modi

20:38 - October 15, 2018

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీపై కవాతు అనంతరం బహిరంగ సభలో ప్రసంగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు, మోదీ.. ఏపీని దారుణంగా మోసగించారని పవన్ ఆరోపించారు. 

ఏపీలో జరుగుతున్న దోపిడీలు, దారుణాలపై సీఎం చంద్రబాబు మాట్లాడలేకపోతున్నారని, ఆయన తన పద్ధతి మార్చుకోవాలని పవన్ సూచించారు. ఏ విషయంలోనూ చంద్రబాబు తనను సంప్రదించలేదని, చంద్రబాబు అవినీతిపై మాట్లాడితే ఉన్నపళంగా తాను మారిపోయానని అంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా మౌలిక సదుపాయాలు లేవని, విజన్ 2020లో చెప్పిన రెండు కోట్ల ఉద్యోగాలు, రోడ్లు ఎక్కడ ఉన్నాయని పవన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా జన్మభూమి కమిటీలు దోచుకుంటున్నాయని, అవి జన్మభూమి కమిటీలా? గూండా కమిటీలా? అంటూ టీడీపీ నేతలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

2014లోనే తమ పార్టీకి బలం ఉందని, అయినప్పటికీ ఓట్లు చీల్చి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయడం ఇష్టం లేకనే పోటీ చేయలేదని పవన్ వెల్లడించారు. చంద్రబాబుకు మద్దతుగా నిలిచినా ఎటువంటి పదవులూ ఆశించలేదన్నారు. రాష్ట్రానికి మంచి పాలన ఇవ్వాలని మాత్రం నాడు చంద్రబాబును కోరానని పవన్ గుర్తుచేసుకున్నారు. జనసేన పార్టీ భవన నిర్మాణానికి కూడా అనుమతి ఇవ్వలేదని, టీడీపీ పల్లకీని తమ పార్టీ ఎప్పుడూ మోస్తూనే ఉండాలా? అని పవన్ నిలదీశారు.

15:07 - October 11, 2018

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీకి తీరని అన్యాయం చేసినా.. ప్రధాని మోదీని వైఎస్ జగన్ ఒక్క మాట కూడా అనడం లేదని, బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న కారణంగానే జగన్ నోరు మెదపడం లేదని సీఎం చంద్రబాబు ఆరోపిస్తుంటే.. వైసీపీ నాయకులు అంతే ధీటుగా బదులిస్తున్నారు. బీజేపీతో కలిస్తే మాపై కొత్తగా ఈడీ కేసులు ఎందుకు పెడతారని? వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అసలు జాతీయ పార్టీలతో కలవాల్సిన అవసరం తమకు లేదన్నారాయన. ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడిన వైవీ సుబ్బారెడ్డి.. తమ రాజీనామాలపై మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. 

వంగవీటి రాధా ఎపిసోడ్‌పైనా వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వంగవీటి రాధా వైసీపీలోనే ఉన్నారని చెప్పారు. పార్టీ గెలుపు కోసం కొన్ని మార్పులు జరుగుతుంటాయన్నారు. ఇక 2019 ఎన్నికల్లో నేను ఒంగోలు నుంచే పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి.. తన పోటీపై అధినేత జగన్ నిర్ణయమే ఫైనల్ అవుతుందన్నారు.

08:48 - October 11, 2018

ఢిల్లీ: నోరు జారడం ఆ తర్వాత నాలిక కరుచుకోవడం.. మన రాజకీయ నాయకులకు కామనే కదా. ఆవేశంలో ముందూ వెనకా ఆలోచన చేయకుండా ఏదో ఒకటి మాట్లాడేస్తారు. ఆ తర్వాత వివాదాస్పదం కావడంతో మళ్లీ మాట మారుస్తారు. బీజేపీ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విషయంలోనూ ఇదే జరిగింది. సొంత పార్టీ నేతల నుంచి వచ్చిన విమర్శల ఫలితమో.. తన తప్పు తెలుసుకున్నారో... కానీ.. ఇప్పుడు ఆయన మాట మార్చారు. అసలు నేను అలా అనలేదు అని చెబుతున్నారు.

వివరాల్లో వెళితే.. 2014 పార్లమెంటు ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నో అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చామని, ప్రజలు ఇప్పుడు వాటిని గురించి అడుగుతుంటే సమాధానం చెప్పలేక పారిపోతున్నామని వ్యాఖ్యానించి ఎన్డీయే సర్కారును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇరుకునపడేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు బీజేపీకి షాక్ ఇచ్చాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ బీజేపీని ఇబ్బందులకు గురి చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, కాంగ్రెస్ విరుచుకుపడేలా ఆయన అస్త్రాన్ని అందించారని బీజేపీ నేతలు వాపోయారు. దీంతో నితిన్ గడ్కరీ మాటమార్చారు. 

