osmania university

13:30 - June 13, 2017

హైదరాబాద్ : ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్ 2 రద్దు చేసి మరో 3 నెలల్లా తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వంద మంది విద్యార్థులు శిరోముండన కార్యక్రమాం చేపట్టారు. విషయం తెలుసుకున్న ఓయూ పోలీసులు ఆర్ట్స్ కాలేజీ ఎదుట విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారిని నాచారం పోలీసు స్టేషన్ కు తరలించారు. అరెస్టైన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, వైట్ నర్ తో దిద్దిన పేపర్ ను ఎలా గుర్తిస్తారని వారు ప్రశ్నించారు. 

14:58 - June 12, 2017
21:12 - June 6, 2017

హైదరాబాద్ : ఉద్యమాల ఖిల్లా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా టీఆర్ ఎసో ప్రభుత్వంపై మరో  పోరాటానికి తెలంగాణ కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారుపై నిరుద్యోగులు, విద్యార్థుల్లో నెలకొని ఉన్న  అసంతృప్తికి ఆజ్యం పోసి, తమకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించింది. ఈనెల 18న ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ మహా సంగ్రామ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. 
ఉద్యమాల ఖిల్లా ఓయూ
పోరాటాల పోరు గడ్డ, ఉద్యమాల ఖిల్లా ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణలో పుట్టిన ఉద్యమాలన్నింటికీ  ఈ విశ్వవిద్యాలయంలోనే బీజంపడ్డాయి. చాలా పోరాటాలు ఫలితాలిచ్చాయి. ఇటువంటి ఉస్మానియా యూనివర్సిటీని వేదికగా చేసుకుని మరో ఉద్యమానికి తెలంగాణ కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిలోకాన్ని దూరం చేసుకున్న కాంగ్రెస్‌, ఇప్పుడు వీరి సమస్యలపై పోరాటాలకు ఊపిరిపోయాలని నిర్ణయించింది.  
ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల ఉద్యోగాల ఖాళీ
తెలంగాణ ఉద్యమ సమయంలో లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని  టీఆర్‌ఎస్ హామీ ఇచ్చి, విద్యార్థులు, నిరుద్యోగులకు తమవైపు తిప్పుకుంది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయింది. కొన్ని నోటిఫికేషన్లు వేసి, కొద్ది పోస్టులను భర్తీ చేసి, విద్యార్థులు, నిరుద్యోగులకు ఆశలు కల్పించింది. ఇంకా రెండు లక్షల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాల్సివుందని నిరుద్యోగ సంఘాలు, ప్రతిపక్షాల నేతలు చెబుతున్నారు. టీఎస్‌పీఎస్సీ కొన్ని నోటిఫికేషన్లు జారీ చేసి రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి. పోటీ పరీక్షలు  నిర్వహించినా తప్పుల తడకలు. ఓఎంఆర్‌ షీట్లను ఫ్లూయిడ్‌ ఇంక్‌తో మార్పు చేసిన ఘనత టీఎస్‌పీఎస్సీదేనని నాయకులు గుర్తు చేస్తున్నారు. ఉపాధ్యాయ  ఉద్యోగాల ఖాళీల భర్తీకి మూడుళ్ల నుంచి టెట్‌, డీఎస్సీ నోటిఫికేన్లు జారీ చేయకుండా ఇదిగో, అదిగో అంటూ కాలక్షేపం చేస్తున్న అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అటవీశాఖలో ఖాళీగా ఉన్న ఫారెస్టు రేంజి ఆఫీసర్లు, సెక్షన్‌ ఆఫీసర్లు, బీట్‌ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ రద్దుల పద్దులో చేరింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాన్నీ విద్యార్థులు, నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా వీరందర్నీ సమీకరించి, సర్కారుపై పోరాటానికి సిద్ధం చేయాలని  తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. 
నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణలో లోపాలు 
నిరుద్యోగుల జీవితాలతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ చెలగాటమాడుతోందన్నది కాంగ్రెస్‌ నేతల వాదన. నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణలో లోపభూయిష్టమైన విధానాలతో నిరుద్యోగులు బలిపశువులు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉండవన్న టీఆర్‌ఎస్‌.... అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు, ఉద్యోగుల మధ్య లడాయి పెట్టి, చోద్యం చూస్తోందన్న  వాదనలు ఉన్నాయి. ఈ విషయాలన్నిటినీ విద్యార్థులు, నిరుద్యోగుల దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుసల్పే విధంగా చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, నిరుద్యోగ మహా సంగ్రామానికి సిద్ధమైంది. టీ పీసీసీ నేతృత్వంలో తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ఈ మహా సంగ్రామ సభకు అన్ని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలను ఆహ్వానిస్తున్నారు. విద్యార్థి, నిరుద్యోగ మహా సంగ్రామ సభ ద్వారా టీఆర్‌ఎస్ నేతల గుండెల్లో దడపుట్టించి, ఈ వర్గాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. 

