love affair

11:48 - June 25, 2017

నల్గొండ : కులాంతర వివాహం చేసుకుని భర్త, అత్తమామల చేతిలో వేధింపులకు గురైన దళిత యువతి జ్యోతి న్యాయం కోసం పోరాడుతోంది. భర్త ఇంటి వద్ద నిరసన దీక్ష చేపట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలి నాతాళ్లగూడెంకు చెందిన జ్యోతి 2012లో లింగస్వామి గౌడ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మూడు నెలలపాటు సవ్యంగా సాగింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. భర్త, అత్తమామల వేధింపులు ఎక్కవయ్యాయి. దీంతో తనకు న్యాయం చేయాలంటూ జ్యోతి... ఐదేళ్లుగా పోలీసులు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి భర్త ఇంటి వద్దే నిరసన దీక్షకు దిగింది.

10:35 - June 17, 2017

హైదరాబాద్ : రాష్ట్రలో సంచలనం సృష్టించిన శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు శ్రావణ్, రాజీవ్ లను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. శ్రావణ్ ను ఎ1 నిందితుడిగా, రాజీవ్ ను ఎ2 నిందితుడిగా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు రిమాండ్ డైరీ తయారు చేశారు. అయితే శిరీష మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని పై హెచ్ఆర్ సీ వెళ్తమని తెలిపారు. 

19:53 - June 16, 2017

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శిరీష అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. శిరీష మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తేల్చారు. ఆమెది హత్యకాదని... ఆత్మహత్యేనని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ కేసులో ఏ-1గా శ్రావణ్‌, ఏ-2గా రాజీవ్‌ను నిందితులుగా చేర్చామన్నారు. శిరీష, శ్రావణ్‌, రాజీవ్‌ కలిసి సిద్దిపేట జిల్లాలోని కుకునూర్‌పల్లి వెళ్లారని చెప్పారు. ఆ రాత్రి శిరీషతోపాటు రాజీవ్‌, శ్రావణ్‌, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి మద్యం సేవించారన్నారు. అనంతరం ఒంటరిగా ఉన్న శిరీషపట్ల ఎస్సై అసభ్యకరంగా ప్రవర్తించారని.. శ్రావణ్‌, రాజీవ్‌లు తమ విచారణలో తెలిపారన్నారు. ఎస్సై చేష్టలతో అవాక్కైన శిరీష మనస్తాపం చెందిందని.. ఒక్కసారిగా ఆమె పెద్దగా అరవడంతో బయట ఉన్న రాజీవ్‌, శ్రావణ్‌ లోనికి వచ్చారన్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత శిరీష మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తేల్చారు. ఇదే అంశంపై 'హెడ్ లైన్ షో'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సామాజిక కార్యకర్త దేవి, డాక్టర్ సైక్రియాటిస్టు జవహర్ లాల్ నెహ్రూ, మాజీ ఏసీబీ రెడ్డన్న పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

08:35 - June 16, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్‌ శిరీష్‌ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు. ఉస్మానియా వైద్యులు అందజేసిన శిరీష శవపరీక్ష నివేదికను పోలీసులు పరిశీలించారు. శిరీష మెడ, చెవి, పెదవులపై బలమైన గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టంలో నిర్థారణ అయింది. దీంతో ఈమెను ఎవరైనా హత్యచేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. నిఘా విభాగం కూడా ఈ కేసును దర్యాప్తు చేసింది. పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు, ఇంటెలిజెన్స్‌ అధికారులు శిరీష ఆత్మహత్య చేసుకున్న గదిలోకి వెళ్లి రెండు గంటలకు పైగా వివిధ కోణాల్లో పరిశీలించారు. బయోమెట్రిక్‌ అమర్చే ప్రతినిధులను పిలిపించి శిరీష ఆత్మహత్య చేసుకున్న గదిని క్షణ్ణంగా తనిఖీ చేశారు. ఎవరెవరు శిరీష కార్యాలయానికి వచ్చి వెళ్లారన్న వివరాలు సేకరించారు. వారి థంబ్‌ప్రింట్‌ వివరాలపై ఆరా తీశారు.

ఘటనా స్థలానికి నిందితులు...
శిరీష ఆత్మహత్య కేసులో నిందితులుగా అనుమానిస్తున్న రాజీవ్‌, శ్రవణ్‌లను ఆర్‌జే స్టూడియోలోనే ఏడు గంటలపాటు పోలీసులు ప్రశ్నించారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను విచారించారు. రాజీవ్‌, శ్రవణ్‌లను ఘటనా స్థలానికి తీసుకెళ్లి దర్యాప్తు జరిపారు. శిరీష ఆత్మహత్య కేసులో ప్రతి సన్నివేశాన్ని అత్యంత పకడ్బందీగా, అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ నెల 12న రాజీవ్‌, శ్రవణ్‌లతో కలిసి కుకునూరుపల్లికి వెళ్లి వచ్చాక శిరీష ఆత్మహత్య చేసుకొంది. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రెండు ఘటనలు సంచలనం సృష్టించాయి. అయితే, కుకునూరుపల్లి నుంచి వచ్చాక అసలు ఏం జరిగిందనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు. శిరీషను ఎవరైనా హత్యచేసి .. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా? అనే కోణంలో దర్యాప్తు పూర్తైంది. ఈ మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టినప్పుడు వాస్తవాలు వెల్లడవుతాయి. 

