Modi government

13:18 - August 14, 2018
13:14 - August 14, 2018

ఢిల్లీ : భారత దేశం 72వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఆగస్టు 15 వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా.. రాష్ర్ట ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. దేశ రాజధానిలోని ఎర్ర కోటలో స్వతంత్ర దినోత్సవ వేడుకల రిహార్సల్స్‌ పూర్తయ్యాయి. ఎన్డీఏ పాలనలో ప్రధాని మోదీ ఐదోసారి ఎర్రకోటపై నుంచి త్రివర్ణపతాకం ఎగురవేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని కీలక ప్రసంగం చేయనున్నారు.

72 స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం
దేశ రాజధానిలో 72వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ప్రధాని మోదీ ఎర్రకోటలో ఐదోసారి త్రివర్ణ పతాకం ఎగరేయనున్నారు. బుధవారం ఉదయం 7గంటలకు ముందుగా ఎర్రకోటపై త్రివర్ణపతాకం రెపరెపలాడబోతోంది. బ్రిటీష్‌ పాలన నుంచి పోరాడి సాధించుకున్న స్వతంత్రానికి గుర్తుగా మన తొలిప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ మొదలుకుని ఇప్పటి ప్రధాని మోదీ వరకూ ఎర్రకోటపై జెండా ఎగురేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అలాగే.. షాజహాన్‌ 16వ శతాబ్దంలో నిర్మించిన ఎర్రకోటలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సైతం ఆనవాయితీగానే వస్తోంది. ఈ సారి జరుపుకోనున్న వేడుకలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు, ప్రజలు కూర్చునేందుకు ఎర్రకోట ప్రాంగణంలో వేలాది కుర్చీలను ఏర్పాటు చేశారు.

ఉగ్రవాద దాడులతో భద్రత కట్టుదిట్టం
గతంలో ఎన్నడూ లేనంత ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. సందర్శకుల కోసం ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. వేడుకల్లో పొరపాట్లు జరగకుండా ఉండేందుకు.. ముందస్తుగా సోమవారం రిహార్సల్‌ పరేడ్‌ నిర్వహించారు. ఉగ్రవాద దాడులు జరగవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో.. ఎర్రకోటలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే దేశ రాజధానిలోకి అనుమతిస్తున్నారు. పదివేల మందికి పైగా బలగాలు, ఢిల్లీ పోలీసులు సహా కేంద్ర భద్రతా దళాలు సహస్ర్త సీమా బల్, నే,నల్‌ సెక్యూరిటీ గార్డ్స్, సీఐఎస్ఎఫ్, బీఎస్‌ఎఫ్ దళాలు ఎర్రకోట చుట్టూ పహారా కాస్తున్నాయి.

1800 ప్రదేశాలు మూసేవేత
రెండు కోట్ల రూపాయల విలువైన రెండు హై రిజల్యూషన్‌ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. చిన్న గదులు, కిటికీలతో సహా 18వందల ప్రదేశాలను మూసేశారు. మొత్తం 600 సీసీ కెమెరాలతో పర్యవేక్షించిస్తున్నారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లోనే 115 కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రధాని ఎర్రకోటకు వచ్చే మార్గంలో 50 పీసీఆర్‌ వాహనాలను గస్తీ కాస్తున్నాయి. డాగ్‌స్క్వాడ్‌ బృందాలు కోటలో ప్రతి అంగుళాన్ని తనిఖీ చేస్తున్నారు. అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఎర్రకోటలోకి అనుమతించేలా బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీ యంత్రాలను ఏర్పాటు చేశారు.

పారాగ్లైడింగ్‌ బెలూన్లు ఎగరేయడంపై నిషేధం
ఎర్ర కోట చుట్టుపక్కల నివసించే వారితోపాటు.. కొత్తగా వచ్చిన వారు, అనుమానితుల వివరాలు సేకరించి పర్యవేక్షిస్తున్నారు. పారాగ్లైడింగ్‌ బెలూన్లు ఎగరేయడాన్ని నిషేధించారు. ఎత్తైన భవనాలపైనా సాయుధ దళాలు, స్నైపర్లను ఏర్పాటు చేశారు. 400 షార్ప్‌షూటర్స్‌ ఎత్తైన భవనాల నుంచి నిఘా నేత్రంతో భద్రతను పర్యవేక్షించనున్నారు. ప్రధాని నివాసం నుంచి ఎర్రకోట వరకూ సీసీ కెమెరాలతో ప్రధాని భద్రతను పర్యవేక్షించనున్నారు. ఢిల్లీలోని వివిధ పాఠశాలల నుంచి ఏడు వందల మంది ఎన్‌ సీసీ కేడెట్లు, ప్రభుత్వ పాఠశాలలనుంచి మూడువేల మంది విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. వారిలో ఐదు వందల మంది విద్యార్థినులు జాతీయ గీతాన్ని ఆలపించనున్నారు.

