nalgonda

14:45 - September 18, 2018

నల్గొండ : మిర్యాలగూడ పరువు హత్యకేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. హత్య కేసులో పురోగతి లభించింది. ప్రణయ్ హత్యలో కీలక నిందితుడు శర్మగా పోలీసులు గుర్తించారు. శర్మ స్వస్థలం బీహార్ లోని సంస్థాపూర్‌లో అతన్నిఇవాళ తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. శర్మను బీహార్ నుంచి నల్గొండకు తరలిస్తున్నారు. ఈరోజు నిందితున్ని రిమాండ్ చేస్తామని జిల్లా ఎస్పీ రంగనాథ్ చెబుతున్నారు. హత్య చేసేందుకు కోటికి పైగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. 

 

11:51 - September 18, 2018

నల్గొండ : మిర్యాలగూడ పరువు హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హంతకుడు అబ్దుల్‌ బారీ కోసం నాలుగు బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు. హత్యకు ముందు మిర్యాలగూడ పట్టణంలోనే బారీ బస చేసినట్టు తెలుస్తోంది. బారీకి షెల్టర్‌ కరీం ఇచ్చాడు. ప్రణయ్ఇంటికి కూతవేటు దూరంలోనే కరీం నివాసం ఉంది. హత్య వివరాలను కాసేపట్లో ఎస్పీ ఎస్‌పీ రంగనాథ్‌  మీడియా ముందు వెల్లడించనున్నారు. 

 

17:31 - September 15, 2018

నల్గొండ : మిర్యాలగూడలో నిన్నజరిగిన యువకుడు ప్రణయ్ హత్య కలకలం సృష్టిస్తోంది. తన తండ్రే ప్రణయ్ ను హత్య చేయించారని ప్రణయ్ భార్య అమృత ఆరోపించారు. హంతకుడైన తన తండ్రిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. హత్యకు ముందు అనేక సార్లు రెక్కీ నిర్వహించారని పేర్కొన్నారు. తన భర్తను హత్య చేయిస్తాడని ఊహించలేదని వాపోయింది. 

మిర్యాలగూడలో ప్రణయ్ దారుణహత్యకు గురయ్యాడు. ఆరు నెలల క్రితం కోటీశ్వరుడైన మారుతిరావు కుమార్తె అమృతను ప్రణయ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి తండ్రి నుంచి ప్రాణహాని ఉందని గతంలో ప్రణయ్‌ పోలీసలకు కూడా ఫిర్యాదు చేశాడు. అయితే గర్భవతి అయిన భార్యను నిన్నఆస్పత్రికి తీసుకెళ్లి.. తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి ప్రణయ్‌పై కత్తులతో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన అతను మృతి చెందాడు.   

 

20:51 - September 14, 2018

నల్గొండ : జిల్లాలోని మిర్యాలగూడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు పెరమళ్ల ప్రణయ్‌గా గుర్తించారు. ఆరు నెలల క్రితం ప్రణయ్‌ ఓ కోటీశ్వరుడి కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి తండ్రి నుంచి ప్రాణహాని ఉందని గతంలో ప్రణయ్‌ పోలీసలకు కూడా ఫిర్యాదు చేశాడు. అయితే.. ఈరోజు గర్భవతి అయిన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి.. తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి ప్రణయ్‌పై కత్తులతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ప్రణయ్ అక్కడికక్కడే మృతి చెందారు. 

 

09:03 - September 9, 2018

నల్గొండ : నాగార్జున సాగర్ ను చూసేందుకు వెళ్తున్నారా ? అయితే మీరు కొత్త అనుభూతిని పొందుతారు. నాగార్జున సాగర్ కు వెళ్లే పర్యాటకులు కొత్త అనుభూతి పొందేలా...తెలంగాణ పర్యాటక శాఖ లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రతి ఒక్కరి జీవితంలో మధురానుభూతి కలిగించేలా ఈ లాంచీ ప్రయాణం ఉండనుంది. పర్యాటకానికి తోడు శ్రీశైలం మల్లికార్జునుడిని దర్శించుకునేలా ప్రత్యేక ప్యాకేజీని రూపొందించింది.

