OU Centenary Grand Celebrations

21:29 - April 26, 2017

హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం శత వసంతోత్సవం ఘనంగా జరిగింది. ఓయూ శతాబ్ది ఉత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉత్సవాల పైలాన్‌ను కూడా ఆవిష్కరించారు. వందేళ్ల క్రితం ఇదే రోజు ఓయూ ఓ విజన్‌తో ప్రారంభమైందన్నారు రాష్ట్రపతి ప్రణబ్‌. వందేళ్లలో వర్సిటీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. వందేళ్ల క్రితమే ఉన్నత విద్యలో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచామన్నారు. ఉన్నత విద్యకు భారత్ ఎప్పటి నుంచో అంతర్జాతీయ చిరునామా అని పేర్కొన్నారు. 15వ శతాబ్దంలోనే నలంద యూనివర్శిటీ ఏర్పాటైన విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో ఐఐటీల ఏర్పాటు విద్యావ్యవ‌స్థలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చాయ‌ని చెప్పారు. దేశంలో ఉన్న ఐఐటీల్లో,ఎన్ఐటీల్లో, ఐఐఎస్సీల్లో 100శాతం క్యాంప‌స్ రిక్రూట్‌మెంట్లు జ‌రుగుతున్నాయ‌న్నారు. ఈ క్రమంలోనే యూనివ‌ర్శిటీల‌ను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్నమైంద‌న్నారు. యూనివ‌ర్శిటీల్లో నాణ్యాతా ప్రమాణాలు పెర‌గాల్సి ఉంద‌న్నారు.

మాట్లాడని సీఎం కేసీఆర్‌
మరోవైపు, ఉస్మానియా విశ్వవిద్యాలయ సమస్యలపై సీఎం కేసీఆర్‌ మాట్లాడుతారని విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ సీఎం ప్రసంగించకుండానే వెను తిరగడం... అటు గవర్నర్‌ నరసింహన్ కూడా మౌనంగా వెళ్లిపోవడం విద్యార్థుల ఆగ్రహానికి కారణమైంది. రాష్ట్రపతి సభ నుంచి బయటకు వెళ్లగానే విద్యార్ధులు బయటకు వచ్చి పెద్ద ఎత్తున కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. విద్యార్ధులు ఒక్కసారిగా బయటకు వచ్చి ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీగా వచ్చి నినాదాలు చేయడంతో..క్యాంపస్‌లో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాస్తవానికి ప్రారంభ సభలో రాష్ట్రపతి ప్రసంగం కన్నా ముందే గవర్నర్, సీఎం కేసిఆర్ స్పీచ్‌ ఉంటుందని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. కానీ విద్యార్థులు నిలదీసే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలోనే, వారు ప్రసంగించకుండా వెళ్లిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో సీఎం ప్రసంగించకపోవడంపై హస్తం నేతలు కూడా విమర్శలు కురిపిస్తున్నారు. ఓయూ శతాబ్ది వేడుకల్లో మాట్లాడలేక పారిపోయారని ఎద్దేవా చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ప్రాణాలు అర్పించిన ఓయూ విద్యార్థుల త్యాగాలను స్మరించుకోవాల్సిన తరుణంలో.. కేసీఆర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏదీఏమైనా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఓయూకు వెళ్లిన సీఎం కేసీఆర్‌.. మాట్లాడకుండానే వెనుతిరగడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

15:14 - April 26, 2017

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వందేళ్ల ఉత్సవంలో మాట్లాడకపోవడంపై విద్యార్థులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఏ గ్రౌండ్ నుంచి అర్ట్స్ కాలేజీ వరకు సుమారు 600 మంది విద్యార్ధులు భారీ ర్యాలీ నిర్వహించారు. 100 ఏళ్ల ఉస్మానియాకు అవమానం జరిగిందని విద్యార్థులు ఆవేదన వెలుబుచ్చారు. సీఎం యూనివర్సిటీకి వరాలు ప్రకటిస్తారని ఎదురు చూసిన తమకు నిరాశ మిగిలిందని, కనీసం గవర్నర్ కూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