ఓల్డ్‌ ఢిల్లీలోని రోడ్లపై ఆంక్షలు
దేశ రాజధానిలోని కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. 14వతేదీ సాయంత్రం 5గంటల నుంచి.. 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకూ మెట్రో స్టేషన్లలో పార్కింగ్‌ రద్దు చేశారు. లుటైన్‌రోడ్డు, చాందినీచౌక్‌ మార్గ్‌, తిలక్‌ మార్గ్, మథుర రో్డు, బదూర్‌ షా జఫర్‌ మార్గ్‌, సుభాష్‌ మార్గ్‌, జవహర్‌ లాల్‌ మార్గ్‌, రింగ్‌రోడ్డు సహా.. ఓల్డ్‌ ఢిల్లీలోని రోడ్లపై ఆంక్షలు విధించారు.

పంద్రాగస్టు వేడుకలను రాజీకీయంగా ఉపయోగించుకోనున్న ప్రధాని మోదీ
ఐదేళ్ళ ఎన్డీయే పాలన చివరి దశలో ఉన్న నేపథ్యంలో.. ప్రధాని మోదీ ఈ వేడుకలను రాజకీయంగా ఉపయోగించుకోనున్నారు. ఎన్డీయే వైఫల్యాలను మరిపించేందుకు.. కొత్తగా ప్రజాకర్షక పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. నల్లధనం వెలికితీత, ఉద్యోగ కల్పన, విద్య, పేదరిక నిర్మూలన, రైతులను ఆదుకుంటామనడం వంటి అనేక అంశాల గురించి ఎన్ని చెప్పినా.. అవేవీ అమలుకు నోచుకోలేదు. నాలుగేళ్ళ నుంచి ఎర్రకోట వేదికగా ఇచ్చిన హామీలు అమలు కాని నేపథ్యంలో.. ఈ సారి మోదీ మాటలు నమ్ముతారా అన్నది ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది.

ప్రధాని ప్రసంగంపై ఆసక్తి..
ఎర్రకోటనుంచి చేసే ప్రసంగంలో ప్రధాని ఏఏ అంశాలను ప్రస్తావిస్తారా అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. ఎలాంటి అంశాలు ఉండాలో ఇప్పటికే ప్రజల సలహాలనూ కోరారు మోదీ. కానీ చాలా వరకూ.. దేశంలో దళితులపై జరుగుతున్న మూక దాడులపై మాట్లాడాలని నెటిజన్లు కోరారు. నాలుగేళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చునే ప్రయత్నం చేస్తారా.. లేక మరో సారి అమలు కాని హామీలతో.. రాజకీయ భవిష్యత్తుకు పనికొచ్చే ఉపన్యాసాలిస్తారో చూడాలి.. 

11:34 - August 11, 2018

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వానికి దగ్గరయ్యేందుకు టీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. కేంద్రం తీసుకునే నిర్ణయాలకు మద్దతు తెలుపుతున్నా.... అక్కడి నుంచి ఎలాంటి సపోర్ట్‌ లభించడం లేదు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ బంధం బలపడుతుందని అందరూ భావిస్తున్నా..... కేంద్రం మాత్రం ఏమీ తేల్చడం లేదు. చివరికి బైసన్‌పోలో గ్రౌండ్‌ విషయంలో కేంద్రం నాన్చుడు ధోరణే అవలంభిస్తోంది. 
రూటు మార్చిన టీఆర్‌ఎస్‌  
విభజన హామీల అమలుకు కేంద్రం ప్రభుత్వంపై విరుచుకుపడ్డ టీఆర్‌ఎస్‌ రూటు మార్చింది. కేంద్ర ప్రభుత్వంతో దగ్గరయ్యేందుకు ప్రయత్నించింది.  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అయినా జాతీయ స్థాయి రాజకీయాలపై ఆసక్తితో సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా వేదిక ఏర్పాటు చేసే ప్రయత్నాలను కూడా చేశారు.  కానీ ఇటీవల కేసీఆర్‌ అనుసరిస్తున్న విధానాలు మాత్రం బీజేపీకి సన్నిహితంగా టీఆర్‌ఎస్‌ ఉంటుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మొన్న జరిగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో... ఏన్డీఏ మద్దతు ఇచ్చిన అభ్యర్థికే టీఆర్‌ఎస్‌ కూడా సపోర్ట్‌ చేసింది.  దీంతో బీజేపీకి గులాబీ పార్టీ మరింత దగ్గరయ్యిందన్న విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిది.
తెలంగాణ సర్కార్‌ ప్రతిపాదనలకు నో గ్రీన్‌సిగ్నల్‌
టీఆర్‌ఎస్‌ కేద్ర ప్రభుత్వానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి గులాబీ పార్టీ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వకపోవడాన్ని  గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని తేల్చిచెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చి నాటి నుంచి రక్షణశాఖ భూములను , రా ష్ట్రప్రభుత్వానికి కేటాయించాలని కోరుతోంది.  ఆ భూములలో సచివాలయంతోపాటు మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకుంది. నాలుగేళ్లుగా ఈ వ్యవహారాన్ని కేంద్రం తేల్చలేకపోతోంది. బెంగళూరులో రక్షణ శాఖ భూములను కర్నాటక ప్రభుత్వానికి కేటాయించడం, తెలంగాణలో కేటాయించకపోవడం దేనికి సంకేతాలన్న ప్రశ్నలు అధికారపార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి. కేంద్రంతో సయోధ్యగా వ్యవహరించినా... అనుకున్న స్థాయిలో సహకారం అందడంలేదన్న అభిప్రాయాన్ని గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా విభజన హామీలు కూడా పూర్తిస్థాయిలో అమలుకాకపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమన్న వాదనను వారు తెరపైకి తీసుకొస్తున్నారు.

