nara Lokesh

13:35 - June 28, 2017

నెల్లూరు : నెల్లూరు జిల్లాలో వైసీపీకి మంచి బలం ఉంది. పటిష్టమైన క్యాడర్‌ ఉన్నా సమర్థవంతమైన లీడర్‌ లేనిలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్దన్‌రెడ్డి... పార్టీ శాసనసభ్యులు, నేతలు, కార్యకర్తలను కలుపుకొని వెళ్లలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి.నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఆరు చోట్ల వైసీపీ గెలుపొందింది. నెల్లూరు లోక్‌సభ స్థానం కూడా వైసీపీ ఖాతాలోనే ఉంది. మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కొన్ని చోట్ల నాయకత్వ లోపం కనిపిస్తోంది. ఎంపీ మేకపాటి ఎవరినీ కలుపుకుపోవడంలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. పైగా ఎంపీపై ప్రజల్లో వ్యతిరేకత ప్రబలిందన్న వాదనలు ఉన్నాయి. వచ్చే ఎన్నికలకు మేకపాటిని మార్చకపోతే వైసీపీ పరిస్థితి వేరుగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

జనంతో మమేకం
నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, సూళ్లూరుపేట స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై పోరాడుతూ, నిత్యం జనంతో మమేకమవుతున్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డిపై కొంత వ్యతిరేకత ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండరన్న అపవాదు ఎదుర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి బరిలో దిగితే మేకపాటి గౌతంరెడ్డి సరితూగరని పార్టీ నేతలే చెబుతున్నారు. ఆత్మకూరుకు కొత్త అభ్యర్థిపై పార్టీ నాయకత్వం దృష్టి పెట్టాలని కొందరు సూచిస్తున్నారు.

బలమైన అభ్యర్థిగా ప్రసన్నకుమార్‌
ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు వైపీసీ నాయకత్వం ప్రయత్నించాలని సూచిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డే సరైన వ్యక్తి అని భావిస్తున్నారు. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పోటీకి విముఖత చూపితే ఆత్మకూరులో వ్యతిరేకత ఎదుర్కొంటున్న మేకపాటి గౌతంరెడ్డిని మంచిదంటున్నారు. కోవూరు స్థానంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి బలమైన అభ్యర్థి అవుతారని చెబుతున్నారు. కొకపోతే ఆర్థికంగా కొంత బలహీనంగా ఉండటమే సమస్యగా భావిస్తున్నారు. సర్వేపల్లి అసెంబ్లీ స్థానంలో ప్రస్తుత ఎమ్మెల్యే కాకాని గోవర్దన్‌రెడ్డి ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో సోమిరెడ్డిపై కాకాని గెలుపొందారు. మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రోజురోజుకు ప్రజలకు చేరువు అవుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సోమిరెడ్డి వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి పోటీ చేస్తే, వైసీపీ అభ్యర్థిత్వాన్ని మార్చలన్న అభిప్రాయం పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి. గూడూరు వైసీపీ ఎమ్మెల్యే సునీల్‌ కుమార్‌ టీడీపీలో చేరిన తర్వాత ఈ నియోజకవర్గంలో నాయకత్వలోపం ఏర్పడింది. గూడూరు స్థానంలో వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న మురళీధర్‌ వచ్చే ఎన్నికల్లో పోటీకి పరిపోరని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో గత వెంకటగిరిలో ఓడిపోయిన కొమ్మి లక్ష్మయ్యనాయుడు వైసీపీకి దూరంగా ఉంటున్నారు. వెంకటగిరి ఇన్‌చార్జ్‌గా ఉన్న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. నాయకత్వ, సమన్వయ లోపాలను సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఢోకా ఉండదని విశ్లేషిస్తున్నారు. 

11:07 - June 28, 2017

చిత్తూరు : తిరుమల దేవస్థానంలో వచ్చే నెల7 నుంచి శుక్ర, శని, ఆదివారల్లో దివ్యదర్శనం టోకెన్ల జారీ నిలిపి వేయనున్నారు. కాలినడక భక్తులకు ఇస్తున్న ఉచిత అడ్డూల విధానం కొనసాగించనున్నారు. నడక దారిన భక్తులు ఎక్కువగా రావడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి..

 

 

13:18 - June 23, 2017

అవినీతి లేని పాలన సాగుతోంది..లంచం ఇవ్వకండి..అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం..టెక్నాలజీ సాయంతో అవినీతిని అరికడుతున్నాం..ఇవి పాలకులు చెబుతున్న మాటలు. మరి వాస్తవ పరిస్థితి కరెక్టుగానే ఉందా ? అంటే లేదనే సమాధానం వస్తోంది. ఎందుకంటే ఏపీలో జరుగుతున్న ఏసీబీ దాడుల్లో కోట్లు రాలుతున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు బయటపడుతుండడం విశేషం. గత కొన్ని రోజులుగా పలువురు అధికారులపై ఏసీబీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఉద్యోగి నుండి అధికారుల వరకు పట్టుబడుతుండడం గమనార్హం.

