nellore

20:05 - February 27, 2017

నెల్లూరు : జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా ఆనం విజ‌య్‌ కుమార్ రెడ్డిని జ‌గ‌న్ ఓకే చేశారు. ఈ మేర‌కు ఒంగోలులో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రక‌ట‌న చేశారు. దీంతో గ‌త వారం రోజులుగా నెల్లూరు జిల్లాలో కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు వైసీపీ తెర‌దించింది. వైసీపీ గుర్తు మీద గెలిచి టీడీపీలో చేరిన వారంతా మ‌ళ్లీ వైసీపీలోకి రావాల‌ని వైవీ సుబ్బారెడ్డి కోరారు. తెలుగుదేశం పార్టీ మీద రివేంజ్ తీర్చుకునే టైం వచ్చింద‌ని ఆయ‌న అన్నారు. జంప్ జిలానీలు వైసీపీకి ఓటెయ‌్యకుంటే న్యాయప‌ర‌మైన చిక్కులు త‌ప్పవ‌ని హెచ్చరించారు. మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ఆశీర్వాదం తోనే తాను బ‌రిలోకి దిగుతున్నాని ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వైసీపీ త‌ర‌పున త‌న‌కు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఖ‌రారు చేసిన జ‌గ‌న్‌కు ఆయన కృత‌జ్ఞత‌లు తెలిపారు.

 

12:36 - February 19, 2017

నెల్లూరు : మాగుంట లే అవుట్ లో విషాదం చోటు చేసుకుంది. సమాచార హక్కు జిల్లా కన్వీనర్ భద్రం మృతదేహం రైలు పట్టాలపై కనిపించింది. రెడ్ క్రాస్ లో క్రీయాశీల పాత్ర పోషిస్తున్నాడు. సీపీఐ నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయి. భద్రం ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక ఎవరైనా చంపేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అవినీతిని ప్రశ్నిస్తుండడంతో ప్రత్యర్థులు కక్ష కట్టి చంపేసి మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

17:47 - February 18, 2017

నెల్లూరు : ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి రాజకీయాలు చేయలేదని, ఎన్నికల్లో డబ్బులు పంచడం లేదని చెప్పగలరా అని నిలదీశారు. ప్రధాని మోడీ ఏపీకి ఇచ్చిన హామీలకు గతి లేదు కానీ యూపీలో రైతు రుణమాఫీ చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

17:39 - February 18, 2017

నెల్లూరు : తన సోదరుడు ఆనం రాంనారాయణరెడ్డితో ఎలాంటి విబేధాలు లేవని టిడిపి నేత ఆనం వివేకానందరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ మధ్య చిచ్చు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. తుది శ్వాస వరకు నెల్లూరును..రాజకీయాలను..తమ్ముడిని వదులుకోనని ఖరాఖండిగా చెప్పారు.

22:04 - February 17, 2017

నెల్లూరు : జీజీహెచ్‌లో విధులకు డుమ్మా కొట్టి ప్రైవేటు క్లీనిక్‌ నడుపుతున్న ఆరుగురు డాక్టర్లను మంత్రి కామినేని సస్పెండ్‌ చేశారు. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఆయన.. విధులకు హజరుకాకుండా ప్రైవేటు ప్రాక్టీస్‌ చేస్తున్న డాక్టర్లపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ప్రభుత్వ వైద్యులకు ప్రైవేటు హస్పటల్స్‌ ఉంటే రాజీనామా చేయాలని కామినేని అన్నారు. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తామన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేస్తున్న ప్రభుత్వ వైద్యుల చిట్టా తన వద్ద ఉందని మంత్రి తెలిపారు. 

 