నాగార్జున సాగర్ పర్యాటకులు కొత్త అనుభూతి ఆస్వాదించేలా తెలంగాణ పర్యాటక శాఖ లాంచీ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. నాగార్జున సాగర్ నుంచి అధ్యాత్మిక కేంద్రమైన శ్రీశైలంకు లాంచీని ప్రారంభించింది. రెండు తెలుగు రాష్ట్రాలు, ఐదు జిల్లాల మీదుగా 110 కిలోమీటర్ల పాటు లాంచీ ప్రయాణం సాగనుంది. నల్లమల కొండల మధ్య సాగే లాంచీ ప్రయాణం....పర్యాటకులకు కొత్త అనుభూతి కలగనుంది. 

నాగార్జున సాగర్ ప్రాజెక్టు....నల్లమల జలాశయం అటవీ ప్రాంతం మధ్యలో విస్తరించి ఉంది. ప్రాజెక్ట్ నీటి మట్టం 570 అడుగులు దాటితేనే....శ్రీశైలంకు లాంచీ ప్రయాణానికి అణువుగా ఉంటుందన్న లక్ష్యంతో ముందు ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ తర్వాత పర్యాటకుల డిమాండ్ దృష్టిలో పెట్టుకొని మూడు ప్యాకేజీలను నిర్ణయించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్  నీటి మట్టం 585 అడుగుల మార్కు దాటడంతో...ట్రయల్ రన్ లేకుండానే తెలంగాణ పర్యాటక శాఖ యాత్రకు శ్రీకారం చుట్టింది. కృష్ణా నదిలో ఆరు గంటల పాటు సాగే యాత్రలో...అలలతో పోటీ పడుతూ లాంచీ యాత్ర సాగుతుంది. లాంచీయాత్ర మొత్తం నల్లమల అటవీ ప్రాంతంలోనే సాగడంతో...పర్యాటకులు ప్రకృతి అందాలను తిలకించేలా తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. 

12:17 - September 5, 2018

నల్గొండ : వైద్యం కోసం వెళ్లిన ఓ వ్యక్తికి మూత్రపిండంలో రాళ్లు ఉన్నాయని వైద్యులు కిడ్నీ తొలగించారు. పదేళ్ల క్రితం వ్యక్తికి నిర్వహించిన కిడ్నీ శస్త్రచికిత్స తాజాగా వివాదానికి కారణమైంది. మూత్రపిండంలో రాళ్లు ఉన్నాయని చెప్పిన వైద్యులు తనకు తెలియపరచకుండానే ఒక కిడ్నీని తొలగించారంటూ బాధితుడు ఆరోపిస్తున్నారు. దీనికి గాను తనకు పరిహారం చెల్లించాలంటూ బంధువులతో కలిసి ఆ ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆర్‌ఎంపీ వైద్యుడిని డిమాండ్‌ చేస్తూ డిండి మండల కేంద్రంలో ధర్నాకు దిగారు. 
వివరాల్లోకి వెళితే...
నాగర్ కర్నూలు జిల్లా వంగూర్‌ మండలం ఉమ్మాపూర్‌ గ్రామానికి చెందిన బన్నె బుచ్చయ్య పదేళ్ల క్రితం కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులను సంప్రదించగా కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చెప్పారు. అచ్చంపేట ఆస్పత్రిలో తీసిన ఎక్స్‌రేలను తమ ఊరి వాడు, డిండి మండల కేంద్రంలో ఆర్‌ఎంపీ వైద్యుడైన జిలానీకి చూపించగా ఆయన హైదరాబాద్ మలక్‌పేటలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. అక్కడ కుటుంబ సభ్యుల సమ్మతితో శస్త్ర చికిత్స చేసిన వైద్యులు తొలగించిన రాళ్లను చూపారని, అయితే మూత్రపిండం తొలగించినట్లు చెప్పలేదని బాధితుడు ఆరోపించారు. 3 నెలల కిందట మళ్లీ నొప్పి రావడంతో అచ్చంపేటలోని మరో ఆస్పత్రికి వెళ్లగా కిడ్నీ ఒకటి తొలగించి ఉన్నట్లు తెలిసిందని,  కల్వకుర్తి, హైదరాబాద్‌లలోని మరో 2 ఆస్పత్రులకు వెళ్లినా ఇదే విషయం చెప్పారన్నారు. దీంతో గ్రామస్థులు, బంధువులతో కలిసి బాధిత కుటుంబసభ్యులు నిన్న డిండిలోని ఆర్‌ఎంపీ వైద్యుడు జిలానీని నిలదీశారు. తనకేమీ తెలియదని జిలానీ జవాబివ్వటంతో అతని ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. నష్టపరిహారానికి డిమాండ్‌ చేశారు. స్థానిక నేతలు జోక్యం చేసుకొని ఆందోళనను విరమింపజేశారు. తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు.