ప్రభుత్వ ఉద్యోగం..
చేసేది ప్రభుత్వ ఉద్యోగం..ప్రభుత్వం ఇచ్చిన జీతం తీసుకుంటూనే పలువురు అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. కోట్లు..ఆస్తులను వెనక్కి వేసుకుంటున్నారు. అవినీతి ఆరోపణలు బయటకు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగి వారి పని పడుతోంది. అది ఆర్ అండ్ బి శాఖ కావచ్చు..మున్సిపల్ శాఖ..రెవెన్యూ శాఖ...ఇలా ఏ శాఖలో చూసినా అవినీతి రాజ్యం ఏలుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ మోస్తారు ఉద్యోగి నుండి కీలక స్థానాల్లో ఉన్న వారు ఏసీబీకి పట్టుబడుతుండడం అవినీతి ఏ విధంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మీడియాలో వీరి ఆస్తులు..డబ్బులు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

కోట్లలో ఆస్తులు..
ఇటీవలే పలువురు అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. అక్రమాస్తుల విలువ చూసి ఏసీబీ అధికారులే షాక్ తింటున్నారంట. మొన్నటికి మొన్న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మహారాణి సత్రంలో ఏసీబీ అధికారులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఏపీ ఇండస్ట్రియల్ అడిషనల్ డైరెక్టర్ సురేష్ బాబు ఇంటిపై కూడా ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ దాడులు తీవ్ర కలకలం సృష్టించాయి. హైదరాబాద్లో 5 చోట్ల, విజయవాడ, గుంటూరు, కర్నూల్లో ఏసీబీ సోదాలు చేసింది. రూ. 40 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించారని, మొత్తం రూ. 100 కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టారని మీడియాలో ప్రచారం జరిగింది. అంతేగాకుండా పలు చెక్ పోస్టులపై కూడా ఏసీబీ అధికారులు దాడులు జరిపి అవినీతికి పాల్పడుతున్న వారికి చెక్ పెట్టింది. వీరి దాడుల్లో నగదు..విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకొంటోంది. గాజువాక సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకయ్యనాయుడు ఇంటిపై ఏసీబీ అధికారులు చేసిన దాడుల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయని వార్తలు వెలువడ్డాయి. వెంకయ్యపై ఆరోపణలు రావడంతో దాడులు చేసిన ఏసీబీ సోదాల్లో సుమారు రూ. 50 కోట్లకు పైగా అక్రమాస్తులున్నట్లు గుర్తించారు.

తాజాగా...
ప్రజా ఆరోగ్య చీఫ్ ఇంజనీర్ పాము రంగారావు ఇంటి పై శుక్రవారం ఏసీబీ దాడులు నిర్వహించింది. గుంటూరులోని గౌతమి అపార్ట్ మెంట్ ఉన్న రంగారావు ఇంట్లో ఏసీబీ అధికారులు బంగారం, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.30 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను కూడ స్వాధీనం చేసుకున్నారు. గత మూడు గంటలుగా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. దాడులు ముగిసిన అనంతరం ఎన్ని కోట్లు..ఎంత విలువైన ఆస్తులు బయటపడ్డాయో తెలియనుంది.

ఉపేక్షించవద్దు...
రాష్ట్ర ప్రభుత్వంలోని చిన్న ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిని పట్టుకోవాల్సిన బాధ్యత ఏసీబీకి ఉంటుంది. ఎక్కడైనా ఏసీబీ దాడులు జరుగుతున్నాయంటే ఇతర ఉద్యోగులు..అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. ఆయా ప్రభుత్వ శాఖలు లేదా విభాగాల్లో ఏసీబీ కేసు నమోదు అయితే వెంటనే ఆయా ఉద్యోగిని విధుల్లోంచి తొలగించాల్సి ఉంటుంది. కేసు తేలే దాకా విధులకు దూరంగా ఉంచుతారు. ఇంత భారీ స్థాయిలో అవినీతి అధికారులు బయటపడుతుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అవినీతికి పాల్పడుతున్న వారు చిన్న స్థాయి ఉద్యోగి నుండి అధికారుల వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఒక అధికారి వద్ద ఇంత దొరుకుతుంటే పైనున్న వారు ఇంకెంత ఆవినీతికి పాల్పడి ఉంటారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎవరూ అవినీతికి పాల్పడినా వారిని ఉపేక్షించవద్దని ప్రజలు కోరుతున్నారు.

