life jackets

16:39 - November 18, 2017

తూర్పుగోదావరి : విజయవాడ ఫెర్రీ ఘాట్‌ పడవ ప్రమాద ఘటన తరువాత అధికారుల్లో చలనం వచ్చింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ బోట్లను నడుపుతున్న వారిపై ఆంక్షలను కఠినతరం చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఫలితంగా పాపికొండల బోటు విహారానికి బ్రేక్ పడింది. మూడురోజుల పాటు ఎలాంటి విహార యాత్రకు అనుమతులు లేవని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

కృష్ణానది పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాద ఘటన తరువాత పాపికొండల విహారం కోసం నడుపుతున్న బోట్లలో నిర్లక్ష్యం ఒక్కసారిగా బయటపడింది. మొత్తం బోట్లన్నీ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. ఫెర్రీ ఘాట్ ప్రమాద ఘటన జరిగిన మరుసటిరోజే అధికారులు హుటాహుటీన బోట్ల నిర్వహణపై ఆరాతీశారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం అంగళూరు నుంచి పాపి కొండల విహారం కోసం వెళ్లే బోట్లను  సీతానగరం, దేవీపట్నం ఎమ్మార్వోలు తనిఖీలు చేశారు. నాలుగు బోట్లు మినహా మిగిలిన బోట్లన్నీ నిబంధనలకు నీళ్లొదిలేస్తున్నట్టు తేలింది. అంతే అధికారులు సమావేశమై బోటు ఓనర్లపై నిబంధనలు కఠినతరం చేసేందుకు ఉపక్రమించారు. అందులో భాగంగా పర్యాటక శాఖ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో జాయింట్ కలెక్టర్ మల్లిఖార్జున్ సమావేశమయ్యారు. 

బోట్లలో పరిమితికి మించి పర్యాటకులను ఎక్కించినట్టు అధికారుల తనిఖీల్లో తేలితే శాశ్వతంగా బోటు లైసెన్స్‌ను రద్దు చేస్తామని జాయింట్ కలెక్టర్ మల్లిఖార్జున్ బోటు నిర్వాహకులకు ఆదేశించారు. ప్రతీ బోటులో సీసీకెమెరాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. దీంతో పాటు ప్రతీ బోటులోనూ నావిగేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఇసుక మేటలను గుర్తించగలిగేలా ఉండకపోతే పర్యాటకుల ప్రాణాలకు ముప్పు కలుగుతుందనీ, అనుభవం కలిగిన డ్రైవర్ మాత్రమే బోట్లను నడపాలని ఆదేశించారు. 

భద్రత విషయంలోనే కాకుండా పర్యాటకులనుంచి దోచుకుంటున్న బోటు నిర్వాహకులను కట్టడి చేయడంలో అధికారులు దృష్టి పెట్టారు. కలెక్టర్ పెట్టిన టిక్కెట్ ధర ప్రకారం మాత్రమే పర్యాటకుల వద్ద డబ్బులు తీసుకునేలా చర్యలు చేపడతామన్నారు. విహారం మార్గంలో అధికారులు నిర్దేశించిన నాలుగు చోట్ల ఖచ్చితంగా తనిఖీ చేయించుకుని తీరాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అధికారులు ఏదో చర్యలు చేపట్టాం .. చేతులు దులుపుకున్నాం.. అన్న చందంగా కాకుండా అవి అమలయ్యే తీరుపై మరింత దృష్టి పెట్టాలని అందరూ కోరుతున్నారు. 

21:15 - November 14, 2017

విజయవాడ : ఫెర్రీఘాట్‌ పడవ ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. ఏడేళ్ల చిన్నారి అశ్విత మృతదేహాన్ని ఇవాళ రెస్క్యూ టీమ్‌ వెలికి తీసింది. మరోవైపు బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబుకు కృష్ణా జిల్లా కలెక్టర్‌ ప్రాథమిక నివేదిక అందజేశారు. బోటులో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. బోటింగ్‌ అనుమతులకు సంబంధించి విధానాలు మారుస్తామని పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ తెలిపారు.

