nirmal

14:27 - October 20, 2018

నిర్మల్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆ పార్టీ చీఫ్ ఉతమ్ కుమార్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 12 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని ఉత్తమ్ జోస్యం చెప్పారు. నిర్మల్ జిల్లా భైంసాలో రాహుల్ గాంధీ ప్రజా గర్జన బహిరంగ సభలో ఉత్తమ్ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం నడుస్తోందన్న ఉత్తమ్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10కి 10సీట్లు తామే గెల్చుకుంటామన్నారు. నాలుగేన్నర ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించిన ఉత్తమ్.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వరికి ఎంఎస్‌పీ బోనస్ ఇచ్చి రూ.2వేలకు కొనుగోలు చేస్తామన్నారు. మొక్కజొన్నను రూ.2వేలకు.. పత్తిని రూ.7వేలకు.. మిర్చి, పసుపు రూ.10వేలకు కొనుగోలు చేస్తామన్నారు. అలాగే విద్యార్థులకు వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంటు ఇస్తామన్నారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. నిర్మల్ జిల్లా భైంసాలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, డీకే అరుణ, విజయశాంతి, రేవంత్ రెడ్డి, సబిత తదితరులు సభలో పాల్గొన్నారు.

15:12 - July 14, 2018

నిర్మల్ : మిషన్ భగీరథ పైపులైన్ నిర్మాణ నాణ్యత ఎలా ఉందో పలు ఘటనలు నిరూపించాయి. పలు ప్రాంతాల్లో పైపు లైన్ లు పగిలిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో పైపులైన్ పగిలిపోయింది. భారీగా నీరంతా వృధాగా పోయింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి నిర్మల్ పట్టణానికి నీరందిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సకల్పించింది. అందులో భాగంగా 'మిషన్ భగీరథ'కింద పైపులైన్ ఏర్పాటు చేశారు. శనివారం అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు.

కానీ మంజులాపూర్...నిర్మల్ జాతీయ రహదారి పక్కనే ఉన్న పైపులైన్ వాల్ ఎగిరిపోయింది. ఒక్కసారిగా నీరంతా పైకి ఎగిసింది. దాదాపు పది మీటర్ల ఎత్తున నీరు ఎగిసిపడింది. పక్కనే ఉన్న ఓ రైతుకు ఉన్న మూడెకరాల పొలంలోకి భారీగా నీరంతా చేరింది. చేనంతా నీటితో నిండిపోవడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న అధికారులు చర్యలు చేపట్టారు. మరి ఆర్థికంగా నష్టపోయిన ఆ రైతును అధికారులు...ప్రభుత్వం ఆదుకుంటుందా ? లేదా ? అనేది చూడాలి. 

14:38 - July 2, 2018

నిర్మల్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అభం..శుభం..తెలియని ఓ విద్యార్థిపై కత్తిపోట్లకు గురి కావడం తీవ్ర సంచలనం రేకేత్తిస్తోంది. ఈ ఘటన ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకోవడం మరింత కలకలం సృష్టిస్తోంది. హర్షవర్దన్ అనే బాలుడు మహాత్మాగాంధీ పూలే ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నాడు. సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని ఆగంతకుడు హర్షవర్ధన్ పై కత్తితో దాడికి దిగారు. వీపు వెనుక భాగంలో కత్తిపోట్లు పడ్డాయి. తీవ్ర గాయాలతో బాలుడు కేకలు వేయడంతో ఆశ్రమంలో ఉన్న ఇతర విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కానీ ఘటన జరిగిన అనంతరం విషయాన్ని గోప్యం ఎందుకు ఉంచారు ? అనేది తెలియరావడం లేదు. అలాగే తల్లిదండ్రులకు కూడా ఆలస్యంగా సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. సిబ్బంది నిర్లక్ష్యం ఉందని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల కిందట గురుకుల పాఠశాలలో చేరిపించడం జరిగిందని, కత్తిపోట్ల అనంతరం బాలుడి కాళ్లు..చేతులు పనిచేయడం లేదని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు వచ్చారు ? బాలుడిని ఎందుకు పొడిచాడనే తెలియాల్సి ఉంది. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

 

