారులను సిట్‌ విచారించింది. అయితే ఈ కేసులో ఆర్డీవో స్థాయి అధికారుల ప్రమేయం ఉందని అనకాపల్లి టీడీపీ ఎమ్మెల్యే పీలా సత్యనారాయణ చేసిన ఆరోపణలు చేయడంతో సిట్‌ విచారణ కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం రామవరంలో 95 ఎకారాల భూమిని తప్పుడు రికార్డులతో పీలా సత్యనారాయణ ఆక్రమించుకున్నారని సిట్‌ అధికారులు తేల్చారు. అయితే ఈ కేసులో ఇప్పుడు పీలా ఎదురుదాడికి దిగారు. విశాఖ ఆర్డీవో వెంకటేశ్వర్లుపై ఆరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.

కక్ష కట్టి కేసులో ఇరికించారు..
తన తండ్రి నుంచి వారసత్వంగా వస్తున్న భూమిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి ఇవ్వమని ఆర్డీవో వెంకటేశ్వర్లు చెప్పిన మాటను వినకపోవడంతోనే తనపై ఆర్డీవో కక్ష కట్టి కేసులో ఇరికించారన్నది పీలా వాదన. ఆర్డీవో ఇచ్చిన నివేదిక అధారంగా సిట్‌ అధికారులు తనపై కేసు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. పీలా వ్యవహారంపై విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు. ఆరోపణలు వేరు, వాస్తవాలు వేరని అంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతున్నారు. భూ కుంభకోణం కేసును ఆర్డీవోపైకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్న ఎమ్మెల్యే పీలా సత్యనారాయణ వైఖరి సీపీఎం నేతలు తప్పుపడుతున్నారు. పీలా సత్యనారాయణ రెవెన్యూ అధికారులపై ఆరోపణల నేపథ్యంలో విశాఖ భూ కుంభకోణం కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని వైసీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. భూ కుంభకోణం కేసులో అనకాపల్లి ఎమ్మెల్యే పీలా సత్యనారాయణ విశాఖ ఆర్డీవోపై ఫిర్యాదు చేసిన తరుణంలో ఇప్పుడు సిట్‌ ఏంచేయబోతోందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆర్డీవో వెంకటేశ్వర్లును పిలిపించి విచారణ జరుపుతుందా ? లేదా ? అన్నది చూడాలి.

 

14:55 - July 26, 2017

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో సంచలనం రేపిన వ్యాపం ప్రధాన సూత్రధారి ప్రవీణ్ యాదవ్ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేగుతోంది. ఆయన స్వగృహంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏంటో తెలియరాలేదు. వ్యాపమ్ పేరిట జరిగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, అడ్మిషన్ కోసం జరిగే పరీక్షల్లో భారీ ఎత్తున స్కాం జరిగిన సంగతి తెలిసిందే. వ్యాపమ్ స్కాంతో సీనియర్ అధికారులు, రాజకీయ నేతలకు సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ స్కాంకు సంబంధించి 40 మందిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఈ స్కాం శివరాజ్ సింగ్ ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఇప్పటికే దీనిపై నియమితులైన సిట్ దర్యాప్తు చేస్తోంది. 

08:01 - July 17, 2017

విశాఖ : విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్‌ భూ అక్రమాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. గోవింద్‌ ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నట్టు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన కుటుంబ సభ్యుల పేరుమీద ఏకంగా 48.55 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టు విమర్శలు ఉన్నాయి. ఆనందపురం మండలం రామవరంలో సర్వే నంబర్‌ 126, 127, 128,130లో 95.89 ఎకరాల భూమిని కాజేసినట్టు ఎమ్మెల్యే గోవింద్‌పై ఆరోపణలు ఉన్నాయి. గోవింద్‌ అండ్‌ కో ఈ 95.89 ఎకరాలను తమ పేర్లమీద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. దాదాపు 14 మంది పేరిట రాయించుకున్నారు. వీరిలో ఎమ్మెల్యే గోవింద్‌తోపాటు ఆయన బంధువుల పేర్లు కూడా ఉన్నాయి.

సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అడంగల్‌
ప్రభుత్వ భూములను కాజేయడానికి పీలా గోవింద్‌ అండ్‌ కో... సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అడంగల్‌ రికార్డును ట్యాంపర్‌ చేసినట్టు సిట్‌ గుర్తించింది. ఆ రికార్డులో కొన్నిచోట్ల రెడ్‌ ఇంక్‌తో దిద్దినట్టు తహసీల్దార్‌ నివేదిక సమర్పించారు. సర్వే నంబర్‌ 130 /2లోని 11.45 ఎకరాలకు అప్పటి కాంగ్రెస్‌ నేత ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి కలెక్టర్‌ లవ్‌ అగర్వాల్‌ దగ్గర ఎమ్మెల్యే ఎన్‌వోసీ తీసుకున్నారు. ఆ భూమి పక్కనే ఉన్న మరో 48.55 ఎకరాల ప్రభుత్వ భూమినీ వదల్లేదు. వాటిపై కన్నేసి రికార్డులను తారుమారు చేసి దర్జాగా ఆక్రమించుకున్నారు. దశాబ్దాలుగా ఆ భూమిద్వారా వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తున్నారు. అంతేకాదు... సర్వేనంబర్‌ 130లో 60 ఎకరాలు ఉండగా సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అండగల్‌ మార్చేసి అందులో 17 సబ్‌ డివిజన్లు సృష్టించారు. వీటిలో కొన్ని భూములను పీలా కుటుంబీకుల పేరుమీదకు 10(1) అండగల్‌లో నమోదు చేశారు.

పాస్‌ పుస్తకాలను, టైటిల్‌ డీడ్‌లను రద్దు
ఆనందపురం భూముల కేసు ఆర్‌డీవో కోర్టుకు విచారణకు రావడంతో ఎమ్మెల్యేగారి అక్రమాల బాగోతం బయటపడింది. పీలా గోవింద సత్యనారాయణ అండ్‌ కో స్వాధీనంలో ఉన్న భూముల్లో 48.55 ఎకరాలు ప్రభుత్వ భూములని తేల్చారు. వాటికి జారీ అయిన పాస్‌ పుస్తకాలను, టైటిల్‌ డీడ్‌లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మిగిలిన 47.34 ఎకరాల భూమికి సంబంధించి అటు జమీందార్ల కుటుంబంగానీ, ఇటు పాకలపాటి, పీలా కుటుంబంగానీ సరైన రికార్డులు చూపించకపోవడంతో వాటికి సంబంధించిన హక్కులు ఎవ్వరికీ లేకుండా రద్దు చేసింది. ఈ వివాదం కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. తక్షణమే పీలా కుటుంబీకుల స్వాధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలని ఆనంతపురం తహసీల్దార్‌ను ఆదేశించారు. తనపై వస్తున్న భూ ఆక్రమణ ఆరోపణలపై ఎమ్మెల్యే పీలా గోవింద్ ఎట్టకేలకు స్పందించారు. తనపై కొంతమంది కావాలనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సిట్‌ విచారణకైనా తాను సిద్దమేనని చెప్పారు.పీలా గోవింద్‌ అక్రమాల డొంక కదిలించేందుకు సిట్‌ సిద్ధమవుతోంది. మరి సిట్‌ ఏం తేలుస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

18:41 - July 11, 2017

తూర్పు గోదావరి : దేశ వ్యాప్తంగా ఉన్న రైతు సమస్యలపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ప్రముఖ పరిశోధకుడు, జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్. దేశంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని ఆయన అన్నారు. ఏపీ రైతు సంఘం 21వ రాష్ట్ర మహాసభల సందర్భంగా వ్యవసాయ సంక్షోభం అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. నీటి సౌకర్యం, రుణమాఫీ, గిట్టుబాటు ధరలు, విత్తనాలు వంటి అనేక అంశాలపై పార్లమెంటులో రైతులతో చర్చించాలని పాలగుమ్మి సాయినాథ్ అన్నారు. 

06:50 - July 10, 2017

విశాఖపట్టణం : జిల్లాలో వరుసగా భూ దందాలు వెలుగు చూస్తున్నాయి. జిల్లాలో భూ బాగోతాలపై ఇప్పటికే సిట్ విచారణ సాగుతుండగా.. తాజాగా వక్ఫ్‌ భూముల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి నియోజవర్గంలో వందల కోట్ల విలువైన వక్ఫ్ భూములకు రెక్కలు వచ్చాయి. విశాఖజిల్లాలో సరికొత్త భూదందాకు నాయకులు, అధికారులు తెరతీశారు. 210 ఎకరాల వక్ఫ్ భూమిని ఓకే వ్యక్తి పేరుతో మార్చిన అధికారులు సరికొత్త మాయాజాలన్ని ప్రదర్శించారు.

