Pawan Kalyan

15:40 - September 21, 2017

మురుగదాస్..సామాజిక అంశాలను సృశిస్తూ సినిమాలు తీస్తుంటారు. ఆయన తీసిన పలు సినిమాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈయన దర్శకత్వంలో ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' హీరోగా 'స్పైడర్' చిత్రం రూపొందింది. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తో మురుగదాస్ ఓ సినిమా చేయనున్నారని సోషల్ మాధ్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది. అక్టోబర్ నుండి తాను రాజకీయాల్లో ఉంటానని ఇటీవలే పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఒప్పుకున్న సినిమానలు త్వరగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. అనంతరం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో కూడ పవన్ నటిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.

పవన్‌కి 'కత్తి' లాంటి సామాజిక నేపథ్యం ఉన్న కథలు బాగా సరిపోతాయని మురుగదాస్ పేర్కొన్నట్లు వార్తల కథనం. 'కత్తి' చిత్రానికి సీక్వెల్‌గా వీరి కాంబినేషన్‌లో సినిమా వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద 'ఖైదీ నెంబర్ 150' సినిమాకి సీక్వెల్ రూపొందబోతోందని, అందులో పవన్ నటిస్తారన్న వార్తలతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారంట. మరి పవన్ - మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమా ఉంటుందా ? లేదా ? అనేది చూడాలి. 

11:19 - September 21, 2017

టాలీవుడ్ దర్శకుడు 'రాజమౌళి' తన రెండు చిత్రాలతో అంతర్జాతీయస్తాయిలో పేరు సంపాదించుకున్నాడు. సంవత్సరాల తరబడి చేసిన 'బాహుబలి', 'బాహుబలి 2' సినిమాలు ఏ స్థాయిలో విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమా అనంతరం 'రాజమౌళి' ఎలాంటి సినిమాను ప్రకటించలేదు. దీనితో ఆయన దర్శకత్వంలో ఏ హీరో నటిస్తారనే ఉత్కంఠ నెలకొంది. దీనిపై సోషల్ మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఇటీవలే 'రామ్ చరణ్' నటిస్తున్న 'రంగస్థలం 1985' సినిమా షూటింగ్ లో మెగాస్టార్ 'చిరంజీవి'తో కలిసి 'రాజమౌళి' హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 'మగధీర' తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల 'రామ్‌ చరణ్‌'తో గ్యాప్‌ వచ్చిందని అప్పట్లో ఇండస్టీ కోడై కూసింది. కానీ ఇవన్నీ వట్టి పుకార్లేనని పరిణామాలను బట్టి తెలుస్తోంది. 'రాజమౌళి' ఈ మధ్య 'రామ్‌ చరణ్‌'తో సన్నిహితంగా కనిపిస్తున్నారు. 'చిరంజీవి' నటించబోయే 'సైరా' టైటిల్ లాంచింగ్ వేడుకలో 'రాజమౌళి' పాల్గొనడం తెలిసిందే. అంతేగాకుండా విజయేంద్ర ప్రసాద్ 'శ్రీవల్లి' ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా వెళ్లారు. చిరు, రామ్‌ చరణ్‌ కోసం ఒక కథ రాయాలని ఉందని రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈమధ్య ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో వారివురితో రాజమౌళి సంప్రదింపులు జరుపుతున్నట్లు, మెగాధీరులకోసం తండ్రితో కథ సిద్ధం చేస్తున్నట్లే అనిపిస్తోందని పుకార్లు షికారు చేస్తున్నాయి. 

06:35 - September 20, 2017

హైదరాబాద్ : 2014 ఎన్నికల ముందు ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. ఆయన అయితేనే దేశానికి మేలు జరుగుతుందని ఒకరు అంటే... అతనిలాంటి గొప్ప వ్యక్తితో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు మరొకరు. ఇది అప్పటి మాట. కానీ... తాజాగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతోంది. గత సాధారణ ఎన్నిక సమయలో మోదీ, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టినా... ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్డీయే కూటమికి మద్దతిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలలో మోదీ, పవన్‌కల్యాణ్‌ కలిసి ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. అది గతం. కానీ... ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ, పవన్‌కల్యాణ్‌ల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. ఎన్డీయే అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు ఆస్తామని అప్పట్లో మోదీ హామీ ఇచ్చారు. అయితే.. మోదీ గెలిస్తే విడిపోయి నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని పవన్‌ ఆయనకు మద్దతుగా నిలిచారు. కానీ... బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత... ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని పక్కనపెట్టి... ప్రత్యేక సాయం ప్రకటించింది.

