minister harish rao

19:09 - October 16, 2017

హైదరాబాద్ : తెలంగాణలో మంత్రి హరీశ్‌రావు గోబెల్స్‌ ప్రచారకర్తగా మారారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం చివరిదశ పనులు పూర్తిచేసి.. ప్రాజెక్టు మొత్తం తమ ప్రభుత్వమే నిర్మించిందని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. భూనిర్వాసితులు న్యాయం కోసం కోర్టులకు వెళితే అదో పెద్ద నేరంగా పరిగణించడం దుర్మార్గమన్నారు. పాలమూరు జిల్లాలో అన్ని ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో చేపట్టిన విషయం ప్రజలకు తెలుసన్నారు. 

 

20:50 - October 15, 2017

నాగర్‌కర్నూల్ : జిల్లాలో కల్వకుర్తి ప్రాజెక్టు నీటిని మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడిన హరీశ్‌...కాంగ్రెస్‌ నేతలపై నిప్పులు చెరిగారు. 30 ఏళ్లలో వారు చేయలేనిది..మూడేళ్లలో తాము చేయడంతో అసూయపడుతున్నారని విమర్శించారు. వారు కోర్టులను నమ్ముకుంటే.. తాము ప్రజలను నమ్ముకున్నామన్నారు. కల్వకుర్తి నియోజకవర్గానికి కృష్ణ జలాలు తీసుకురావడం ఎంతో ఆనందదాయకమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇది కల్వకుర్తి రైతుల 30 ఏళ్ల కల అని..పండుగలా జరుపుకోవాల్సిన రోజు అని అభివర్ణించారు. ఇక మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..కల్వకుర్తి ప్రాజెక్టుకు నీరు విడుదల చేయడంలో మంత్రి హరీష్‌రావు కృషి ఎంతో ఉందన్నారు. దీంతో రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. 

20:38 - October 13, 2017

హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, అటవీ, పర్యావరణ, వన్యప్రాణి అనుమతులు, పంప్ హౌజ్‌లు, కెనాల్స్‌తో పాటు ఇతర పనుల పురోగతిపై హరీష్‌రావు సమీక్ష నిర్వహించారు. 6 లక్షల 74 వేల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతి ఇంకా వేగంగా జరగాలని మంత్రి హరీష్‌రావు అన్నారు. 

 

18:21 - October 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల 23 లేదా 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. సమావేశ తేదీలను రేపటిలోగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేయనున్నారు. వివిధ అంశాలపై చర్చతో పాటు వివిధ బిల్లులను ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది. 8కిపైగా బిల్లులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పీడీ చట్ట సవరణ, గేమింగ్‌ చట్ట సవరణ తదితర బిల్లులు ఇందులో ఉండనున్నాయి. ముస్లిం బాలికలతో అరబ్‌ షేక్‌ల వివాహాలు, ఖాజీల కట్టడి కోసం చట్టం తీసుకొచ్చే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం అందుకు సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ప్రజా సమస్యలపై చర్చకు విపక్షాలు సమయం కోరితే గడువు పెంచేందుకు కూడా సిద్ధమని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. 

 

17:19 - October 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు టీప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 23 లేదా 25 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయి. ప్రజా సమస్యలపై చర్చకు ప్రతిపక్షాలు సమయం కోరితే సమావేశాలు పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. పేకాటపై పీడీ యాక్టు చట్టం తీసుకొస్తామని చెప్పారు.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:22 - October 5, 2017

నల్లగొండ : కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయాలన్న ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరంపై ఎన్జీటీ ఆదేశాలు తాత్కాలిక అడ్డంకేనని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో పర్యటించిన ఆయన కాళేశ్వరానికి స్టే ఇవ్వడం కాంగ్రెస్‌కు ఆనందంగా ఉందని ఎద్దేవా చేశారు. 

20:54 - October 4, 2017

సిద్దిపేట : గోదావరి జలాలు సిద్దిపేట జిల్లాను తాకాయి. తపాస్‌పల్లి రిజర్వాయర్‌ ఎడమ కాల్వ ద్వారా 20 గ్రామాలకు మంత్రి హరీష్‌రావు గోదావరి జలాలను విడుదల చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు హరీశ్. 

సిద్దిపేట జిల్లాలో తొలిసారిగా గోదావరి జలాలు ప్రవేశించాయి. తపాస్‌ పల్లి రిజర్వాయర్ ఎడమ కాల్వ ద్వారా సిద్దిపేట, కొండపాక మండలాల్లోని 20 గ్రామాలకు గోదావరి జలాలను మంత్రి హరీష్‌రావు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కలెక్టర్ వెంకట్రాం రెడ్డి పాల్గొన్నారు. 