210 ఎకరాల వక్ఫ్ భూములు..
అనకాపల్లీ నియోజకవర్గం కశికోట మండలంలో 210 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి. దాదాపు 200 మంది రైతులు దశాబ్దాలుగా ఇక్కడే ఇళ్లు కట్టుకుని ఈభూములను సాగు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న రైతులలో అత్యధికులు 2014లో వచ్చిన హుద్ హుద్ తుఫానులో నష్టపరిహారం పొందినవారే. అటు ఏలేరు కాలువ కింద నష్టపోయిన రైతులకు కూడా 40:60 నిష్పత్తిలో ఇక్కడే ల్యాండ్స్‌ ఇచ్చారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఇటీవల కరీముల్లా అనే వ్యక్తి ఈ భూములు తనవే అంటూ కోర్టుకు ఎక్కారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఈ భూములు ఎవ్వరి వద్ద ఉన్నాయో విచారణ చెపట్టాలని ఆర్డీవోను అదేశించింది. దీంతో సమస్య మొదలయింది.

పెద్దల హస్తం..
అయితే వక్ఫ్‌ భూములపై కోర్టుకు వెళ్లడం వెనుక కొందరు పెద్దల హస్తం ఉన్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ఎకరం దాదాపు కోటిరూపాయలు పలుకుతున్న ఈ భూములపై రాజకీయ పెద్దల కళ్లు పడ్డాయి. వీటిని కాజేయడానికి స్కెచ్‌ వేశారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో చకచకా పావులు కదిపారు. దీనికి రెవెన్యూ అధికారుల సహకారం తోడయింది. 1993జూన్‌లో ప్రభుత్వం వీటిని ఇనాం భూములుగా ప్రకటించడాన్ని అవకాశంగా తీసుకుని షేక్‌కరీముల్లా రెహ్మాన్‌ పేరుతో మొత్తం 210 ఎకరాలను ఆన్‌లైన్‌లో మార్పు చేశారు. దీనిపై రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

న్యాయం చేస్తామంటున్నారు..
రైతుల తిరుగుబాటుతో అధికారుల్లో హైరానా మొదలయింది. ఎటువంటి విచారణ లేకుండా భూములను ఒకే వ్యక్తి పేరుతో బదిలీ చేయడంపై ఇప్పటికే రైతులు సిట్ కు కూడా ఫిర్యాదు చెశారు. దీంతో రైతులకు న్యాయం చేస్తామని సెలవిస్తున్నారు రెవెన్యూ అధికారులు. రోజుకో భూ బాగోతం బయటపడుతుండటంతో విశాఖ జిల్లా ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్ర కార్యాచరణ రూపొందించుకుని వేల కోట్ల రూపాయల భూదందాలకు బ్రేకులు వేయాలని కోరుతున్నారు.

13:28 - July 1, 2017
16:22 - June 29, 2017

అనంతపురం : అనంతపురంలో ల్యాండ్‌ మాఫియా రెచ్చిపోతోంది. యజమానులకే తెలియకుండా కోట్లాదిరూపాయల భూములను మాఫియా మింగేస్తోంది. భూ దొంగలకు రెవెన్యూ అధికారులు, పోలీస్‌లు కూడా తోడవడంతో అనంతపురంలో కోట్ల రూపాయల భూములకు రెక్కలొస్తున్నాయి.

సివిల్‌ పంచాయతీలకు అడ్డాగా పోలీస్‌ స్టేషన్‌
అనంత జిల్లాలో ఏ పోలీస్‌ స్టేషన్‌ చూసినా సివిల్‌ పంచాయతీలకు అడ్డాలుగా మారిపోయాయనే ఆరోపణలొస్తున్నాయి. చివరికి ఏస్పీ, డీజీపీ కార్యాలయాలకు అతి సమీపంలో ఉన్న భూములను కూడా కాజేసేందుకు ప్లాన్స్‌ వేస్తున్నారు. ఏకంగా ఓ పోలీసు అధికారి కార్యాలయమే భూ దొంగలకు అడ్డాగా మారిందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డం..ఈ విమర్శలకు నిదర్శనమని చెప్పుకుంటున్నారు. పోలీసులు డ్యూటీని వదిలేసి రెవెన్యూ ఉద్యోగం చేస్తున్నారన్న జేసీ వ్యాఖ్యలు జిల్లాలో భూ దందా విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తోందని అంటున్నారు.