దీంతో బీజేపీ తీరుపై పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేసి పోరాటం మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంలోని బీజేపీతో పాటు,.. కొంతమంది కేంద్రమంత్రులను సైతం టార్గెట్‌ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ, పవన్‌ మధ్య దూరం క్రమంగా పెరుగుతూ వచ్చింది. అయితే.. పవన్‌ కేంద్రమంత్రులను టార్గెట్‌ చేసినా ఎక్కడా మోదీని ఒక్క మాట కూడా అనలేదు. దీంతో పవన్‌, మోదీ సన్నిహితంగానే ఉన్నారనే ప్రచారం జరిగింది. కానీ... మోదీ మాత్రం పవన్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదనే వార్తలకు మరింత బలం పెరిగింది.

తాజాగా మోదీ స్వచ్చ భారత్‌లో తమ వంతు సహకారం అందించాలని కోరుతూ పలువురు ప్రముఖులకు లేఖలు రాశారు. టాలీవుడ్‌ సినీ ప్రముఖులు మహేష్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, మోహన్‌బాబులకు లేఖలు రాసిన మోదీ... పవన్‌ను మాత్రం అందులో భాగస్వామ్యం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో పవన్‌ సహకారం కోరిన మోదీ... ఇప్పుడు ఎందుకు దూరం పెట్టారనేది ఆసక్తిగా మారింది. అయితే... ప్రత్యేక హోదా విషయంలో పవన్‌ కేంద్రం తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కారణమని జనసేన వర్గాలు అంటున్నాయి. ఇదేకాకుండా... చిరంజీవిని బీజేపీలోకి తీసుకువచ్చి... 2018లో రాజ్యసభ సీటు ఇచ్చేందుకు ఆ పార్టీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారు.

ఇక పవన్‌కల్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని బీజేపీ నేతలు తమ ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ కలిసి వచ్చినా...రాకపోయినా చిరంజీవిని ముందు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని కాషాయి నేతలు ప్లాన్‌ వేస్తున్నారు. మొత్తానికి పవన్‌కల్యాణ్‌, మోదీల మధ్య దూరం వచ్చే ఎన్నికల నాటికి ఇలాగే కొనసాగుతుందా ? లేదంటే వచ్చే ఎన్నికల ముందు మళ్లీ ఒక్కటి అవుతారా ? అంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. 

11:53 - September 19, 2017

టాలీవుడ్ పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పక్కన పెట్టేసినట్లేనా ? మోడీ వద్ద పవన్ ఇమేజ్ ఏంటీ ? అనే చర్చ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. ఎందుకంటే ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛభారత్ ప్రమోషన్ నేపథ్యంలో టాలీవుడ్ లోని కొంతమంది నటులకు లేఖలు రాశారంట. కానీ పవన్ కు మాత్రం లేఖ రాయకపోవడంతో దీనిపై తెగ వార్తలు వెలువడుతున్నాయి.

టాలీవుడ్ లో పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' కు ఉన్న మేనియా అందరికీ తెలిసిందే. ఆయన మద్దతు తీసుకోవడం ఎన్నికల్లో టిడిపి - బిజెపి కూటమిలు ప్రయత్నించాయి. అందులో భాగంగా 2014 ఎన్నికల్లో 'పవన్ కళ్యాణ్' టిడిపి - బిజెపి కూటమికి మద్దతినిచ్చారు. అంతేగాకుండా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ప్రతిపక్షాలపై పవన్ ఘాటు విమర్శలు చేశారు. ఆయన ఎన్నికల ప్రచారంలో ఎక్కడ పాల్గొన్నా భారీ స్పందన వచ్చేది. ఎన్నికల్లో టిడిపి - బిజెపి కూటమి ఘన విజయం సాధించింది.

అనంతరం కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మోడీ..చంద్రబాబు ప్రభుత్వంపై 'పవన్' పలు విమర్శలు గుప్పించడం అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేగాకుండా 'జనసేన' పేరిట పార్టీ స్థాపించి వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతామని కూడా ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతం..కార్యకర్తల నియామకం విస్తృతంగా జరుగుతోంది.