14:42 - April 26, 2017

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఐఐటీలో చదివిన వారికి వంద శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు. ఉన్నత విద్యలో ఇప్పటికే ఎంతో అభివృద్ధి సాధించామని, ఇంకా విప్లవాత్మక మార్పులు వస్తాయనడంలో అతిశయోక్తి లేదన్నారు. మేధావుల ఆలోచనలకు విశ్వవిద్యాయాలు వేదికలుగా నిలుస్తున్నాయని మేధావులు, విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక అంశాలపై దృష్టి సారించాలని ప్రణబ్‌ ముఖర్జీ పిలుపునిచ్చారు. పారిశ్రామిక అంశాలకు దోహదపడేలా యూనివర్శిటీల్లో పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. 

14:37 - April 26, 2017

హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. వందేళ్ల క్రితం ఇదేరోజు ఒక విజన్‌తో ఓయూ ప్రారంభమైందన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్సవాల సావనీర్‌ను తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఓయూ అత్యున్నత విశ్వవిద్యాలయం. వందేళ్ల క్రితం మీర్‌ అలీ ఉస్మాన్‌ ఖాన్‌ దీన్ని ప్రారంభించారు. ఈ వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఉన్నత విద్యలో వందల సంవత్సరాల క్రితమే భారత్‌ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. 

11:39 - April 26, 2017

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు సన్నద్ధవుతోంది. యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాకులు ఉత్తమ పరిశోధనలు చేయడంలో ఈ లైబ్రరీ కీలక పాత్ర పోషిస్తోంది.

ప్రపంచానికి మేధావులను అందించిన ఓయూ లైబ్రరీ...

ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఉస్మానియా యూనివర్సిటీ గ్రంథాలయం రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఓయూలో చదవి, ఈ లైబ్రరీని ఉపయోగించుకున్న ఎంతోమంది మేధావులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. కవులు, కళాకారులు, గాయకులు, రచయితలు, క్రీడాకారులు, రాజకీయవేత్తలుగా రాణిస్తున్నారు. ఎందరో సరస్వతీ పుత్రులను ప్రపంచానికి అందించన ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ... చాలా ఉద్యమాలకు ఊపిరిపోసింది. ముల్కి ఉద్యమం మొదలు తెలంగాణ రైతాంగ పోరాటం, సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల వరకు అన్నీ కూడా ఇక్కడే పురుడుపోసుకున్నాయి.

అందుబాటులో 5,40,387 పుస్తకాలు ...

ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ చదువుల తల్లి. ఈ గ్రంథాలయంలో 5,40,387 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పోటీ పరీక్షలకు హారజయ్యే విద్యార్థులకు ఈ లైబ్రరీ ఎంతో బాగా ఉపయోగపడుతోంది.

ఏడాదిలో 360 రోజులు పని చేస్తున్న ఓయూ లైబ్రరీ ...

విద్యార్థుల అవసరాలకు అనుగుణగా లైబ్రరీ పని వేళలు, పని దినాలు ఉన్నాయి. ఏడాదిలో ఐదు రోజులు మినహా మిగిలిన 360 రోజులు పని చేస్తుంది. పద్నాలుగు విభాగాల్లో సేవలు అందిస్తోంది. విలువైన ఎన్నో గ్రంథాలను భవిష్యత్‌ తరాల కోసం డిజటలీకరణ చేశారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, కవీంద్రుడు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వంటి చాలా మంది ప్రముఖులు ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. 6,825 చేతిరాత ప్రతులు, 45 వేల డిజిటల్‌ పుస్తకాలు, 253 పిరియాడికల్స్‌, 273 పిల్మ్‌లు ఈ లైబ్రలో విద్యార్థులు, పరిశోధకులకు అందుబాటులో ఉన్నాయి. తాళపత్ర గ్రంథాలు, ప్రాచీన రాత ప్రతులు కూడా ఉస్మానియా యూనిర్సిటీ లైబ్రరీలో ఉన్నాయి. తెలుగు, తమిళనం, కన్నడ, మరాఠీ, హిందీ, ఉర్దూ, పార్సీ, అరబిక్‌, హిబ్రూ... ఇలా పలు భాషల గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ లైబ్రరీని తీర్చిదిద్దారు.