సీఐ బంధువుల భూబగోతం

ఇదిగో కలెటక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఈ భూమి కేంద్రంగా ఇపుడు వివాదం మొదలైంది. ఈ భూమి తమదేనని అనంతపురం సీఐ బంధువులు కొందరు అమ్మకానికి పెట్టారు. అయితే .. కొనుగోలు దారులు భూమికి సంబంధించిన లింక్‌ డాక్యుమెంట్లు అడగడంతో అసలు విషయం బయటపడింది. లింక్‌ డాక్యుమెంట్లు లేకుండానే భూమి రిజిస్టర్‌ అయి ఉండటంతో.. విషయం భూమి అసలు యజమానులకు చేరింది. దీంతో అసలు తాము ఎపుడూ భూమిని అమ్మలేదని 60ఏళ్ల క్రితమే ఈ భూమిని తాము అసైండ్‌ల్యాండ్‌గా ప్రభుత్వం నుంచి పొందామని విషయాన్ని వారు బయటపెట్టారు. దీంతో తమ బంధువుల తరపున అనంపురం పోలీస్‌ సీఐ రంగంలోకి దిగి భూ యజమానులకు బెదిరింపులు మొదలు పెట్టారు. అంతటితోనే ఆగకుండా పోలీసు తెలివితేటలు ప్రదర్శించి, భూమిని సొంతం చేసుకునేందుకు ఎత్తులు వేశారు. 57 ఏళ్ల క్రితమే ఈ ల్యాండ్‌ తమ పేరుతో రిజిస్టర్‌ అయిందని ..భూమిని అమ్ముకోడానికి అనుమతి ఇవ్వాలని సీఐ బంధువులు ఆర్డీవో దగ్గర పంచాయతీ పెట్టారు. దీనిపై విచారణ చేసిన ఆర్డీవోకు కళ్లుతిరిగినంత పనయింది. ఈ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ అస్తవ్యస్థ వివరాలతో ఉన్నాయి. దీంతో ఇది వివాదాస్పద భూమి అంటూ క్రయ-విక్రయాలు జరపొద్దంటూ .. సమస్యను కోర్టులో పరిష్కరించుకోవాలని తేల్చిచెప్పారు.

పోలీసు అధికారి లోకల్‌ పంచాయతీ
విషయం కోర్టుకు వెళితే అసలుకే మోసం వస్తుందనుకున్న సదరు పోలీసు అధికారి లోకల్‌ పంచాయతీకి తెరతీశారు. కొందరు అధికారపార్టీ నేతలు, స్థానికంగా పలుకుబడి కలిగిన ఓ రియల్‌ వ్యాపారిని రంగంలోకి దించాడు. భూమి అసలు యజమానులను పిలిపించి తలాఇంత అంటూ పంకాలు చేయడానికి ప్రయత్నించారు. అయితే భూమి అసలు యజమానులు దీనికి ఒప్పుకోలేదు. వివాదం మరింత ముదరడంతో విషయం కాస్తా పోలీసుబాసు ఎస్పీ దృష్టికి చేరింది. దీనిపై సీరియస్‌గా స్పందించిన ఎస్పీ రాజశేఖర్‌బాబు సదరు రియల్‌ఎస్టేట్‌ వ్యారితోపాటు సీఐ బంధువులను కూడా తీవ్రంగా మందలించారు. అనంతపురం ఆర్డీవో నుంచి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు తెప్పించుకుని పరిశీలించారు. వివాదంలో తలదూర్చిన సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉన్నతాధికారుల హెచ్చరిక
పోలీసు ఉన్నతాధికారుల హెచ్చరికలతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినా.. అసలు లింకు డాక్యుమెంట్లు లేకుండా భూమి రిజిస్ట్రేషన్‌ ఎలా జరిగిందన్నది తేలాల్సిన అవసరం ఉంది. లంచాలకు కక్కుర్తిపడిన కొందరు రెవెన్యూ అధికారులు, రిస్ట్రేషన్‌ అధికారులే ఇలా ఇష్టారీతిగా భూ దందాలకు సపోర్టు చేస్తున్నారనే అరోపణలొస్తున్నాయి. రెవిన్యూ అధికారులు సమస్య సృష్టించడం.. పరిష్కారం పేరుతో పోలీసులు పంచాయతీలు నిర్వహించి, పేదలు, రైతుల ఆస్తులను దోచుకుంటున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - land scam