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌ వద్ద జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కి పెరిగింది. ఏడేళ్ల అశ్విత మృతదేహాన్ని రెస్క్యూటీం వెలికితీసింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. అశ్విత అమ్మ నాన్నమ్మ కూడా ప్రమాదంలో మృతిచెందడం కుటంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఫెర్రీఘాట్‌ బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబుకు కృష్ణా జిల్లా కలెక్టర్‌ ప్రాథమిక నివేదిక అందజేశారు. బోటు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. 25 మంది సామర్థ్యం ఉంటే 45 మందిని ఎక్కించారని తెలిపారు. సరస్సుల్లో నడిపే బోటు కృష్ణానదిలో తిప్పడానికి అనుమతి లేదని చెప్పారు. రివర్‌ బోటింగ్‌ అండ్‌ అడ్వంచర్స్‌ సంస్థకు పెద్ద బోట్లు నడిపే అనుమతి లేదని కలెక్టర్‌ నివేదికలో తెలిపారు. మరోవైపు ప్రమాద బాధ్యులపై ప్రభుత్వం తొలి వేటు వేసింది. పర్యాటకశాఖ కాంట్రాక్ట్‌ బోటు డ్రైవర్‌ గేదెల శ్రీనును సస్పెండ్‌ చేసింది. మరో 8 మందిపై శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నారు.

పడవ ప్రమాదంపై పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ బోటింగ్‌ ఆపరేటర్లతో సమావేశమయ్యారు. బోటింగ్‌ అనుమతులకు సంబంధించి విధానాలు మారుస్తామని చెప్పారు. ఇప్పటివరకు నదిలో పడవలు నడుపుకునేందుకు పర్యాటక శాఖతో సంబంధం లేకుండా జలవనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఆ విధంగా అనుమతులు తీసుకున్నవారెవ్వరూ పర్యాటక శాఖతో అగ్రిమెంట్‌​కావటం లేదని మంత్రి అన్నారు. ఈ లోపాలు సరిదద్దేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని మంత్రి చెప్పారు. విధివిధానాల్లో మార్పులు తీసుకొస్తామని, కొత్త పర్యాటక విధానాన్ని అధ్యయనం చేస్తున్నామని అఖిలప్రియ వివరించారు. మరోవైపు విజయవాడ పడవ ప్రమాద ఘటనా స్థలాన్ని కాంగ్రెస్‌ నిజ నిర్థారణ కమిటీ పరిశీలించింది. పున్నమిఘాట్‌ వద్ద అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం ఉందని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు అన్నారు. అధికారులు దగ్గరుండి మరీ ప్రైవేటు బోట్‌లో ఎక్కిస్తున్నారని ఆరోపించారు. 

20:37 - November 14, 2017

జల సమాధి జవాబు ఏదీ ?

పవిత్ర సంగమంలో బోల్తాకొట్టిన పడవ ఎవరిది? ఏ రాజకీయ నాయకుల హస్తం ఉంది? అనుమతులు లేకుండా తిరుగుతుంటే ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందా? లేక నేతలు కుమ్మక్కయ్యారా? అసలు ఓ ఆధ్యాత్మిక ఉత్సవంలో, ఓ టూరిస్టు ప్రాంతంలో సామాన్యులే ఎందుకు చనిపోతారు? సామాన్యులే ఎందుకు గాయపడతారు? దీనిపై ప్రత్యేక కథనం..గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలిగొన్న ఘటన ఇంకా కళ్లముందు నుంచి చెరిగిపోలేదు. దానిపై విచారణ ఇప్పటికీ అతీగతీ లేదు. ఇక కార్తీక మాసంలో పవిత్ర సంగమం వద్ద జనం పోటెత్తుతారని తెలిసినా అప్రమత్తం కాని తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రైవేటు పర్యాటకానికి ఓ రేంజ్ లో ప్రచారం కల్పిస్తూ కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా, భద్రతా ఏర్పాట్లు లేకుండా, ప్రభుత్వ నియంత్రణ లేకుండా గాలికి వదిలేయంటం చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం కాదా అని బాధితులు మండిపడుతున్నారు..