తాను మరాఠీలో ఇచ్చిన ఇంటర్వ్యూను అర్థం చేసుకుని విమర్శలు చేయడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరాఠీ భాషను ఎప్పుడు నేర్చుకున్నారని నితిన్ గడ్కరీ ప్రశ్నించారు. ఆ ఇంటర్వ్యూలో తాను మోదీ పేరెత్తలేదని, ప్రజల ఖాతాల్లో ఎన్నడూ రూ. 15 లక్షలు వేస్తామని చెప్పలేదని ఆయన వివరణ ఇచ్చారు. నేను చెప్పింది ఒకటైతే, మీడియాలో ప్రసారమైంది మరొకటని నితిన్ పేర్కొన్నారు.

తన మరాఠీ ఇంటర్వ్యూపై మరింత వివరణ ఇచ్చిన గడ్కరీ, ఏడెనిమిది రోజుల క్రితం తాను ఇంటర్వ్యూ కోసం వెళ్లానని, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దేవేంద్ర ఫడ్నవిస్, గోపీనాథ్ ముండే ఇచ్చిన ఎన్నికల హామీల గురించిన ప్రస్తావన వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో అమలుకు సాధ్యం కాని ఎన్నికల హామీలు ఇవ్వొద్దని తాను అభ్యంతరం చెప్పానని, అటువంటి హామీల జోలికి వెళ్లవద్దని తాను వారిద్దరికీ సూచించిన విషయాన్ని గుర్తు చేశానని గడ్కరీ అన్నారు. నేను మాట్లాడిన మాటలను వక్రీకరించారని నితిన్ గడ్కరీ ఆరోపించారు.

16:02 - October 10, 2018

హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ ఆపద్ధర్మ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. నరేంద్ర మోదీ హవాలో కొట్టుకుపోతారనే భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని షా ఎద్దేవా చేశారు. కొడుకు లేదా కూతురినో సీఎంను చేయాలనేది కేసీఆర్ ఆశ అని.. కానీ కేసీఆర్ ఆశలు నెరవేరవని అమిత్ షా అన్నారు. ముందస్తు ఎన్నికల కారణంగా ప్రజలపై పడుతున్న ఆర్థికభారంపై కేసీఆర్ ఏం సమాధానం చెబుతారని షా ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు అమిత్ షా రంగంలోకి దిగారు. కరీంనగర్ లో బీజేపీ అధ్వర్యంలో జరిగే సమరభేరి సభలో అమిత్ షా ప్రసంగిస్తారు.

ఇవాళ హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా కు బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌లో ఎన్నికల సన్నాహక సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల బూత్ స్థాయి ఇంఛార్జ్‌లతో ఆయన చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడిన అమిత్ షా.. కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ‌పై మోడీ వివక్ష చూపుతున్నారని కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్ల కాలంలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన రూ.లక్షా 15వేల సంగతి కేసీఆర్ మరిచారా? అని నిలదీశారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తే బీసీలు నష్టపోతారని అమిత్ షా అన్నారు.

12:02 - October 10, 2018

ఢిల్లీ: రాఫెల్ డీల్.. దేశ రాజకీయాలను కుదిపేస్తున్న అంశం. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో దీనిపై మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాఫెల్‌ ఒప్పందానికి సంబంధించిన వివరాలు, ఈ ఒప్పందం కుదుర్చుకోవడంపై నిర్ణయం తీసుకున్న ప్రక్రియ గురించి పూర్తి వివరాలను సీల్డ్‌ కవర్‌లో ఈ నెల 29లోగా అందజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే విమానాల ధర, సాంకేతిక అంశాలకు సంబంధించిన వివరాలు అవసరం లేదని కోర్టు వెల్లడించింది. దేశ రక్షణ అంశమైనందున వ్యయాల విషయాన్ని అడగబోమని కోర్టు స్పష్టం చేసింది.

‘మేము కేంద్రానికి నోటీసులు జారీ చేయడం లేదు. పిటిషనర్ల వాదనలు పరిగణలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేస్తున్నాం. వారి వాదనలు ఆమోదయోగ్యంగా లేవు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. అయితే రాఫెల్ ఒప్పంద నిర్ణయం ఏ విధంగా తీసుకున్నారో తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. 

