maharastra

16:35 - December 5, 2017

మహారాష్ట్ర : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఓఖీ తుపాను మహారాష్ట్రను తాకింది. దీంతో ముంబయిలో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. నగరంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రైల్వే స్టేషన్ల వద్ద అదనపు భద్రతను ఏర్పాటుచేశారు. జాలర్లు సముద్రంలోకి వెళ్లరాదని ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఉదయం నాటికి ఓఖీ తుపాను గుజరాత్‌ తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఓఖీ తుపాను ధాటికి కేరళ, తమిళనాడులో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

12:13 - January 11, 2017

ఢిల్లీ : ప్రకృతి ఎప్పుడు కన్నెర్ర చేసినా.. ఆ ప్రభావం రైతన్నల పైనే పడుతోంది. ప్రతిఏటా సంభవించే కరవు కాటకాలకు దేశవ్యాప్తంగా చిన్న రైతులే చితికి పోతున్నారు. కరవు, వర్షాభావ పరిస్థితులు అదే పనిగా అన్నదాతల పాలిట శాపంగా మారి ఉసురు తీస్తున్నాయి. 2015 ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం కరవు పీడిత ప్రాంతం మహారాష్ట్రలో అత్యధికంగా రైతులు మృతి చెందారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో చిన్న కమతాల రైతులే అధికంగా ఉండటం శోచనీయం. ! 
కరవుతో రైతులు విలవిల 
గత ఏడాది క్రితం వరకు దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరవుతో రైతులు విలవిలలాడి పోయారు. వర్షాలు లేక మరట్వాడా ప్రాంతం పూర్తిగా ఎడారిని తలపించింది. ఒక్క మహారాష్ట్రలోనే కాదు .. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో చిన్న, సన్నకారు రైతులే అధికమని గణాంకాలు చెబుతున్నాయి. 
రైతులే అధిక శాతం ఆత్మహత్యలు 
నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం 2 హెక్టార్ల కన్నా తక్కువ భూమి కలిగిన రైతులే అధిక శాతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలా 2015లో 72 శాతం చిన్న రైతులే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 10 హెక్టార్లు ఆపై భూమి కలిగిన రైతుల్లో ఆత్మహత్య శాతం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ కోవకు చెందిన రైతుల్లో కేవలం 2 శాతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2015లో 8 వేల ఏడు మంది రైతులు ఉసురు తీసుకుంటే.. ఇందులో నాలుగో వంతు మధ్యతరగతి రైతులు ఉన్నారు. 2 నుంచి 10 హెక్టార్ల భూమి కలిగిన రైతులను మధ్యతరగతి రైతులుగా పరిగణిస్తారు. 
మోతుబరి రైతుల చేతిలో సాగవుతున్న భూమి 10.6 శాతం 
2010-11 వ్యవసాయ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. హెక్టార్‌ కంటే తక్కువగా భూమి ఉన్న వారిలో 67.1 శాతం ఉండగా... 1 నుంచి 2 హెక్టార్లు భూమి కలిగిన రైతులు 17.9 శాతం ఉన్నారు. అదేవిధంగా 2 నుంచి 10 హెక్టార్లు కలిగిన మధ్యతరగతి రైతులు 14.3 శాతం ఉంటే.. 10 హెక్టార్లకంటే ఎక్కువ భూమి కలిగిన మోతుబరి రైతులు 0.7 శాతం ఉన్నారు. మొత్తానికి సాగులో ఉన్న భూమి చిన్న రైతులకు అల్పంగా ఉందని గణాంకాలు చాటుతున్నాయి. ఉపాంత రైతులు సాగులో ఉన్న భూమి కేవలం 22.5 శాతం కాగా, 22.1శాతం భూమి చిన్న రైతుల చేతుల్లో సాగవుతోంది. అదే సమయంలో మధ్యతరగతి రైతుల 44.8 శాతం సాగుబడిలో ఉండగా... మోతుబరి రైతుల చేతిలో సాగవుతున్న భూమి 10.6 శాతంగా ఉంది.   
ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలి..
కేవలం వ్యవసాయం పైనే కాకుండా..వ్యవసాయేతర రంగాలపైనా దృష్టి పెట్టినప్పుడే రైతన్నల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని భువనేశ్వర్‌కు చెందిన నవకృష్ణ చౌదరి సెంటర్‌ ఫర్‌ డెవలప్‌ మెంట్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ సృజిత్‌ మిశ్రా  సూచించారు. అందరికీ అన్నంపెట్టే అన్నదాతలు చితికిపోకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. 
ఉపాంత రైతులు బలవన్మరణాలు
గణాంకాల ప్రకారం.. మొత్తం 2,195 అతి తక్కువ భూమి కలిగిన ఉపాంత రైతులు బలవన్మరణాలకు పాల్పడగా...వారిలో మహారాష్ట్రలో 834, ఛత్తీస్‌గడ్‌లో 354 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డ వారిలో ఉన్నారు. అంటే మహారాష్ట్రలో 38 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 16 శాతం ఉపాంత రైతులు బలవంతంగా ఉసురుతీసుకున్నారు.  మహారాష్ట్రలో ఆత్మహత్యలు చేసుకున్న 3,618 రైతుల్లో...1,285 మంది చిన్న రైతులే కావడం గమనార్హం. మొత్తంగా చూస్తే అత్యధిక శాతం అంటే.. 35.5 శాతం ఆత్యహత్యలకు పాల్పడ్డట్లు గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇక కర్ణాటకలో 3,618 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడితే... అందులో అధికమొత్తంలో 751 మంది చిన్నరైతులే ఉండటం శోచనీయం. ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్న వారిలో చిన్నరైతులే 20 శాతం ఉండటం చూస్తే చిన్న రైతుల దుస్థితి ఎలా ఉందో అర్ధం అవుతోంది. 2015లో మొత్తం 160 మంది 10 హెక్టార్లకు పైబడ్డ రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారిలో తెలంగాణలో అత్యధికంగా అంటే.. 79 మంది మోతుబరి రైతులున్నారు. 37 మంది రైతులతో ఛత్తీస్‌గఢ్‌ రెండోస్థానంలో నిలిచింది. 
ఆత్మహత్య చేసుకున్నవారిలో చిన్న రైతులే అధికం 
అత్యధికంగా.. 354 మధ్యతరగతి రైతుల ఆత్మహత్యలు ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకోగా.. వాటిలో చిన్న రైతులు 310 మంది చనిపోయారు. మొత్తానికి కరవు కాటకాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో చిన్న రైతులే అధికంగా ఉంటున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