 

13:46 - August 9, 2018

విజయవాడ : రైతాంగ కార్మిక సమస్యలు పరిష్కరించాలంటూ సీఐటీయూ,  రైతుకూలీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జైల్‌ భరో నిర్వహించారు. విజయవాడ ధర్నా చౌక్‌ సెంటర్‌లో నిర్వహించిన జైల్‌ భరో కార్యక్రమంలో రైతాంగ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనిన నిరసన వ్యక్తం చేశాయి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదాయం పెంచుతామన్న మోదీ ..పూర్తిగా విఫలమయ్యారని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకులు శ్రీనివాస్‌ విమర్శించారు.

07:05 - August 3, 2018

ఢిల్లీ : దేశంలోని ముస్లింలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని లోక్‌సభలో ఎంఐఎం సభ్యులు అసదుద్దీన్‌ ఓవైసీ ఆరోపించారు. ముస్లింలు అన్ని రంగాల్లోనూ వెనకబడి ఉన్న ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని ఓవైసీ డిమాండ్‌ చేశారు. ఒకవేళ మరాఠాలు, పటేల్‌, గుజ్జర్లు, జాట్‌ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తే ముస్లిం సామాజిక వర్గానికి కూడా రిజర్వేషన్లు కల్పించాలి ఆయన స్పష్టం చేశారు.

07:03 - August 3, 2018

ఢిల్లీ : ఎస్‌సి ఎస్‌టి యాక్ట్‌ సవరణ బిల్లుపై లోక్‌సభలో రగడ జరిగింది. గత నాలుగు నెలలుగా ఈ బిల్లుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ ఎందుకు తీసుకురాలేదని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ బిల్లును రేపే ప్రవేశపెట్టండి...అందరం కలిసి బిల్లును పాస్‌ చేయిద్దామని ఖర్గే అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి బిల్లుకు మోది క్యాబినెట్‌ బుధవారమే ఆమోదం తెలిపిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొద్దిసేపు సభలో గందరగోళం నెలకొంది. వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెడతామని హోంమంత్రి పేర్కొన్నారు. 

10:23 - August 2, 2018

ఢిల్లీ : కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకొనేలా చొరవ తీసుకోవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కోరినట్లు ఏపీ టిడిపి ఎంపీ రమేశ్ పేర్కొన్నారు. గురువారం ఉదయం వెంకయ్య నాయుడిని ఏపీ టిడిపి ఎంపీలు, కడప జిల్లా ప్రజాప్రతినిధులు కలిశారు. కడప స్టీల్ ప్లాంట్ పై ఉప రాష్ట్రపతికి వినతిపత్రం అందచేశారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని రాష్ట్రపతిని వీరు కలిసిన సంగతి తెలిసిందే. అనంతరం సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ...ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ తాను దీక్ష చేయడం జరిగిందని, కానీ కేంద్రం స్పందించలేదని ఉప రాష్ట్రపతికి తెలియచేసినట్లు తెలిపారు. దీనితో ముఖ్యమంత్రి వచ్చి కొన్ని ఆప్షన్ వెల్లడించారని, కానీ ఉభయసభల్లో కేంద్రం ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదని పేర్కొన్నట్లు తెలిపారు. 