విజ్ఞాన భాండాగారం భాసిల్లుతున్నఉస్మానియా ...

విజ్ఞాన భాండాగారం భాసిల్లుతున్నఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ భవిష్యత్‌ తరాలకు మరింత మెరుగైన సేవలు అందిచేలా దినదిన ప్రవర్థమానం చెందాలని అందరూ ఆశిస్తున్నారు. 

09:33 - April 26, 2017

హైదరాబాద్: ఎందరో విద్యావేత్తలను, మేధావులను తీర్చిదిద్దిన ఉస్మానియా విశ్వవిద్యాలయం నాటి హైదరాబాద్‌ రాజ్యంలో ఏర్పాటైన తొలి విశ్వవిద్యాలయం. వందేళ్లనాటి ఇంజనీరింగ్‌ ప్రతభను నేటీకీ చాటుతూ ఆద్భుతంగా భాసిల్లుతోంది.. ఆర్ట్స్‌ కళాశాల భవనం. హైద‌రాబాద్ అంటే చార్మనార్‌ ఎలా గుర్తుకు వ‌స్తుందో .. ఉస్మానియా యూనివ‌ర్సిటి అనగానే ఇక్కడి ఆర్ట్స్ కాలేజీయే అందరి మదిలోనూ మెదులుతుంది.

1873లోనే ఓయూ మొదటి ప్రతిపాదన ....

ఉస్మానియా విశ్వవిద్యాలయ ఏర్పాటు ప్రతిపాదన 1873లోనే జరిగింది. ఆనాటి ఇద్దరు ప్రముఖ మేధావులు రఫత్ యార్ జంగ్, జమాలుద్దీన్ అఫ్‌ఘనీ ఈ విషయమై చొరవ తీసుకున్నట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఆ కాలంలోనే జమాలుద్దీన్‌ అఫ్‌ఘనీ పారిస్ నగరంలో స్థిరపడ్డారు. అక్కడ బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడైన బ్లంట్‌ని 1882లో కలిసినప్పుడు హైదరాబాద్‌లో విశ్వవిద్యాలయ ఏర్పాటు గురించి ప్రస్తావించారట. అలా ఈ చదువుల సౌధానికి తొలి ప్రతిపాదన జరిగింది. ఆతర్వాత బ్రిటీష్‌ఎంపీ బ్లంట్ నిజాం ఆస్థానంలోని ప్రధానమంత్రి సాలార్‌జంగ్-2ను కలిసి.. విశ్వవిద్యాలయ ఏర్పాటుపై చర్చించారట. అనంతరం ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్‌కు 1883 జనవరి 24న వర్సిటీ ఏర్పాటుకు లిఖిత పూర్వక ప్రతిపాదన అందజేశారు.

1913లో దార్-ఉల్-ఉలూం పేరుతో విద్యార్థుల ప్రదర్శలు...

1913లో ప్రాంతంనుంచే హైదరాబాద్‌ రాజ్యంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలంటూ.. దార్-ఉల్-ఉలూం పేరిట విద్యార్థులు నగరంలో ప్రదర్శనలు కూడా జరిపేవారట. ఈ నేపథ్యంలో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సింహాసనం అధిష్ఠించారు. 1914లో విద్యార్థి సంఘం నాయకులు పబ్లిక్ గార్డెన్స్‌లోని టౌన్ హాలులో ఏడవ నిజాం ప్రభువును కలిసి తమ ప్రతిపాదనను ఆయన ముందుంచారని, దీనిపై స్పందించిన నిజాం నవాబు తన అంగీకారం తెలిపాడని చరిత్రకారులు చెబుతారు.