17:51 - June 11, 2017

యాదాద్రి : ప్రేమోన్మాది శ్రీకాంత్‌ ఇంటి ముందు గాయాత్రి మృతదేహంతో ఆమె బంధువులు ఆందోళనకు దిగడంతో యాదాద్రి జిల్లా యాదగిరిపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన బంధువులు.. శ్రీకాంత్‌ ఇంటిపై దాడిచేశారు. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి, నిప్పుపెట్టారు. అప్రమత్తమైన పోలీసులు.. వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అంతకుముందు యాదగిరిగుట్ట రోడ్డుపై గాయత్రి మృతదేహంతో జైగౌడ నాయకులు, బంధువులు ధర్నా చేశారు. శ్రీకాంత్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ధర్నాకు మహిళా సంఘాలు మద్దతుతెలిపాయి. నిందితుడిని ఉరితీయాలని డిమాండ్‌ చేశారు. మృతురాలి కుటుంబానికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రేమోన్మాది శ్రీకాంత్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

15:55 - June 11, 2017

యాదాద్రి : ప్రేమోన్మాదానికి బలైన గాయత్రి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ భువనగిరి జిల్లా వద్ద మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. దీంతో ఆస్పత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. 

11:43 - June 10, 2017

యాదాద్రి భువనగిరి : కులదురహంకారంతో హత్యలు చేస్తున్న వారిని సామాజిక బహిష్కారం చేయాలని సీపీంఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. యాదాద్రిజిల్లా భువనగిరిలో జరిగిన  సభలో పెద్ద ఆయన పాల్గొన్నారు. నరేశ్‌ అంబోజి కుటుంబానికి వామపక్షాలు, ప్రజాసంఘాలు బాసటగా నిలుస్తాయని.. న్యాయం జరిగే వరకు , నిందితులకు శిక్షలు పడేవరకు పోరాటం చేస్తామన్నారు ప్రజాసంఘాల నేతలు.
భువనగిరిలో భారీ బహిరంగసభ 
అంబోజు నరేశ్‌..స్వాతిల హత్యలను నిరసిస్తూ వామపక్షాలు, 83 ప్రజాసంఘాలు భువనగిరిలో కదంతొక్కాయి. పట్టణంలోని జగ్జీవన్‌రామ్‌ విగ్రం వద్ద  పౌర, సామాజిక, ప్రజాసంఘాల పేరుతో బహిరంగసభను నిర్వహించారు. నరేశ్‌-స్వాతిల హత్యపై సమగ్ర న్యాయవిచారణ జరిపించాలని, నరేశ్‌కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 
నరేశ్...స్వాతి హత్యలను కులాల ఘర్షణగా చిత్రించే కుట్ర..!
నరేశ్.. స్వాతిల హత్యను కులాల మధ్య సంఘర్షణగా చిత్రించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని.. అలాంటి కుట్రలను విఫలం చేయాలన్నారు  సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం. నరేశ్‌ కుటుంబానికి న్యాయం జరిగేవరకు వామపక్షాలు రాజీలేని పోరాటం చేస్తాయని తేల్చి చెప్పారు. దీనికోసం మిగతా రాజకీయపార్టీలను, యాద్రాద్రిజిల్లా  టీఆర్‌ఎస్‌ నాయకులను కూడా కలుపుకుని పోరాడతామన్నారు.
నిందితులకే వత్తాసు పలుకుతున్న పోలీసులు
కులదురహంకారంతో జరిగిన స్వాతి నరేశ్‌ల హత్యలను ప్రజలందరూ ఖండించాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. పోలీసు వ్యవస్థసైతం నిందితుల పక్షం వహించడంపై ప్రజాసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణలేకుండా పోయిందని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు.  మేజర్లైన యువకులు తమకు నచ్చిన వారిని పెళ్లిచేసుకునే హక్కును .. ఆదిపత్యకులాల ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని విమర్శించారు. 
ప్రజాసంఘాలు ధర్నా 
అంతకు ముందు ప్రజాసంఘాలు ధర్నాకు దిగాయి. సభాప్రాంగణానికి ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించి.. నరేశ్‌కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌  చేశారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ స్థంభించింది. నిందితుడు శ్రీనివాసరెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్న  రామన్నపేట సీఐ శ్రీనివాస్‌, భువనగిరిపట్టణ సీఐ  శంకర్‌గౌడ్‌లపై హత్యకేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కేసు విచారణకు ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలని,  నరేశ్‌ కుటుంబానికి 25లక్షల రూపాయలు, 3ఎకరాలభూమిని  పరిహారంగా 
ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 
కులాంతర వివాహ రక్షణ చట్టం తేవాలి
ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ స్వాతి-నరేశ్‌ల హత్యపై ఉన్నత స్థాయి దర్యాప్తును చేపట్టి.. తెలంగాణలో సామాజిక న్యాయాన్ని బతికించాలని వామపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.  భవిష్యత్తులో ఇలాంటి కులదురహంకార హత్యలు జరగకుండా.. కులాంతర వివాహాల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. లేదంటే.. పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. 

