NTR Biopic

13:11 - July 16, 2018

'మహానటి'గా కీర్తి సురేశ్ నటన విమర్శకులు ప్రశంసల్ని అందుకుంది. తన ముగ్ధ మనోహరమైన నటనతో హేమా హేమీలను మెప్పించటమేకాకుండా వారి ప్రశంసల్ని కూడా పొందింది కీర్తీ సురేశ్. ఇక ఆ సినిమా దేశ విదేశాలలో సాధించిన వసూళ్లు బాక్సాఫీస్ ను షేక్ చేశారు. కీర్తీకి మహానటి సినిమా ఒక వరమనే చెప్పాలి. అవకాశం రావటం ఒక ఎత్తు అయితే..నటనలో మహానటిని గుర్తు చేయటం సాధారణవిషయం కాదు. ఆ సినిమాను ఒప్పుకోవటం పండించటం ఎవ్వరికీ సాధ్యం కాదు. అటువంటిది కీర్తి అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం ఆమె నటనకు తార్కాణంగా చెప్పవచ్చు..మరి ఒకసారే కాదు మహానటిగా కీర్తీ సురేశ్ మరోసారి వెండితెరపై అభిమానులను, ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయినట్లుగా సినీ వర్గాల భోగట్టా..

'ఎన్టీఆర్' బయోపిక్ లో సావిత్రిగా కీర్తి..
క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతోంది. బాలకృష్ణ .. విద్యాబాలన్ .. రానా .. ప్రకాశ్ రాజ్ .. మోహన్ బాబు .. సీనియర్ నరేశ్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఎన్టీఆర్ నట ప్రస్థానంలో సావిత్రి పాత్రను టచ్ చేయకుండా ఉండటం కష్టం. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అందువలన 'ఎన్టీఆర్' బయోపిక్ లో సావిత్రి పాత్ర కూడా కనిపించనుంది.

ప్రత్యేక పాత్రలో రకుల్..
'మహానటి' లో సావిత్రిగా నటించిన కీర్తి సురేశ్ నూటికి నూరు మార్కులు కొట్టేసింది. ఇప్పుడు సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ ను కాకుండా మరో కథానాయికను ప్రేక్షకులు ఊహించుకోవడం కష్టం. అందువలన ఆమెను తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె ఎంపిక ఖరారైపోయిందనేది సినీవర్గాల నుంచి అందుతోన్న సమాచారం. ఇక ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాటలో రకుల్ కనిపించనుందనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది.

 

11:53 - July 5, 2018

తెలుగు సినిమా తెరపై ఇలవేలుపుగా నిలిచిన గొప్ప నటుడు..యుగపురుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఎన్ని తరాలు గడిచినా ఆయన సినీ నట జీవితంలోను..రాజకీయ రంగంలోను ఆయన ఒక దృవతార అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ పాత్రతో పాటు ఆయన చుట్టు అల్లుకున్న అన్ని పాత్రలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆ పాత్రల్లో ఏ పాత్రకు ఎవరు సరిపోలతారనే సెలక్షన్..వారిని నటింపజేయటం కూడా కత్తిమీద సామువంటిదే. ఈక్రమంలో ఎన్టీఆర్ జీవన సహచరి బసవ తారకం పాత్రలో బాలివుడ్ నటి విద్యాబాలన్ అయితే ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. నటనలో విద్యా బాలన్ ఎటువంటి సమర్థత వున్న నటో కొత్తగా చెప్పనక్కరలేదు.

ప్రఖ్యాత నటుడు దివంగత ఎన్టీ రామారావు బయోపిక్ గా 'ఎన్టీఆర్' చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి హైదరాబాదులో జరుగుతుంది. ఇందులో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రను విద్యాబాలన్ పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

12:09 - July 4, 2018

టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో మంది వారసులు హల్ చల్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో వారసుడు ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆ వారసుడి ఎంట్రీ కోసం ఎప్పటి నుండో ప్రేక్షకుల్లో ఆసక్తి కొనసాగుతున్నండగా తాతగారి బయోపిక్ ద్వారా నందమూరి వారసుడు ఎంట్రీ ఇవ్వనున్నాడు. అందరు సినిమా క్లైమాక్స్ లో అద్బుతమైన ఎంట్రీతో అలరించిన అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా ఇప్పటికే రెండు సినిమాలు చేసాడు. మరి బాలయ్య వారసుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చి హీరోగా ఎన్ని మార్కులు కొట్టేస్తాడో చూడాలి..