20:11 - February 17, 2017

నెల్లూరు : 20 ఏళ్లుగా ఒకే జిల్లాలో పాతుకుపోయారు...వివిధ హోదాల్లో పనిచేశారు...పదోన్నతులు వచ్చినకొద్దీ అధికారం పెరిగింది..అందులో ధనదాహం కూడా...సింహపురిలో ఉన్నతాధికారిగా ఉంటూ కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టిన రాంరెడ్డి అక్రమ సంపాదన బయపడింది...ఏసీబీ తవ్వినకొద్దీ బయటపడుతున్న వాటిని చూసి కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. అధికారాన్ని అడ్డుపెట్టుకున్నాడు..తనకున్న పరిచయాలను క్యాష్ చేసుకున్నాడు...ఎక్కడ పనిచేసినా అక్కడ దొరికింది దోచేశాడు...ఒకటి కాదు..రెండు కాదు కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టాడు ఆఫీసర్....అధికారి అవినీతిపై నజర్ పెట్టిన ఏసీబీ ఒక్కసారిగా దాడులు నిర్వహించింది..అయితే ఏసీబీ ఊహించినదాని కంటే ఎక్కువనే ఆస్తులు బయటపడ్డంతో షాక్‌ తినడం ఆఫీసర్ల వంతు అయింది...ఆ ఆఫీసర్ ఎవరో కాదు..సింహపురిలో జిల్లా పరిషత్‌ సీఇఓ, నగరపాలక సంస్థ ఇన్‌చార్జిగా ఉన్న రామిరెడ్డి...
హైదరాబాద్‌లోనూ భారీగా ఆస్తులు...
నెల్లూరు జిల్లాలో సుదీర్ఘం కాలం పని చేస్తున్న జిల్లా పరిషత్‌ సీఈవో, నగర పాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్‌ బి.రామిరెడ్డి నివాసాల పై ఏసీబీ దాడులు నిర్వహించింది...నాలుగు ప్రాంతాలలో ఏక కాలంలో 14 చోట్ల రామిరెడ్డి ఆస్తుల పై ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఉదయం 6 గంటల నుంచి రామిరెడ్డి ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు, కొందరు అనుచరులు, మరికొందరు బినామీల ఇళ్లల్లో హైదరాబాద్‌, గుంటూరు, నెల్లూరు, తిరుపతి పట్టణాలలోని 14 చోట్ల ఈ దాడులు చేపట్టారు.
పదోన్నతులతో పాటే పెరిగిన ఆదాయం..
నెల్లూరు జిల్లాలో తాహసీల్దారు నుంచి ఆర్డీవో, డీఆర్వో, జడ్పీ సీఈవో వరకు 20 ఏళ్లకు పైగా రామిరెడ్డి వివిధ హోదాలలో పని చేశారు...ప్రస్తుతం ఉన్నతాధికారిగా పనిచేస్తున్న రామిరెడ్డిపై వచ్చిన ఆరోపణలతో ఏసీబీ రంగంలోకి దిగింది...నగరంలోని చిల్డడ్రన్స్‌ పార్కు, బి.వి.నగర్‌, మాగుంట లేఅవుట్‌, సరస్వతీ నగర్‌ ప్రాంతాలలో సోదాలు నిర్వహించింది. ఆయనతో పాటు ఒకరిద్దరు ఉపాధ్యాయులు, అదే శాఖలో పనిచేసే మరో దిగువ స్థాయి ఉద్యోగి ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ భారీగా అక్రమాస్తులున్నట్లు గుర్తించింది. 
ఇప్పటికే బయటపడ్డ మూడు కోట్ల ఆస్తులు..
నెల్లూరు, గుంటూరు, తిరుపతి పట్టణాలలో రామిరెడ్డి, ఆయన అనుయాయుల పేరుతో ప్లాట్లు, స్థలాలు, బహుళ అంతస్తుల భవనాలు ఉన్నట్లు గుర్తించింది. నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్‌ పార్కు వద్ద రామిరెడ్డి ఉన్న డూప్లేక్స్‌ ఇళ్లు అందులో పలు కీలక రికార్డులు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు...రామిరెడ్డి నివాసాల పై చేసిన తనిఖీలలో ఇప్పటి వరకు రెండున్నర కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించామని బహిరంగ మార్కెట్‌లో దీని విలువ పదిరెట్లు వుంటుందని అధికారులు చెబుతున్నారు..బ్యాంకు లాకర్లను ఓపెన్‌ చేయాల్సి వుంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన రామిరెడ్డి లాంటి అధికారులు ఎందరో తమ అధికారాన్ని అడ్డుపెట్టుకున్నవారే..వారికి కొందరు రాజకీయుల సహకారం ఉండడంతో తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు దోచేశారు...
హైదరాబాద్‌లో కూడా ఆస్తులు 
నెల్లూరు జడ్పీ సీఇఓ రాంరెడ్డి ఆస్తులు హైదరాబాద్‌లో కూడా ఉన్నాయి...వీటిని గుర్తించిన ఏసీబీ అధికారులు తెలంగాణా ఏసీబీకి సమాచారం అందించారు..వెంటనే హైదరాబాద్‌ టీం కూకట్‌పల్లిలో సోదాలు చేసింది.. ఈ దాడుల్లో నెల్లూరు,కావలి ప్రాంతాల్లోని ఇళ్ల స్థలాల డాక్యుమెంట్లు దొరికాయి...
హైదరాబాద్‌ లోనూ దాడులు 
నెల్లూరు జిల్లా పరిషత్‌ సీఇఓ రాంరెడ్డి అక్రమాస్తులపై హైదరాబాద్‌ నగరంలోనూ దాడులు జరిగాయి...ఈ తనిఖీల్లో ఎన్నో ఆస్తులు బయటపడ్డాయి.. ఇంకా కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు..దాదాపు 5 గంటలపాటు కొనసాగిన దాడుల్లో రాంరెడ్డి ఆస్తులను బయటకు తీశారు...
కూకట్‌పల్లిలో దాడులు..
ఏసీబీ దాడులు 
కూకట్‌పల్లిలోని ఆఫీసర్ రాంరెడ్డికి చెందిన ఇంట్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్ ఖాదర్‌బాషా బృందం దాడులు చేసింది... ఆ ఇంట్లో సోదాలు చేయగా నెల్లూరు, కావలి ప్రాంతాల్లోని ఇంటి స్థలాల డాక్యుమెంట్లు దొరికాయి..దాదాపు ఐదు స్థలాల విలువ మార్కెట్లో లక్షల్లోనే ఉంటుందని అంచనా... ఇంకా ఎక్కడైనా ఆస్తులున్నాయా..? బ్యాంకు లాకర్లున్నాయన్నదానిపై ఏసీబీ శోధిస్తుంది.