ఎలాంటి అనుమతులు లేవు..ఏ దారిలో వెళ్లాలో బోట్ నడిపేవాడికి తెలియదు.. దీనివెనుక ఎవరెవరు కుమ్మక్కయ్యారో అంతా గప్ చుప్.. ఎక్స్ గ్రేషియా ఇస్తాం.. కమిటీ వేస్తాం.. విచారణ జరుపుతాం.. ఆ విధంగా ముందుకెళతాం.. జాతరకెళితే ఇంటికి సేఫ్ గా రాగలరా? ఏదైనా దేవాలయ ఉత్సవానికెళితే సరైన రక్షణ ఉంటుందా? ఏ మాత్రం లేదని చరిత్ర చెప్తోంది. మన దేశంలో ఇలాంటి ప్రమాదాలు ఇప్పటివి కాదు. అనేక ఘటనలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. వాటిలో మొన్నటి పుష్కరాల ఘటన మొదటి కాదు.. నేటి పడవ ప్రమాదం ఆఖరికాకపోవచ్చు.. ప్రభుత్వాల నిర్లక్షం ఆ రేంజ్ లో కనిపిస్తోంది.

ఈ ప్రమాదాల చిట్టా చూస్తే అర్ధమయ్యేది ఒక్కటే..సామాన్య ప్రజలంటే పాలకులకు ఎంత చిన్నచూపో తెలిసిపోతుంది. హడావుడి చేసి, రండి రండి అంటూ పర్యాటకులను, భక్తులను ప్రచారార్భాటంతో ఆకర్షించటం తప్ప , హడావుడిగా ఉత్సవాలు నిర్వహించటం తప్ప అందులో ఎలాంటి చిత్తశుద్ధి కనిపించని పరిస్థితి. గాల్లో దీపంలా ప్రజారక్షణను వదిలేసే పాలకులదే నూటికి నూరుపాళ్లూ ఈ పాపం.. అసలీ బోటింగ్ సంస్థ వెనుక ఏపీ మంత్రి హస్తం కూడా ఉందనే వార్తలో నిజమెంత?

పవిత్ర సంగమంలో భక్తులు మరణించారంటే దానికి కారణం నూటికి నూరుపాళ్లూ ఏలికల నిర్లక్ష్యమే. ప్రచారం చేసుకున్నంత ఉత్సాహంగా ఏర్పాట్లు కూడా చేసి ఉంటే, ఇలాంటి విషాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. ప్రజల ప్రాణాలకు వీసమెత్తు విలువివ్వకుండా, పర్యాటక ప్రాంతాల్లో పుణ్య క్షేత్రాల్లో ప్రభుత్వాలు కనబరుస్తున్న నిర్లక్ష్యంలో మార్పు రావలసిన అవసరం ఉంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:57 - November 14, 2017

విజయవాడ : పడవ ప్రమాద ఘటనా స్థలాన్ని కాంగ్రెస్‌ నిజ నిర్థారణ కమిటీ పరిశీలించింది. పున్నమి ఘాట్‌ వద్ద అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం ఉందని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు అన్నారు. అధికారులు దగ్గరుండి మరీ ప్రైవేటు బోట్‌లో ఎక్కిస్తున్నారని ఆరోపించారు. సేఫ్టీనామ్స్‌ పాటించకపోవడంతోనే 22 మంది మృతి చెందారని పేర్కొన్నారు. పల్లంరాజుతో టెన్ టివి ముచ్చటించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:36 - November 14, 2017

విజయవాడ : ఫెర్రీ ఘాట్‌ పడవ ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. ఏడేళ్ల చిన్నారి అశ్విత మృతదేహాన్ని రెస్క్యూ బృందం వెలికి తీసింది. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అశ్విత అమ్మ నాన్నమ్మ కూడా ప్రమాదంలో మృతిచెందడం కుటంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నదిలో గల్లంతైన ఒంగోలుకు చెందిన మరో మహిళ సుజన కోసం గాలింపు కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:28 - November 14, 2017

హైదరాబాద్ : విజయవాడలో జరిగిన బోటు ప్రమాదంలో 22 మంది జలసమాధి అయ్యారు. కృష్ణా నదిలో విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద జరిగిన ఘోర పడవ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా ఈ ప్రమాదంతో పర్యాటకుల్లో గుండెల్లో గుబులు రేగుతోంది. టూర్ ఏదైనా సరే బోటు షికారు ఉందంటే పర్యాటకులు ఆ షికారు కోసం ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ బోటు ప్రమాదం తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. బోటు షికారుపై ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ అందాలను వీక్షించడానికి చాలా మంది పర్యాటకులు నగరానికి వస్తుంటారు. సాగర్ లో ఏర్పాటు చేసిన బోటులో ప్రయాణించడానికి చాలా మంది మక్కువ చూపిస్తుంటారు. మరి సాగర్ లో బోటు షికారు ప్రమాదంగా ఉందా ? బోటు ప్రయాణం సేఫేనా ? తెలంగాణ టూరిజం శాఖ ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటోంది ? దీనిపై తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

14:20 - November 14, 2017

విజయవాడ : కృష్ణా నదిలో విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 22 మంది చనిపోయారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధ్యులపై చర్యలు చేపట్టింది. ఏపీ అసెంబ్లీలో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు బాధ్యులైన వారికి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందుకు ఒక కమిటీ వేసి 24గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు.