1917 ఏప్రిల్‌ 267వ నిజాం వర్సిటీ ఏర్పాటుపై ఫర్మానా...

ఓవైపు ఆరవ నిజాంకాలంలో జరిగిన కృషి, విద్యార్థులు, మేధావుల కోరిక మేరకు 1917 ఏప్రిల్‌ 26న 7వ నిజాం లాంఛనంగా ఫర్మానా జారీ చేశారు. అలా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది. ప్రస్తుత అబిడ్స్ ప్రాంతంలో ఒక అద్దె భవనంలో మొట్టమొదట తరగతులు ప్రారంభించారు. అనంతరం ప్రొఫెసర్‌ సర్ పాట్రిక్ గాడ్డెస్ నేతృత్వంలో అడిక్‌మెట్ ప్రాంతంలో 1700 ఎకరాల విశాలమైన స్థలాన్ని విశ్వవిద్యాలయం కోసం కేటాయించింది ఏడవ నిజాం ప్రభుత్వం.

బిల్డింగ్‌ నమూనా ఎంపికలో ఆర్కిటెక్ట్‌ల కృషి ...

ఆతర్వాత వర్సిటీ భవన నిర్మాణానికై నమూనాల ఎంపిక కోసం హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు నవాబ్ జైన్ యార్‌జంగ్, సయ్యద్ అలీ రజాలు ఇంగ్లండ్, ఫ్రాన్స్, జపాన్, టర్కీ, అమెరికా దేశాల్లో పర్యటించారు. తిరుగు ప్రయాణంలో ఈజిప్టులో బెల్జియం ఆర్కెటెక్ట్ జాస్పర్‌ను కలిసి హైదరాబాద్‌లో విశ్వవిద్యాలయ బిల్డింగ్స్‌ రూపకల్పనపై చర్చించారట. తర్వాత నవాబ్ జైన్, ఆయన మిత్రులు హైదరాబాద్‌కు తిరిగి వచ్చి, విశ్వవిద్యాలయ భవన రూపకల్పన కోసం ఈజిప్టు ఆర్కిటెక్ట్ జాస్పర్ పేరును 7వ నిజాందగ్గర ప్రతిపాదించారు.

బీదర్, గోల్కొండ, చార్మినార్, ఎల్లోరా..

అలా నిజాం అనుమతితో జాస్పర్ పదవీ బాధ్యతలు చేపట్టి బీదర్, గోల్కొండ, చార్మినార్, ఎల్లోరా, అజంతా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. భారతీయ శిల్పకళ, సంస్కృతీ విధానాలను ఆకళింపు చేసుకుని, హైదరాబాద్ సంస్కృతితో మేళవించి.. ప్రస్తుతం ఉన్న ఓయూ ఆర్ట్స్ కళాశాల భవన నమూనాను రూపొందించారు. దీంతో వర్సిటీ భవన నిర్మాణ పనులకు ఏడో నిజాం పునాది రాయి వేశారు. ఈ భవన నిర్మాణంలో సుమారు 35 వేల మంది కార్మికులు శ్రమించారు. కళాశాల ప్రధాన భవనం 110 మీటర్ల వెడల్పు, 119 మీటర్ల ఎత్తుతో రెండంతస్తుల్లో నిర్మించారు. సుమారు 164 విశాలమైన తరగతి గదులతో ఈ చదువుల కోవెల కొలువుదీరింది. దీని నిర్మాణం కోసం ఆ రోజుల్లో దాదాపు 36 లక్షల రూపాయలు ఖర్చు చేసింది నిజాం ప్రభుత్వం. సుమారు ఐదున్నరేళ్లపాటు నిరంతరంగా కొనసాగి.. 1919 డిసెంబర్ 5 నాటికి పూర్తయింది. ఈ బిల్డింగ్‌ నిర్మాణంలో హ్యూమ్ పైప్ కంపెనీ, హైదరాబాద్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలు పాలుపంచుకున్నాయి. కళాశాల నిర్మాణ శైలిలో సర్వమత సమ్మేళనం కనిపించేలా తీర్చిదిద్ది.. తమ విశాల దృక్పథాన్ని చాటుకున్నారు నిజాంపాలకులు.