యంగ్ ఎన్టీఆర్ గా మోక్షజ్ఞ..
క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో యంగ్ ఎన్టీఆర్ గా శర్వానంద్ కనిపించే అవకాశం వున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. యంగ్ ఎన్టీఆర్ గా మోక్షజ్ఞ కనిపిస్తేనే నందమూరి అభిమానులు సంతృప్తి చెందుతారని బాలకృష్ణతో క్రిష్ చెప్పారట.

బాలయ్య ఆమోదంతో సింగపూర్ కు మోక్షజ్ఞ
ఈ సినిమా ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే బాగుటుందని భావించిన బాలకృష్ణ .. అందుకు మోక్షజ్ఞను సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. మోక్షజ్ఞ కాస్త బొద్దుగా ఉంటాడు .. ఈ సినిమాలో పాత్ర కోసం ఆయన కాస్త సన్నబడితే బాగుటుందని క్రిష్ సూచించాడని చెబుతున్నారు. దాంతో తన పోర్షన్ షూటింగ్ సమయానికి సన్నబడి ఫిట్ నెస్ ను సాధించడం కోసం మోక్షజ్ఞ సింగపూర్ వెళ్లాడని అంటున్నారు. ఈ సినిమాలో హరికృష్ణ .. కల్యాణ్ రామ్ కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.   

16:31 - May 17, 2018

జీవిత చరిత్రలను సినిమాలుగా తీసి ప్రేక్షకులను అలరించటం, విమర్శకులను మెప్పించటం అంటే మాటలు కాదు..అందులోను కొందరు సినిమా చరిత్రలో సునామీ సృష్టించి..ఆచంద్రతారార్కం నిలిచిపోయిన కొందరి జీవిత చరిత్రలను తెరకెక్కించటమంటే కత్తిమీద సాము లాంటిదే. వారి గురించి ఎన్నో తెలుసుకోవాలి.వారి అలవాట్లను, హావభావాలను పలికించటం, నటించటం అంటే మాటలు కాదు. అటువంటి గొప్ప నటుడు ఎన్టీఆర్ బయోపిక్ అంటే మాటలు కాదు..ఏ పాత్రకు ఎవరిని తీసుకోవాలి?ఆ పాత్రకు వారు సరిపోతారా? న్యాయం చేయగలరా? అనే కోటి ప్రశ్నలు దర్శకుడి సమర్థతను ప్రతిబింభాస్తాయి. అలా ఎన్టీఆర్ పాత్రకు నటుడు బాలకృష్ణ ఫిక్స్ అయ్యాడు. ఇక ఆయన వియ్యంకుడు, సీఎం, ఎన్టీఆర్ అల్లుడు అయిన నారా చంద్రబాబునాయుడు పాత్రలో ఎవరు నటించనున్నారనే ప్రశ్న రానే వచ్చింది. మరి ఆ పాత్రకు దగ్గుపాటి రానా ఎంపికయినట్లుగా సినీ పరిశ్రమ సమాచారం.

