pakistan

15:51 - October 26, 2017

పాకిస్తాన్ : అవినీతి కేసుల్లో చిక్కుకున్న పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌కు కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు పాకిస్తాన్‌ కోర్టు బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేసింది. నవంబర్‌3వ తేదీన కోర్టులో హాజరుకావాలని నవాజ్‌ను ఆదేశించింది. ప్రస్తుతం నవాజ్‌ షరీఫ్‌ లండన్‌లో ఉన్నారు. ఆయన భార్య కుల్సుం లండన్‌లో క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. గత ఏడాది పనామా పత్రాల్లో నవాజ్‌ షరీఫ్‌ కుటుంబ సభ్యుల పేర్లు బయటకు రావడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. లండన్‌లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని నవాజ్‌ షరీఫ్‌ కుటుంబం ఆరోపణలు ఎదుర్కొంటోంది.

 

15:07 - October 21, 2017

ఢిల్లీ : 2015లో కిడ్నాప్‌కు గురైన పాకిస్తాన్‌ జర్నలిస్టు జీనత్‌ షెహజాదీ ఆచూకి లభించింది. పాకిస్తాన్‌-ఆఫ్గనిస్తాన్‌ సరిహద్దులో ఆమెను రెస్క్యూ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మానవ హక్కుల కోసం పోరాడుతున్న జీనత్‌ను పాకిస్తాన్‌ నిఘావర్గాలే కిడ్నాప్‌ చేశాయని ఆమె కుటుంబం సభ్యులు, మానవహక్కుల సంఘాలు ఆరోపించాయి. 25 ఏళ్ల జీనత్‌ ఫ్రీలాన్స్‌ రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. తప్పిపోయిన మనుషుల ఆచూకి కోసం తన కలాన్ని సంధించారు. అడ్రస్‌ లేకుండా పోయిన భారత్‌కు చెందిన ఇంజనీర్ హమీద్‌ అన్సారీ కోసం ఆమె పత్రికలు, టీవీ ఛానళ్లలో కథనాలు రాశారు. సోషల్‌ మీడియా ద్వారా హమీద్‌ అన్సారీ తల్లి ఫౌజియా అన్సారీని సంప్రదించారు. హమీద్‌ అన్సారీ మిస్సింగ్‌ కేసును రిపోర్టు చేస్తున్న జీనత్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. జీనత్‌ కిడ్నాప్‌కు ముందు పాక్‌ భద్రతా బలగాలు ఆమెను 4 గంటలు అదుపులోకి తీసుకుని హమీద్‌ విషయంలో విచారణ జరిపినట్లు సమాచారం. 2015లో గూఢచర్యం కేసు కింద హమీద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాకిస్తాన్‌ సైనిక కోర్టు ఆయనకు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2015లోనే జీనత్‌ కిడ్నాప్‌కు గురైంది. 

21:35 - October 19, 2017

అప్ఘానిస్తాన్ : ఆఫ్గనిస్తాన్‌లో ఉగ్రవాదులు మళ్లీ మారణహోమం సృష్టించారు. కాందహార్‌ ప్రావిన్స్‌లోని ఆర్మీ క్యాంప్‌పై దాడికి దిగారు. రెండు కారు బాంబులను పేల్చిన ఆత్మాహుతి దాడిలో 43 మంది సైనికులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి.ఈ దాడికి తామే బాధ్యులమని తాలిబన్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. తాలిబన్లను వ్యతిరేకిస్తూ ఆఫ్గాన్‌ దళాలు దాడులు చేస్తున్న నేపథ్యంలోనే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్లు పేర్కొంది. గత వారం రోజుల్లో ఇది మూడో పేలుడు ఘటన.

21:34 - October 19, 2017

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, ఆయన కూతురు మర్యామ్, అల్లుడు మహమ్మద్‌ సఫ్దర్‌లపై పాకిస్తాన్ అవినీతి వ్యతిరేక కోర్టు నేర అభియోగాలు నమోదు చేసింది. నేషనల్ ఎకౌంటబులిటీ బ్యూరో చేసిన అవినీతి ఆరోపణల మేరకు.. వీరిపై అభియోగాలు దాఖలు చేసింది. నవాజ్‌ షరీఫ్, అతని కుటుంబ సభ్యులు, ఆర్థిక మంత్రి ఈశాక్‌ డార్‌లకు వ్యతిరేకంగా మూడు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఎన్ఏబి తనపై విడివిడిగా అవినీతి కేసులు నమోదు చేయడంపై నవాజ్‌ షరీఫ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పనామా పత్రాల స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాజ్ షరీఫ్‌ జూలై 28న ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. 

09:25 - October 16, 2017

ఇస్లామాబాద్ : జమాతుద్దవా చీఫ్ హఫీజ్ సయీద్‌పై ఉన్న ఉగ్రవాద ఆరోపణలను ఉపసంహరించుకుంది పాకిస్థాన్. ఉగ్రవాద ఆరోపణలు వెనక్కి తీసుకోవడంతో ఇన్నాళ్లూ హౌజ్ అరెస్ట్‌లో ఉన్న సయీద్‌ను ఇక విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. యాంటీ టెర్రరిజం యాక్ట్ కిందే గతంలో సయీద్‌ను అదుపులోకి తీసుకున్నారు పాక్ అధికారులు. అయితే ఇప్పుడు సయీద్‌తోపాటు అతని నలుగురు అనుచరులు ఈ చట్టం కిందికి రాకపోవడంతో వాళ్లను రిలీజ్ చేయాలని సయీద్ తరఫు లాయర్ ఏకే డోగార్ వాదించారు. అయితే సయీద్‌తోపాటు జేయూడీపై అన్ని ఆధారాలను తాము సమర్పిస్తామని లాహోర్ హైకోర్టుకు పాక్ ప్రభుత్వం తెలిపింది. సయీద్‌పై ఇప్పటికే యూఎన్, యూఎస్ నిషేధం విధించారు. అతన్ని అరెస్ట్ చేస్తే కోటి డాలర్లు కూడా ఇస్తామని ప్రకటించాయి. 2008 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి అయిన సయీద్‌ను ఈ ఏడాది జనవరిలో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచీ అతను గృహ నిర్బంధంలోనే ఉన్నాడు.