1919లో ఇంటర్ తరగతులతో కళాశాల ప్రారంభం...

భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ..1919లో ఇంటర్ తరగతులతో కళాశాల ప్రారంభమైంది. 1921 నాటికి బీఏ, 1923 నుంచి పీజీ తరగతులు మొదలయ్యాయి. కాలేజీ ప్రారంభంలో ఉర్దూ మాధ్యమంలోనే తరగతులు నిర్వహించినా.. 1948 నుంచి ఇంగ్లిష్‌లో కూడా బోధన ప్రారంభించారు. యూనివర్సిటీలో విదేశీ భాషల్లోనూ బోధన జరుగుతోంది. ప్రస్తుతం 87దేశాలకు చెందిన 4వేల మంది విద్యార్థులు ఓయూలో చదువుకుంటున్నారు.

మాజీ ప్రధాని పీవీ , ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వై.వి.రెడ్డి ,అజారుద్దీన్‌ ఓయూ స్టూడెంట్స్‌

వందేళ్లనుంచి విద్యావెలుగులను పంచుతున్న ఉస్మానియా యూనివర్సిటీ ఎందరో మేధావులు, ప్రముఖులను దేశానికి అందించింది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ ఆర్‌బీఐ గవర్నర్‌ వైవీరెడ్డి, ఇండియా క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ ఆజారుద్దీన్‌ లాంటివారు ఈ విశ్వవిద్యాయలంలో చదువుకున్నవారే. చదువులకే కాదు.. సమకాలీన సమస్యలపై గళం విప్పి.. ప్రత్యక్ష్య ఉద్యమంలో దూకడానికి ఓయూ సదా సిద్ధంగా ఉంటూనే వచ్చింది. స్వాతంత్ర్య పోరాటం నుంచి రజాకార్ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల వరకు .. ఈ యూనివర్సిటీ విదయార్థులు సమరశీల పోరాటాలు జరిపారు. ఇలా ఈ విశ్వవిద్యాలయం భవనం ఉన్నత చదువులు, రాజకీయ, సామాజిక ఉద్యమాలకు వేదిగా.. తన విశిష్ట చరిత్రను కళ్లముందు నిలపడంతోపాటు.. జాతి వారసత్వ సంపదగా ఓయూ భవనం నేటికీ పర్యాటకులను ఆకట్టుకుంటోంది.

07:58 - April 26, 2017

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాలు ఇవాళ్టి నుంచే మొదలవుతున్నాయి. యూనివర్సిటీ చాన్స్ లర్, గవర్నర్ నరసింహన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ ఉత్సవాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు దాదాపు పదిహేనువేల మంది ప్రముఖులు ఉస్మానియా యూనివర్సిటీ ఉత్సవాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. భారతదేశానికే ఒక ప్రధానిని అందించిన ఘనత వున్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? ఉస్మానియా గత వైభవాన్ని నిలుపుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రతి గ్రామానికి రైతు సంఘాన్నిఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారు. ముందు పండి కందులు, మిర్చి రైతులను ఆదుకునే వారు ఎవరు? పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం లేదా?రైతు ఉద్యమాల్లో రైతుల సలహాలను తీసుకోవాల్సిన అవసరం లేదా? ప్రభుత్వాసుపత్రుల్లో బాలింతల మరణాలు, ఈ అంశాలపై 'న్యూస్ మార్నింగ్ ' చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ విశ్లేషకులు నడిపంల్లి సీతారామరాజు, టిఆర్ ఎస్ నేత కె.రాజీమోహన్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి,మాజీ ఎంపీ, టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి, బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:49 - April 26, 2017

హైదరాబాద్‌ : నేడు నగరంలో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నగరంలో పర్యటించే ప్రాంతాల్లో ఆయా సమయాల్లో ఈ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

మధ్యాహ్నం 12.30కు ఓయూకు రాష్ట్రపతి

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మధ్యాహన్నం 12న్నర గంటల తర్వాత బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి ఉస్మానియా యూనివర్సిటీ చేరుకుంటారు.