 

07:39 - May 21, 2017

నిజామాబాద్ : ఇది నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయం. ఈ యూనివర్సిటీలో మొదటి నుంచి వివాదాలే. తాజాగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకంలో వివాదం తలెత్తింది. ఇటీవల ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, అటెండర్, సెక్యూరిటీ గార్డుల పోస్ట్ లను భర్తీ చేశారు. అయితే వీసీ సాంబయ్య ఒక్కో పోస్టుకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

రాత పరీక్ష....
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో అభ్యర్ధులు రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే వర్సిటీ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండానే ప్రజా ప్రతినిధులకు చెందిన వ్యక్తులను ఉద్యోగాల్లో భర్తీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థి సంఘాలకు, విసికి మధ్య వివాదం ముదరడంతో పంచాయితీ నిజామాబాద్ ఎంపీ కవిత వద్దకు చేరినట్లు సమాచారం. దీనిపై కవిత వీసీని వివరణ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు విద్యాశాఖ అధికారులకు సమాచారం లేకుండా ఎలా నియామకాలు చేశారంటూ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జేఏసీ రంజన్‌ను నివేదిక కోరినట్లు తెలుస్తోంది. ఇక జరిగిన అవకతవకలపై ఇంటెలిజెన్స్ నిఘా విభాగం పూర్తి స్ధాయిలో ఆరా తీస్తున్నారు. ఇక ఈ విషయంపై వీసీ సాంబయ్యని ప్రశ్నిస్తే ఏజెన్సీ టెండర్ ప్రకారమే నియామకాలు చేశామని చెప్పారు. ఉద్యోగాల కోసం ఎవరైనా డబ్బులు ఇచ్చినట్లు ఆధారాలుంటే చూపించాలని ఆయన అన్నారు. ఏది ఏమైనా ఈ వివాదంపై అధికారులు పూర్తి స్ధాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉంది..లేదంటే వర్సిటీ అధికారులు మరింత అభాసుపాలయ్యే ప్రమాదం ఉంది. 

18:16 - May 9, 2017

హైదరాబాద్ : అది దేశంలోనే ఎంతో పేరు ప్రతిష్టలున్న యూనివర్శిటీ. ఎన్నో శక్తులు ఆ యూనివర్శిటీ పేరును దిగజార్చేందుకు ప్రయత్నించాయి. అయినా ఆ విశ్వవిద్యాలయం వన్నె కొంచెం కూడా తగ్గలేదు. ఎప్పుడూ లేని విధంగా ఈ విద్యాసంవత్సర ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. గత రెండేళ్లుగా ఆందోళనలతో హాట్ టాపిక్‌గా నిలిచిన హెచ్‌సీయూ.. విద్యార్థులు రారు అని జరిగిన ప్రచారాలను పటా పంచలు చేసింది. అడ్మిషన్ల వెల్లువతో యూనివర్శిటీ కళకళలాడుతోంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నించాయి. కానీ వారి వ్యూహాలేవీ ఇక్కడ పని చేయలేదు. యూనివర్శిటీ ఇప్పటికీ అదే చరిష్మాతో ముందుకు సాగుతోంది. రోహిత్ వేముల ఆత్మహత్య ముందు తరువాత జరిగిన అనేక ఘటనలు విశ్వ విద్యాలయ ప్రతిష్టను దెబ్బ తీశాయని.. ఇక ఈ యూనివర్శిటీకి విద్యార్థుల రాక తగ్గుతుందని ప్రచారం జరిగింది. కానీ వాటన్నింటినీ తిప్పికొడుతూ ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీకి ప్రవేశాల కోసం దరఖాస్తుల వెల్లువ వస్తోంది.