పలు సందర్భాల్లో ఆయన పాలకులపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మోడీ ఆయన్ను పట్టించుకోవడం మానేసినట్లు తెలుస్తోంది. తాజాగా మోడీ తెలుగు సినీ ప్రముఖులైన రాజమౌళి, ప్రభాస్, మోహన్ బాబు, మహేష్ బాబులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లేఖలు రాశారు. స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని లేఖలు రాశారు. కానీ తనకు గతంలో మద్దతు తెలిపిన పవన్ కు మాత్రం లేఖ రాయకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరి లేఖపై పవన్ స్పందిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

10:41 - September 19, 2017

టాలీవుడ్ పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' సినిమా మొదలైదంటే చాలు సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు ఆయన అభిమానులు చిత్ర విశేషాల కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటారు. కానీ తన సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని లీక్ కాకుండా జాగ్రత్త పడుతారని టాక్. టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కొనసాగుతున్న ఈ సినిమాలో 'పవన్' సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కానీ షూటింగ్ ప్రారంభమైనా ఇంతవరకు టైటిల్ నిర్ణయించకపోవడం గమనార్హం.

పవన్ కిది 25వ చిత్రం కావడంతో చిత్ర టైటిల్ వైవిధ్యంగా ఉండాలని 'త్రివిక్రమ్' భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు పలు సినిమా టైటిల్స్ పరిశీలించినట్లు తెలుస్తోంది. 'ఇంజనీర్‌ బాబు', గోపాల, గోపాలుడు వంటి టైటిల్స్ వినిపించినా తాజాగా 'గోపాలుడు' టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలిసింది. ఇక ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ 'ఖుష్బూ' ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు.

08:17 - September 19, 2017

హైదరాబాద్ : జ‌న‌సేన పార్టీని పటిష్టం చేసేందుకు పవన్‌ కల్యాణ్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్‌కు ధీటుగా పార్టీ సభ్యత్వ నమోదుకు త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారు.. ప్రతి అడుగులోనూ వినూత్నంగా సాగుతున్న గబ్బర్‌ సింగ్‌.. యువతే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. సభ్యత్వ నమోదుకు ఆన్‌లైన్‌ను వాడుకుంటున్నారు.
పార్టీ సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌
జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రాబోతున్నారు. అక్టోబర్‌ నుంచి రాజకీయాలకే పరిమితమవుతానన్న ఆయన.. ఆలోపు పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. పార్టీ సభ్యత్వ నమోదు... అనుబంధ కమిటీలను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో యూత్‌ను సభ్యులుగా చేర్చుకోవడంపై దృష్టిపెట్టారు. ఇప్పటికే జనసేన పార్టీ సభ్యత్వ నమోదుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ కూడా రూపొందించింది. 
యువతను తిప్పుకోవాలని ప్లాన్‌ 
మొదటి నుంచీ ఇతర పార్టీలకు భిన్నంగా సాగుతున్న పవన్‌..పార్టీ స‌భ్యత్వ నమోదును పూర్తిగా ఆన్‌లైన్‌లో చేపట్టాలని నిర్ణయించారు. దీని ద్వారా యువతను ఎక్కువగా తనవైపు తిప్పుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారు. ప్రత్యేక యాప్‌ ద్వారా సభ్యత్వాలను నమోదు చేయబోతున్నారు.. ఇందుకు సంబంధించిన యాప్‌ కూడా సిద్ధమైంది.. పవన్‌ సూచనతో ఈ యాప్‌లో జనసేన ఐటి విభాగం కొన్ని మార్పులు చేయబోతోంది. సభ్యత్వ నమోదుతోపాటు అనుబంధ సంఘాల ద్వారాకూడా పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లాలని పవన్‌ స్కెచ్‌ వేస్తున్నారు. ఒక్కో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటూ అమలు దిశగా ముందుకు సాగుతున్నారు.
 

 

19:55 - September 17, 2017

హైదరాబాద్ : జనసేన పార్టీ సభ్యత్వ నమోదుపై ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ రివ్యూ నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఆన్‌లైన్‌లో జరిగిన ఈ సమీక్షలో సాఫ్ట్‌వేర్, సాంకేతిక వివరాలను ఐటీ విభాగం నిపుణులు పవన్ కల్యాణ్‌కు వివరించారు. సాఫ్ట్‌వేర్, యాప్‌ను పరిశీలించిన అనంతరం... కొన్ని మార్పులు, చేర్పులను సూచించారు. త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదును కూడా  ప్రారంభించనున్నట్లు పవన్‌కల్యాణ్ తెలిపారు. 