07:33 - August 2, 2018
21:13 - August 1, 2018

అనంతపురం : అభివృద్ధి నిరోధక వైసీపీ, జనసేన, బీజేపీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ మూడు పార్టీల నేతలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. సహాయ నిరాకరణతో ప్రధాని మోదీ ఏపీకి అన్యాయం చేస్తుంటే... కేసులతో వైసీపీ ప్రగతికి అవరోధంగా మారిందని విమర్శించారు. అసత్య ఆరోపణలతో జనసేన ప్రజలను రెచ్చగొడుతోందని అనంతపురం జిల్లా పేరూరు గ్రామదర్శిని సభలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. రామగిరి మండలం పేరూరులో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. పేరూరు ప్రాజెక్టుకు నీరు తరలించే కాల్వ నిర్మాణానికి భూమి పూజ చేసిన చంద్రబాబు.. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. చంద్రన్న బీమా పథకం కింద చెక్‌లు అందచేశారు. వివిధ పథకాల కింది  లబ్ధిదారులకు ఆస్తులను పంపిణీ చేశారు. 

పేరూరు గ్రామదర్శిని సభలో ప్రసంగించిన చంద్రబాబు... ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్‌పై విరుచుకుపడ్డారు. అవినీతిపరుల ఆస్తులు జప్తు చేస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రధాని... ఇప్పుడు వైసీపీ వంటి అవినీతి పార్టీలకు అండగా నిలుస్తున్నారని విరుచుకుపడ్డారు. 

విభజనతో నష్టపోయిన ఏపీని అన్ని విధాల ఆదుకుంటానని హామీ ఇచ్చిన మోదీ... ఇప్పుడు అడ్డం తిరిగడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పాలనలో దేశంలో మహిళలు, మైనారిటీలు సహా ఏ వర్గానికి రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయ లబ్ధి కోసమే అసోంలో జాతీయ పౌర రిజిస్టర్‌ నుంచి 40 లక్షల మంది పేర్లు తొలగించారని విమర్శించారు. 

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడమని అడిగితే ప్రధాని మోదీ బెదిరింపులకు దిగుతున్నారని చంద్రబాబు విమర్శించారు. హుందాగా ప్రవర్తించాల్సిన మోదీ... స్థాయి మరిచి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో పలు గ్రామాలకు రోడ్లు, ఎన్టీఆర్‌ ఇళ్లు చంద్రబాబు మంజూరు చేశారు. 

 

19:33 - August 1, 2018

ఢిల్లీ : విభజన హామీలు.. ముఖ్యంగా కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం.. తెలుగుదేశం నేతలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. పార్లమెంటు లోపలా, బయటా ఆందోళనలు సాగిస్తూనే.. రాష్ట్రపతి దృష్టికీ ఈ అంశాన్ని తీసుకు వెళ్లారు. ఇంకోవైపు.. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీతోనూ టీడీపీ నేతలు భేటీ అయి.. తమ డిమాండ్‌కు మద్దతును సమీకరించారు. 

విభజన హామీల సాధన దిశగా.. తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటివరకు పార్లమెంటు ప్రాంగణంతో పాటు ఉభయసభల్లో ఆందోళన కొనసాగిస్తున్న ఆ పార్టీ ఎంపీలు తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. సుజనాచౌదరి నేతృత్వంలోని బృందం.. రాష్ట్రపతిని కలిసి.. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకునేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఉక్కు కర్మాగారం ఆంధ్రుల మనోభావాలకు చెందిన అంశం కాబట్టి ఆ హామీ నెరవేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో.. టీడీపీ ఎంపీలు.. కేంద్ర ఉక్కు శాఖమంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌నూ కలిశారు. కడప జిల్లా నాయకులతో కలిసి.. టీడీపీ ఎంపీలు.. కేంద్ర మంత్రిని కలిశౄరు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

అటు పార్లమెంటు ప్రాంగణంలో.. బుధవారం కూడా టీడీపీ ఎంపీలు ఆందోళనను కొనసాగించారు. పార్లమెంటు గాంధీ విగ్రహం దగ్గర ఏపీకి న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. మరోవైపు.. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ ప్రజాకవి వేషధారణలో మోదీ వైఖరిపై మండిపడ్డారు. మాటలగారడీ.. వినయం పేరడీతో మోదీ ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. ఇంకోవైపు.. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీతోనూ.. టీడపీ ఎంపీలు సుజనాచౌదరి, కేశినేని నాని భేటీ అయ్యారు. పార్లమెంటులో ఆమెను కలిసి.. తమ ఆందోళనకు మద్దతును కోరారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - Modi government