చంద్రబాబు పాత్రలో రానా?..
నందమూరి బాలకృష్ణ తలపెట్టిన మహానేత దివంగత ఎన్టీ రామారావు బయోపిక్ లో రానా కీలక పాత్రను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ అల్లుడు, బాలయ్యకు వియ్యంకుడు, సీఎం అయిన చంద్రబాబునాయుడి పాత్రలో దగ్గుపాటి రానా కనిపిస్తాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. చిత్ర బృందం రానాను సంప్రదించగా, ఆయన అంగీకరించాడని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

ఎన్టీఆర్ జన్మదినం రోజున ప్రకటన?..
ఈ నెల 28న ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా రానా నటించే పాత్రపై అధికారిక ప్రకటన వస్తుందని కూడా సమాచారం. కాగా, 'లీడర్' చిత్రంలో సీఎంగా కనిపించిన రానా, ఈ సినిమాలోనూ సీఎంగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ విషయమై పూర్తి క్లారిటీ రావాలంటే ఎన్టీఆర్ జయంతి వేడుకల వరకూ వేచిచూడాల్సిందే.

06:49 - April 26, 2018

హైదరాబాద్ : నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న 'ఎన్టీఆర్‌' సినిమా నుంచి దర్శకుడు తేజ వైదొలిగారు. బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం షూటింగ్‌ ... ఇటీవల రామకృష్ణ స్టూడియోలో ప్రారంభమైంది. అయితే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నానని తేజ ప్రకటించారు. తాను ఎన్టీఆర్‌కు వీరాభిమానినని.... ఈ సినిమాకు న్యాయం చేయలేనని అనిపిస్తోందని... అందుకే తప్పుకుంటున్నా'నని పేర్కొన్నారు.

20:48 - April 25, 2018

హైదరాబాద్ : ఎన్టీఆర్ బయోపిక్ మూవీ నుంచి డైరెక్టర్ తేజ తప్పుకున్నారు. ఇటీవలే అట్టహాసంగా మూవీ ప్రారంభం అయింది. మూవీలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తున్నారు.