 

11:53 - February 17, 2017

నెల్లూరు : జిల్లా పరిషత్‌ సీఈవో బొబ్బా రామిరెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు మెరుపుదాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆరోపణలతో ఏసీబీ అధికారులు హైదరాబాద్‌, తిరుపతి, ఒంగోలు, నెల్లూరులో ఏకకాలంలో దాడులు చేశారు. నెల్లూరు సహా మొత్తం 15 చోట్ల రామిరెడ్డి బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు 3 కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంకా ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. కావలిలో రామిరెడ్డి మిత్రుడు మండవ జయరామయ్య ఇంట్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

20:06 - February 16, 2017

నెల్లూరు : జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజు పనిచేయని ప్రభుత్వ డాక్టర్లపై కొరఢా ఝళిపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ..పనిచేయకుండా డుమ్మాలు కొట్టే ప్రభుత్వ డాక్టర్లను సస్పెండ్‌ చేశారు. ప్రభుత్వ డాక్టర్లుగా ఉంటూ ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తున్న,.ఆరుగురు డాక్టర్లఫై  జిల్లా కలెక్టర్ ముత్యాల సస్పెండ్‌ వేటు వేశారు. డ్యూటీ టైంలో కూడా ప్రైవేట్ క్లినిక్ విధులు నిర్వహిస్తున్నారని విమర్శలు రావడంతో జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజు..ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న డాక్టర్లపై  నిఘా ఉంచారు. సొంత క్లినిక్‌లు నడుపుతున్నారని సమాచారంతో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి డ్యూటీ టైంలో విధులకు హాజరుకాకుండా ప్రైవేట్ క్లినిక్‌లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లను కలెక్టర్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పలు సొంత ప్రైవేట్ క్లినిక్ లో పని చేస్తున్న 6మంది డాక్టర్లను సస్పాండ్ చేసారు.

 

18:54 - February 12, 2017

ఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగనతలంలో మరో ఘనతను సొంతం చేసుకోబోతోంది. ఇప్పటి వరకు అనేక రికార్డులు సృష్టించిన ఇస్రో... మరో రికార్డు ప్రయోగానికి సిద్దమైంది. ఈనెల 15న ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నద్దమైంది. దీని ద్వారా రష్యా రికార్డును ఇస్రో బద్దలు కొట్టబోతోంది. వరుస విజయాలతో జోరుమీదున్న ఇస్రో మరో రికార్డు దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు అనేక ప్రతిష్టాత్మక ప్రయోగాలతో దేశఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు చేర్చిన షార్‌.. ఇప్పుడు ప్రపంచానికే సవాల్‌ విసరబోతోంది. మంగళయాన్‌, చంద్రయాన్‌-1లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు విజయవంతం చేసిన ఆత్మవిశ్వాసంతో ఈ ఏడాది సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమైంది. ఈనెల 15న... మరో భారీ ప్రయోగానికి ఇస్రో సన్నద్దమైంది. ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి రికార్డు సృష్టించబోతోంది. ఒకేసారి 37 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన రష్యా రికార్డును.. భారత్‌ బద్దలు కొట్టనుంది.