07:41 - September 5, 2018

నల్గొండ : సాధారణంగా తాబేలు ఐదారు కిలోల బరువు ఉంటుంది. మీరేప్పుడైనా 60 కిలోల తాబేలు చూశారా? అయితే ఇప్పుడు చూడండి.. అడవిదేవులపల్లి మండల శివారులోని నాగార్జున సాగర్‌ టేల్‌పాండ్‌ వద్ద సుమారు 60 కిలోల భారీ తాబేలు లభ్యమైంది. దీనిని గమనించిన స్థానికులు తాబేలును తిరిగి నదిలోకి వదిలారు. ఇటీవల నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి కృష్ణా జలాలను విడుదల చేసిన విషయం విదితమే. నీటి విడుదల సమయంలో నదిలోని నీటి వేగానికి ఒక భారీ తాబేలు ఒడ్డుకు కొట్టుకొచ్చి బండరాళ్ల మధ్య చిక్కుకు పోయింది. గమనించిన స్థానికులు అతి కష్టం మీద దానిని నదిలోకి వదిలారు. ఇంత పెద్ద తాబేలును తామింత వరకు చూడలేదని వారు తెలిపారు. 

 

10:43 - September 1, 2018

నల్లగొండ : ఎగువ నుంచి వస్తున్న వరద నీరుతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లోకి నీరు రావటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ప్రాజెక్ట్‌ నిండటంతో తమకు రెండు పంటలకు నీరు అందుతుందని రైతులు భావిస్తున్నారు. దీంతో సాగర్ లో జలకళకు తమ ఇంటిలో పంటల శిరులు వెల్లివిరుస్తాయని రైతన్నలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

13:53 - August 31, 2018

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్‌ నేతలు ఆవేదనలో ఉన్నారని అందుకే వారు ఆవేదన సభ పెడుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానం సాధించడంతో సీఎం కేసీఆర్‌ ఘనత మరోసారి స్పష్టమైందని ఎంపీ అభిప్రాయపడ్డారు. ప్రగతినివేదన సభకు రైతు సమన్వయ సమితి సభ్యులందరూ తరలిరావాలని సూచించారు.

17:35 - August 21, 2018

నల్లగొండ : నాగార్జునసాగర్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ప్రస్తుతం శ్రీశైలంనుంచి 2లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతోంది. తాగునీటి అవసరాలకోసం కుడికాల్వకు, ఎఎమ్మార్సీకి కలిపి సుమారు 8వేల క్యూసెక్కుల నీరు డ్యామ్‌ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. చాలాకాలం తర్వాత డ్యామ్‌ కళకళలాడుతుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - nalgonda