కార్యక్రమం అనంతరం రాజ్‌భవన్‌కు రాష్ట్రపతి వెళ్లనున్నారు. అక్కడి నుంచి గచ్చిబౌలీలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ అడిటోరియంలో జరిగే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ ల్యాంగేజ్ యూనివర్సిటీ కార్యక్రమానికి హాజరువుతారు. రాష్ట్రపతి పర్యటించే ఈ రూట్లలో ఆంక్షలు కొనసాగుతాయని పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్లే ఆర్టీసి బస్సులను మళ్లిస్తుండడంతో వాహనదారులు, ప్రయాణీకులు తమ గమ్యస్థానాలను సులువుగా చేరుకునేందుకు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని పోలీస్‌ అధికారులు సూచించారు.

అడిక్‌మెట్‌ -ఆర్ట్స్‌ కాలేజీ -తార్నాక వెళ్లే వాహనాలను.. సీతాఫల్‌ టీజంక్షన్‌ వద్ద సీతాఫల్‌మండి వైపు మళ్లింపు

రాష్ట్రపతి పర్యటించే సమయంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. అడిక్‌మెట్ ఫ్లైఓవర్, ఆర్ట్స్ కాలేజీ నుంచి తార్నాక వైపు వెళ్లే వాహనాలు సీతాఫల్ టీ జంక్షన్ వద్ద సీతాఫల్‌మండి వైపు మళ్లిస్తారు. అటు హబ్సిగూడ నుంచి తార్నాక వైపు వెళ్లే వాహనాలను రాజ్యాభిలేఖ తార్నాక స్ట్రీట్ నెం.1 వద్ద, లాలాపేట్ నుంచి వచ్చే వాహనాలను డేవిడ్ మెమోరియల్ స్కూల్ వద్ద నిలిపివేస్తారు.

వివిధ రూట్లలో ఆర్టీసీ బస్సుల మళ్లింపు

ఇక ఆర్టీసీ బస్సుల ను కూడా వివిధ రూట్లలో మళ్లించనున్నారు. ఎన్‌సీసీ గేట్ నుంచి పాసు ఉన్న వాహనాదారులను మాత్రమే ఉస్మానియా క్యాంపస్‌లోకి పంపిస్తారు. సాధారణ వాహనాలను డీడీ కాలనీ, విద్యానగర్ వైపు మళ్లిస్తారు. ప్రధాన డైవర్షన్ రాంనగర్ టీ జంక్షన్, విద్యానగర్ టీ జంక్షన్ వద్ద ఉంటుందని పోలీసులు తెలిపారు.

తార్నాక నుంచి వెళ్లే రూట్ నెం. 3 ఆర్టీసి బస్సులు స్ట్రీట్ నెం. 8 హబ్సి గూడ, రామాంతపూర్, అంబర్‌పేట్ 6 జంక్షన్, నింబోలిఅడ్డా మీదుగా కాచిగూడ రూట్‌లో వెళ్లాల్సి ఉంటుంది. అలాగే

ఆఫ్జల్‌గంజ్ లేదా కోఠి నుంచి ఈసీఐఎల్ వైపు వెళ్లే వాహనాలు చాదర్‌ఘాట్, నింబోలి అడ్డా, అంబర్‌పేట 6 జంక్షన్, అంబర్‌పేట్, రామాం తపూర్, హబ్సిగూడ స్ట్రీట్ నెం. 8 నుంచి ఈసీఐఎల్‌కు వెళ్లాలని పోలీస్‌ అధికారులు తెలిపారు.