30 శాతం పెరిగిన దరఖాస్తులు..
గత రెండేళ్లుగా హెచ్‌సీయూ.. విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికింది. అనేక పోరాటాలకు కేంద్రబిందువైంది. ఈ క్రమంలో ఆందోళనలతో యూనివర్శిటీ పరువు పోతుందనీ కొందరంటే.. ప్రతిష్ట దిగజారుతుందనీ మరికొందరు మాట్లాడారు. అయితే భారీగా వచ్చిన దరఖాస్తులు వారందరి నోళ్లకు తాళం పడేలా చేశాయి. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో మొత్తం 124 కోర్సుల్లో దాదాపు 2 వేల సీట్లున్నాయి. వీటిలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 3 నుంచి మే 5 వరకు యూనివర్శిటీ అధికారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఎప్పుడూ లేని విధంగా విద్యార్థుల నుంచి 58 వేల 34 దరఖాస్తులు ఈ విద్యా సంవత్సరానికి వచ్చాయి. గతేడాది 44 వేల దరఖాస్తులు వచ్చాయి. అంటే దాదాపు 30 శాతానికి పైగా దరఖాస్తులు పెరిగాయి. వీటిలో 37 శాతం మహిళా అభ్యర్థుల నుంచి రావడం విశేషమనే చెప్పాలి.

విద్యార్థి సంఘాల హర్షం..
ఈ దరఖాస్తుల్లో ఓబీసీ అభ్యర్థులవి 35.9 శాతం, ఎస్సీ అభ్యర్థులవి 15.83 శాతం, ఎస్టీ అభ్యర్థులవి 9.60 శాతం ఉన్నాయి. అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 19 వేల 9 దరఖాస్తులు రాగా, తర్వాతి స్థానాల్లో కేరళ 6 వేల 515 దరఖాస్తులు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 5 వేల 918 దరఖాస్తులు ఉన్నాయి. హెచ్‌సీయూ ప్రవేశపరీక్షలు దేశవ్యాప్తంగా 37 కేంద్రాల్లో జూన్ 1 నుంచి 5 వరకు జరగనున్నాయి. విద్యార్థులు హాల్ టికెట్లను ఈ నెల 25 నుంచి హెచ్‌సీయూ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని యూనిర్శిటీ అధికారులు చెబుతున్నారు. యూనివర్శిటీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక్కో సీటుకు 29 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. దీని పట్ల యూనివర్సిటీ అధికారులతో పాటు విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

12:01 - May 4, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల యాభై వేల మంది విద్యార్ధులు డిగ్రీ పరీక్షలు రాయడానికి సిద్ధం అవుతున్నారు. ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో డిగ్రీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. ఈనెల 5 నుంచి కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలకు, 9న మహాత్మాగాంధీ యూనివర్సిటీ, 11 నుంచి శాతవాహన యూనివర్సిటీ, 23 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలకు, 19 నుంచి పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లోనూ డిగ్రీ పరీక్షలు మొదలు కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడం లేదంటూ ప్రైవేటు కాలేజ్ యాజమాన్యాలు డిగ్రీ పరీక్షలను బహిష్కరిస్తామని ప్రకటించాయి. దీంతో ఇవాళ జరగాల్సిన తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల్ని అధికారికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఇంకా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను వసూలు చేస్తూ కాలేజీలు నడుపుతున్నాయి. అయితే అవి సరిపోకపోవడంతో కాలేజీలు నడపలేక రోడ్డున పడ్డామని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో ఏ విధంగా ఫీజులు చెల్లిస్తారో అదే విధంగా చెల్లిస్తేనే నాణ్యమైన విద్య అందించగలమని చెబుతున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు పరీక్షలు అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి. 2016-17 విద్యా సంవత్సరంలో ప్రారంభమైన డీఓఎస్ టీ డిగ్రీ ఆన్ లైన్ సర్వీస్ తెలంగాణ ద్వారా అడ్మిషన్లు నిర్వహించారు. అయితే కొన్ని కాలేజీలు ఈ డీఓఎస్ టీలో భాగం అవ్వబోమని స్పష్టం చేసి వాటి ఇష్టానుసారం ఫీజులు వసూలు చేశాయి. ఇందులో భాగం అయిన కాలేజీలు మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే వసూలు చేస్తూ కాలేజీలు నడుపుతున్నాయి. తాజాగా వీటికి రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను కూడా విడుదల కాకపోవడంతో కాలేజీలు నడపడమే గగనంగా మారిందని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే తమ ఫీజులు చెల్లించమని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కి వినతిపత్రం సమర్పించాయి. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే డీఓఎస్ టీ నుంచి బయటకు వచ్చేస్తామని హెచ్చరిస్తున్నాయి. మరి వీరి డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. 