 

12:22 - June 8, 2017

కూతురి ప్రేమలో ఉన్నాడని తెలిసి కక్ష...కసితో రగిలిపోయాడు...తన కూతురికి కనిపించకుండా చేయాలని...నమ్మకస్తుడిని పిలిపించి చంపేసిన దుర్మార్గం...

ఆస్తి..అంతస్తుల ముందు పేగు బంధం తెగిపోతోంది. మనుషుల్లో పెరుగుతున్న స్వార్థం..ఎన్నో ఘోరాలకు దారి తీస్తోంది..ప్రాణాలు తీస్తోంది..ఈ ఆస్తుల కోసం జన్మనిచ్చిన వారిని అంతం చేస్తున్నారు..రక్తసంబంధాన్ని కాలరాస్తూ..రక్తాన్ని చిందిస్తున్నారు..ఎందుకు కక్షలు..కార్పణ్యాలు.. ? అన్నదమ్ముల మధ్య అనుబంధాలు మాయమౌతున్నాయి.. దీనితో సాధిస్తున్నది ఏమిటీ ?
ప్రేమించడమే శాపమైంది..మనస్సుకు నచ్చిన వారిని ఎంచుకోవడం పాపంగా మారుతోంది..రెండు హృదయాలు కలవడం అంటే పెద్దల అంగీకారం కావాల్సిందే..లేదంటే ప్రాణాలు తీస్తున్నారు..తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పరువు హత్యలో రెండు కుటుంబాల్లో విషాదం నింపింది... యావత్తు తెలుగు రాష్ట్రాల్లో ప్రేమికుల గుండెలు పగిలేలా భయాన్ని సృష్టించాయి. మరి పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి....

12:43 - June 6, 2017

తూ.గో: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన స్వాతి, నరేష్‌ల పరువు హత్య ఘటన మర్చిపోకముందే తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలో మరో పరువు హత్య జరిగింది. తన కూతుర్ని ప్రేమించాడని ప్రియుడిని యువతి తండ్రి దారుణంగా హత్యచేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని గొల్లపాలెం వద్ద ఉన్న కరవాక బీచ్‌లో పాతిపెట్టాడు. మే 2న ప్రియుడిని హత్య చేసినట్లు పోలీసుల విచారలో తేలింది. అయితే ప్రియుడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. నిందితుడు, యువతి తండ్రి అయిన కందుల విజయ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

06:43 - June 4, 2017

కర్నూలు : కులజాడ్యం ఓ విద్యార్థిని నిండు ప్రాణాలు బలి తీసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. కులాలు వేరు కావడంతో పెద్దలు వారిద్దరిని బలవంతంగా వేరు చేశారు. మరోవైపు తన భర్తకు మరో పెళ్లి చేశారు. ఇది తట్టుకోలేని ఆమె తనువు చాలించింది. కర్నూలు జిల్లా గూడురు మండలం కె.నాగలాపురానికి చెందిన టీటీసీ విద్యార్థిని గీత, పెంచికలపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థి సోమశేఖరరెడ్డి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే.. కులాలు వేరు కావడంతో.. అబ్బాయి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వారిద్దరూ మార్చి నెలలో ఓ గుళ్లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సోమశేఖరరెడ్డి.. గీతను ఇంటికి తీసుకెళ్లాడు. అయితే.. నాలుగైదు రోజుల తర్వాత వారిద్దరిని విడదీసేందుకు కుట్రలు మొదలుపెట్టారు తల్లిదండ్రులు. తమ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదని రాత్రికి రాత్రే సోమశేఖర్‌రెడ్డిని వేరే ఊరికి తీసుకెళ్లారు. ఒంటరిగా ఉన్న గీతను.. తెలిసిన వారి ద్వారా పుట్టింటికి పంపించారు. ఎన్ని రోజులైనా భర్త రాకపోవడంతో.. ఆమే అత్తారింటికి వెళ్లింది. అక్కడ భర్త కనిపించకపోవడంతో.. అత్తామామలను అడిగింది. వారినుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. ఏమి చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించింది. అయితే.. గీత మైనర్‌ కావడంతో.. మేజర్‌ అయిన తర్వాత వస్తే పెళ్లి చేస్తామని పోలీసులు తెలిపారు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

శిక్షించాలంటున్న గ్రామస్తులు..
మరోవైపు ఆమెకు గ్రామ కుల పెద్దల నుంచి బెదిరింపులు వచ్చాయి. మేజర్‌ కాకుండానే చేసుకున్న పెళ్లి చెల్లదని.. చదువుకున్న తర్వాత వేరే అబ్బాయిని వివాహం చేసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో తన భర్త వేరే వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గీత.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురు ఆత్మహత్యకు సోమశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులే కారణమని గీత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఓ అమ్మాయి ఆత్మహత్యకు కారణమైన సోమశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - love affair