సిద్దిపేట జిల్లాను గోదావరి జలాలు ముద్దాడటం చరిత్రలో నిలిచిపోయే రోజన్నారు మంత్రి హరీష్‌రావు. 2001లోనే ఈనీరు రావాల్సి ఉన్నా అప్పటి టీడీపీ ప్రభుత్వం అడ్డుపడి రానివ్వకుండా చేసిందని ఆరోపించారు. కొండపాక ప్రజలు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నట్లే.. కెనాల్‌ను కూడా తెచ్చుకున్నారని హరీష్‌రావు అన్నారు. 

అదే విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సైతం సింగూర్ నుంచి 40 వేల ఎకరాలకు నీళ్లిచ్చే భాగ్యం కలిగిందన్నారాయన. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏ ప్రభుత్వం కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు నీరిచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ఆదేశాలతో సింగూరు ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసినట్లు హరీష్‌రావు చెప్పారు. సాగునీటి ప్రాజెక్టు విడుదల పనులు ప్రారంభించే అవకాశం తనకు సీఎం కేసీఆర్ ఇచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నట్లు హరీష్‌రావు తెలిపారు. 

17:51 - October 4, 2017

సిద్దిపేట : గోదావరి నీళ్లు మొదటిసారి సిద్దిపేట జిల్లాను ముద్దాడాయని.. ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజన్నారు మంత్రి హరీష్‌రావు . సిద్దిపేట జిల్లా తపాస్‌పల్లి రిజర్వాయర్ ఎడమకాల్వ ద్వారా సిద్దిపేట, కొండపాక మండలాల్లోని 20 గ్రామాలకు ఈరోజు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాజరయ్యారు. 2001లోనే కొండపాక మండలానికి 9 వేల ఎకరాలకు నీరు రావాల్సి ఉండగా అప్పటి టీడీపీ ప్రభుత్వం నిలిపివేసిందని హరీష్‌ రావు అన్నారు. ఈరోజు ఆ నీరు కొండపాక మండలాల్లో ప్రవహిస్తోందని తెలిపారు. 

 

07:16 - October 3, 2017

భూపాలపల్లి : గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ పాలకులు మధ్యలోనే వదిలేసిన ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తోందని నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు అన్నారు. భూపాలపల్లిజిల్లా వెంకటాపూర్‌ మండలంలో పాలెం ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 10వేల 132 ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మలనాగేశ్వరరావు, ఇరిగేషన్‌ అధికారులు కూడా పాల్గొన్నారు.

07:13 - October 3, 2017

ఖమ్మం : జిల్లాలో పాలేరు పాత కాల్వ... కొత్త కాలువగా జీవం పోసుకుంది.. రికార్డ్‌ స్థాయిలో నాలుగు నెలల్లోనే ఆధునికీకరణ పనులు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్‌ నుంచి మంత్రి హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు నీటిని విడుదల చేశారు. పాలేరు పాత కాల్వ ప్రాజెక్ట్‌తో 25 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. కూసుమంచి మండలంలోని ఆయకట్టు రైతుల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం 2017 ఫిబ్రవరి 16న పాలేరు ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు 64 కోట్ల నిధులను మంజూరు చేసింది. 20 నెలల్లో కావాల్సిన ప్రాజెక్ట్‌... నాలుగు నెలల్లోనే ప్రాజెక్ట్‌ సిద్ధమైంది. దీంతో... సోమవారం మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావులు ప్రాజెక్ట్‌ను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ మేరకు అధికారులను, కాంట్రాక్టర్‌ను మంత్రులు అభినందించారు.

పాలేరు పాత కాలువను గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని.. మంత్రి హరీశ్‌ రావు అన్నారు. కేవలం నాలుగు నెలలకే ఆధునికీకరణ పనులు పూర్తి చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని ఆయన అన్నారు. ఇక్కడ రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం ప్రాజెక్ట్‌ ఆధునికీకరణ పూర్తి చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నాలుగు మాసాల్లోనే పనులు పూర్తి చేయడం కొత్త రికార్డ్‌ అని ఆయన అన్నారు. పాత కాలువ ప్రాజెక్ట్‌ నిర్మించి 95 సంవత్సరాలు కావడంతో... ప్రాజెక్ట్ శిథిలాస్థకు చేరుకుంది. కాలువ సామర్థ్యం 250 క్యూసెక్కులైతే, శిథిలావస్థకు చేరడంతో కేవలం రెండు వందల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే గండి పడే పరిస్థితి ఉండేది. ఇంజనీరింగ్ అధికారులు, అటు సిబ్బంది, కార్మికులు రేయింబవళ్లు పని చేసి...నాలుగు నెలల్లోనే ప్రాజెక్ట్‌కు జీవం పోశారు. ఈ ఆధునికీకరణతో చివరి ఆయకట్టు వరకూ నీళ్లు అంది.. రైతుల కష్టాలు తీరనున్నాయి.

Pages

Don't Miss

Subscribe to RSS - minister harish rao