21:13 - June 22, 2017

అనంతపురం: హిందూపురం పారిశ్రామిక వాడలోని హెరిటేజ్ కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదం ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబుకు చెందిన కంపెనీకావడంతో మీడియాను ఎవరినీ అనుమతించడం లేదు. మరో వైపు రేపు ఆ ప్రాంత ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

19:42 - June 20, 2017

అమరావతి: టీచర్ల అక్రమ బదిలీలను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. విజయవాడలో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులను అరెస్ట్‌ చేసి భవానీపురం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా స్కూళ్లను మూసివేసేస్తోందని.. లక్షల రూపాయలు లంచంగా తీసుకుని అక్రమ బదిలీలు చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘం నేతలు ఆరోపించారు. ఉపాధ్యాయుల ఆందోళనకు సంబంధించి విజయవాడ స్టూడియోలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో యూటీఎఫ్ నేత బాబురెడ్డి, ఏపీటీఎఫ్ పాండురంగ వరప్రసాద్, ఎస్టియు నేత జోసఫ్ సుధీర్ బాబు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

11:46 - June 17, 2017

గుంటూరు : వైసీపీ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు.. ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్‌ కిశోర్‌ సర్వేల భయం పట్టుకుంది. ప్రశాంత్‌ కిశోర్‌ చేపడుతున్న అభిప్రాయ సేకరణలు... సర్వేలు.. వైసీపీ నాయకులను హడలెత్తిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న జగన్‌.. ప్రశాంత్‌ కిషోర్‌ సలహాలు, సూచనలను కచ్చితంగా అమలు పరుస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్‌ కిశోర్ బృందం... నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కో-ఆర్డినేటర్ల నేతల పనితీరుపై సర్వే ప్రారంభించింది. గ్రామాల్లో పర్యటించి... అభ్యర్థుల పనితీరు.. గెలుపు..ఓటములపై పరిశీలన మొదలుపెట్టింది. సర్వేలలో తెలిసిన అంశాల మేరకు పార్టీలో పలు మార్పులు... చేర్పులు చేస్తున్నట్టు సమాచారం.

సర్వేలు ప్రభావం..
ప్రశాంత్‌ కిశోర్‌ సర్వేల ప్రభావం మిగిలిన ప్రాంతాలపై ఏమేరకు పడిందో గానీ, అనంతపురం జిల్లాలో మాత్రం, ప్రశాంత్‌ ఎఫెక్ట్‌ స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డితోను, ఆయన కుటుంబ సభ్యులతోనూ అత్యంత చనువున్న అనంతపురం మాజీ శాసనసభ్యులు గురునాథరెడ్డినే జగన్‌ పక్కన పెట్టేశారు. వచ్చే ఎన్నికల్లో గురునాథరెడ్డి గెలుపు కష్టమని, ప్రశాంత్‌కిశోర్‌ సర్వేలో తేలిందని, అందుకే, ఆయన్ను పక్కన పెట్టారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. పార్టీ నియోజకవర్గం ఇంచార్జిగా గుర్నాథ్ రెడ్డిని తప్పించి మైనార్టీ వర్గానికి చెందిన నదీమ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. గతంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో, గుర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరి ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. అప్పట్లో జగన్‌కు జిల్లా నుంచి తొలుతగా మద్దతు పలికింది గుర్నాథ్ రెడ్డే కావడం గమనార్హం. అలాంటి ఆత్మీయుడిని కూడా జగన్‌ ఇంచార్జి పదవికి దూరం చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ప్రజబలం ఉన్నవారికే ఇంచార్జిలు
ఎన్నికల్లో గెలుపే ఏకైక అర్హతగా జగన్‌, నియోజకవర్గ ఇంచార్జిలను నియమిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం చాలామంది నేతల్లో గుబులు రేకెత్తిస్తుంది. ఎంతో కాలం నుంచి పార్టీని...వైఎస్సార్‌ కుటుంబాన్ని నమ్ముకుని ఉన్న గురునాథ్‌రెడ్డికే ఈ పరిస్థితి వస్తే ఇక మిగిలిన వారి పరిస్థితి ఏమిటని అనుకుంటున్నారు. పార్టీ అధినేత జగన్‌ నిర్ణయాలను ప్రశాంత్‌ కిశోర్‌ సర్వే ఫలితాలే ప్రభావితం చేస్తుండడంతో, జిల్లాలోని వైసీపీ నాయకులంతా అలర్ట్‌ అయ్యారు. సీరియస్‌గా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. తమపై ఎక్కడ వేటు పడుతుందో అనే టెన్షన్లో పడ్డారు. మొత్తానికి, ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహాలు వైసీపీని గెలుపు తీరానికి చేరుస్తాయో లేదోగానీ, అనంతపురం జిల్లా వైసీపీ నాయకులను మాత్రం ఒళ్లొంచి కష్టపడేలా చేస్తున్నాయి. 