12:40 - September 8, 2017

ఖమ్మం : పట్టణంలోని ఎంబి గార్డెన్‌లో.. జనసేన సన్నాహక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీని పటిష్టపరిచడంలో భాగంగా.. ఈ శిబిరాలను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు జనసేన రాష్ట్ర ఇంఛార్జ్‌ శంకర్ గౌడ్‌, రాష్ట్ర మీడియా ఇంఛార్జ్‌ హరిప్రసాద్‌ తెలిపారు. జనసేన పార్టీలోకి వచ్చేవారు కుల, మత, ప్రాంత, వైషమ్యాలను పక్కన పెట్టి రావాలని హరిప్రసాద్‌ అన్నారు. అలాంటి వారికే తమ పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సూచించారన్నారు. 

 

16:16 - September 4, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తాజా చిత్రం టైటిల్ పై ఉత్కంఠ నెలకొంటోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా కొనసాగుతున్న చిత్ర షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్ లో జరుగుతోంది. ‘కాటమరాయుడు' డిజాస్టర్ అనంతరం 'పవన్' నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేమ..వినోదాత్మక అంశాలకు ఫ్యామిలీ అంశాలను మిళితం చేసి యాక్షన్ కు కూడా తగిన ప్రాధాన్యతనివ్వనున్నట్లు టాక్.

ఇటీవలే సినిమాకు సంబంధించిన ఓ టీజర్ ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా మరో ఫొటోను రిలీజ్ చేసింది. ఈ ఫొటోలో పవన్..కీర్తి సురేష్ లు ఆకట్టుకొనే విధంగా ఉన్నారు. షూటింగ్ కొనసాగుతున్నా చిత్ర టైటిల్ ను మాత్రం ప్రకటించలేదు. టైటిల్ విషయంలో చిత్ర బృందం తర్జన భర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇంజినీర్ బాబు, దేవుడే దిగి వచ్చినా, ‘అజ్ఙాత వాసి' అనే టైటిళ్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో 'అజ్ఞాత వాసి'కి మొగ్గు చూపుతున్నట్లు టాక్. చిత్ర బృందం ఏ టైటిల్ ను పెడుతుందోనని అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నూతన సంవత్సరంలో సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. పవన్ సరసన కీర్తితో పాటు అనూ ఇమ్మాన్యుయేల్ కూడా నటిస్తోంది. ఇతర ముఖ్యపాత్రల్లో ఆది పినిశెట్టి, ఖుష్బూ తదితరులు నటించనున్నారు. 

12:18 - September 3, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' సినిమా కోసం అభిమానులు ఎంతగానే వెయిట్ చేస్తున్నారు. ఆయన నటించిన 'కాటమరాయుడు' డిజాస్టర్ అనంతరం వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' కాంబినేషన్ లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. 'పవన్' సరసన 'కీర్తి సురేష్‌’, 'అను ఇమ్మానుయేల్‌' హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి కథతో రూపొందుతోంది ? పవన్ పాత్ర ఎలా ఉండబోతోంది ? తదితర విషయాలకు బయటకు పొక్కడం లేదు. సినిమాకు సంబంధించిన ఫొటోలు కూడా రావడం లేదు. తాజాగా 'పవన్’ బర్త్ డే సందర్భంగా చిత్ర బృందం ఓ టీజర్ ను విడుదల చేశారు.

ఇక్కడ పూర్తిగా 'పవన్' ను టైటిల్ ను మాత్రం చూపించలేదు. కొద్ది కణాల పాటు 'పవన్' ను నీడలా చూపించారు. సినిమాలోని ఓ పాటను అనిరుధ్‌ హమ్‌ చేస్తుండగా పక్కనే దర్శకుడు త్రివిక్రమ్‌ ఎంజాయ్ చేసున్న దృశ్యాలు ఈ వీడియోలో చూపించారు. 'బయటికొచ్చి చూస్తే టైమెమో త్రీ ఒ క్లాక్‌... 'అంటూ ఈ పాట ట్రెండీగా ఉందనిపిస్తుంది. చివరిలో 'పవన్‌' కుర్చీ తిప్పి.. నిశ్శబ్ధంగా నిల్చొని ఉన్న సన్నివేశాన్ని చూపించారు. ఇక టీజర్ లో సినిమా రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేశారు. జనవరి 10, 2018న సినిమా రిలీజ్ ఉంటుందని ప్రకటించింది. మరి టైటిల్ ఏంటో త్వరలోనే తెలియనుంది. ‘ఇంజినీర్ బాబు' పేరు ఖరారు చేస్తారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - Pawan Kalyan