08:44 - July 2, 2018

నిర్మల్ : రక్తపాశాలను కూడా మద్యం ప్రభావితం చేస్తోంది. మద్యం మత్తులో కన్న తండ్రులను, తల్లులను దారుణంగా హత్య చేస్తున్న సందర్భాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అలాగే కన్న కొడుకులను హత్య చేస్తున్న తండ్రుల ఉదంతాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓదెల మండలం ఉప్పరపల్లిలో మద్యం డబ్బుల కోసం కన్న కుమారుడిని కన్నతండ్రి కొట్టి చంపిన ఘటన మరచిపోకముందే..మద్యం డబ్బుల కోసం కన్న తండ్రిని దారుణంగా చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముథోల్ జిల్లాలో మద్యానికి బానిసైన నగేశ్ తండ్రి పోతన్నను కర్రతో కొట్టి చంపాడు. మద్యానికి డబ్బులివ్వాలని తండ్రితో గొడవ పడ్డ నగేశ్ తండ్రి డబ్బులు ఇవ్వకపోవటంతో ఘర్షణకు దిగాడు. అనంతరం కర్రతో తీవ్రంగా దాడి చేయగా పోతన్న ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పోతన్న భార్య, స్థానికులు కలిసి భైంసా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పోతన్న మృతి చెందాడని వైద్యులు తెలిపారు. తండ్రిపై దాడి చేసిన వెంటనే నగేశ్ పరారయ్యాడు. మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పరారీలో వున్న నగేశ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

11:15 - June 18, 2018

నిర్మల్ : సోన్ మండలంలో జరిగిన బాలికపై హత్యాచారం ఘటనపై జిల్లా వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలికపై ఓ యువకుడు అత్యాచారం జరిపి తలపై బండరాయితో మోది దారుణంగా చంపేశాడు. దీనిపై కుటుంబసభ్యులు...గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నిందతుడిని అప్పగించాలంటూ తామే శిక్షిస్తామని జాతీయ రహదారిపై ఆదివారం ఆందోళన జరిపారు. పోలీసులు నచ్చచెప్పడంతో వారు శాంతించారు. ఇదిలా ఉంటే సోమవారం ఉదయం మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాలిక హత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘలు స్కూల్స్ బంద్ కు పిలుపునిచ్చాయి. దీనితో పలు స్కూల్స్ బంద్ అయ్యాయి. 

19:43 - June 12, 2018

నిర్మల్ : తెలంగాణలో రైతులకు లబ్ది చేకూరాలనే ఉద్దేశంతో సర్కార్‌ చేపట్టిన విత్తనాల పంపిణీ పక్కదారి పడుతోంది. యదేచ్చగా సబ్సిడీ విత్తనాలు పక్కదారి పడుతున్నాయి. నిర్మల్‌ జిల్లాలోని తనూర్‌, కుబీర్‌, ముధోల్‌ మండలాల పరిధిలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 100కు పైగా సబ్సిడీ సోయా విత్తనాల బస్తాలు పట్టుబడ్డాయి. విత్తనాలను అక్రమంగా తరలిస్తున్న రెండు ఆటోలు, ఒక మోటర్‌ సైకిల్‌, ఒక బొలేరో వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు.

09:35 - May 21, 2018

నిర్మల్‌ : సారంగాపూర్, మామడ మండలాల్లో రైతుబంధు చెక్కులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పంపిణీ చేశారు. రైతులు ఆత్మవిశ్వాసంతో దర్జాగా బతకాలనే సదుద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రైతులకు ప్రతీ ఎకరానికీ రెండుపంటలకు కలిపి 8 వేల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో బ్యాంకుల నుండి రుణాలు తీసుకోకుండా పంటలను పండించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

12:33 - May 7, 2018

నిర్మల్ : కడెం మండలం అల్లంపల్లిలో విషాదం నెలకొంది. వాగు వద్ద ఆడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మడుగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. చిన్నారులిద్దరు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు కావడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులు సాయి (5), సిద్దు(7)గా గుర్తించారు.  

20:05 - April 27, 2018

నిర్మల్‌ : బైంసా పట్టణంలోని పురాణాబజార్‌లో విషాదంచోటుచేసుకుంది. తండ్రి మందలించాడనే మనస్తాపంతో పదమూడేళ్ళ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తండ్రి మందలించాడని మనస్థాపం చెందిన రాహుల్‌... ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉండగా.. వైద్యం చేయించారు.. ఈ పరిస్థితుల్లోఎండలో తిరగొద్దంటూ బాలుని తండ్రి మందలించాడు.. దీంతో క్షణికావేశానికి లోనైన బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.  

19:50 - April 16, 2018

నిర్మల్‌ : ఖానాపూర్‌ మండలంలోని నడింపల్లి గ్రామాన్ని గ్రామ పంచాయితీగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు నిర్మల్‌ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం ఖానాపూర్‌ ఎంపీడీవోకు వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటికైన ప్రభుత్వం మాకు న్యాయం చేయకపోతే కోర్టు ద్వారానైనా గ్రామ పంచాయితీని సాధించుకుంటామని గ్రామస్థులు స్పష్టం చేశారు. చిన్న చిన్న తండాలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం తమ గ్రామాన్ని చిన్న చూపు చూస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - nirmal