11:32 - June 17, 2017

విశాఖ : విశాఖపట్నం భూ కుంభకోణం పై వైసీపీ పోరాటం ఉధృతం చేసింది. భూ కుంభకోణం వైసీపీ ఇప్పటికే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తుంది. ఇతర పక్షాలతో కూడా నిరసనలు వ్యక్తం చేశారు. భూ కంభకోణంపై సమగ్ర విచారన జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఈ నెల 22 న విశాఖ కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపట్టనున్నారు. ధర్నాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పాల్గొననున్నారు. భూ కుంభకోణం వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని వైసీపీ నేతు ఆరోపిస్తున్నారు. 

21:32 - June 16, 2017

అమరావతి: తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలపై కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తామని ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి కళా వెంకట్రావు అన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ బకాయిలకు సంబంధించిన అంశాలను లేఖలో పేర్కొంటామన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్‌ వివాదం నేపథ్యంలో.. ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మూడువేల కోట్ల విద్యుత్‌ బకాయిలు తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సి ఉందన్నారు. తెలంగాణ బకాయిల అంశాన్ని గవర్నర్‌ దగ్గర జరిగే మీటింగ్‌లోనూ లేవనెత్తుతామన్నారు. 

21:18 - June 16, 2017

అమరావతి: రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తోందని... సీఎం చంద్రబాబు చెప్పారు.. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న రుణమాఫీ పథకానికి సహకారం అందించాలని బ్యాంకర్లకు సీఎం విజ్ఞప్తి చేశారు.. ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తున్నాయని.. ఖరీఫ్‌లో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నామని చెప్పారు..

వార్షిక రుణ ప్రణాళిక 1,66,806 కోట్లు

అమరావతిలో ఏపీ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమైంది.. ఇందులో 2017-18 రుణ ప్రణాళికను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు... కోటి 66లక్షల 806 కోట్లుగా వార్షిక రుణ ప్రణాళిక ప్రకటించారు... ఇది గత ఏడాదికంటే 14.4శాతం ఎక్కువని సీఎం చెప్పారు.. చిత్తంఉన్నా విత్తం ఉండాలని.... ఏ రంగానికైనా డబ్బులు చాలా ముఖ్యమని స్పష్టం చేశారు..

ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం

తమ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని చంద్రబాబు చెప్పారు.. ఇందుకు సంబంధించిన కార్యక్రమానికి సుభాష్ పాలేకర్‌ను సలహాదారుగా నియమించామని గుర్తుచేశారు.. అమరావతిలో ప్రకృతి వ్యవసాయ యూనివర్శిటీ నెలకొల్పుతామని ప్రకటించారు.. వ్యవసాయ అభివృద్ధికి అయోవా యూనివర్శిటీతో ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రకటించారు.. వ్యవసాయశుద్ది పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.. మేలురకమైన విత్తనాల అభివృద్ధికి కర్నూలులో మెగాసీడ్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు..

వర్షం అంచనాల్లో 85శాతం కచ్చితత్వాన్ని సాధించాం

రెండు, మూడు రోజుల్లో వర్షం కురుస్తుందనే అంచనాల్లో 85శాతం కచ్చితత్వాన్ని సాధించామని చంద్రబాబు చెప్పారు.. 8నుంచి 10రోజుల్లో వర్షాలు కురుస్తాయన్న అంచనాల్లో 70శాతం కచ్చితత్వాన్ని సాధించామని తెలిపారు.. పాంట్రిక్స్‌ యాప్‌తో మొక్కలకు ఏర్పడిన తెగుళ్లను గుర్తించి ముందస్తు నివారణ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు..

రైతులకు రెట్టింపు ఆదాయానికి పథకాలు, ప్రణాళికలు

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని బ్యాంకర్ల సమావేశంలో అధికారులకు చంద్రబాబు సూచించారు. వ్యవసాయరంగంలో సమూల సంస్కరణలు రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రకటించారు... రైతులకు రెట్టింపు ఆదాయానికి పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు బ్యాంకులు సహకరించాలని కోరారు. ఉద్యానవన పంటలు, పశుగణాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులకు సీఎం వివరించారు... రాయలసీమలో రెయిన్ గన్స్‌తో కరవుపై యుద్ధం చేసిన విషయాన్ని అధికారులకు గుర్తు చేశారు. కౌలు రైతులకు ఉదారంగా రుణాలు ఇవ్వాలని బ్యాంకు అధికారులకు సూచించారు. రైతులకు మరింత మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

18:58 - June 16, 2017

ప్రకాశం :రైతుల సంక్షేమంకోసం ఏపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని... మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో రైతులు సకాలంలో పంటలు పండిస్తున్నారని తెలిపారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో దేవినేని పర్యటించారు. 164కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. రోంపేరు బ్రిడ్జిని ఆరు నెలల్లో పూర్తిచేస్తామని ప్రకటించారు.. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నేతలు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు..

Pages

Don't Miss

Subscribe to RSS - nara Lokesh