17:02 - March 29, 2018

హైదరాబాద్ : తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా ఇనుమడింప చేసిన మహానుభావుడు.. అభిమానుల పాలిట వెండితెర వేలుపు..  యుగపురుషుడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా.. సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఎన్టీఆర్‌ పేరుతోనే రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో.. టైటిల్‌ రోల్‌.. ఎన్టీఆర్‌ నటవారసుడు బాలకృష్ణ పోషిస్తున్నారు. తేజ దర్శకత్వంలో వస్తోన్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమా.. రామకృష్ణా కల్చరల్‌ సినీ స్టుడియోలో ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. 
సెట్స్‌పైకి ఎన్టీఆర్ బయోపిక్‌ మూవీ  
ఎన్టీఆర్‌ అభిమానుల నిరీక్షణకు నిర్దిష్ట రూపం.. అన్నగారి బయోపిక్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం.. నందమూరి అభిమానుల్లో అంతులేని ఆనందం.. అవును.. నందమూరి అభిమానులను ఆనంద డోలికల్లో ఓలలాడించే.. స్వర్గీయ నందమూరి తారకరాముడి బయోపిక్‌ మూవీ సెట్స్‌పైకి వెళ్లింది. అన్నగారి నట వారసుడు నందమూరి బాలకృష్ణ, టైటిల్‌ రోల్‌ పోషిస్తోన్న ఈ సినిమా.. తేజ దర్శకత్వంలో రూపొందుతోంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ టైటిల్‌తో వస్తోన్న సినిమా షూటింగ్‌.. గురువారం ఉదయం.. సరిగ్గా ఉదయం 9 గంటల 45 నిమిషాలకు.. అతిరథ మహారథుల సాక్షిగా.. రామకృష్ణా సినీ స్టుడియోస్‌లో ప్రారంభమైంది. 
ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న వెంకయ్యనాయుడు
ఎన్టీఆర్ బయోపిక్‌ ప్రారంభ వేడుకల్లో.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని, ముహూర్తం షాట్‌కు క్లాప్‌ కొట్టారు. తెలుగువారి గుండెల్లో చిరంజీవిగా నిలిచిపోయిన నందమూరి తారకరామారావుతో.. తన అనుబంధాన్ని స్మరించుకున్న వెంకయ్య, ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమా.. ఎన్టీఆర్‌ మాదిరిగానే, చరిత్ర సృష్టించి, ఓ చరిత్రగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో  మైలురాయిగా నిలిచిపోయిన లవకుశ, పాతాళభైరవి, దేశోద్ధారకుడు చిత్రాలు మార్చి 29నే రిలీజ్ అయ్యాయని ఈసందర్భంగా వెంకయ్యనాయుడు గుర్తుచేసుకున్నారు 
దుర్యోధనుడి పాత్రపై ముహూర్తం షాట్‌ చిత్రీకరణ
ఎన్టీఆర్‌కు చెరగని యశస్సును అందించిన దాన వీర శూర కర్ణ చిత్రంలోని దుర్యోధనుడి పాత్రపై ముహూర్తం షాట్‌ను చిత్రీకరించారు. కురుసభలో.. నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో ఎన్టీఆర్‌ పలికిన డైలాగ్‌ వెర్షన్‌తో.. బాలయ్య చేసిన అభినయాన్ని ఆహూతులు అభినందించారు. దుర్యోధనుడి పాత్రను ధరించిన బాలయ్యలో.. ఎన్టీఆర్‌ను చూసుకుని అభిమాన గణం మురిసిపోయింది.
సినిమా, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ కీలక పాత్ర : బాలకృష్ణ 
చలన చిత్ర రంగంలోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించిన ఎన్టీఆర్‌... యావద్భారతావని గుర్తుంచుకునే యశస్సును సముపార్జించుకున్నారని హీరో బాలకృష్ణ అభివర్ణించారు. ఎలాంటి వ్యతిరేక పరిస్థితుల్లోనూ.. మడమ తిప్పని ధీరత్వం ఎన్టీఆర్‌దని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి పాత్రను తానే పోషించడం పూర్వజన్మ సుకృతం అని అభివర్ణించుకున్నారు బాలయ్య. 
డైరెక్టర్‌ తేజ...
ఎన్టీఆర్‌ బయోపిక్‌ను, ఎన్.బి.కె ఫిల్మ్స్, వారాహి చలనచిత్రం, విబ్రీ  మీడియా సంస్థలు నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ సినీ జీవితం నుంచి రాజకీయ  రంగప్రవేశం దాకా అనేక కీలక ఘట్టాలను ఈ చిత్రంలో చూపించేందుకు దర్శకుడు తేజ సిద్ధంగా ఉన్నాడు. ఎంతో అదృష్టం చేసుకుంటేగాని ఎన్టీఆర్‌ సినిమాకు దర్శకత్వం వహించే అదృష్టం రాదన్నారు డైరెక్టర్‌ తేజ. 
సినిమా ప్రారంభోత్సవంలో అల్లు అరవింద్‌..
సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌.. తాము మదరాసీలు కాదని, తెలుగు వారమని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనఖ్యాతి ఒక్క ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇటువంటి చరిత్ర సృష్టించిన మహనీయుడి జీవితాన్ని వెండితెరపైకి తీసుకురావడం పెద్ద సాహసమని, ఇలాంటి యుగపురుషుడి  చరిత్రతో రూపొందే సినిమాలో నటించడానికి బాలకృష్ణ మాత్రమే అర్హుడని, దమ్మున్న వ్యక్తి అని అన్నారు. 
సంగీత దర్శకుడిగా కీరవాణి 
ఎన్టీఆర్‌ బయోపిక్‌ చిత్రానికి సంగీత దర్శకుడిగా కీరవాణిని ఎంపిక చేశారు. ఈ భారీ సినిమాలో.. ఎన్టీఆర్‌ పోషించిన రకరకాల పాత్రలను కూడా చూపనున్నారు. ఆయా పాత్రలకు సపోర్టింగ్‌గా నటించిన హీరోయిన్ల పాత్రలకు.. వర్తమాన నటీమణులను ఎంపిక చేయనున్నారు. హిందీ సహా పలు దక్షిణాది నటీనటులు ఈ సినిమాలో పాత్రధారులు కానున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఎన్టీఆర్‌ సినిమాను దసరాకి విడుదల కానుంది. 