104 ఉపగ్రహాలు..
పీఎస్‌ఎల్‌వి -సి37 వాహన నౌక ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 15వ తేదీ ఉదయం 9.28కి ఉపగ్రహాలను నింగిలోకి పంపుతారు. ఈ రాకెట్‌లో పంపించే ఉపగ్రహాల్లో భారత్‌కు చెందినవి కేవలం మూడే. మిగిలిన 101 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవే. మన దేశానికి చెందిన 714 కిలోల బరువుగల కార్టోశాట్‌ 2డి ప్రధాన ఉపగ్రహం, 20కిలోల బరువు ఐఎన్‌ఎస్‌ -1ఏ, ఐఎన్‌ఎస్‌ -1బి నానో ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. వీటిలో అమెరికా, ఇజ్రాయిల్‌, కజకిస్తాన్‌, నెదర్లాండ్‌, స్విట్జర్లాండ్‌ ముందుకు రావడంతో 101 ఉపగ్రహాలను గగనతలంలోకి పంపనున్నారు.

గంటన్నర పాటు ప్రయోగం..
ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా ఇస్రో ఈ ప్రయోగాన్ని గంటన్నరపాటు జరుపనుంది. 104 ఉపగ్రహాలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. రాకెట్‌ భూమి నుంచి నింగిలోకి ఎగిరిన తర్వాత భూమికి 500 కిలోమీటర్ల దూరంలో ప్రధాన ఉపగ్రహం కార్టోశాట్‌ను విడవనుంది. అనంతరం అక్కడి నుంచి 630 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత మిగిలిన 101 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి చేరేవిధంగా శాస్త్రవేత్తలు డిజైన్‌ చేశారు. ఎక్కువ ఉపగ్రహాలు ఉన్నందున ఒక్కొక్క బాక్స్‌లో 25 ఉపగ్రహాలు పెట్టి మొత్తం నాలుగు పెట్టెల్లో అమర్చి ఒకదాని తర్వాత ఒకటి విడిపోయే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది మొత్తం జరుగడానికి 90నిమిషాల సమయం పడుతుంది.

చివరి క్షణంలో మార్పులు..చేర్పులు..
భూగోళ పరిశోధనల కోసం ఇస్రో ఈ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతోంది. గత ఏడాది జూన్‌ 22న ఒకే రాకెట్‌లో 20 ఉపగ్రహాలను ప్రయోగించి భారత్‌ తన సత్తా చాటింది. అయితే రష్యా మాత్రం 2014లోనే ఏకకాలంలో 37 ఉపగ్రహాలను ప్రయోగించడం ఇప్పటి వరకు అతిపెద్ద రికార్డు. ఇప్పుడు 104 ఉపగ్రహాలను పంపి భారత్‌ ఈ రికార్డును బద్దలు కొట్టబోతోంది. ఈ ప్రయోడానికి 48 గంటల ముందే కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. అయితే వాతావరణ పరిస్థితులను బట్టి చివరి క్షణంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది.

16:44 - February 12, 2017

నెల్లూరు : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనలో ప్రజాస్వామ్యానికి తీరని హాని జరుగుతోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు.డా.శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో 25 సంవత్సరాల నూతన ఆర్థిక విధానాల అమలు ఉద్యోగులు - కార్మికులు - ప్రజలపై ప్రభావం అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాఘవులు మాట్లాడుతూ... పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిందని, మతసౌమరస్యానికి విఘాతం కలుగుతోందన్నారు. ప్రజాస్వామ్యానికి నూతన ఆర్థిక విధానాలు దోహదం చేయడం లేదన్నారు. కార్పొరేట్లకు ఆర్థిక సంస్కరణలు లాభాలు తెచ్చిపెడుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో నరేంద్ర మోడీ మరింత దూకుడుగా వెళుతున్నారని విమర్శించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - nellore