దిల్‌సుఖ్‌నగర్‌ - సికింద్రాబాద్‌ 107 బస్సులు :

అటు దిల్‌సుఖ్‌నగర్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించే 107 రూట్ బస్సులను విద్యానగర్ వద్ద మళ్లిస్తారు, ఈ బస్సులు హిందీ మహా విద్యా లయ, ఆర్టీసి ఎక్స్ రోడ్స్, ముషీరాబాద్ మీదుగా సికింద్రాబాద్ రూట్‌లో నడుస్తాయి. ట్రాఫిక్‌ నియంత్రణ, నిబంధనలకు పౌరులు సహకరించానలి సీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. 

06:45 - April 26, 2017

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధ, గురు, శుక్రవారాల్లో మూడు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో యూనివర్సిటీలో పండుగ వాతావరణం నెలకొంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులు, విద్యార్థులు సిద్ధమయ్యారు. ఇందుకోసం క్యాంపస్‌లోని గ్రౌండ్స్‌ను ముస్తాబు చేశారు.

విద్యార్థి సంఘాలతో నగర పోలీసు కమిషనర్‌ చర్చలు ...

అయితే.. సంబురాలకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ఉండేందుకు ఓయూలోని విద్యార్థి సంఘాలతో నగర పోలీసు కమిషనర్‌ చర్చలు జరిపారు. ఉత్సవాలు సామరస్యంగా.. ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా వారిని ఒప్పించారు.

కొంతమంది నేతలను అరెస్టు చేయడంతో ....

విద్యార్థి సంఘాలు సహకరిస్తామని చెప్పినప్పటికీ.. ఇప్పటికే కొంతమంది నేతలను అరెస్టు చేయడంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు ఓయూ ఉత్సవాలను దేశం గర్వించే విధంగా నిర్వహిస్తామంటున్నారు ఓయూ విద్యార్థి, ఎంపీ బాల్క సుమన్‌. ఎంతోమంది మేధావులు రాజకీయ నేతలను అందించిన ఉస్మానియా యూనివర్సిటీ.. శతాబ్ధి ఉత్సవాల్లో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి.

నేడు ప్రణబ్ ముఖర్జీ రాక

ఇక బుధవారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రానున్న నేపథ్యంలో జాతీయ భద్రతా దళాలు ఓయూని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పాసులు ఉన్నవారిని తప్ప ఇతరులను లోపలికి అనుమతించేది లేదంటున్నారు. అలాగే యూనివర్సిటీలో భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరోవైపు విద్యార్థులు ముఖ్యమంత్రిని అడ్డుకుంటారన్న ఉద్దేశంతో పోలీసులు మరిన్ని బలగాలను మోహరించే అవకాశం ఉంది.

చరిత్రలో నిలిచిపోయే విధంగా ...

మొత్తానికి ఓయూ ఉత్సవాలను చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే.. ప్రతిరోజు సాయంత్రం ఓయూ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 

06:41 - April 26, 2017

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాలు ఇవాళ్టి నుంచే మొదలవుతున్నాయి. యూనివర్సిటీ చాన్స్ లర్, గవర్నర్ నరసింహన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ ఉత్సవాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు దాదాపు పదిహేనువేల మంది ప్రముఖులు ఉస్మానియా యూనివర్సిటీ ఉత్సవాల్లో పాల్గొంటారని అంచనా. భారతదేశానికే ఒక ప్రధానిని అందించిన ఘనత వున్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? ఉస్మానియా గత వైభవాన్ని నిలుపుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలోచర్చను చేపట్టింది. ఈ చర్చలో ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని, లేడీస్ హాస్టల్ కేంద్రంగా అనేక విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఎస్ ఎల్ పద్మ పాల్గొన్నారు. పూర్తి వివరా లకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

Pages

Don't Miss

Subscribe to RSS - OU Centenary Grand Celebrations