 

12:54 - February 16, 2018

సినిమా ఇండస్ట్రీలో అందరూ స్టార్ హీరోలు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తో రెడీ అవుతున్నారు. రీసెంట్ సినిమాల హిట్ లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా చక చక సినిమాలు చేస్తున్నారు. తెలుగు లో బయోపిక్స్ రావడం కొంచం రేర్ అనే ఒపీనియన్ ఉన్న ఈ టైం లో ఒక బయో పిక్ తో రెడీ అవుతున్నాడు స్టార్ హీరో.

చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వీరితో పాటు స్టార్ హీరో హోదా ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ. బాలయ్య సినిమా అంటే మాస్ లో క్లాస్ లో మంచి క్రేజ్ ఉంటుంది. తన సినిమాల్లో కచ్చితంగా ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు బాలకృష్ణ. తన ప్రీవియస్ సినిమా జై సింహ లో కూడా బాలకృష్ణ చాల పవర్ ఫుల్ రోల్ లో కనిపించాడు. ఈ సినిమా టాక్ పాజిటివ్ గా వచ్చింది.

బాలకృష్ణ ప్రెసెంట్ 'నందమూరి తారకరామారావు' జీవిత కథని ఆధారం చేసుకొని బయోపిక్ తీస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమా కి డైరెక్టర్ తేజ ..ఒక టీజర్ కూడా షూట్ చేసి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు. కానీ ఆ తరువాత ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ మాత్రం ఏమి రాలేదు. చక చక సినిమాలు చేస్తూ ఫామ్ లో ఉన్న బాలయ్య ఈ సినిమాలో ఆ స్పీడ్ ఎందుకు చూపించడం లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల డౌట్. తేజ రీ ఎంట్రీ ఇచ్చి 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. 

10:33 - October 12, 2017

ఎన్టీఆర్ బయోపిక్..ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయి కూర్చొంది. ఎన్టీఆర్ బయోపిక్ ను తీయాలని ఆయన కుమారుడు 'బాలకృష్ణ' ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ వివాదంలో ఉండే 'రాంగోపాల్ వర్మ' కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరిట ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే 'ఎన్టీఆర్' బయోపిక్ నిర్మించే దర్శకుడి కోసం 'బాలయ్య' వెయిట్ చేశారని తెలుస్తోంది.

తొలుత 'క్రిష్'..లేదా 'తేజ'కు ఈ సినిమా బాధ్యతలను అప్పగించాలని 'బాలయ్య' యోచించారని టాక్. కానీ 'క్రిష్' మణికర్ణిక ప్రాజెక్టుతో బిజీగా ఉండడంతో 'ఎన్టీఆర్' బయోపిక్ పై దృష్టి పెట్టే టైం లేదని ప్రచారం జరిగింది. ఆ బాధ్యతలను తాజాగా 'తేజ' స్వీకరించినట్లు టాలీవుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆయన దర్శకత్వంలో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. త్వరలోనే ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ప్రారంభించేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో బాలకృష్ణ నిర్మాతగా మారనున్నారని మరో టాక్. ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

13:20 - October 10, 2017

సెన్షేనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రూపుదిద్దుకోబోతుంది. ఈ సినిమాకు వైసీపీ నేత రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యహరించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆర్జీవీ మరో ప్రకటన చేశాడు. ఫిబ్రవరిలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ షూట్ మొదలుపెట్టి అక్టోబర్ లో రిలీజ్ చేస్తామని తెలిపాడు. ఎన్టీఆర్ జీవితం మహాభారతం లాంటిదని అందులో ఒక అధ్యాయాన్ని మాత్రమే తెరకెక్కిస్తున్నామని తెలిపాడు. చిత్తూరు జిల్లా పలమనేరులో వైసీపీ నేత రాకేశ్ రెడ్డితో కలిసి ఈ చిత్రం గురించి డీటేల్స్ వెల్లడించాడు వర్మ.

Pages

Don't Miss

Subscribe to RSS - NTR Biopic