20:54 - October 15, 2017

ఢిల్లీ : ఆసియా కప్‌ హాకీ టోర్నీలో భారత్‌ దుమ్ములేపింది. పూల్‌ ఏ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 3..1తో చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో భారత్‌ 9 పాయింట్లతో పూల్‌-ఏలో అగ్రస్థానంతో ముగించింది. చింగల్‌సేన 13 నిమిషంలో, రమణ్‌దీప్‌ సింగ్‌ 44 నిమిషంలో, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 45వ నిమిషంలో గోల్‌ కొట్టారు. పాక్‌లో అలీషాన్‌ ఒక్కడే గోల్‌ చేయగలిగాడు. టోర్నీలో భారత్‌కిది వరుసగా మూడో విజయం. తొలి మ్యాచ్‌లో జపాన్‌ను 5..1, రెండో మ్యాచ్‌లో బంగ్లాను 7...0తో చిత్తుచిత్తుగా ఓడించింది.

 

13:18 - October 13, 2017

ప్రకాశం : మరో జవాన్ దేశం కోసం తన ప్రాణాలను అర్పిచి భారతమాత నెత్తుటిపై నెత్తుటి తిలకం దిద్దాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబుళాపురానికి చెందిన రామకృష్ణా రెడ్డి దుండగల్ సెక్టార్ లో విధులు నిర్వహిస్తుండగా పాక్ సైన్యం కాల్పుల్లో మృతి చెందాడు. ఉన్న ఒక్క కొడుకు మరణించడంతో రామకృష్ణారెడ్డి తల్లిదండ్రులు విషాదంలో మునిపోయారు. తన కొడుకు 120 కోట్ల మంది కోసం ప్రాణాలర్పించిన అమరుడుని రామకృష్ణారెడ్డి తండ్రి అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

20:36 - September 27, 2017

పాకిస్తాన్ : టమాట కేజీ వంద రూపాయలంటేనే మనం అల్లాడిపోతాం....అలాంటిది పాకిస్తాన్‌లో కేజీ టమాటా 300 రూపాయలు పలుకుతోంది. లాహోర్‌, పంజాబ్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో కిలో టమోటో ౩ వందలు, రావల్పిండి, ఇస్లామాబాద్‌లో 2 వందలు రూపాయలు ఉంది. భారత్‌ నుంచి సరఫరా తగ్గిపోవడంతో పాకిస్తాన్‌కు ఈ సమస్య వచ్చింది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా భారత్‌ నుంచి మాత్రం టమోటోను దిగుమతి చేసుకునేది లేదని పాక్‌ ఆహార భద్రత మంత్రి సికందర్‌ హయత్‌ బోసన్‌ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాక్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. బలుచిస్తాన్‌లో టమాట కోతకు వచ్చిందని మరి కొద్ది రోజుల్లో ధరలు తగ్గనున్నాయని చెబుతున్నారు.

 

21:37 - September 22, 2017

శ్రీనగర్ : సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌ సైన్యానికి భారత్ తీవ్ర హెచ్చరికలు చేసింది. భారత సైనికులపై మరోసారి కాల్పులకు తెగబడితే తగిన రీతిలో సమాధానం చెబుతామని పాకిస్తాన్‌కు స్పష్టం చేసింది. భారత, పాకిస్తాన్‌లకు చెందిన డిజిఎంవోల మధ్య ఫోన్‌లో చర్చలు జరిగాయి. భారత ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఆరుగురు పాకిస్తాన్‌ పౌరులు మృతి చెందారని, 26 మంది గాయపడ్డారని పాకిస్తాన్‌ ఆరోపించింది. పౌరులపై కాల్పులు జరపలేదని భారత్‌ స్పష్టం చేసింది. జమ్ము సెక్టార్‌లో పాకిస్తాన్‌ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడినందునే భారత్‌ దీటుగా స్పందించిందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఏకే భట్‌ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారని భారత్‌ పేర్కొంది. పాకిస్తాన్‌ సీమాంతర తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, దీనివల్ల జమ్మూ కశ్మీర్‌లో భద్రతాపరమైన సమస్యలు వస్తున్నాయని భట్‌.. పాక్‌ డీజీఎంవో దృష్టికి తీసుకెళ్లారు.

21:35 - September 22, 2017

బీజింగ్ :  కశ్మీర్‌ అంశంలో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని చైనా స్పష్టం చేసింది. కశ్మీర్‌ సమస్య భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య అంతర్గత వివాదమని, ద్వైపాక్షిక చర్చల ద్వారా కశ్మీర్‌ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఇరుదేశాలు కలిసి శాంతి, సుస్థిరతలను కాపాడుకోవాలని పేర్కొంది. కశ్మీరు సమస్యపై తమ వైఖరి సుస్పష్టంగా ఉన్నట్లు చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ పేర్కొన్నారు. కశ్మీరుపై ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని అమలు చేయాలని ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - pakistan