11:06 - May 3, 2017

నిజామాబాద్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తోన్న డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు నిలిచిపోయాయి. ప్రైవేట్‌ కాలేజీ యాజమాన్యాలు డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలను బహిష్కరించాయి. గత ఐదేళ్లుగా డిగ్రీ ఫీజులు పెరగక, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ సకాలంలో అందక ఇబ్బందిపడుతున్నామని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఫీజులు పెంచే వరకు ఆన్‌లైన్‌ అడ్మిషన్లలో తాము పాల్గొనబోమని తేల్చి చెప్పాయి. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు తమ కళాశాల్లలో పరీక్షలు జరగనివ్వమని స్పష్టం చేశాయి. ఫీజులు 40 నుంచి 50 శాతం పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు ఉన్నత విద్యామండలి చైర్మన్ తో భేటీ కానున్నారు.

 

 

07:43 - April 29, 2017

హైదరాబాద్ : దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్శిటీల్లో ఉస్మానియా యూనివర్శిటీ ఒక్కటి.. ఈ యూనివర్శిటీ ఎందరో మహా మహా ఉద్దండులను దేశానికి అందించిన చదువుల తల్లి.. యూనివర్శిటీని స్థాపించి వందేళ్లు పూర్తైన సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రారంభఉత్సవాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చిన వీరంతా ఎంతో నిరుత్సాహనికి గురయ్యారు. వందేళ్ల పండుగ అంటే ఎంతో గొప్పగా ఊహించుకున్న వారందిరినీ ఈ వేడుకలు తీవ్ర అసంతృప్తిగా గురిచేశాయి. దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ వేడులకలు అందరినీ ఆకట్టుకోలేకపోయాయి. ఉస్మానియా ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా మాత్రం ఈ ఉత్సవాలు జరగలేదనే విమర్శలు మొదలయ్యాయి.

కనిపించని విద్యార్థులు...
ఉత్సవాల ప్రారంభ సభ వేదిక చుట్టుపక్కల ఎక్కడా విద్యార్థులు కనిపించలేదు.. మొత్తం సభ ప్రభుత్వ సభలాగే కొనసాగింది. ముందు నుంచి
యూనివర్శిటీ సమస్యలపై గళమెత్తుతూ వస్తున్న విద్యార్ధులు రాష్ట్రపతి వస్తున్న సభలో ఏదైనా ఆటంకం కలిగిస్తారనే నెపంతో స్టేజి కి దాదాపుగా కొన్ని వందల మీటర్ల దూరంలో విద్యార్ధుల గ్యాలరీని ఏర్పాటు చేశారు. అయితే ప్రారంభ సభ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా టీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమంలా సాగాయని విద్యార్ధులు మండిపడుతున్నారు. వేడుకలు జరిగిన మూడు రోజుల పాటు ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ప్రణాళిక లేకుండా నిర్వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల కార్యక్రమాల్లో విద్యార్థుల భాగ్యస్వామ్యం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

 