 

11:50 - June 28, 2016

హైదరాద్ : గోదావరి నదిపై నిర్మించే ప్రాజెక్టులపై మహారాష్ట్ర-తెలంగాణ సర్కార్‌ల మధ్య అధికారిక ఒప్పందానికి ముహూర్తం ఖరారైంది. జులై 15న ముంబైలోని ఇరువురు సీఎంలు సమావేశమై అగ్రిమెంట్‌ చేసుకోనున్నారు. ఇదిలావుంటే ఈ ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు, నీటిరంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే మహారాష్ట్రతో ఒప్పందం కుదిరిందని భారీ ర్యాలీ చేపట్టిన అధికార పార్టీ.. మరోసారి ఒప్పందం అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 
జులై 15న ముంబైలో భేటీకానున్న ఇరువురు సీఎంలు
ప్రాజెక్టుల రీ-డిజైన్‌లో భాగంగా గోదావరి నదిపై కొత్తగా నిర్మించే ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో ఒప్పందానికి తెలంగాణ సర్కార్‌ సిద్ధమవుతోంది. జులై 15న ముంబైలోని సహ్యాద్రి గెస్ట్‌హౌస్‌లో ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మేడిగడ్డ, తుమ్మడిహెట్టి, కొరటా-చనాఖా బ్యారేజీలకు సంబంధించి ఒప్పందం జరగనుంది. 
100 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వ ఉండేలా గేట్లు
రెండు రాష్ట్రాల మధ్య జరగనున్న ఒప్పందం చారిత్రాత్మకమని మంత్రి హరీష్‌రావు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజిని 101 మీటర్ల ఎత్తు డిజైన్‌తో నిర్మిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని మహారాష్ట్ర తెలిపింది. దీంతో 100 మీటర్ల ఎత్తు వరకే ప్రస్తుతం నీటి నిల్వ ఉండేలా గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్‌లో 101 మీటర్ల ఎత్తులో నీటిని నింపే విషయమై నిర్ధారిస్తారు. ఇక తుమ్మిడిహట్టి బ్యారేజి 148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో నిర్మించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని హరీష్‌రావు అన్నారు. 15న జరిగే సమావేశంలో ఇద్దరు సీఎంలతో పాటు.. జలవనరుల శాఖ మంత్రులు, ఇరిగేషన్‌ శాఖ ముఖ్యకార్యదర్శుల, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడం చారిత్రాత్మకమని ప్రభుత్వం చెబుతుంటే.. ప్రజలను మభ్యపెట్టేందుకే టీఆర్‌ఎస్‌ యత్నిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