మంగళవారం బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబుకు కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రాథమిక నివేదిక అందించారు. 25 మంది సామర్థ్యం ఉంటే 45 మందిని ఎక్కించారని, సదస్సులో తిప్పే బోటును కృష్ణా నదిలో తిప్పడానికి అనుమతి లేదని, రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ సంస్థకు పెద్ద బోట్లు నడిపే అనుమతి లేదని నివేదికలో కలెక్టర్ పేర్కొన్నారు. గతేడాది వరకు కాకినాడలో ఉన్న బోటును విజయవాడ తెచ్చి మరమ్మత్తులు చేశారని తెలిపారు. ఇదిలా ఉంటే రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ సంస్థ యజమానిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.

బోటు ప్రమాద ఘటనపై చర్యలు...
బోటు ప్రమాదానికి కారణంగా భావించిన పర్యాటక శాఖ కాంట్రాక్టు ఉద్యోగి గేదెల శ్రీనుపై వేటు పడింది. బోటు ప్రమాదం ఘటనలో మరో 8 మందిపై ప్రభుత్వం వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టూరిజం, జలవనరుల శాఖ మంత్రులు..అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. విజిలెన్స్ నివేదికను బుట్టదాఖలు చేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన నిబంధనలు అమలు చేయకపోవడంపై బాబు వివరణ కోరినట్లు సమాచారం. 

19:27 - November 13, 2017

విజయవాడ : కృష్ణా నదిలో పవిత్ర సంగమం వద్ద పడవ ప్రమాదం ఘటనలో పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన పడవ యాజమాన్యం రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ పార్టనర్స్ సంస్థపై ఇబ్రహీంపట్నం పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అనుమతులు లేకుండా బోటును నదిలోకి తీసుకురావడం, పర్యాటకులను జలవిహారానికి తీసుకెళ్లడాన్ని పోలీసులు నేరంగా పేర్కొన్నారు. లైఫ్ జాకెట్లు వంటి రక్షణాత్మక సామాగ్రి పరిమితంగా ఉండటం, సామర్థ్యానికి మించి పర్యాటకులను పడవలోకి ఎక్కించడం వంటి అభియోగాల కింద కేసు నమోదు చేశారు. సంస్థ నిర్వాహకులు శేషం మోదకొండల రావు, నీలం శేషగిరిరావు, గేదెల శ్రీను, వింజమూరి విజయసారథి, చిట్టిపై కేసులు నమోదు చేసినట్లు ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు. 

 

10:11 - November 13, 2017

కృష్ణా : బోటు బోల్తా కొట్టిన ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. 16 మంది పర్యాటకులను మత్స్యకార్మికులు రక్షించారు. భవానీ ఐలాండ్స్ నుంచి పవిత్ర సంగమానికి పర్యాటకులు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గల్లంతైన నలుగురి కోసం వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఒక మృతదేహం మినహా 15 మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 42 మంది పడవలో ప్రయాణిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:32 - November 13, 2017

కృష్ణా : నదిలో జరిగిన పడవ ప్రమాదంపై సీనియర్‌ ఐఏఎస్ ఆఫీసర్‌తో విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయాల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. చంద్రన్న బీమా పథకం వర్తించే వారికి మరో ఐదు లక్షలు ఇస్తారు. బీమా లేనివారికి ఎక్స్‌గ్రేషియా ఐదు లక్షలకు తోడు మరో మూడు లక్షలు కలిపి ఇస్తామని ఏపీ హోం మంత్రి చినరాజప్ప చెప్పారు.

విజయవాడ ఫెర్రీ ఘాట్‌ వద్ద కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదంపై ప్రభుత్వ సమగ్ర విచారణకు ఆదేశించింది. బోల్తా పడ్డ పడవకు అనుమతిలేదిన పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చించారు.

విజయవాడలోజరిగిన పడవ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు విమర్శించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.  

Pages

Don't Miss

Subscribe to RSS - life jackets