భారత్‌-ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. రూ.59వేల కోట్లతో 36యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రెంచ్ ఏరోస్పెస్ కంపెనీ డసాల్డ్ ఏవియేషన్ కంపెనీతో చేసుకున్న ఒప్పందంలో అవకతవకలు జరిగాయని పిటిషనర్‌ ఎంఎల్‌ శర్మ వాదించారు. ఈ కేసు జాతీయ భద్రతకు సంబంధించిందని, దీన్ని రాజకీయం చేస్తున్నారని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్‌ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై అక్టోబరు 31న విచారణ జరపనున్నట్లు కోర్టు తెలిపింది.

36 విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందని, ఇరు దేశ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 253 ప్రకారం పార్లమెంట్ ఆమోదం లేనందున, ఒప్పందాన్ని రద్దు చేయాలని న్యాయవాది తన పిటీషన్‌లో పేర్కొన్నారు.

రాఫెల్ ఒప్పందం భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన రక్షణ ఒప్పందం. భారత ఎయిర్‌ఫోర్స్ ఆయుధాల ఆధునికీకరణ ప్రక్రియలో భాగంగా భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందంలో 36 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కొనుగోలు చేయాలనేదే ఒప్పందం. రెండు ఇంజిన్ల మీడియం మల్టీ రోల్ కంబాట్ సామర్థ్యం కలిగిన రాఫెల్ విమానాలను ఫ్రెంచ్ ఏరోస్పెస్ కంపెనీ డసాల్డ్ ఏవియేషన్ తయారు చేసింది. ఇది 59వేల కోట్ల డీల్. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.

14:36 - October 5, 2018

విజ‌య‌వాడ‌: ఏపీలో టీడీపీ నేత‌లు టార్గెట్ గా జ‌రుగుతున్న ఐటీ దాడుల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. అందుబాటులో ఉన్న సీనియ‌ర్ నేత‌ల‌తో అత్యవ‌స‌రంగా స‌మావేశం అయిన సీఎం చంద్ర‌బాబు.. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై ఫైర్ అయ్యారు. ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల్లో ఐటీ, ఈడీ దాడులు చేయించ‌డం బీజేపీకి అల‌వాటేన‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. ఎన్ని కుట్ర‌లు చేసినా ఏపీని ఏమీ చేయ‌లేర‌ని వ్యాఖ్యానించారు. ఐటీ దాడుల నేప‌థ్యంలో పార్టీ నేత‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని చంద్ర‌బాబు సూచించారు. ఎటువంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సిద్థంగా ఉన్నామని...రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఏపీలోని త‌మ పార్టీ నాయకులకు చెందిన సంస్థలపై ఐటీ దాడుల వెనుక బీజేపీ హస్తం ఉంద‌ని ప‌లువురు టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు, వ్యాపార‌వేత్తలు, సీఎం చంద్ర‌బాబుకి స‌న్నిహితులైన బీదా సోద‌రులు, మంత్రి నారాయ‌ణకు చెందిన సంస్థ‌ల్లో ఐటీ అధికారులు సోదాలు చేప‌ట్టారు. ఈ  సోదాల్లో ఆ శాఖ అధికారులు కీలకమైన సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. సదరన్ డెవలపర్స్ ఆఫీసులో జరిపిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.ఈ డాక్యుమెంట్లు ఓ మంత్రికి సంబంధించినవిగా చెప్పుకుంటున్నారు. సదరన్ డెవలపర్స్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ పేరుతో ఒక సంస్థ అమరావతిలో భూ లావాదేవీలు జరిపినట్లు ఐటీ శాఖ గుర్తించిందని సమాచారం.

టీడీపీ నేతలపై మోదీ ప్రభుత్వం కక్షసాధిస్తోందని మంత్రి నారాయ‌ణ ఆరోపించారు. బీదా మస్తాన్ రావు సంస్థలపై ఐటీ దాడులు కుట్రపూరితమే అని ఆయ‌న  మండిపడ్డారు. తమిళనాడు, కర్ణాటకలో మాదిరిగా ఏపీపై కూడా పెత్తనం చేయాలని భావిస్తున్నారని మంత్రి నారాయణ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు

17:44 - September 3, 2018

ముంబై : కేంద్ర ప్రభుత్వంపై ప్రముఖ బాలీవుడ్ నటి సంచలన విమర్శలు చేశారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన వారు దేశాన్ని పాలిస్తున్నారంటూ బాలీవుడ్ ప్రముఖ నటి స్వర భాస్కర్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. పౌరహక్కుల నేత వరవరరావుతో పాటు మరికొందరిని కేంద్రం ప్రభుత్వం అరెస్ట్ చేయించిన విషయం తెలిసిందే. ఈ అరెస్టును ఖండించిన నటి స్వర భాస్కర్ కేంద్రంపై నిప్పులు చెరిగింది.

నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి వారి కేసుల్లో ఈ ప్రభుత్వం ఏం చేసిందంటు ప్రశ్నించింది. వేల కోట్ల ప్రజా ధనాన్ని దోచేసి..విదేశాలకు పారిపోతున్న వారిని ఏమీ చేయలేని ప్రభుత్వం..నిరు పేదల కోసం, వారి హక్కుల కోసం పోరాడుతున్న వారిని మాత్రం అరెస్టులు చేసి జైళ్లకు పంపిస్తోందని స్వరభాస్కర్ ఆవేదన వ్యక్తం చేసారు. కాగా ప్రధాని నరేంద్రమోదీ హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై ఇటీవల మహారాష్ట్ర పోలీసులు విరసం నేత వరవరరావుతోపాటు మరో నలుగురు హక్కుల నేతలను అరెస్ట్ చేసినన విషయం తెలిసిందే. 

15:10 - August 28, 2018

హైదరాబాద్ : విరసం నేత వరవరరావును అరెస్టు చేయడంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సమాచారం తెలుసుకున్న పలు ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. ఆయన అరెస్టును ఖండించాయి. ప్రధాన మంత్రి మోడీ హత్య కేసు కుట్రలో భాగంగా మంగళవారం పూణె పోలీసులు నగరానికి చేరుకుని వరవరావు నివాసంలో ఆయన కూతుళ్ల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. అనంతరం వరవరరావును విచారించిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు నిర్వహించిన అనంతరం పూణెకు తరలించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నాగోల్ లో జర్నలిస్టు క్రాంతిని కూడా పూణె పోలీసులు అరెస్టు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:22 - August 28, 2018

హైదరాబాద్ : నగరంలో మరోసారి కలకలం రేగింది. విరసం నేత వరవరరావు నివాసంపై పూణె పోలీసులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హత్య కుట్ర కేసుకు సంబంధించి పూణె పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. సుమారు ఎనిమిది గంటల పాటు విచారణ అనంతరం వరవరరావును అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు ఆయన నివాసం వద్దకు భారీగా చేరుకున్నాయి. పాలకుల వైఖరిని తీవ్రంగా నిరసించాయి. ఈ దాడిని ఖండిస్తున్నట్లు, మహారాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. మోడీని హత్య చేసేందుకు వరవరరావు ఫండింగ్ చేశారని అంటే నవ్వుతారని సంధ్య విమర్శించారు.

ఇదిలా ఉంటే వరవరరావును ఇంటి నుండి గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించనున్నారు. అనంతరం నాంపల్లి పీఎస్ లేదా పూణె పీఎస్ కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే వరవరరావు కూతుళ్ల నివాసాలపై కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయన అల్లుడు ఇఫ్లూ ప్రోఫెసర్ సత్యనారాయణ నివాసంలో సోదాలు చేశారు. అలాగే జర్నలిస్టు క్రాంతి నివాసంపై కూడా సోదాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ల్యాప్ టాప్, పుస్తకాలు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి మూడు నెలల క్రితం మావోయిస్టుల కుట్ర బయటపడింది. గతంలో అరెస్ట్ చేసిన రోనాల్డ్ విల్సన్ ల్యాప్ టాప్ లో దొరికి లేఖ ఆధారంగా.. ప్రధాని హత్యకు మావోయిస్టులు కుట్ర చేసినట్టు పూణే పోలీసులు దర్యాప్తులో తేల్చారు.  ప్రస్తుతానికి సంబంధించిన ఈ ఘటనలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

20:43 - August 2, 2018

దళితాగ్రహానికి కేంద్రం దిగి వచ్చింది. మరో విడత ఆందోళనల అగ్గి రాజుకోకముందే జాగ్రత్త పడింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని తీర్మానించింది. ఈ చట్టం మునుపటిలాగా కఠినంగా, పటిష్టంగా ఉండేలా చూడాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై మోడీ సర్కార్ కు ఉన్న కమిట్ మెంట్ ఎంత ? ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ, కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కుమార్, సామాజిక విశ్లేషకులు ప్రొ. శ్రీపతిరాముడు పాల్గొని, మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని 9వ షెడ్యూల్ లో చేర్చాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Pages

Don't Miss

Subscribe to RSS - modi