07:58 - April 27, 2017

హైదరాబాద్:యూనివర్సిటీలు మేధావుల ఆలోచనలకు వేదికగా నిలుస్తాయని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రణబ్, ఓయూ వందేళ్లు పూర్తి చేసుకోవడం స్ఫూర్తిదాయకమని, తానీ వేడుకల్లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. నాటి మీర్ ఉస్మాన్ స్వప్నం నేడు సుసంపన్నమైందన్నారు. మరోవైపు గవర్నర్‌ నర్సింహన్, సీఎం కేసీఆర్ ఈ వేదికపై ప్రసంగించకపోవడం పట్ల విద్యార్థులు, ప్రతిపక్ష నేతలు భగ్గుమంటున్నారు. వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ సాధ్యం కాదన్నారు ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌. ముందస్తు ఎన్నికలు వస్తాయని సీఎం చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదని.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని మాత్రమే సూచించారని తెలిపారు. ఏడాది ముందే ఎన్నికలంటే ఎవరూ ఒప్పుకోరన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వినయ్ కుమార్, టిడిపి విద్యాసాగర్, వైసీపీ నేత మదన్ మోహన్ రెడ్డి, టిఆర్ ఎస్ నేతమన్నె గోవర్థన్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

21:29 - April 26, 2017

హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం శత వసంతోత్సవం ఘనంగా జరిగింది. ఓయూ శతాబ్ది ఉత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉత్సవాల పైలాన్‌ను కూడా ఆవిష్కరించారు. వందేళ్ల క్రితం ఇదే రోజు ఓయూ ఓ విజన్‌తో ప్రారంభమైందన్నారు రాష్ట్రపతి ప్రణబ్‌. వందేళ్లలో వర్సిటీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. వందేళ్ల క్రితమే ఉన్నత విద్యలో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచామన్నారు. ఉన్నత విద్యకు భారత్ ఎప్పటి నుంచో అంతర్జాతీయ చిరునామా అని పేర్కొన్నారు. 15వ శతాబ్దంలోనే నలంద యూనివర్శిటీ ఏర్పాటైన విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో ఐఐటీల ఏర్పాటు విద్యావ్యవ‌స్థలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చాయ‌ని చెప్పారు. దేశంలో ఉన్న ఐఐటీల్లో,ఎన్ఐటీల్లో, ఐఐఎస్సీల్లో 100శాతం క్యాంప‌స్ రిక్రూట్‌మెంట్లు జ‌రుగుతున్నాయ‌న్నారు. ఈ క్రమంలోనే యూనివ‌ర్శిటీల‌ను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్నమైంద‌న్నారు. యూనివ‌ర్శిటీల్లో నాణ్యాతా ప్రమాణాలు పెర‌గాల్సి ఉంద‌న్నారు.

మాట్లాడని సీఎం కేసీఆర్‌
మరోవైపు, ఉస్మానియా విశ్వవిద్యాలయ సమస్యలపై సీఎం కేసీఆర్‌ మాట్లాడుతారని విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ సీఎం ప్రసంగించకుండానే వెను తిరగడం... అటు గవర్నర్‌ నరసింహన్ కూడా మౌనంగా వెళ్లిపోవడం విద్యార్థుల ఆగ్రహానికి కారణమైంది. రాష్ట్రపతి సభ నుంచి బయటకు వెళ్లగానే విద్యార్ధులు బయటకు వచ్చి పెద్ద ఎత్తున కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. విద్యార్ధులు ఒక్కసారిగా బయటకు వచ్చి ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీగా వచ్చి నినాదాలు చేయడంతో..క్యాంపస్‌లో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాస్తవానికి ప్రారంభ సభలో రాష్ట్రపతి ప్రసంగం కన్నా ముందే గవర్నర్, సీఎం కేసిఆర్ స్పీచ్‌ ఉంటుందని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. కానీ విద్యార్థులు నిలదీసే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలోనే, వారు ప్రసంగించకుండా వెళ్లిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో సీఎం ప్రసంగించకపోవడంపై హస్తం నేతలు కూడా విమర్శలు కురిపిస్తున్నారు. ఓయూ శతాబ్ది వేడుకల్లో మాట్లాడలేక పారిపోయారని ఎద్దేవా చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ప్రాణాలు అర్పించిన ఓయూ విద్యార్థుల త్యాగాలను స్మరించుకోవాల్సిన తరుణంలో.. కేసీఆర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏదీఏమైనా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఓయూకు వెళ్లిన సీఎం కేసీఆర్‌.. మాట్లాడకుండానే వెనుతిరగడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

Pages

Don't Miss

Subscribe to RSS - osmania university