17:48 - March 23, 2016

మహబూబ్ నగర్ : మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ లో మహిళల ఆలయ ప్రవేశంపై ఇటీవల పలు ఉద్యమాలు జరిగిన సంగతి తెలిసిందే. కానీ తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం మహిళలకు ఆలయ ప్రవేశం ఉంటుంది. దీనితో ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

07:08 - July 17, 2015

హైదరాబాద్:అంతా ఓకే అనుకున్నారు.. ఇక నిర్మాణమే ఆలస్యమని భావించారు.. ఇంతలో టీ సర్కారుకు షాక్ తగిలింది. వ్యాప్కోస్‌ రూపొందించిన కొత్త డిజైన్‌ సర్కార్ అవాక్కైంది. మొదట ఒక డిజైన్‌ను చేసి...అంతా అయ్యాక మరో డిజైన్‌ను తెరపైకి తెచ్చింది. దీంతో గోదావరిపై ప్రాజెక్టుల డిజైన్‌కు మరిన్ని సమస్యలొచ్చాయి. వెంటనే అలర్ట్ అయిన సర్కారు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది.
50 నియోజకవర్గాల్లో 50 లక్షల ఎకరాలకు సాగునీరు....
తెలంగాణను సస్యస్యామలం చేసేలా ప్రాజెక్టుల రూపకల్పనకు టీప్రభుత్వం సిద్ధమైంది. గోదావరి బేసిన్ కింద 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో 50 లక్షల ఎకరాలకు సాగునీరందించే అవకాశం ఉందని సర్కారు అంచనావేసింది. గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాను సంపూర్ణంగా వాడుకునేలా ప్రాజెక్టులు డిజైన్ చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
మొదట మహారాష్ట్రకు ముప్పు ఉండదన్న వ్యాప్కోస్‌.....
ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనిని ప్రభుత్వం.....కేంద్ర ప్రభుత్వ సంస్థ వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్విసెస్‌... వ్యాప్కోస్‌కి అప్పగించింది. మొదట దీనిపై సర్వేచేసిన వ్యాప్కోస్‌....మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మిస్తే మహారాష్ట్రలో ఎలాంటి ముంపు ఉండదని పేర్కొంది. దీని ఆధారంగానే ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల రీఇంజనీరింగ్‌కు శ్రీకారం చుట్టింది. మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మించి, కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎల్లంపల్లికి... అక్కడి నుంచి మిడ్‌ మానేరుకు 160 టీఎంసీలను తరలించాలని ప్రతిపాదించింది. కాని రెండో సారి సర్వేచేసిన వ్యాప్కోస్‌... బ్యారేజీ వల్ల మహారాష్ట్రలో 500ల హెక్టార్ల ముంపు తప్పదని చావుకబురు మెల్లగా చెప్పింది.
ముంపు నివారణకు గైడ్‌బండ్స్‌ నిర్మించాలని ప్రతిపాదన....
దీంతో ప్రాజెక్టుల డిజైన్‌పై తీవ్ర గందగరోళం నెలకొంది. ఐతే ముంపును నివారించటానికి..గైడ్ బండ్స్ నిర్మించొచ్చని వ్యాప్కోస్‌ ప్రతిపాదించింది. మేడిగడ్డకు బదులు...దానికి సమీపంలోని అంబడిపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని చెప్పింది. కాని అక్కడ నిర్మిస్తే...బెగ్లూరు గ్రామంలోని భూములు ముంపుకు గురవుతాయి. ఇక్కడా ముంపు జరగకుండా...గైడ్‌బండ్‌లను నిర్మించొచ్చని వ్యాప్కోస్‌ స్పష్టం చేసింది. కాని వ్యవసాయ భూములు మాత్రం మునిగిపోక తప్పదని తెలిపింది. కాని బ్యారేజీ నిర్మాణంతో....ముంపుకు గురయ్యే అటవీప్రాంతమెంత? వ్యవసాయ భూములెన్ని? అనే వివరాలపై మాత్రం క్లారిటీ లేదు.
నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు....
ఈ అంశంపై మంత్రి హరీశ్ రావుతోపాటు.... వ్యాప్కోస్ ప్రతినిధులు, నీటిపారుదల అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. గోదావరి బేసిన్‌లో అవ‌స‌ర‌మైన కొత్త డిజైన్లు రూపొందించాల‌ని అధికారులను ఆదేశించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున కనీసం లక్ష ఎకరాలకు సాగునీరందించడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గోదావరిపై ఎక్కడెక్కడ లిప్టులు పెట్టాలి? ఎక్కడ రిజర్వాయర్లు కట్టాలి? ఎక్కడ ఎన్ని టిఎంసిలు వాడాలి? ఏ ప్రాంతానికి ఏ మార్గం ద్వారా నీరు తీసుకోవాలి? తదితర అంశాలపై గూగుల్‌ ఎర్త్‌ మ్యాపులు, నివేదికల ఆధారంతో విస్తృతంగా చర్చించారు.
గోదావరి జలాల్లో తెలంగాణ వాటా 953 టీఎంసీలు....
గోదావరి జలాల్లో 953 టిఎంసిలనీటిని వాడుకునే హక్కు తెలంగాణకు ఉంది. 433 టిఎంసిల కోసం ప్రాజెక్టులున్నాయి. ఇంకా 521 టిఎంసిలు వాడుకునేందుకు ప్రాజెక్టులు కట్టుకోవాలి. వీటిలో ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల ద్వారా 400 టిఎంసిలు వాడుకునేందుకు అనుమతులు వచ్చాయని అధికారులు తెలిపారు. వీటిని శాస్త్రీయంగా అధ్యయనం చేశాకే... ముందుకెళ్లాలని సర్కార్ భావిస్తోంది.
తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టుకు కడితే ఆదిలాబాద్‌కు నీరు....
ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టుకు ప్రస్తుతమున్న డిజైన్ పనికిరాదని ప్రభుత్వం యోచిస్తోంది. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్‌ జిల్లాకు నీరివ్వాలని చూస్తోంది. కాళేశ్వరం దిగువన మరో ప్రాజెక్టు కట్టి నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌తోపాటు వరంగల్‌, నల్లగొండ జిల్లాల్లోని జనగామ, భువనగిరి డివిజన్లకు నీరివ్వాలని భావిస్తోంది. ఇటు నిజాంసాగర్‌కు, ఎస్ ఆర్ ఎస్పీ కి కూడా అనుసంధానం చేయాలని సూచించారు అధికారులు. ప్రస్తుతం కంతనపల్లికోసం ప్రతిపాదించిన ప్రాంతం దగ్గర కాకుండా... కొంచెం ముందుకు ప్రాజెక్టు కడితే... దేవాదులకు మ‌రింత ఉపయోగమని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. అన్నీ శాస్త్రీయంగా చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం... ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వంనుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తంకాకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. ఈ ప్రాజెక్టులన్నీ మూడేళ్లలోపు పూర్తికావాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Don't Miss

Subscribe to RSS - maharastra